బీబీసీ స్పోర్ట్స్ హ్యాకథాన్: ఏంటీ కార్యక్రమం... అసలేం చేయబోతున్నారు?

ఫొటో సోర్స్, ANIRBAN SEN
ప్రముఖ ఎన్‌సైక్లోపీడియా వెబ్‌సైట్ వికీపీడియాను ఈ రోజు కొన్ని వందల మంది విద్యార్థులు 'హ్యాక్' చేయబోతున్నారు. భారత క్రీడాకారిణుల గురించి వ్యాసాలు రాసేందుకు నిర్వహిస్తున్న హ్యాకథాన్‌లో భాగంగా వాళ్లు ఈ పని చేయనున్నారు.
బీబీసీ చేపట్టిన 'ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్' ప్రాజెక్టులో భాగంగా ఈ హ్యాకథాన్ జరుగుతోంది. 50 మంది క్రీడాకారిణుల గురించి వికీపీడియాలో విద్యార్థులు కొత్త పేజీలు సృష్టించనున్నారు.
ప్రపంచవ్యాప్తంగా చాలా మంది సమాచారం వెతికేందుకు వికీపీడియాను చూస్తారు. అయితే, ఈ వెబ్‌సైట్‌లో లింగపరమైన అసమానతలు ఉన్నాయి. వికీపీడియా ఇంగ్లీష్ వ్యాసాల్లో మహిళలపై ఉన్నవి 17 శాతమే.
అందుకే, క్రీడారంగంలో ఘన విజయాలు అందుకున్న భారతీయ మహిళల గురించి వ్యాసాలను వికీపీడియాలో చేర్చేందుకు ఆ సంస్థతో బీబీసీ చేయి కలిపింది.
ప్రముఖ క్రీడా పాత్రికేయులు, నిపుణులు, బీబీసీ ఎడిటర్లతో కూడిన ఓ జ్యూరీ ఇందుకోసం 50 మంది క్రీడాకారిణుల పేర్లను ఎంపిక చేసింది.
ఈ 50 మంది క్రీడాకారిణుల్లో చాలా మందికి వికీపీడియాలోని వివిధ భారతీయ భాషల విభాగాల్లో, కొందరికి ఇంగ్లిష్ వికీపీడియాలో పేజీలు లేవు.

ఫొటో సోర్స్, SOPA Images/Getty
మరుగునపడ్డ కథలను బయటకు తీసుకువచ్చేందుకు ఇంటర్వ్యూలు
ఈ 50 మంది క్రీడాకారిణుల గురించి ఇంటర్నెట్‌లో చాలా తక్కువ సమాచారం ఉందని బీబీసీ పరిశోధనలో తేలింది.
ఈ లోటును పూడ్చేందుకు ఈ 50 మందిలో 26 మందిని బీబీసీ ఇంటర్వ్యూ చేసింది. వారి గురించి కథనాలను బీబీసీ వెబ్‌సైట్లలో ప్రచురించింది.
బీబీసీ ఇంగ్లిష్‌తో పాటు హిందీ, పంజాబీ, గుజరాతి, మరాఠీ, తమిళం, తెలుగు వంటి భారతీయ భాషల్లో ప్రసారాలు అందిస్తోంది.
జీవితంలో తాము ఎదుర్కున్న సవాళ్లు, సమస్యలు, వ్యక్తిగత ఇబ్బందులు, మౌలిక వసతుల లేమి, లింగ వివక్ష వంటి వాటి గురించి బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో క్రీడాకారిణులు వివరించారు.
అయితే, ఎన్ని సవాళ్లు ఎదురైనా, తట్టుకుని నిలబడి ఈ క్రీడాకారిణులు తమ ప్రయాణాలను కొనసాగించారు. కొన్ని సార్లు వారికి తమ ఆత్మీయుల నుంచి, కొన్ని సంస్థల నుంచి సహకారం అందింది.
మహిళలను క్రీడల్లో ప్రోత్సహించేలా వివిధ శిక్షణ సంస్థలు, మైదానాలు, మౌలిక వసతులు రావాల్సిన అవసరం ఉందని ఈ క్రీడాకారిణుల్లో చాలా మంది అభిప్రాయపడ్డారు. మహిళలు క్రీడల్లో రాణించేందుకు కుటుంబ సహకారం కూడా ఎంతో అవసరమని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
జర్నలిజం విద్యార్థులతో కలిసి...
బీబీసీ ఈ హ్యాకథాన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 13 విద్యా సంస్థల్లో చదువుకుంటున్న 300కుపైగా మంది జర్నలిజం విద్యార్థులతో జట్టు కట్టింది.
ఉత్తర భారత్‌లో దిల్లీ స్కూల్ ఆఫ్ జర్నలిజం, దిల్లీ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ (అజ్మేర్), డోబ్రా కాలేజీ (జలంధర్), గురునానక్ దేవ్ యూనివర్సిటీ (అమృత్‌సర్) ఇందులో భాగమయ్యాయి.
పశ్చిమ భారత్‌లో గుజరాత్ యూనివర్సిటీ (అహ్మదాబాద్), వీర్ నర్మద్ సౌత్ గుజరాత్ యూనివర్సిటీ (సూరత్), పార్లే తిలక్ విద్యాలయ అసోసియేషన్స్ సతాయే కాలేజీ (ముంబయి), రాష్ట్రసంత్ తుకాడోజీ మహారాజ్ నాగ్‌పుర్ యూనివర్సిటీ (నాగ్‌పుర్) పాలుపంచుకుంటున్నాయి.
దక్షిణ భారత్ నుంచి అవినాశ్ లింగం ఇన్‌స్టిట్యూట్ (కోయంబత్తూరు), భారతీయార్ యూనివర్సిటీ (కోయంబత్తూరు), పాండిచ్చేరి యూనివర్సిటీ (పుదుచ్చేరి), భవన్స్ వివేకానంద కాలేజీ ఆఫ్ సైన్స్, హుమానిటీస్ అండ్ కామర్స్ (సికింద్రాబాద్), ఆంధ్రా యూనివర్సిటీ (విశాఖపట్నం) పాలుపంచుకుంటున్నాయి.
వ్యాసాలను ఎలా వికీపీడియాలో చేర్చాలన్న విషయమై వికీపీడియా విద్యార్థులకు శిక్షణ ఇచ్చింది.
ఈ స్పోర్ట్స్ హాకథాన్ బీబీసీ భారతీయ భాషల సోషల్ మీడియా వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.

ఇవి కూడా చదవండి:
- ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ అంటూ సాగిన పోరాటంలో పోలీసు కాల్పులకు 32 మంది మృతి.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎలా సాధించుకున్నారంటే
- మాన్య సింగ్: ఆటో డ్రైవర్ కూతురు మిస్ ఇండియా రన్నరప్ వరకు ఎలా ఎదిగారు?
- ‘‘బూజు పట్టిందని రూ.పది వేల కోట్ల ప్యాలెస్‌ను కూల్చి, మళ్లీ కడుతున్నారు’’
- సియాచిన్: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రం
- డోనల్డ్ ట్రంప్‌కు అభిశంసన ఆరోపణల నుంచి విముక్తి... సెనేట్‌లో వీగిపోయిన తీర్మానం
- జ్యోతిషాన్ని నమ్మే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది... ఎందుకు?
- సెక్స్ సమయంలో శరీరంలో చేరి ప్రాణాలకే ముప్పు తెచ్చే ఈ బ్యాక్టీరియాలు మీకు తెలుసా?
- సెక్స్ పట్ల సమాజానికి గౌరవం ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























