You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వైఎస్ జగన్మోహనపురం: ఆంధ్రప్రదేశ్‌లో 30.75 లక్షల నిరుపేద కుటుంబాలకు ఇంటి పట్టాల పంపిణీ - ప్రెస్ రివ్యూ
నిరుపేదలను సుదీర్ఘకాలంగా ఊరిస్తున్న ఇంటిపట్టాల పంపిణీ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. పట్టాల పంపిణీ అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పేదల ఇంటి నిర్మాణాలనూ ప్రారంభించనున్నారని ఆంధ్రజ్యోతి తన కథనంలో తెలిపింది.
వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్ పర్వదినాలను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా 30.75లక్షల మంది నిరుపేద కుటుంబాలకు.. ఆ కుటుంబాల్లోని మహిళల పేరిట ఇంటిపట్టాలు ఇవ్వనున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తూర్పుగోదావరి జిల్లా కొమరగిరి గ్రామం నుంచి ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ వెంటనే అదే గ్రామంలో ఇళ్లనిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేస్తారు. అదే సమయంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు వారి వారి జిల్లాలు, నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
‘నవరత్నాలు-పేదలందరికి ఇళ్లు’ పథకం కింద డీ పట్టాల రూపంలో ఇంటిస్థలాలు ఇవ్వనున్నట్లు గురువారం రెవెన్యూశాఖ ఉత్తర్వులు (జీవో 391) జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లపట్టాల పంపిణీ, నిర్మాణాలకు వచ్చే నెల జనవరి ఏడో తేదీ వరకు శంకుస్థాపనల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఇంటిస్థలాల కోసం గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర, పట్టణ ప్రాంతాల్లో సెంటు భూమి చొప్పున ఇస్తారు. ఇప్పటికే భూ సేకరణ పూర్తయింది. లే అవుట్‌లు సిద్ధం చేశారు. వీటితో 17,500 వైఎస్ఆర్ జగనన్న కాలనీలు రానున్నాయని ఈ కథనంలో రాశారు.
కాగా, కాకినాడ రూరల్ మండలం నేమాంలో 103 ఎకరాల్లో 3,317 మందికి ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు లేఅవుట్ సిద్ధం చేశారు. ఈ లేఅవుట్‌లో వచ్చే కాలనీకి వైఎస్ జగన్మోహనపురంగా నామకరణంచేసి.. ఆ పేరుతోనే ముఖద్వారం కూడా ఏర్పాటు చేశారని ఆంధ్రజ్యోతి ప్రచురించింది. పలు జిల్లాల్లోనూ 'పేదింటి' పేటలు, కాలనీలను జగన్, జగనన్న పేరుతోనే సిద్ధం చేస్తున్నారని తెలిపింది.
బ్రిటన్‌నుంచి వచ్చిన ఏడుగురికి కరోనావైరస్...కొత్త రకమా కాదా అనేది నిర్థారణ కాలేదు
బ్రిటన్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ప్రయాణికుల్లో ఇప్పటివరకు ఏడుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని, అయితే వీరిలో కొత్త రకం వైరస్ ఉందో లేదో తెలుసుకునేందుకు నమూనాలను సీసీఎంబీ ప్రయోగశాలకు పంపినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారని ఈనాడు ఒక కథనాన్ని ప్రచురించింది.
ఈ నెల 9 నుంచి వచ్చిన 1200 మందిలో 846 మందిని గుర్తించి పరీక్షలు నిర్వహించగా ఈ విషయం వెల్లడైందన్నారు. వీరంతా హైదరాబాద్, మేడ్చల్, జగిత్యాల, సిద్దిపేట, వరంగల్ అర్బన్ జిల్లాలకు చెందిన వారన్నారు. వీరిని, పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన వారిని సైతం ప్రత్యేకంగా పరిశీలిస్తున్నామని వివరించారు. కొత్త వైరస్ బాధితులకు చికిత్స అందించేందుకు టిమ్స్‌లో మూడు అంతస్తులను కేటాయించినట్లు చెప్పారు. గురువారం ఇక్కడ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ, వైద్య విద్య సంచాలకులు రమేష్‌రెడ్డి, ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు, టీఎస్‌ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, కొవిడ్ సాంకేతిక నిపుణుల కమిటీ సభ్యులు గంగాధర్‌తో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో తొలిదశ కింద 70 నుంచి 80 లక్షల మందికి టీకా వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి తెలిపారు. వైద్యఆరోగ్య, పోలీసు, పురపాలక, అగ్నిమాపక సిబ్బందితో పాటు వయసుపైబడిన వారికి తొలిదశలో ఇస్తామని వెల్లడించారు. టీకా వేసేందుకు 10 వేల మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చామని, ఒక్కొక్కరు రోజుకు 100 మందికి వ్యాక్సిన్ వేస్తే రోజుకు 10 లక్షల మందికి టీకా వేయవచ్చని తెలిపారు. తొలిడోసు ఇచ్చిన 28 రోజుల్లో రెండో డోసు ఇచ్చేందుకు వీలుగా సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేశామని వివరించారని ఈ కథనంలో పేర్కొన్నారు.
లోన్ యాప్‌ల వేధింపులు...మరో యువకుడి ఆత్మహత్య
ఆన్‌లైన్ లోన్ యాప్‌ల కారణంగా ఇటీవల ఆత్మహత్యలు పెరిగిపోయాయని, తాజాగా లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు సాక్షి ఒక కథనాన్ని ప్రచురించింది.
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సంతోష్‌కుమార్ ఆర్‌ఎఫ్‌సీఎల్ కర్మాగారంలో సైట్ ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్నాడు. ఎన్టీపీసీ మల్కాపూర్ గ్రామంలో అద్దెకు ఉంటున్న సంతోష్ ఇంట్లోనే చిన్న కిరాణా దుకాణం కూడా నడుపుతున్నాడు. దీని నిర్వహణకు ఐదు ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా రూ.60 వేల వరకు అప్పు తీసుకున్నాడు. తీసుకున్న అప్పుకు వడ్డీ, అసలు మొత్తం చెల్లించాలని యాప్‌ల నిర్వాహకులు రోజూ బెదిరిస్తుండటంతో భయాందోళనకు గురైన సంతోష్ ఈ నెల 18న ఇంట్లో గడ్డిమందు తాగాడు.
ఆన్‌లైన్ వడ్డీ వ్యాపారులు వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానని మొబైల్ ద్వారా స్నేహితులకు వీడియో పంపించాడు. గమనించిన ఇరుగుపొరుగు వారు గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి, అనంతరం పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌కు తరలించారు. ఈ విషయం బాధితుడి కుటుంబసభ్యులకు మిత్రులు సమాచారం అందించగా ఈనెల 21న సంతోష్‌ను తూర్పుగోదావరి జిల్లాకు తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం వైజాగ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. తన మిత్రుడు ఆన్‌లైన్ వేధింపుల వల్లే మృతిచెందాడని, దీనికి కారణమైన లోన్ యాప్ యజమానులపై చర్యలు తీసుకోవాలని గురువారం సంతోష్‌కుమార్ మిత్రుడు బ్రహ్మచారి ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై స్వరూప్‌రాజ్ తెలిపారని ఈ కథనంలో తెలిపారు.
తాడిపత్రిలో 144 సెక్షన్
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, వైసిపి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జెసి.ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు పరస్పర దాడులకు పాల్పడ్డారని ప్రజాశక్తి ఒక కథనాన్ని ప్రచురించింది.
ఆ కథనం ప్రకారం.. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గురువారం ఉదయం తన అనుయులతో కలసి తాడిపత్రి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే జెసి.ప్రభాకర్‌రెడ్డి నివాసంలోకెళ్లి అక్కడున్న వారి అనుచరులపై దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో జెసి.ప్రభాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులెవరూ అక్కడ లేరు. జెసి.ప్రభాకర్‌రెడ్డి కూర్చీని బయటకు తీసుకొచ్చి నిప్పుపెట్టారు. ఇసుక అక్రమ రవాణా విషయంలో పెద్దారెడ్డి, వారి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో దుష్పప్రచారం చేస్తున్నందుకే ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. దాడి చేసారన్న విషయం తెలిగానే అనంతపురంలోనున్న జెసి.ప్రభాకర్‌రెడ్డి హుటాహుటిన తాడిపత్రికి ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డితో కలసి వెళ్లాడు. అప్పటికే పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న జెసి మద్దతుదారులు పెద్దారెడ్డి వర్గీయులపై దాడికి యత్నించారు. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడిలో ఇద్దరు గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో తాడిపత్రి డీఎస్పీ చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పోలీసులతో అక్కడ మోహరించారు. ఇరువర్గాలపై లాఠీలు ఝుళిపించి అక్కడి నుంచి పంపారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తాడిపత్రిలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు డీఎస్పీ ప్రకటించారు.తమ కుటుంబంపై సోషియల్ మీడియాలో అసభ్య పోస్టులు ఎందుకు పెడుతున్నారని అడిగేందుకు మాజీ ఎమ్మెల్యే జెసి.ప్రభాకర్‌రెడ్డి వద్దకు తాము వెళ్లగా అతని అనచరులే తమపై దాడికి పాల్పడ్డారని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలిపారని ఈ వార్తలో రాశారు.
ఇవి కూడా చదవండి:
- క్రిస్మస్: బైబిల్‌ను తొలిసారిగా తెలుగులోకి అనువాదం చేసింది విశాఖపట్నంలోనేనా?
- రాష్ట్రపతి భవన్‌కు కాంగ్రెస్ నేతల పాదయాత్ర, అడ్డుకున్న పోలీసులు
- సిస్టర్ అభయ హత్య కేసులో ఫాదర్, నన్‌కు జీవిత ఖైదు
- నీటి కాలుష్యం: వైజాగ్ మరో ఏలూరు కానుందా?
- ఏపీ రాజధాని చుట్టూ ఏడాదిగా ఏం జరిగింది? అమరావతి భవితవ్యం ఏంటి?
- 451 ఏళ్ల బానిసత్వం నుంచి గోవాను లోహియా ఎలా విడిపించారు?
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- శకుంతలా దేవిని హ్యూమన్ కంప్యూటర్ అని ఎందుకు పిలుస్తారంటే..
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ: మెరుగైన మహిళా సాధికారత... కలవరపెడుతున్న పోషకాహార లోపం -జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే
- సౌదీ అరేబియా భారతదేశంతో స్నేహం ఎందుకు కోరుకుంటోంది...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)