You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
భార్య కాపురానికి రాలేదని బావమరిది ఇంటికి నిప్పు- ఆరుగురు మృతి-ప్రెస్‌రివ్యూ
భార్య కాపురానికి రాలేదని బావమరిది ఇంటికి నిప్పు- ఆరుగురు మృతి
కాపురానికి రానన్న భార్యపై కోపంతో ఓ వ్యక్తి బావమరిది ఇంటికి నిప్పంటించాడని, ఈ ఘటనలో ఆరుగురు మరణించారని సాక్షి పత్రిక ఒక కథనం ఇచ్చింది. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. కర్ణాటకలోని కొడగు జిల్లా కనూరులో ఈ ఘోరం జరిగింది.
కనూరుకు చెందిన బోజ అనే వ్యక్తి మద్యానికి బానిసై భార్యతో తరచూ గొడవపడేవాడు.
ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం కూడా బోజ భార్యతో గొడవపడ్డాడు.
భర్త ఆగడాలను భరించలేకపోయిన భార్య అదే ఊళ్లో ఉంటున్న తన సోదరుడి ఇంటికి పిల్లలతో సహా వెళ్లింది.
మద్యం మత్తులో ఉన్న బోజ బావమరిది ఇంటికి వెళ్లి ఇంటికి రావాల్సిందిగా భార్యను కోరాడు.
కానీ ఆమె ఒప్పుకోకపోవడంతో అప్పటికి అక్కడి నుంచి వెళ్లిపోయిన బోజ, అర్ధరాత్రి దాటిన తర్వాత బావమరిది ఇంటికి వచ్చాడు.
బయట తాళాలు వేసి ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి పారిపోయాడు.
ఆ ఇంట్లో బోజ కుటుంబ సభ్యులు నలుగురు, మంజు కుటుంబానికి చెందిన మరో నలుగురు ఉంటున్నారు.
అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉండటంతో అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకోలేక పోయారు. బోజ భార్యతో పాటు మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
తీవ్రంగా గాయపడిన ఐదుగురిని మైసూరులోని కేఆర్ ఆస్పత్రికి తరలించగా అక్కడ మరో ముగ్గురు మరణించారు.
చికిత్స పొందుతున్న మరో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు చెప్పిన పోలీసులు, నిందితుడి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.
రూ.1,001 కోట్ల విలువైన ఇల్లు కొనుగోలు చేసిన డీమార్ట్ అధినేత
ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్, డీ-మార్ట్ సూపర్ మార్కెట్ల అధిపతి రాధాకిషన్ దమానీ...తన సోదరుడు గోపీ కిషన్ దమానీతో కలిసి దేశంలోనే అత్యంత ఖరీదైన ఇంటిని కొన్నారని ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కథనం ఇచ్చింది.
దక్షిణ ముంబై, మలబార్ హిల్స్‌లోని ఆ ఇంటిని ఏకంగా రూ.1,001 కోట్లకు వారు కొన్నారని, ఇటీవలి కాలంలో ఇదే అతిపెద్ద రెసిడెన్షియల్ ప్రాపర్టీ డీల్ అని ఈ కథనం పేర్కొంది.
ఈ రెండంతస్తుల భవనం రిజిస్ట్రేషన్ మార్చి 31న జరగ్గా, రూ.30 కోట్లను స్టాంప్ డ్యూటీగా దమానీ సోదరులు చెల్లించినట్లు తెలిపింది.
రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ప్రకారం ఈ ప్రాపర్టీ విస్తీర్ణం 61,916 చదరపు అడుగులు. అంటే ఒక్కో చదరపు అడుగుకు రూ.1,61,670 చొప్పున చెల్లించినట్లు అంచనా
ఈ మధ్యనే దమానీ థానేలోని 8 ఎకరాల భూమిని మాండలెజ్ ఇండియా (గతంలో క్యాడ్బరీ ఇండియా) నుంచి రూ.250 కోట్లకు కొనుగోలు చేశారు.
గత ఏడాది ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసిన ధనవంతుల జాబితాలో 1,540 కోట్ల డాలర్ల ఆస్తితో దమానీ దేశంలో నాలుగో అత్యంత ధనవంతుడిగా నిలిచారు.
నామినేషన్లు వేసిన వారిలో 116మంది మృతి...వీరిలో ఏకగ్రీవంగా ఎన్నికైన వారు 16మంది
ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు వేశాక చనిపోయిన వారి స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు ఏపీ ఎస్ఈసీ ప్రత్యేక నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఈనాడు పత్రిక ఒక కథనం ఇచ్చింది.
మృతి చెందిన అభ్యర్థుల వివరాలను పంచాయతీరాజ్‌శాఖ నుంచి ఎన్నికల సంఘం సేకరించింది. జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు వేసిన వారిలో 15 మంది, ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేస్తున్న వారిలో 101 మంది మృతి చెందారని ఈ కథనం పేర్కొంది.
ఈ స్థానాల్లో ఎన్నికల నిర్వహణ విషయమై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నీలం సాహ్ని శనివారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్‌తో చర్చించారు. ఈనెల 15లోగా ఎన్నికలు నిర్వహించాలనే యోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రకటన ఎప్పుడు ఇస్తారన్నది సోమవారం తరువాత స్పష్టత రానుంది.
కాగా జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనవారిలో 16 మంది మృతి చెందినట్లు ఈనాడు కథనం పేర్కొంది. వీరిలో ఇద్దరు జడ్పీటీసీలు, 14 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు.
ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యుల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ఆరుగురు మృతి చెందారు. నెల్లూరు, కడప జిల్లాల్లో ఇద్దరు చొప్పున, పశ్చిమ గోదావరి, విజయనగరం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు. ఈ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు.
మొబైల్ బ్యాటరీ లైఫ్ 9 ఏళ్లు-అమెరికా కంపెనీ పరిశోధనలు
అమెరికాకు చెందిన ఎన్‌డీబీ అనే స్టార్టప్ సంస్థ ఛార్జింగ్ చేయాల్సిన అవసరం లేని బ్యాటరీని అభివృద్ధి చేస్తోందని నమస్తే తెలంగాణ పత్రిక ఒక కథనం ఇచ్చింది.
నానో డైమండ్ బ్యాటరీ (ఎన్‌డీబీ) పేరుతో అణు వ్యర్థాలు, వజ్రాలతో ఈ బ్యాటరీలను తయారు చేస్తున్నట్లు ఈ కథనం తెలిపింది.
2012 నుంచి ఈ సంస్థ బ్యాటరీ తయారీలో నిమగ్నమై ఉన్నది. 2023లో తొలి బ్యాటరీ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. అయితే ఈ కంపెనీ ప్రస్తుతం అంతరిక్ష పరిశోధనల కోసం ఈ బ్యాటరీని తయారు చేస్తున్నది.
ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలకు కూడా బ్యాటరీలను తయారు చేస్తామని కంపెనీ సీఈవో నైమా గోల్‌షరీఫీ చెప్పారు. ఇవి ఛార్జింగ్ అవసరం లేకుండా 9 ఏండ్ల దాకా పనిచేస్తాయన్నారు.
ప్రస్తుత అంచనాల ప్రకారం రోదసి కోసం చేస్తున్న నానో డైమండ్ బ్యాటరీ ఛార్జింగ్ అవసరం లేకుండా 28 వేల ఏండ్లు పనిచేస్తుందని కంపెనీ ప్రతినిధులు వెల్లడించినట్లు ఈ కథనం వెల్లడించింది.
ఎన్‌డీబీ బ్యాటరీ సాధారణ వోల్టాయిక్ బ్యాటరీలాగా (గోడ గడియారం సెల్‌లాగా) పనిచేస్తుంది. వజ్రాలు మంచి ఉష్ణవాహకాలు కాగా, ఎన్‌డీబీ బ్యాటరీలో వజ్రాలు, అణు వ్యర్థాలు పొరలు పొరలుగా ఉంటాయి.
అణువ్యర్థాల నుంచి వెలువడే రేడియో ధార్మికతను, ఉష్ణాన్ని వజ్రాలు తీసుకొని మరో పొరకు పంపిస్తాయి. ఇలా పొరల మధ్య రసాయనిక చర్యతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
సాధారణంగా అణువ్యర్థాలు వేల సంవత్సరాలపాటు తమ నుంచి రేడియో ధార్మికతను విడుదల చేస్తాయి. అందువల్లనే ఈ బ్యాటరీలు వేల సంవత్సరాలు పనిచేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపినట్లు నమస్తే తెలంగాణ పత్రిక కథనం పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- ‘గర్భం దాల్చేందుకు మా ఊరికొస్తారు’
- దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించడానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఎవరిని సంప్రదించారు
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- కండోమ్స్, టైర్లు సహా ఎన్నో వస్తువుల తయారీలో వాడే విలువైన పదార్థం కనుమరుగైపోనుందా
- విశాఖపట్నం: సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానం... దీని చూస్తే ఎందుకు ఉద్వేగం ఉరకలేస్తుంది?
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడకు.. బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- దేశంలో మళ్లీ లాక్డౌన్.. ఎక్కడెక్కడంటే
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- సముద్రపు చేపలా, చెరువు చేపలా... ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి ఇలా తొలగించండి
- బిర్యానీ పక్కాగా వండాలంటే కచ్చితమైన లెక్కలు ఉంటాయా? దీనికో ఆల్గారిథమ్ ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)