తెలంగాణలో తిరుగుతున్న పులులెన్ని... ఒకటా, రెండా, నాలుగా? :ప్రెస్ రివ్యూ

ప్రచురణ

కుమరం భీం జిల్లాలో దాడులు చేస్తున్న పులి ఒక్కటేనా, లేక వేరు వేరా అనే విషయంలో గందరగోళం నెలకొన్నట్లు ఈనాడు దినపత్రిక కథనం ప్రచురించింది.

దహెగాం మండలం దిగిడ.. పెంచికల్‌పేట మండలం కొండపల్లి.. కుమురం భీం జిల్లాలో పులి పంజాకు ఇద్దరు బలైన ప్రాంతాలు.

ఈ రెండూ జరిగింది 18 రోజుల వ్యవధిలో. రెండు గ్రామాల మధ్య దూరం 10 కిలోమీటర్లే. దీంతో పంజా విసిరింది వేర్వేరు పులులా?ఒక్కటేనా అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని పత్రిక రాసింది.

రెండూ వేర్వేరు పులులని ఆసిఫాబాద్‌ జిల్లా అటవీ అధికారులు చెబుతున్నారు. నిపుణులు మాత్రం..దాడి చేసి చంపింది ఒకే పులి అని అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఈనెల 7న కాగజ్‌నగర్‌లో సమీక్ష చేయనున్నట్లు సమాచారం.

నవంబరు 29న కొండపల్లిలో బాలిక నిర్మలను చంపిన పులికి సంబంధించిన చిత్రం, పాదముద్రల ఆధారం అటవీశాఖకు దొరకలేదు.

పులుల జాడ తెలుసుకునేందుకు కొండపల్లి, ఆ పరిసరాల్లో దాదాపు 30 కెమెరాలు అమర్చారు. ఈ కెమెరాల ట్రాప్‌లో తాజాగా నాలుగు పులులు చిక్కినట్లు తెలిసిందని కథనంలో రాశారు.

‘ఇందులో ఒక ఆడపులి, ఒక మగ పులి ఎప్పటి నుంచో ఈ ప్రాంతంలో తిరుగుతున్నవే. అలాగే మిగిలిన రెండూ చాలాకాలంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచరించేవే.

పాత చిత్రాలతో తాజా చిత్రాలు సరిపోయాయి’అని అటవీశాఖ అధికారి ఒకరు తెలిపారు. నిర్మలను చంపింది మహారాష్ట్ర నుంచి కొత్తగా వచ్చింది కావచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నట్లు ఈనాడు చెప్పింది.

పత్తి చేలో నిర్మలను చంపిన ప్రాంతానికి పులి మళ్లీ వస్తుందన్న అంచనాతో ఆ ప్రాంతంలో 3 బోనులు ఏర్పాటు చేశారు.

"పెద్దపులులు నాలుగుకాళ్ల వన్యప్రాణుల్ని, పశువులనే వేటాడి తింటాయి. పత్తి ఏరేటప్పుడు, చెట్ల దగ్గరకు వెళ్లి ఆకులు తెంపే సమయంలో వంగితే.. పెద్దపులులు మనిషిని నాలుగుకాళ్ల వన్యప్రాణిగా భావించి వెనుక నుంచి దాడి చేసే ప్రమాదం ఉంది. అడవిలోకి వెళ్లాల్సివస్తే గుంపుగా వెళ్లడం..ఒంటరిగా ఉన్నప్పుడు పులి కనిపిస్తే నిటారుగా నిలబడి ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి" అని వన్యప్రాణి నిపుణుడు, అటవీశాఖ మాజీ అధికారి తులసీరావు చెప్పారని ఈనాడు వివరించింది.

దిశ చట్టంలో కీలక నిబంధనల తొలగింపు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆమోదించిన దిశ బిల్లులో కీలక నిబంధనలన్నీ తొలగించారని ఆంధ్రజ్యోతి దినపత్రిక తన కథనంలో చెప్పింది.

దిశ బిల్లు-2019 కథ ముగిసింది. దిశ బిల్లును కేంద్రం తిరస్కరించి వెనక్కి పంపించిన తర్వాత... ఏ మాత్రం జవం, జీవం లేని కొత్త బిల్లును సభలో ప్రవేశపెట్టి ప్రభుత్వం ఆమోదింపజేసుకుందని పత్రిక రాసింది.

21 రోజుల్లోనే విచారణ పూర్తి... మరణ శిక్ష వంటి కఠినమైన నిర్ణయాలను పక్కన పెట్టారని తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌ దిశ చట్టం-శిక్షాస్మృతి-2019ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ దిశ చట్టం-2020గా (మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలకు ప్రత్యేక కోర్టులు) మార్చేశారు.

పేరు ఒక్కటే కాదు.. బిల్లులోని అనేకానేక అంశాలు తొలగిపోయాయి. బిల్లు స్వరూపమే మారిపోయింది. దేశానికి మార్గనిర్దేశం చేస్తామన్న ఏ ఒక్క అంశమూ కొత్త బిల్లులో లేదు.

మహిళలను ముట్టుకుంటే మరణ శిక్షే అంటూ సర్కారు చేసిన ప్రకటనలు, 21 రోజుల్లోనే శిక్షలు వేస్తామన్న హామీలు కొత్త బిల్లులో లేవని పత్రిక చెప్పింది.

కేవలం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తామని ఈ బిల్లులో ప్రతిపాదించారు. ఇందులో కొత్తేమీలేదని రాసింది.

ఎలాంటి కేసుల విచారణకయినా ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉంటుంది. సర్కారు కూడా ఇప్పుడు ఆ అధికారాన్ని ఉపయోగించుకొంది. దిశ అనే పేరును మాత్రం కొనసాగించారని ఆంధ్రజ్యోతి వివరించింది.

జీహెచ్ఎంసీ ఫలితాలు: మధ్యాహ్నం 3 గంటల్లోగా స్పష్టత

ఈసారీ జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు కాస్త ఆలస్యం కావచ్చని నమస్తే తెలంగాణ దినపత్రిక కథనం ప్రచురించింది.

దిల్లీ నుంచి గల్లీ నేతల దాకా ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి.

జీహెచ్‌ఎంసీలోని 150 డివిజన్లకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు మొదలుకానుంది.

ఈసారి బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు జరుగడంతో ఫలితాల వెల్లడి కొంత ఆలస్యమయ్యే అవకాశమున్నట్టు తెలుస్తున్నదని పత్రిక రాసింది.

మొత్తం 150 డివిజన్లకు సంబంధించి వార్డుకు ఒక కౌంటింగ్‌ హాల్‌ చొప్పున ప్రతి హాల్‌లో 14 టేబుళ్లపై ఓట్లను మదించనున్నారు.

ఒక్కో టేబుల్‌పై గంటకు వెయ్యి చొప్పున 14వేల ఓట్లు లెక్కిస్తామని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.

ఈ లెక్కన 28వేల లోపు ఓట్లు పోలైన డివిజన్‌ల్లో కౌంటింగ్‌ మొదలుపెట్టిన రెండు గంటల్లోనే జయాపజయాలు ఖరారు కానున్నాయని నమస్తే తెలంగాణ చెప్పింది.

తక్కువ ఓట్లు పడిన మెహిదీపట్నం (11,818) నుంచి తొలిఫలితం రావచ్చని భావిస్తున్నారు. ఎక్కువ ఓట్లు పడిన మైలార్‌దేవ్‌పల్లి (37,445) డివిజన్‌ ఫలితం అన్నింటికంటే చివరన వచ్చే అవకాశముంది.

బ్యాలెట్‌ పేపర్లు బయటికి తీసి, కట్టలు కట్టే ప్రక్రియను పూర్తి చేసుకున్నాక మధ్యాహ్నంలోపు తొలి ఫలితం వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి సాయంత్రానికే అన్ని డివిజన్ల ఫలితాలు వెల్లడవుతాయని భావిస్తున్నట్లు నమస్తే తెలంగాణ వివరించింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు ఆర్బీఐ షాక్

ప్రైవేటు రంగంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త క్రెడిట్ కార్డులు, కొత్త డిజిటల్ కార్యకలాపాలు ప్రారంభించకుండా రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు ఇచ్చినట్లు సాక్షి దినపత్రిక కథనం ప్రచురించింది.

గడిచిన రెండేళ్లుగా ప్రైవేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ డిజిటల్‌ సేవల్లో పదే పదే అంతరాయాలు కలుగుతుండటంపై రిజర్వ్‌ బ్యాంక్‌ తీవ్రంగా స్పందించింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌.. కొత్త క్రెడిట్‌ కార్డులను జారీ చేయకుండా, కొత్త డిజిటల్‌ కార్యకలాపాలేమీ ప్రకటించకుండా తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ గురువారం అసాధారణ ఆదేశాలు ఇచ్చిందని కథనంలో రాశారు.

సాంకేతిక సమస్యలను పరిశీలించి, బాధ్యులపై చర్యలు తీసుకోవడంపై బ్యాంకు బోర్డు దృష్టి పెట్టాలని సూచించింది.

‘డిజిటల్‌ 2.0 (ఇంకా ఆవిష్కరించాల్సి ఉంది) కింద కొత్త డిజిటల్‌ వ్యాపార లావాదేవీలు, ఇతరత్రా ఐటీ యాప్‌ల ద్వారా ప్రతిపాదిత లావాదేవీలు, కొత్త క్రెడిట్‌ కార్డుల జారీ వంటివన్నీ తాత్కాలికంగా నిలిపివేయాలని ఆర్‌బీఐ సూచించింది‘ అని స్టాక్‌ ఎక్సే్చంజీలకు బ్యాంక్‌ తెలియజేసిందని సాక్షి చెప్పింది.

బ్యాంక్‌ నూతన సీఈవోగా ఇటీవలే (అక్టోబర్‌ చివర్లో) పగ్గాలు చేపట్టిన శశిధర్‌ జగదీశన్‌కు ఈ పరిస్థితిని చక్కదిద్దడం తొలి సవాలు కానుంది.

ప్రస్తుత యూజర్లకు యథాప్రకారం సర్వీసులు కొనసాగుతాయని బ్యాంక్‌ వర్గాలు తెలిపాయి. ఆర్‌బీఐ ఆదేశాలు ఎప్పటివరకూ అమల్లో ఉంటాయన్న వివరాలు వెల్లడి కాలేదని కథనంలో తెలిపారు.

సాధారణంగా బ్యాంకుల సేవా లోపాలకు సంబంధించి జరిమానాల వంటి వాటితో సరిపెట్టే ఆర్‌బీఐ ఇలాంటి చర్యలు తీసుకోవడం అసాధారణమని పరిశ్రమవర్గాలు తెలిపాయి.

కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు బ్యాంక్‌ కొత్త సీఈవో శశిధర్‌ జగదీశన్‌ పేర్కొన్నారు. ఇప్పటికే ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సిస్టమ్స్‌ను మెరుగుపర్చుకునేందుకు బయట నిపుణుల సహా యం కూడా తీసుకుంటున్నట్లు ఒక ప్రకటనలో వివరించారని సాక్షి వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)