ఇండియా వర్సెస్ ఇంగ్లండ్: రిషబ్ పంత్ సెంచరీతో నాలుగో టెస్టుపై పట్టు బిగించిన భారత్ - Newsreel

ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్టుపై ఇండియా జట్టు పట్టు సాధించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్లు కోల్పోయి 294 పరుగులు చేసి మొదటి ఇన్నింగ్స్‌లో 89 పరుగుల ఆధిక్యం సాధించింది.

రిషబ్ పంత్ సెంచరీ, వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీతో రెండో రోజు ఆటలో భారత్ పట్టు బిగించింది.

పంత్ 118 బంతులాడి 101 పరుగులు చేశాడు. అందులో 13 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.

వాషింగ్టన్ సుందర్ 117 బంతుల్లో 8 ఫోర్లతో 60 పరుగులు చేశాడు.

94 పరుగుల దగ్గర సిక్సర్

పంత్, సుందర్ కలిసి ఏడో వికెట్‌కు 113 పరుగుల పార్ట్‌నర్‌షిప్ అందించారు. హాఫ్ సెంచరీ చేయడానికి 82 బంతులు ఆడిన పంత్ ఆ తరువాత వేగం పెంచాడు. ప్రధానంగా ఇంగ్లండ్ పేసర్లు బెన్‌స్టోక్స్, ఆండర్సన్ బౌలింగ్‌లో వరుస బౌండరీలు సాధించాడు.

94 పరుగుల వద్ద ఉన్నప్పుడు సిక్సర్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్న పంత్ సెంచరీ తరువాత మరో పరుగు మాత్రమే చేసి అవుటయ్యాడు.

ఆండర్సన్ బౌలింగ్‌లో షాట్‌కు ప్రయత్నించగా జో రూట్ క్యాచ్ పట్టడంతో పంత్ ఇన్నింగ్స్ ముగిసింది.

రెండో రోజు ఆట ముగిసే సమయానికి వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నారు.

'అమరావతి భూకుంభకోణం కేసు దర్యాప్తుపై స్టే ఎత్తివేయాలి''.. సుప్రీంకోర్టును కోరిన ఏపీ ప్రభుత్వం

రాజధాని అమరావతి భూకుంభకోణం కేసులో విచారణపై ఏపీ హైకోర్టు విధించిన స్టే ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టును అభ్యర్థించింది.

నిందితులకు వ్యతిరేకంగా ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోబోమని ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది రాజీవ్ ధవన్ చెప్పారు.

కోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరిగినా అందుకు సమ్మతమేనని, అయితే, దర్యాప్తు మాత్రం కొనసాగాలని ధవన్ కోర్టును కోరారు.

జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డిల ధర్మాసనం వాదనలు విన్న తర్వాత కేసును ఏప్రిల్ 7కి వాయిదా వేసింది.

ఏమిటీ కేసు?

అమరావతి భూకుంభకోణం కేసులో మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ సహా మరో 11 మందిని నిందితులుగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదైంది.

అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అవుతుందని తెలిసి ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో భూ క్రయవిక్రయాలు చేసినవారి పాత్ర పై విచారణ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిట్‌ను నియమించింది.

అయితే, సిట్ విచారణను ఏపీ హై కోర్టు స్టే జారీ చేసింది. అమరావతి భూ కుంభకోణం ఎఫ్ఐఆర్, అందులో ఉన్న ఇతర సమాచారం గురించి మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ ఏ విధమైన వార్తలూ రాయకూడదని, ప్రచురించకూడదని ఆదేశిస్తూ గాగ్ ఆర్డర్‌ ఇచ్చింది.

హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దాంతో సుప్రీంకోర్టు మీడియాపై విధించిన ఆదేశాలను తొలగిస్తూ సంబంధిత వ్యక్తులకు నోటీసులను కూడా జారీ చేసింది.

"కేరళ ముఖ్యమంత్రి అభ్యర్థి శ్రీధరన్‌" ట్వీట్‌పై మాటమార్చిన బీజేపీ నేత, కేంద్ర మంత్రి మురళీధరన్

పార్టీ 'మెట్రో మాన్' ఈ.శ్రీధరన్‌ను కేరళలో సీఎం అభ్యర్థిగా నిలిపిందన్న కేంద్ర మంత్రి, బీజేపీ నేత మురళీధరన్ తన మాటమార్చారు.

తమ పార్టీతో చెక్ చేసుకోకుండానే తాను ఆ ప్రకటన ఇచ్చానని, పార్టీ దీనిపై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదని వి. మురళీధరన్ స్పష్టం చేశారు.

"త్వరలో జరిగే కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ శ్రీధరన్‌ సీఎం అభ్యర్థిగా ఉంటారని మా పార్టీ ప్రకటించింది" అని ఆయన గురువారం అన్నారు.

మురళీధరన్ దీనికి సంబంధించి ఒక ట్వీట్ కూడా చేశారు. ఇప్పుడు ఆయన దాన్ని డిలిట్ చేశారు.

"ఈ. శ్రీధరన్‌ సీఎం పదవికి అభ్యర్థిగా బీజేపీ కేరళ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. రాష్ట్రంలో అవినీతి రహిత, అభివృద్ధి చేసే ప్రభుత్వం వచ్చేలా మేం సీపీఐ, కాంగ్రెస్ రెండింటినీ ఓడిస్తాం" అని అందులో రాశారు.

కానీ, తర్వాత ఏఎన్ఐతో మాట్లాడిన మురళీధరన్ "పార్టీ చెప్పిందని రాసిన మీడియాలో వచ్చిన రిపోర్టుల ఆధారంగా నేను ఆ మాట అన్నాను. కానీ, పార్టీతో ఆ విషయాన్ని ధ్రువీకరించుకున్నప్పుడు, అలాంటి ఏ ప్రకటనా చేయలేదని తెలిసింది" అన్నారు.

"పీఎం నరేంద్ర మోదీ నాయకత్వంలో కేరళ ప్రజల అవసరాలను తీర్చడానికి బీజేపీ కృషి చేస్తుంది. ఈ. శ్రీధరన్ నేతృత్వంలో కొత్త కేరళకు ఒక సమర్థవంతమైన ప్రభుత్వం లభిస్తుంది" అని రాసిన ఒక ట్వీట్ శుక్రవారం ఉదయం వరకూ మురళీధరన్ అధికారిక ట్విటర్ అకౌంట్‌లో కనిపించింది.

మురళీధరన్ ట్వీట్‌పై కాంగ్రెస్ నేత శశి థరూర్ ట్విటర్‌లో వ్యంగ్యంగా స్పందించారు.

"నవ్వొస్తోంది, అసలు ఎప్పుడూ నిర్మించని ఒక భవనం టాప్ ఫ్లోర్‌ను ఎవరు సొంతం చేసుకుంటారోనని బీజేపీ గందరగోళంలో పడింది. కేరళలో బీజేపీ ముఖ్యమంత్రి ఎప్పటికీ ఉండడు" అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)