You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Ind vs Eng: ‘మిషన్ ఇంగ్లండ్’కు టీమ్ ఇండియా సిద్ధం
ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్‌లో చరిత్రాత్మక విజయం సాధించిన భారత క్రికెట్ జట్టు ఇప్పుడు మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది.
భారత్‌లో సుదీర్ఘ పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్ జట్టుతో నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఇందులో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ చెన్నై వేదికగా శుక్రవారం ప్రారంభమవుతోంది.
ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌లో అజింక్యా రహానే నేతృత్వంలో టీమ్ ఇండియా ఆతిథ్య జట్టును 2-1తో ఓడించిన సంగతి తెలిసిందే.
రెగ్యులర్ కెప్టెన్ కోహ్లీ ఆడకపోయినా, ప్రధాన ఆటగాళ్లు గాయాలతో మ్యాచ్‌లకు దూరమైనా... ఆస్ట్రేలియాను భారత్ ఓడించిన తీరు విమర్శకులను సైతం మెప్పించింది.
ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు భారత్‌తో ఇంగ్లండ్‌తో పోరుకు సన్నద్ధమైంది.
మరోవైపు ఇంగ్లండ్ కూడా టెస్టు సిరీస్‌లో 2-0తో శ్రీలంకపై క్లీన్ స్వీప్ సాధించి జోరు మీదుంది.
జట్లలో ఎవరెవరు?
భార్య ప్రసవ సమయంలో దగ్గరుండాలని ఆస్ట్రేలియా సిరీస్‌కు సెలవు తీసుకున్న కోహ్లీ ఇప్పుడు మళ్లీ జట్టులోకి తిరిగివచ్చాడు.
ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య కూడా జట్టులో ఉన్నాడు.
మహమ్మద్ షమి, రవీంద్ర జడేజా, ఉమేష్ యాదవ్ గాయాల నుంచి కోలుకుంటున్నారు.
పృథ్వీ షా జట్టులో స్థానం కోల్పోయాడు. నటరాజన్‌కు కూడా చోటు దక్కలేదు. చీలమండ గాయంతో హనుమ విహారి కూడా అందుబాటులో లేడు.
రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా ఫిట్‌గా ఉన్నారు. బుమ్రాకు ఇది స్వదేశంలో తొలి టెస్టు మ్యాచ్ కాబోతోంది.
మరోవైపు సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఈశాంత్ శర్మ కూడా జట్టులో ఉన్నాడు.
ఆస్ట్రేలియా పర్యటనలో మంచి ప్రదర్శన చేసిన మహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకుర్‌లను కూడా మళ్లీ ఇప్పుడు జట్టులోకి తీసుకున్నారు.
ఇంగ్లండ్ ఈ ఏడాది వన్డేలు, టీ20లతోపాటు 17 టెస్టు మ్యాచ్‌లు ఆడుతోంది. అందుకే ఆ జట్టు రొటేషన్ పద్ధతి అనుసరిస్తోంది. ఆటగాళ్లకు మధ్య మధ్యలో విశ్రాంతినిస్తోంది.
వికెట్ కీపింగ్ బ్యాట్స్‌మన్ జానీ బెయిర్‌స్టోను మొదటి రెండు టెస్టులకు తీసుకోలేదు. శ్రీలంక సిరీస్‌లో ఆడిన మార్క్ వుడ్, శామ్ కరన్‌కు కూడా విశ్రాంతిని ఇచ్చారు.
జో రూట్ వందో టెస్ట్ మ్యాచ్
ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ కెరీర్లో ఇది వందో టెస్టు మ్యాచ్. రూట్ తన తొలి టెస్టు మ్యాచ్ కూడా భారత్‌లోనే ఆడాడు. నాగ్‌పుర్‌లో అతడు టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.
ఇక శ్రీలంక సిరీస్‌లో రూట్ బాగా రాణించి ఫామ్‌లో కనిపిస్తున్నాడు. 228, 186 పరుగులతో రెండు మారథాన్ ఇన్సింగ్స్‌లు ఆడాడు. ఇంగ్లండ్ సిరీస్ గెలవడంలో అతడిది కీలక పాత్ర.
రోరీ బర్న్స్, జక్ క్రాలీ, డామ్ సిబ్లీ ఇంగ్లండ్ జట్టులో ఓపెనింగ్ స్థానాల కోసం పోటీపడుతున్నారు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ ఓలీ పోప్ కూడా జట్టులో ఉన్నాడు. జాస్ బట్లర్ వికెట్ కీపింగ్ బ్యాట్సమన్‌గా ఉన్నాడు.
శ్రీలంక పర్యటనకు దూరమైన ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ మళ్లీ జట్టులోకి వచ్చారు. సీనియర్ ఆటగాళ్లు జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్‌లను రొటేషన్ పద్ధతిలో జట్టు వాడుకోనుంది.
జాక్ లీచ్, డామ్ బెస్, మోయిన్ అలీ స్పిన్నర్లుగా జట్టులో ఉన్నారు. లీచ్, బెస్‌లకు భారత్‌లో ఇదే తొలి సిరీస్.
చెన్నైలో చెపాక్ స్టేడియం వేదికగా తొలి టెస్టు శుక్రవారం మొదలవుతోంది. ఈ మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించడం లేదని తమిళనాడు క్రికెట్ సంఘం తెలిపింది.
ఇక ఇదే స్టేడియంలో జరిగే రెండో టెస్టు మ్యాచ్‌కు మాత్రం స్టేడియంలో సగం సీట్లకు జనాలను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు.
అహ్మదాబాద్‌లోని మోతెరా స్టేడియంలో మూడు, నాలుగో టెస్టులు జరగనున్నాయి. 1.1 లక్షల మంది వీక్షకులు కూర్చునేలా ఈ స్టేడియాన్ని పునర్మించారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఇదే.
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ గత ఏడాది భారత పర్యటకు వచ్చినప్పుడు దీన్ని ప్రారంభించారు. ఇక ఈ స్టేడియంలో మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించాలా, లేదా అనే విషయమై గుజరాత్ క్రికెట్ సంఘం ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఈ పర్యటనలో ఆడే ఐదు టీ20 మ్యాచ్‌లకు కూడా ఇదే స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. మిగిలిన మూడు వన్డేలు పుణెలో జరుగుతాయి.
కరోనా సంక్షోభం తర్వాత భారత్‌లో జరుగుతున్న తొలి అంతర్జాతీయ సిరీస్ ఇదే.
భారత్‌లో ఇంగ్లండ్ గణాంకాలు ఇవి...
భారత్‌లో ఇప్పటివరకూ ఇంగ్లండ్ 60 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. వాటిలో 13 గెలవగా, 19 ఓడింది. మిగతా 28 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
ఇంగ్లండ్ జట్టు భారత్‌లో ఐదు టెస్టు సిరీస్‌లు గెలిచింది. వాటిలో చివరి సిరీస్ 2012లో జరిగింది. అప్పుడు అలిస్టర్ కుక్ నేతృత్వంలో ఆ జట్టు 2-1 తేడాతో భారత్‌పై విజయం సాధించింది.
భారత్‌లో ఇంగ్లండ్ చివరిగా 2016లో పర్యటించింది. అప్పుడు ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరగ్గా... భారత్ 4-0 తేడాతో ఆ జట్టును చిత్తు చేసింది.
ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో న్యూజీలాండ్‌తో పోటీపడేదెవరు?
ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా ఈ సిరీస్ జరుగుతోంది. దక్షిణాఫ్రికాలో ఆస్ట్రేలియా జట్టు పర్యటన కరోనావైరస్ కారణంగా రద్దవ్వడంతో... చాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు న్యూజీలాండ్ అర్హత సాధించింది.
ఫైనల్స్‌లో మరో స్థానం కోసం ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లండ్ పోటీపడుతున్నాయి.
ఫైనల్ చేరాలంటే, ఇంగ్లండ్ ఈ సిరీస్‌లో 3-0 లేదా 3-1 లేదా 4-0 తేడాతో భారత్‌ను ఓడించాల్సి ఉంటుంది. అదే భారత్ ఫైనల్ చేరుకోవాలంటే 2-0 లేదా 2-1 లేదా 3-0 లేదా 3-1 లేదా 4-0 తేడాతో ఇంగ్లండ్‌పై నెగ్గాలి.
ఫైనల్స్‌కు అర్హత సాధించేందుకు ఆస్ట్రేలియాకు కూడా అవకాశాలున్నాయి.
భారత్ vs ఇంగ్లండ్ పర్యటనలో మ్యాచ్‌లు ఎప్పుడెప్పుడంటే...
తొలి టెస్టు: ఫిబ్రవరి 5 నుంచి 9 - చెన్నైలో...
రెండో టెస్టు: ఫిబ్రవరి 13 నుంచి 17 - చెన్నైలో...
మూడో టెస్టు: ఫిబ్రవరి 24 నుంచి 28 - అహ్మదాబాద్‌లో...
నాలుగో టెస్టు: మార్చి 4 నుంచి 8 - అహ్మదాబాద్‌లో...
……………………………………………………
మొదటి టీ20: మార్చి 12 - అహ్మదాబాద్‌లో
రెండో టీ20: మార్చి 14 - అహ్మదాబాద్‌లో
మూడో టీ20: మార్చి 16- అహ్మదాబాద్‌లో...
నాలుగో టీ20: మార్చి 18 - అహ్మదాబాద్‌లో
ఐదో టీ20: మార్చి 20 - అహ్మదాబాద్‌లో
……………………………………..
మొదటి వన్డే: మార్చి 23 - పుణెలో...
రెండో వన్డే: మార్చి 26 - పుణెలో...
మూడో వన్డే: మార్చి 28 - పుణెలో...
ఇవి కూడా చదవండి:
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
- దీప్ సిద్ధూ ఎవరు? ఎర్రకోట ఘటన తరువాత చర్చల్లోకి ఎందుకొచ్చారు?
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- బడ్జెట్ 2021-22: సామాన్యులకు ఈ బడ్జెట్‌తో చేకూరే ప్రయోజనాలు ఇవే..
- పాకిస్తాన్ గురించి నేపాల్ ప్రజలు ఏమనుకుంటారు?
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)