You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జగన్: మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరకు ఇళ్ల స్థలాలు ఇద్దాం.. - ప్రెస్ రివ్యూ
పట్టణాలు, నగరాల్లో మధ్య తరగతి కుటుంబాలకు తక్కువ ధరకు ఇళ్ల స్థలాలను కేటాయించేలా లేఅవుట్ల అభివృద్ధి కోసం ఒక విధానం సిద్ధం చేయాలని అధికారులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని ఈనాడు కథనం ప్రచురించింది.
‘‘తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌తో కలిసి ముఖ్యమంత్రి పురపాలక, పట్టణాభివృద్ధిశాఖపై సమీక్ష జరిపారు. ‘గతంలో రాజీవ్ స్వగృహలో ఇళ్లు కేటాయించారు. ఇప్పుడు వివాదాల్లేని స్థలాలను తక్కువ ధరకు ఇచ్చే కార్యక్రమాన్ని రూపొందించాలి’ అని ఆ యన అధికారులను ఆదేశించారు.
ప్రైవేటు వ్యక్తుల వద్ద స్థలాలు కొంటే టైటిల్ సరైనదేనా.. అనుమతులు ఉన్నాయా, లేవా అనే భయాలు ఉంటున్నాయి.
ప్రభుత్వమే లేఅవుట్లు అభివృద్ధి చేస్తే అవన్నీ తొలగిపోతాయి. మధ్యతరగతి ప్రజల కోసం ఏదైనా చేయాలన్న క్రమంలో ఈ ఆలోచన వచ్చింది.
దీనిపై అధికారులు ఆలోచించి ప్రజల సొంతింటి కల సాకారమయ్యేలా చూడాలి’ అని అధికారులకు ముఖ్యమంత్రి జగన్ సూచించారు.
గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తాడేపల్లి పురపాలక సంఘాలను కలిపి నగరపాలక సంస్థగా (మున్సిపల్ కార్పొరేషన్) ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
వీటిలో అభివృద్ధి పనులకు సంబంధించి రూ.1,000 కోట్లతో రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
‘భీమిలి నుంచి భోగాపురం వరకు తీరం వెంబడి 6 వరుసల్లో బీచ్ రోడ్డును అభివృద్ధి చేయనున్నాం. ఈ రహదారి విశాఖపట్నానికి ఒక చిహ్నంలా మిగిలిపోనుంది.
దీనికి అధికారులు కార్యాచరణ సిద్ధం చేయాలి. పట్టణాల్లో ఘన వ్యర్థాల యాజమాన్య కార్యక్రమాల నిర్వహణలో కొత్త విధానాలను పరిశీలించాలి.
పట్టణ గృహ నిర్మాణాన్ని వేగవంతం చేయాలి’ అని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారని ఈ కథనంలో తెలిపారు.
తెలుగు రాష్ట్రాలలో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ గురువారం ప్రమాణ స్వీకారం చేశారని నవతెలంగాణ తెలిపింది.
‘‘హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమె చేత ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు.
జస్టిస్ హిమా కోహ్లీ తెలుగు రాష్ట్రాల్లో మొట్ట మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి.
ఇప్పటి వరకూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ బదిలీపై ఉత్తరాఖండ్ చీఫ్ జస్టిస్‌గా వెళ్లిపోవటంతో ఆయన స్థానం లో పదోన్నతిపై వచ్చిన హిమా కోహ్లీ... బాధ్యతలు చేపట్టారు.
ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్, సీఎం ఆమెకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కోహ్లీ నేరుగా హైకోర్టుకు వెళ్లి బాధ్యతలు చేపట్టార’’ ‘నవ తెలంగాణ’ వార్తా కథనం తెలిపింది.
తెలంగాణలో కోళ్ల వ్యర్థాలతో బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రం
పౌల్ట్రీఫారమ్‌లోని కోళ్ల వ్యర్థాల ఆధారంగా పనిచేసే తొలి బయోగ్యాస్ ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైందని సాక్షి ఒక కథనాన్ని ప్రచురించింది.
‘‘హైదరాబాద్ శివారులోని ఉడిత్యాల్ గ్రామంలో సోలికా ఎనర్జీ, శ్రీనివాస హ్యచరీస్, ఎక్స్‌ఈఎంఎక్స్ ప్రాజెక్ట్స్ సంయుక్తంగా ఏర్పాటుచేసిన ఈ ప్రాజెక్ట్ గురువారం ప్రారంభమైంది.
భారతదేశ క్లీన్ ఎనర్జీ లక్ష్యాలను సాధించడంలో భాగంగా ఈ ప్రాజెక్ట్‌ను ఏర్పాటుచేశారు. రోజుకు 2.4 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్రాజెక్ట్‌ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓఎల్) ఈడీ ఆర్‌ఎస్‌ఎస్ రావు ప్రారంభించారు.
4.50 లక్షల కోళ్లు కలిగిన అతిపెద్ద కోళ్ల ఫారమ్ పక్కన దీనిని ఏర్పాటుచేశారు. కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని చౌకైన రవాణా పథకం కింద సోలికా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించింది.
ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి చేసే బయోగ్యాస్‌ను అత్తాపూర్‌లోని ఐఓఎల్ ఔట్‌లెట్‌కు సరఫరా చేయనున్నారు. రాష్ట్రంలో 3.6 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో రెండో బయోగ్యాస్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు సోలికా ప్రమోటర్ హిమదీప్ నల్లవడ్ల తెలిపార’’ని ఈ కథనంలో రాశారు.
విజయనగరంలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం
విజయనగరం జిల్లాలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు స్థలం ఖరారైందని ప్రజాశక్తి ఒక వార్తను ప్రచురించింది.
రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర నేతృత్వంలో గిరిజన సాంస్కృతిక అధ్యయన కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ సర్రాజు, గిరిజన విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ కట్టమణి తదితరులతో కూడిన కమిటీ గురువారం జిల్లాలో పర్యటించింది.
కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ సూచించిన మెంటాడ, దత్తిరాజేరు మండలాల పరిధిలో 26వ జాతీయ రహదారికి మూడు కిలో మీటర్ల దూరంలోని 426.83 ఎకరాల్లో విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కమిటీ సానుకూలత తెలిపినట్లు ఈ వార్తలో రాశారు.
ఇవి కూడా చదవండి:
- ‘అన్నీ పోను రూ. 500 నెల జీతం’.. అందుకే కార్మికులు తిరగబడి ఫ్యాక్టరీని ధ్వంసం చేశారా
- విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?
- హోమీ జహంగీర్ భాభా భవిష్యవాణి, బ్రిటన్‌లో నిజం కాబోతోందా
- దక్షిణ కొరియాలో ప్రమాద ఘంటికలు, తగ్గిన జననాలు, పెరిగిన మరణాలు
- జాక్ మా: ఈ చైనా బిలియనీర్ రెండు నెలల్లో రూ.80వేల కోట్లు ఎలా కోల్పోయారు?
- మాల మాస్టిన్లు: పొట్టకూటి కోసం ప్రమాదానికి ఎదురెళ్లే ఈ సాహసగాళ్లు ఎవరు
- "నేనెలాగూ బ్రతకను.. నా బిడ్డను అయినా కాపాడండి" - మరణం అంచుల దాకా వెళ్లిన 22 ఏళ్ల మహిళ
- బిట్ కాయిన్లు: అప్పుడు నిషేధించారు... ఇప్పుడు దూసుకుపోతున్నాయి...
- ఏసుక్రీస్తు ఎలా కనిపించేవారు.. ఆయన అసలు చిత్రం ఏది?
- కరోనావైరస్: భారత్ ఆమోదించిన కోవాగ్జిన్‌పై ప్రశ్నలు ఎందుకు ఉత్పన్నం అవుతున్నాయి?
- మైనస్ 67 డిగ్రీల చలిలో ప్రజలు ఎలా జీవిస్తారో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)