తెలంగాణలో కరోనా కొత్త రకం వైరస్: ప్రెస్ రివ్యూ

ప్రచురణ

తెలంగాణ వ్యక్తిలో కరోనా కొత్త రకం వైరస్ బయటపడిందని ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.

కరోనా కొత్త స్ట్రెయిన్‌ తెలంగాణలో ఒకరిలో నిర్ధారణ అయింది. ఇటీవల యూకే నుంచి తిరిగొచ్చిన వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు చెందిన వ్యక్తి (49)లో దీనిని గుర్తించారు.

ఆ వ్యక్తితో ప్రాథమికంగా కాంటాక్టు అయినవారిలో తల్లి, భార్య, డ్రైవర్‌ ఉన్నారు. వీరికి పరీక్షలు నిర్వహించగా తల్లికి పాజిటివ్‌ అని తేలింది.

ఆమెకు సోకింది కొత్త కరోనానా? కాదా? అని తేల్చేందుకు నమూనాలను సీసీఎంబీకి పంపారు.

కాగా, యూకే నుంచి వచ్చి పాజిటివ్‌గా తేలినవారి నమూనాల జన్యు విశ్లేషణ అనంతరం ఫలితాల నివేదికను ఆదివారమే సీసీఎంబీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది.

అందులోనే వరంగల్‌ వ్యక్తిలో కొత్త స్ట్రెయిన్‌ను నిర్ధారించినట్లు సమాచారం. ఇతడి ఆరోగ్యం నిలకడగా ఉందని, కొద్ది రోజుల్లోనే డిశ్చార్జి అవుతారని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి.

వివరాలను ప్రభుత్వం చాలా గోప్యంగా ఉంచింది. వివిధ రాష్ట్రాల్లో నమోదైన కొత్త స్ట్రెయిన్‌ కేసుల వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంగళవారం వెల్లడించనుందని ఆంధ్రజ్యోతి రాసింది.

బ్రిటన్‌ నుంచి రాష్ట్రానికి వచ్చినవారిలో సోమవారం మరో వ్యక్తికి పాజిటివ్‌ వచ్చింది. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాకు చెందిన ఇతడికి ఇంటి వద్ద పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌ అని తేలింది.

అయితే, లక్షణాలు మాత్రం లేవు. దీంతో మొత్తం సంఖ్య 21కి పెరిగింది. యూకే, యూకే మీదుగా డిసెంబరు 9 నుంచి 22వ తేదీ వరకు రాష్ట్రానికి 1,216 మంది వచ్చారు. ఇందులో 1,060 మందిని గుర్తించారు.

ఆరుగురు విదేశాలకు తిరిగి వెళ్లిపోయారు. ఇతర రాష్ట్రాలకు చెందిన 58 మంది సమాచారాన్ని ఆయా ప్రభుత్వాలకు అందించారు.

రాష్ట్రంలో ట్రేస్‌ అయినవారిలో 996 మందికి పరీక్షలు నిర్వహించగా, 966 మందికి నెగెటివ్‌ వచ్చింది. 9 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

పాజిటివ్‌లు 21 మందిలో హైదరాబాద్‌వారు నలుగురు, మేడ్చల్‌వారు 9 మంది, జగిత్యాల జిల్లావాసులు ఇద్దరు, మంచిర్యాల, నల్లగొండ, రంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలవారు ఒక్కొక్కరు ఉన్నారు. వీరంతా వివిధ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డుల్లో చికిత్స పొందుతున్నారని ఆంధ్రజ్యోతి వివరించింది.

కొత్త ఏడాదిలో భారత్‌లోకి అమెరికా ఎలక్ట్రిక్ కారు 'టెస్లా'

వచ్చే ఏడాది భారత్‌లో టెస్లా కార్లు అందుబాటులోకి వస్తాయని కేంద్రం ప్రకటించినట్లు ఈనాడు దినపత్రిక కథనం ప్రచురించింది.

అమెరికా విద్యుత్‌ కార్ల తయారీ దిగ్గజం టెస్లా భారత మార్కెట్లోకి 2021లో ప్రవేశించనుందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సోమవారం ధ్రువీకరించారు.

గిరాకీని బట్టి తయారీ యూనిట్‌ సైతం నెలకొల్పే అవకాశం ఉందని ఆయన అన్నారు. 2030 కల్లా రూ.8 లక్షల కోట్ల ముడి చమురు దిగుమతులతో పాటు కర్బన ఉద్గారాలను 30-35 శాతం తగ్గించుకోవడం కోసం, విద్యుత్‌ కార్లకు భారత్‌ ప్రోత్సాహం ఇస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.

'ప్రపంచంలోనే అత్యంత విలువైన వాహన కంపెనీగా ఉన్న టెస్లా భారత్‌లో విక్రయ కార్యకలాపాలు మొదలుపెట్టనుంది. అమ్మకాలకు వచ్చే స్పందనను బట్టి స్థానికంగా అసెంబ్లింగ్‌, తయారీని పరిశీలిస్తుంది. వచ్చే అయిదేళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద ఈవీ తయారీదారుగా మారే సత్తా భారత్‌కు ఉంద'ని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి గడ్కరీ తెలిపారని ఈనాడు రాసింది.

డిజిటల్‌ రిటైలింగ్‌ ద్వారా విక్రయాలను నేరుగా కంపెనీయే పర్యవేక్షించనుంది. టెస్లా పోర్ట్‌ఫోలియోలోని 'మోడల్‌ 3' వాహనం మన మార్కెట్లో అందుబాటులోకి రానుంది. దీని ధర రూ.55-60 లక్షల వరకు ఉండొచ్చని ఈనాడు వివరించింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఇళ్ల పట్టాల పంపిణీ

ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి శ్రీకాళహస్తిలో ఇళ్లపట్టాల పంపిణీతోపాటూ, తొలి దశ ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారని సాక్షికథనం ప్రచురించింది.

రాష్ట్రమంతటా ఇళ్ల పట్టాలు, నిర్మాణాల పండుగ జరుగుతోందని.. వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్‌ మొదలు కొత్త సంవత్సరం, సంక్రాంతి వరకు ఇది కొనసాగుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

30.75 లక్షల ఇళ్ల స్థల పట్టాల పంపిణీతో పాటు, రెండు దశల్లో 28.30 లక్షల ఇళ్ల నిర్మాణం, మరో 2.62 లక్షల టిడ్కో ఇళ్లు కట్టిస్తామని తెలిపారు.

'నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు' పథకంలో భాగంగా సోమవారం ఆయన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఊరందూరులో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీతో పాటు తొలి దశలో నిర్మించనున్న ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వైఎస్సార్‌ జగనన్న కాలనీ లేఅవుట్‌లో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు.

'తొలి దశలో నిర్మిస్తున్న 15.60 లక్షల ఇళ్లలో చిత్తూరు జిల్లాలో 1,78,840 ఇళ్లు ఉన్నాయి. ఈ జిల్లాలో 2.50 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం. ఊరందూరు లేఅవుట్‌లో ఏకంగా 6,232 మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తున్నాం. ఇక్కడ ప్లాన్‌ చాలా చక్కగా ఉంది. ఇక్కడే ఆర్బీకే కేంద్రాలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్, ఆటో స్టాండ్, వైఎస్సార్‌ జనతా బజార్, కల్యాణ మండపాలు, వార్డు సచివాలయం, పార్కులు, ప్రభుత్వ పాఠశాలలు రానున్నాయి' అని చెప్పారు.

ఇక్కడ మార్కెట్‌ రేటు ప్రకారం ఒక్కో ప్లాటు విలువ రూ.7 లక్షలు ఉంటుందన్నారు. ఒక అన్నగా, తమ్ముడిగా అక్కచెల్లెమ్మలకు ఈ ఆస్తిని ఇస్తున్నానని, ఇందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారని సాక్షి వివరించింది.

తెలంగాణ జలవనరుల శాఖకు కొత్త రూపం

జలవనరుల శాఖకు తెలంగాణ ప్రభుత్వం కొత్త రూపం ఇచ్చిందని నమస్తే తెలంగాణ దినపత్రిక కథనం ప్రచురించింది.

తెలంగాణలో నీటిపారుదల రంగంలో వచ్చిన పెను మార్పులకు అనుగుణంగా జలవనరులశాఖను ప్రభుత్వం పూర్తిగా పునర్వ్యవస్థీకరించింది.

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం ప్రగతిభవన్‌లో జలవనరులశాఖకు చెందిన ముఖ్య అధికారులతో సమావేశమై.. రాష్ట్రంలో ఆ శాఖ స్వరూపాన్ని ఖరారుచేశారు.

భారీ, మధ్య, చిన్నతరహా నీటిపారుదల విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తేవడంతోపాటు, ఒకే ప్రాంతంలో ఉన్న అన్నిరకాల జలవనరులశాఖ వ్యవహారాలను ఒకే అధికారి పర్యవేక్షించేలా పునర్వ్యవస్థీకరించారు.

దీనికి అనుగుణంగా ఉన్నతాధికారుల పోస్టుల సంఖ్యను పెంచారు.

రాష్ట్రం మొత్తాన్ని 19 జలవనరుల ప్రాదేశిక ప్రాంతాలుగా గుర్తించి, ఒక్కొక్క దానికి ఒక్కో సీఈని పర్యవేక్షణాధికారిగా నియమించి బాధ్యతలు అప్పగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని నమస్తే తెలంగాణ రాసింది.

రాష్ట్రంలో ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్‌, రామగుండం, వరంగల్‌, ములుగు, సంగారెడ్డి, గజ్వేల్‌, నల్లగొండ, సూర్యాపేట, వనపర్తి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, హైదరాబాద్‌, కొత్తగూడెం, ఖమ్మం ప్రాదేశిక ప్రాంతాలుగా ఉంటాయని నమస్తే తెలంగాణ వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)