ఆంధ్రప్రదేశ్: అంత్యక్రియలకు తీసుకెళ్తుంటే పాడెపై నుంచి లేచి కూర్చున్నాడు - ప్రెస్ రివ్యూ

ప్రచురణ

ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో ఒక వ్యక్తిని అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా పాడెపైనుంచి లేచి కూర్చున్నట్టు ఈనాడు దినపత్రిక ఒక కథనం ప్రచురించింది.

చనిపోయాడనుకొని అంత్యక్రియలకు తీసుకెళ్తున్న ఓ వ్యక్తి మార్గమధ్యంలో పాడెపై లేచి కూర్చున్న సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలంలో సోమవారం చోటుచేసుకుంది.

గ్రామస్థుల కథనం మేరకు.. మండలంలోని కట్టుబావి సమీపంలో చెట్టుకింద ఓ వ్యక్తి కొంతకాలంగా ఉంటున్నాడు. స్థానికులు పెట్టే భోజనం తిని జీవనం సాగిస్తున్నాడు.

రెండు రోజులుగా ఆ వ్యక్తి అపస్మారక స్థితిలో ఉండటంతో చనిపోయినట్లు భావించి గ్రామ కార్యదర్శి మనోహర్‌, వీఆర్వో నాగరాజుకు స్థానికులు సమాచారం అందించారు.

చివరకు గ్రామస్థులంతా కలిసి అంత్యక్రియలకు ఏర్పాట్లుచేశారు. మృతదేహాన్ని తీసుకెళ్తుండగా ఆ వ్యక్తి ఒక్కసారిగా పాడెపై లేచి కూర్చున్నాడని పత్రిక చెప్పింది.

అధికారులు వెంటనే 108కు సమాచారం అందించి బాధితుడిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతని బంధువులు ఎవరైనా ఉంటే మదనపల్లె జిల్లా ఆసుపత్రికి రావాలని వైద్య సిబ్బంది కోరుతున్నారని ఈనాడు వివరించింది.

జనవరి నుంచి రవాణా తనిఖీలు ముమ్మరం

ఏపీలో జనవరి నుంచి రవాణా తనిఖీలు ముమ్మరం చేస్తున్నట్లు సాక్షి దినపత్రిక వార్త ప్రచురించింది.

రవాణా వాహనానికి సంబంధించి ఏ పత్రం లేకపోయినా కేసులు నమోదు చేసేందుకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం రవాణాశాఖకు ఆదేశాలిచ్చింది.

కోవిడ్‌ కారణంగా రవాణా వాహనాల పర్మిట్లు, రిజిస్ట్రేషన్లు, లైసెన్సుల గడువు ఫిబ్రవరితో తీరిపోయినా.. ఈ ఏడాది డిసెంబర్‌ వరకు చెల్లుబాటయ్యేలా లాక్‌డౌన్‌ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని పత్రిక రాసింది.

కేంద్రం ఆదేశాల ప్రకారం రవాణాశాఖ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసి ఆ మేరకు కేసుల నమోదులో వెసులుబాటు కల్పించింది.

ఈ గడువు ఈనెలాఖరుతో ముగుస్తున్నందున వచ్చే ఏడాది ప్రారంభం నుంచి కఠినంగా రోడ్‌ సేఫ్టీ నిబంధనలు అమలు చేసేందుకు రవాణాశాఖ కింది స్థాయి అధికారులకు ఆదేశాలిచ్చిందని సాక్షి చెప్పింది.

దీంతో చెక్‌పోస్టుల్లో తనిఖీలు ముమ్మరం చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.

ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు సంబంధించి మోటారు వాహన చట్టాన్ని కేంద్రం గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి అమల్లోకి తెచ్చింది.

దీన్ని అనుసరించి ఈ ఏడాది జరిమానాలను భారీగా పెంచుతూ మోటారు వాహన చట్టంలో సెక్షన్‌ 177 నుంచి 199 వరకు కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు కొత్త ఏడాదిలో రోడ్‌ సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్‌ ఉల్లంఘనుల భరతం పట్టనున్నారు.

గు‌ర్‌గావ్ లోన్ యాప్‌లు, హైదరాబాద్‌లో కాల్ సెంటర్లు

హైదరాబాద్‌ లోన్ యాప్ కాల్ సెంటర్లకు, గురుగ్రామ్‌కు లింకు ఉన్నట్లు పోలీసులు గుర్తించారని నమస్తే తెలంగాణ దినపత్రిక కథనం ప్రచురించింది.

లోన్‌యాప్స్‌ నిర్వాహకులపై సైబర్‌ క్రైం పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన 25 ఫిర్యాదులపై దర్యాప్తు ప్రారంభించారు.

గుర్‌గావ్‌లో వీటి ప్రధాన అడ్డాలు ఉన్నట్టు తేల్చారు. వాటి అనుబంధ సంస్థలు హైదరాబాద్‌లో కొనసాగుతున్నాయని గుర్తించారు.

గుర్‌గావ్‌ వెళ్లిన సైబర్‌ క్రైం పోలీసులు అక్కడ10 కాల్‌సెంటర్లపై దాడులు నిర్వహించి 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని ట్రాన్సిట్‌ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చి విచారణ జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

గుర్‌గావ్‌లో అదుపులోకి తీసుకున్న వారిని విచారించడంతో హైదరాబాద్‌లోని కాల్‌ సెంటర్ల గుట్టరట్టయ్యింది. గుర్‌గావ్‌లోని కాల్‌సెంటర్లలో 700 మంది వరకు పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

గుర్‌గావ్‌లోని లోన్‌యాప్స్‌కు అనుబంధం గా నిర్వహిస్తున్న కాల్‌సెంటర్లపై సోమవా రం పోలీసులు దాడి చేశారు. పంజాగుట్ట, బేగంపేట్‌లో మూడు కేంద్రాల్లో ఇన్‌ప్రింట్‌ టెక్నాలజీస్‌ పేరిట సంస్థను ఏర్పాటు చేసి లో న్‌ యాప్‌ దందా నిర్వహిస్తున్నట్టు గుర్తించి దాడులు చేశారు.

ఈ మూడు సంస్థల్లో దాదాపు 500 మంది ఉద్యోగులు పని చేస్తున్నట్టు తేల్చారు. వీరందరీకి ప్రతి నెలా రూ. 10 వేల జీతంతోపాటు సకాలంలో లోన్‌రికవరీ చేస్తే మరో 10 వేల నుంచి 20 వేల వరకు ఇన్సెంటివ్‌ ఇస్తున్నట్టు తేలింది. ఈ సంస్థల మేనేజర్‌లను పోలీసులువిచారిస్తున్నారని నమస్తే తెలంగాణ వివరించింది.

జమిలి ఎన్నికలకు మేం సిద్ధం: సీఈసీ

జమిలి ఎన్నికలకు ఎన్నికల సంఘం సిద్ధంగా ఉందని ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ ఆరోరా వెల్లడించినట్లు ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.

దేశమంతటా లోక్‌సభ, శాసనసభలకు జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరా ప్రకటించారు.

సోమవారం ఓ ఇం టర్వ్యూలో ఆయన మాట్లాడుతూ 'ఒకే దేశం-ఒకే ఎన్నికలు విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన అన్ని చట్ట సవరణలను పార్లమెంటు ఆమోది స్తే జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ సంసిద్ధంగా ఉందన్నారు.

జమిలి ఎన్నికలను నిర్వహించాల న్న అభిప్రాయాన్ని ప్రధాని నరేంద్రమోదీ కూడా పలు సందర్భాల్లో వ్యక్తం చేసిన నేపథ్యంలో సీఈసీ వ్యాఖ్యలు ప్రాధా న్యం సంతరించుకున్నాయి.

జమిలి ఎన్నికలు 2024లో సార్వత్రిక ఎన్నికలతోపాటు జరుగుతాయా, లేక ముందే జరుగుతాయా అన్న అంశంపై కూడా ఇప్పటికే రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చలు ప్రారంభమయ్యాయని ఆంధ్రజ్యోతి వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)