You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
యశ్వంత్ సిన్హా: ‘మోదీ, అమిత్ షాలు దిల్లీ నుంచి దేశాన్ని నడుపుతున్న తీరును దేశం సహించబోదు’.. టీఎంసీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి - Newsreel
అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా పనిచేసిన యశ్వంత్ సిన్హా.. తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు.
2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచీ ఆ పార్టీపై యశ్వంత్ ఆగ్రహంతో ఉన్నారు. పార్టీని కూడా వీడారు. ఆయన శనివారం కోల్‌కతాలో టీఎంసీలో చేరారు. అయితే.. యశ్వంత్ కుమారుడు జయంత్ సిన్హా బీజేపీలోనే కొనసాగుతున్నారు. ఝార్ఖండ్‌లోని హజారీబాగ్ నుంచి బీజేపీ తరఫున లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
మోదీ మొదటి విడత సర్కారులో జయంత్ సిన్హా కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీద యశ్వంత్ సిన్హా నిరంతరం విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఆయన టీఎంసీలో చేరటానికి ముందు.. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఆమె నివాసంలో కలిశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు.
''దేశం ఇప్పుడు ఒక కీలకమైన కూడలిలో నిలుచుంది. మనం విశ్వసించే విలువలు ప్రమాదంలో ఉన్నాయి. న్యాయవ్యవస్థ సహా అన్ని వ్యవస్థలనూ బలహీనపరుస్తున్నారు. ఇది దేశం మొత్తానికీ ఒక ముఖ్యమైన యుద్ధం. ఇది రాజకీయ పోరాటం కాదు.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటం'' అని ఆయన వ్యాఖ్యానించారు.
''అటల్‌జీ ప్రభుత్వంలో మమత, నేను కలిసి పనిచేశాం. మమత ఆది నుంచీ పోరాడుతూనే ఉన్నారు. ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి కాందహార్ తీసుకెళ్లినపుడు.. దానిపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. ఆ చర్చ సందర్భంగా.. ఉగ్రవాదుల చెరలో ఉన్న వారిని విడుదల చేయాలనే షరతుతో.. తాను బందీగా వెళతానని మమత చెప్పారు'' అని యశ్వంత్ సిన్హా గుర్తు చేశారు.
ఆ సమయంలో వాజపేయి ప్రభుత్వంలో మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉన్నారు.
టీఎంసీలో తన చేరికపై యశ్వంత్ మాట్లాడుతూ.. ''నేను రాజకీయాల నుంచి ఎందుకు దూరమయ్యాను.. ఇప్పుడు ఈ వయసులో మళ్లీ ఒక పార్టీలో ఎందుకు చేరుతున్నాను అని మీరు ఆశ్చర్యపోతున్నారేమో. ప్రస్తుత కాలంలో దేశం ఒక అద్భుతమైన మార్పునకు లోనవుతోంది. మనం ప్రాధాన్యమిచ్చే విలువలు, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ నిలబెడతారని విశ్వసించే విలువలు నేడు ప్రమాదంలో ఉన్నాయి. ప్రజాస్వామ్యపు బలం.. ప్రజాస్వామిక వ్యవస్థల్లో ఉందని మనందరికీ తెలుసు. నేడు దాదాపు ప్రతి వ్యవస్థా బలహీనమైపోయింది. ఇందులో న్యాయవ్యవస్థ కూడా ఉండటం విచారకరం'' అని పేర్కొన్నారు.
బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ భారీ ఆధిక్యంతో తిరిగి అధికారంలోకి వస్తుందనటంలో సందేహం లేదన్నారు. ''మోదీ, అమిత్ షాలు దిల్లీ నుంచి దేశాన్ని నడుపుతున్న తీరును దేశం సహించబోద''నే సందేశం బెంగాల్ ఎన్నికలు ఇస్తాయని వ్యాఖ్యానించారు.
2022 చివరికల్లా ఆగ్నేయ ఆసియా కోసం 100 కోట్ల కోవిడ్ టీకాలు: క్వాడ్ దేశాల ప్రకటన
2022 చివరికల్లా ఒక బిలియన్ (వంద కోట్ల) కరోనా వైరస్ వ్యాక్సీన్ డోసులను ఆగ్నేయ ఆసియా మొత్తానికి అందించేందుకు అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్ దేశాధినేతలు అంగీకరించారు.
శుక్రవారం రాత్రి జరిగిన క్వాడ్ దేశాల మొట్టమొదటి వీడియో సదస్సు తరువాత ఈ ఉమ్మడి ఒప్పందాన్ని ప్రకటించారు.
జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ ఉత్పత్తి చేసే ఈ వ్యాక్సీన్ ఒక్క డోసు తీసుకుంటే చాలని భావిస్తున్నారు. ఇది ఇండియాలోనే ఉత్పత్తి కానుంది.
ఈ "భారీ సహకార ఒప్పందం" ముందుగా ఆగ్నేయ ఆసియాలోని దేశాలకు వ్యాక్సీన్లు అందించడంపై దృష్టి సారిస్తుందని అమెరికా తెలిపింది.
"ఇండియా ఉత్పత్తి సామర్థ్యం, యూఎస్ సాంకేతికత, జపనీస్, అమెరికన్ ఆర్థిక సహకారం, ఆస్ట్రేలియా వ్యూహ రచన సహాయంతో (మేము) అధికంగా ఒక బిలియన్ డోసులను అందించేందుకు కట్టుబడి ఉన్నాం" అని అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జాక్ సుల్లివాన్ తెలిపారు. క్వాడ్ వీడియో సదస్సు అనంతరం ఆయన మాట్లాడారు.
ఈ వ్యాక్సీన్లు "అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్" (ఆసియాన్)తో పాటు, "పసిఫిక్ అండ్ బియాండ్"కు కూడా వెళతాయని ఆయన తెలిపారు.
శుక్రవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి పొందిన జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సీన్ అదనపు డోసులను.. భారతదేశానికి చెందిన బయొలాజికల్ లిమిటెడ్ సంస్థ తయారుచేయనుంది.
"జపాన్, అమెరికా, ఆస్ట్రేలియాల సహకారంతో భారతదేశం తన బలమైన వ్యాక్సీన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత విస్తరించుకుంటుంది" అని ప్రధాని నరేంద్ర మోదీ సదస్సు తరువాత ట్విట్టర్‌లో తెలిపారు.
NEET 2021: ఆగస్టు 1న పెన్ను, పేపరుతో పరీక్ష
అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)ను ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీన నిర్వహిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది.
ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీఎస్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్‌ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశానికి నీట్-2021 నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ పరీక్ష ఫలితాన్ని బీఎస్‌సీ నర్సింగ్, బీఎస్‌సీ లైఫ్ సైన్సెస్ తదితర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం కేంద్ర, రాష్ట్ర విద్యా సంస్థలు.. సంబంధిత నియమనిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం ఉపయోగించుకోవచ్చునని చెప్పింది.
నీట్-2021 ప్రవేశ పరీక్షను పెన్ను, పేపర్ విధానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపింది. హిందీ, ఇంగ్లిష్ సహా మొత్తం 11 భాషల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
ఈ పరీక్ష, సిలబస్, వయసు, రిజర్వేషన్ అర్హతలు, సీట్ల వర్గీకరణ, పరీక్ష ఫీజు, పరీక్ష నిర్వహించే నగరాలు, రాష్ట్రాల కోడ్ తదితర వివరాలన్నిటితో సమాచార బులెటిన్‌ను త్వరలో విడుదల చేస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చెప్పింది.
ఈ వివరాలు https://ntaneet.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది.
నరేంద్ర మోదీ: 'ప్రజాస్వామిక విలువలు మనల్ని ఏకం చేశాయి' - క్వాడ్ దేశాధినేతల వీడియో సదస్సులో ప్రధాని
క్వాడ్ బృందంలోని దేశాలన్నిటిని ప్రజాస్వామిక విలువలు అనుసంధానం చేస్తున్నాయని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ ఉమ్మడి సహకారాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి తాను ప్రయత్నిస్తానని చెప్పారు.
స్వేచ్ఛాయుత, పారద్శక, సమ్మిళితమైన ఇండో-పసిఫిక్ ప్రాంతం కోసం తాము కట్టుబడి ఉన్నామని మోదీ చెప్పారు.
శుక్రవారం రాత్రి జరిగిన క్వాడ్ దేశాల మొట్టమొదటి వీడియో సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్, జపాన్ ప్రధానమంత్రి యోషిహిడి సుగా కూడా పాల్గొన్నారు.
''మన ఉమ్మడి విలువలను పెంపొందించటానికి, సురక్షితమైన, సుస్థిరమైన, సుసంపన్నమైన ఇండో-పసిఫిక్ ప్రాంతం అభివృద్ధికి మనం మరింత సన్నిహితంగా కలిసి పనిచేస్తాం'' అని మోదీ పేర్కొన్నారు.
''వ్యాక్సిన్, వాతావరణ మార్పు, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలు ప్రాతిపదికగా ఉన్న మన అజెండా.. ప్రపంచం మరింత మెరుగవటానికి క్వాడ్‌ను ఒక బలమైన వేదికగా చేస్తోంది'' అని చెప్పారు.
ఈ సందర్భంగా జో బైడెన్ మాట్లాడుతూ.. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పరస్పర సహకారానికి క్వాడ్ ఒక ముఖ్యమైన భూమిక అవుతుందని పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ఆయనతో మోదీ సమావేశం కావటం ఇదే మొదటిసారి.
జార్జ్ ఫ్లాయిడ్ కుటుంబానికి 2.7 కోట్ల డాలర్ల పరిహారం ప్రకటించిన మిన్నీపోలిస్
పోలీసుల చేతుల్లో చనిపోయిన నల్లజాతి వ్యక్తి జార్జ్ ఫ్లాయిడ్ కుటుంబానికి 2.7 కోట్ల డాలర్ల పరిహారం చెల్లిస్తామని అమెరికాలోని మినిపోలిస్ నగరం ప్రకటించింది.
గత ఏడాది మే నెలలో డెరెక్ చావిన్ అనే పోలీస్ అధికారి.. నిరాయుధుడైన జార్జ్ ఫ్లాయిడ్‌ను నేలకు అదిమిపెట్టి, అతడి మెడ మీద మోకాలితో నొక్కటంతో అతడు చనిపోయాడు. ఈ దృశ్యాన్ని స్థానికులు కొందరు వీడియో తీశారు.
ఈ వీడియో వైరల్ కావటంతో ఫ్లాయిడ్ ఉదంతంపై అమెరికాతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా కూడా తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. భారీ స్థాయి నిరసనలు వెల్లువెత్తాయి.
ఫ్లాయిడ్ మరణంపై కేసు విచారణ మార్చి 29వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం అవసరమైన జ్యూరీ ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది.
అయితే.. ఫ్లాయిడ్ మరణంపై కేసు వేసిన ఆయన కుటుంబానికి 2.7 కోట్ల డాలర్లు చెల్లించి సెటిల్ చేయటానికి మిన్నీపోలిస్ నగర మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- మహాశివరాత్రి: పురుష లింగాకారానికి పూజలు చేసే అరుదైన ఆలయం.. గుడిమల్లం
- సిద్దిక్ కప్పన్: రేప్ కేసు రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించినందుకు జైల్లో పెట్టి 'హింసిస్తున్నారు'
- No Smoking Day: ‘పొగంగేట్రం’ నుంచి ఉపసంహారం దాకా... ‘నేను స్మోకింగ్ ఎలా మానేశానంటే’
- ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన మృతుల ఖననానికి మారుమూల దీవిని ఎంపిక చేసిన శ్రీలంక
- కొండ బారిడి: తుపాకులు గర్జించిన నేలలో ఇప్పుడు సేంద్రియ వ్యవసాయ విప్లవం
- కరోనా వైరస్ వ్యాక్సీన్ కోసం నమోదు: కోవిన్ యాప్, వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ ఇలా.. ఏఏ ధ్రువపత్రాలు కావాలంటే
- హాథ్రస్: కూతురిని వేధించారని కేసు పెట్టినందుకు తండ్రిని కాల్చి చంపేశారు
- కరోనావైరస్: ఇండియాలో మళ్లీ పాజిటివ్ కేసులు పెరుగుతుండడానికి కారణమేమిటి.. మరో వేవ్ మొదలైందా
- ఇథియోపియా టిగ్రే సంక్షోభం: బీబీసీ విలేకరిని నిర్బంధించిన సైన్యం
- కృత్రిమ గర్భధారణ ఖర్చులు భరించలేక ఫేస్బుక్లో వీర్యదాతలను ఆశ్రయిస్తున్నారు... ఆరోగ్యం ఏమవుతుంది?
- భారతదేశంలోని ‘అస్థిపంజరాల సరస్సు’.. అంతు చిక్కని రహస్యాల నిలయంయాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)