బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2020: నామినీలు వీరే... మీ అభిమాన క్రీడాకారిణికి ఓటు వేయండి

ఈ ఏడాది కూడా బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ (ISWOTY)తో బీబీసీ న్యూస్ మీ ముందుకు వస్తోంది.
BBC ISWOTY 2020 పురస్కారానికి జ్యూరీ సభ్యులు ఎంపిక చేసిన ఐదుగురు నామినీల జాబితాను బీబీసీ ఇండియన్ లాంగ్వేజెస్ హెడ్ రూపా ఝా సోమవారం జరిగిన వెబినార్‌లో ప్రకటించారు.
అభిమానులు బీబీసీ భారతీయ భాషల వెబ్‌సైట్లు (https://bbc.com.im/telugu%3C/a%3E%29, బీబీసీ స్పోర్ట్ వెబ్‌సైట్‌కు వెళ్లి నామినీలలో తమకు నచ్చిన క్రీడాకారిణికి ఓటు వేయవచ్చు.
ఓటింగ్ లింక్ 2021 ఫిబ్రవరి 24న, 11.30 ఐఎస్‌టీ (1800జీఎంటీ) వరకు అందుబాటులో ఉంటుంది.
2021 మార్చి 8న జరగబోయే వర్చువల్ వేడుకలో విజేతను ప్రకటిస్తారు. అన్ని రకాల నిబంధనలు, షరతులు, ప్రైవసీ నోటీసు వెబ్‌సైట్‌లో ఉన్నాయి.
ISWOTY 2020 ఫలితాలను బీబీసీ భారతీయ భాషల వెబ్‌సైట్లు, బీబీసీ స్పోర్ట్ వెబ్‌సైట్‌లో కూడా ప్రకటిస్తారు.
మార్చి 8, మహిళా దినోత్సవంనాడు భారత క్రీడా రంగానికి విశేష సేవలు అందించిన ఓ ప్రముఖ క్రీడాకారిణికి “లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్” అవార్డును బీబీసీ అందించి సత్కరించనుంది. దీంతోపాటు, వర్థమాన మహిళా క్రీడాకారిణులను ప్రోత్సహించేందుకు "ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డ్"ను కూడా బీబీసీ అందించనుంది.
BBC ISWOTY 2020 నామినీలను ప్రముఖ క్రీడా జర్నలిస్టులు, నిపుణులు, బీబీసీ ఎడిటర్లతో కూడిన జ్యూరీ ఎంపిక చేసింది.
ఆ ఐదుగురు నామినీలు వీరే..

ఫొటో సోర్స్, Getty Images
1. మను భాకర్
వయసు: 18 సంవత్సరాలు*, స్పోర్ట్స్: ఎయిర్‌గన్ షూటింగ్
మను భాకర్ 16 ఏళ్ల వయసులోనే.. 2018లో జరిగిన అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ ప్రపంచ కప్‌లో మహిళల 10మీ ఎయిర్ పిస్టల్ పోటీల్లో స్వర్ణం సాధించారు. దీంతో అతి చిన్న వయసులోనే ప్రపంచ కప్‌లో స్వర్ణం సాధించిన భారత షూటర్‌గా రికార్డు సృష్టించారు. అదే ఏడాదిలో కామన్‌వెల్త్ గేమ్స్‌లో కూడా 240.9 పాయింట్లతో రికార్డ్ సృష్టించి.. మహిళల 10మీ ఎయిర్ పిస్టల్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించారు. 2019 ప్రపంచ కప్‌లో కూడా మహిళల 10మీ ఎయిర్ పిస్టల్ పోటీల్లో స్వర్ణం సాధించారు.
(*2021 ఫిబ్రవరి 18కి మను భాకర్‌కు 19 సంవత్సరాలు నిండుతాయి.)

ఫొటో సోర్స్, Getty Images
2. ద్యుతీ చంద్
వయసు 25 సంవత్సరాలు*, స్పోర్ట్స్: అథ్లెటిక్స్
మహిళల 100 మీటర్ల విభాగంలో ద్యుతీ చంద్ ప్రస్తుతం భారత జాతీయ ఛాంపియన్. నేపల్స్‌లో 2019లో జరిగిన వరల్డ్ యూనివర్సైడ్ 100 మీటర్ల ఈవెంట్‌లో ద్యుతీ చంద్ స్వర్ణం సాధించారు. 2020లో ఆమెకు అర్జున అవార్డ్ లభించింది. 2016లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్‌లో మహిళల 100 మీటర్ల పరుగులో పాల్గొనేందుకు ఎంపికైన భారతీయులలో ద్యుతి మూడవ వ్యక్తి. 2018లో జకార్తా వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో మహిళల 100 మీటర్ల పరుగులో ద్యుతి రజతం గెలుచుకున్నారు. ఇది 1998 తర్వాత భారత్‌కు వచ్చిన తొలి అవార్డు. హార్మోన్ టెస్టులో విఫలమైన ద్యుతీ చంద్‌పై అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 2014లో నిషేధం విధించింది. ఆమె శరీరంలో టెస్టోస్టిరాన్ అసాధారణ స్థాయిలో ఉన్నట్లు తేలింది. దీన్ని ‘హైపర్‌ఆండ్రోజెనిజమ్’ అంటారు. అయితే ఆమె ఈ నిషేధంపై పోరాడారు. ఇలా నిషేధం విధించడం వివక్షతో కూడిన నిర్ణయమని, లోపభూయిష్టమైనదని తేలడంతో 2015లో ఆమెపై నిషేధాన్ని ఎత్తివేశారు. తనకు ఎదురైన ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ ద్యుతి.. దేశంలో సమర్ధవంతమైన మహిళా క్రీడాకారిణిగా నిలిచారు.
(*మేము విజేతను ప్రకటించే వారం రోజుల ముందు.. అంటే 2021 ఫిబ్రవరి 3న ద్యుతీ చంద్‌కు 25 సంవత్సరాలు నిండుతాయి.)

ఫొటో సోర్స్, Getty Images
3. కోనేరు హంపి
వయసు: 33, స్పోర్ట్స్: చెస్
మహిళల ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్, 2019
కోనేరు హంపి చదరంగం క్రీడలో అత్యుత్తమ భారతీయ క్రీడాకారుల్లో ఒకరు. ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన హంపిలో ప్రతిభను చాలా చిన్న వయసులోనే ఆమె తండ్రి గుర్తించారు. అత్యంత చిన్న వయసులోనే.. అంటే 15 ఏళ్ల ఒక నెల 27 రోజులకే 2002లో ఆమె గ్రాండ్‌మాస్టర్ అయ్యారు. 2008లో చైనాకు చెందిన హౌ యిఫాన్ ఈ రికార్డును బద్దలుగొట్టేవరకు హంపినే గ్రాండ్‌మాస్టర్‌గా ఉన్నారు. 2019 డిసెంబర్‌లో హంపి మహిళల 'ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్' టైటిల్ గెలుచుకున్నారు. రెండేళ్ల ప్రసూతి విరామం తరువాత ఆమె ఈ ఘనత సాధించారు. తరువాత 2020లో కైర్న్స్ కప్ గెలిచారు. కోనేరు హంపికి 2003లో అర్జున అవార్డ్, 2007లో పద్మశ్రీ అవార్డ్ లభించాయి.

ఫొటో సోర్స్, Getty Images
4. వినేశ్ ఫోగట్
వయసు: 26, స్పోర్ట్స్: ఫ్రీస్టైల్ రెజ్లింగ్
రజత పతకం, ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్
అంతర్జాతీయ రెజ్లింగ్ మహిళా క్రీడాకారుల కుటుంబానికి చెందిన వినేశ్ ఫోగట్, 2018లో జకార్తా ఆసియన్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా రికార్డ్ నెలకొల్పారు. అంతే కాకుండా, కామన్‌వెల్త్ క్రీడల్లో రెండుసార్లు స్వర్ణం సాధించారు. కామన్‌వెల్త్ క్రీడల్లో, ఆసియా క్రీడల్లో కూడా స్వర్ణ పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళా రెజ్లర్ ఆమె. 2019 సెప్టెంబర్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల్లో కాంస్య పతకం సాధించారు. 2020 జనవరిలో రోమ్ ర్యాకింగ్ సీరీస్‌లో వినేశ్ స్వర్ణం గెలుచుకున్నారు. వీటన్నిటితోపాటూ గత ఏడాది వినేశ్ కరోనావైరస్‌ను కూడా జయించారు.

ఫొటో సోర్స్, Getty Images
5. రాణి
వయసు: 26, స్పోర్ట్స్: హాకీ
కెప్టెన్, భారత మహిళల హాకీ జట్టు
రాణి 2020లో ప్రతిష్ఠాత్మక 'వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్' అవార్డును గెలుచుకున్న తొలి హాకీ ప్లేయర్. టోక్యో ఒలింపిక్స్‌లో అడుగు పెట్టేందుకు 2019 నవంబర్‌లో అమెరికాతో ఆడిన హాకీ మ్యాచ్‌లో రాణి కొట్టిన గోల్ కీలక పాత్ర పోషించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత జట్టులో కూడా రాణి ఉన్నారు. అతి చిన్న వయసులోనే ప్రపంచ కప్‌లో పాల్గొన్న భారత హాకీ ప్లేయర్‌గా రాణి 2010లో రికార్డ్ నెలకొల్పారు. అంతే కాకుండా 2010 ప్రపంచ కప్‌లో 'యంగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్' అవార్డ్ కూడా గెలుచుకున్నారు. 2018 ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు రజతం సాధించింది. 2018 ప్రపంచ కప్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. అదే ఏడాది కామన్‌వెల్త్ గేమ్స్‌లో నాల్గవ స్థానంలో నిలిచారు. దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన రాణికి 2020లో ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారం లభించింది.

ఇవి కూడా చదవండి:
- చెస్ ఒలంపియాడ్: ఫైనల్ రౌండ్ ఆడుతుండగా ఇంటర్నెట్ సమస్య.. సంయుక్త చాంపియన్లుగా భారత్, రష్యా
- BBC Telugu Exclusive Interview: ఫైనల్ ఫోబియాపై పీవీ సింధు ఏమన్నారు?
- విశాఖపట్నం: దంగల్ సినిమా స్ఫూర్తితో రెజ్లింగ్‌లో దూసుకెళ్తున్న గిరిజన బాలికలు
- సైనా-సింధు: ఒకరు విప్లవం తెచ్చారు.. మరొకరు ముందుకు తీసుకెళ్తున్నారు
- అంతర్జాతీయ పోటీల్లో భారత్ పెట్టుకున్న ఆశల భారాన్ని మహిళా క్రీడాకారులు ఎలా మోస్తున్నారు?
- BBC EXCLUSIVE: సైనా నెహ్వాల్ ఇంటర్వ్యూ.. ‘సింధు టాప్ ప్లేయరే, కానీ ఈరోజు నాది’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























