You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్: 'భారత్‌లో అందరికీ కోవిడ్ వ్యాక్సీన్ అవసరం లేదు' - ప్రెస్ రివ్యూ
ఇండియాలో అందరికీ కోవిడ్ టీకా ఇవ్వాల్సిన అవసరంలేదని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ అభిప్రాయపడినట్లు ఈనాడు పత్రిక ఒక కథనాన్ని ఇచ్చింది.
వ్యాక్సీన్ ఇవ్వడం వెనక ఉద్దేశం వ్యాధి వ్యాప్తి చైన్‌ను తెంచడమేనని ఆయన పేర్కొన్నట్లు ఈ కథనం తెలిపింది. టీకా పని చేసే సామర్ధ్యం ఒక్కొక్కరిలో ఒక్కోరకంగా ఉంటోందని, ముందు వైరస్ వ్యాప్తిని అరికడితే అందరికీ టీకా ఇచ్చే అవసరం ఉండదని భార్గవ వ్యాఖ్యానించినట్లు పేర్కొంది.
సీరం సంస్థ నిర్వహిస్తున్న కోవిడ్ వ్యాక్సీన్ ట్రయల్స్‌లో కొందరు వలంటీర్లు అనారోగ్యానికి గురికావడంపై స్పందించిన భార్గవ, ఇది ట్రయల్స్‌కు ఏమాత్రం ఆటంకం కలిగించదని, ప్రతి ఒక్కరిపై అది చూపిస్తున్న ప్రభావాలను నిష్పాక్షికంగా అంచనా వేస్తున్నామని తెలిపారు.
మరోవైపు దేశంలో అందరికీ టీకా ఇస్తామని ప్రభుత్వం కూడా ఎప్పుడూ చెప్పలేదని వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వ్యాఖ్యానించారు. టీకా ప్రభావాలను పూర్తిగా అంచనా వేసి అది సురక్షితమని తేలితేనే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ అనుమతిస్తారని పేర్కొన్నారు.
అనుష్కతో శీర్షాసనం వేయించిన విరాట్ కోహ్లీ
గర్భవతి అయిన భార్యకు శీర్షాసనం వేయడంలో సాయం చేస్తున్న ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫొటొ వైరల్‌గా మారినట్లు నమస్తే తెలంగాణ పత్రిక ఒక కథనం ఇచ్చింది.
కోహ్లీ ఇండియాలో ఉన్న సమయంలో తీసిన ఈ ఫొటోను అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసినట్లు ఈ పత్రిక తెలిపింది. తల కిందికి, కాళ్లు పైకి పెట్టి చేసే ఈ ఆసనం చాలా క్లిష్టమైనదని అనుష్క కామెంట్ చేశారు.
అయితే, యోగా తన జీవితంలో ఓ భాగమైపోయిందని, అందుకే డాక్టర్ సూచన మేరకు గర్భవతిగా ఉంటూ కూడా పలు ఆసనాలను కొనసాగిస్తున్నట్లు అనుష్క వెల్లడించారు.
యోగా టీచర్‌తోపాటు తన భర్త విరాట్ కోహ్లి తాను ఈ శీర్షాసనం వేయడానికి సాయం చేశారని అనుష్క ఆ పోస్ట్‌లో కామెంట్ చేశారు. టీచర్ పర్యవేక్షణ, సరైన గైడెన్స్‌తో తాను యోగా కొనసాగిస్తున్నట్లు అనుష్క తెలిపారు.
నీళ్లు తాగడానికి వస్తే గొడ్డళ్లతో నరికారు
ఎన్ని చట్టాలున్నా వన్యప్రాణులపై దారుణమైన దాడులు జరుగుతున్నయనడానికి నిదర్శనంగా నిలుస్తోంది మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఘటన. చెరువులో నీళ్లు తాగడానికి వచ్చిన సాంబార్ జింకపై కొందరు యువకులు గొడ్డళ్లతో దాడి చేసి కాళ్లు నరికారని సాక్షి పత్రిక ఒక కథనం ఇచ్చింది.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో ఓ గిరిజన తండాలో ఈ సంఘటన జరిగింది. చెరువులో నీళ్లు తాగడానికి వచ్చిన ఓ సాంబార్ డీర్ అక్కడున్న కొందరు యువకులు అరుపులకు భయపడి పొలాల్లోకి పరుగులు పెట్టింది. పొలంలో బురదగా ఉండటంతో దిగబడిపోయిన జింకపై ఆ యువకులు గొడ్డళ్లతో దాడి చేశారని సాక్షి కథనం పేర్కొంది.
యువకుల దాడికి దాని కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. భయంతో జింక పెద్దగా అరవడంతో స్థానికులు అక్కడికి వచ్చారు. దీంతో దాడి చేసిన వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు.
తీవ్ర గాయాలపాలైన జింకను అటవీశాఖ అధికారులు హన్మకొండలోని వన విజ్జాన కేంద్రానికి తరలించింది చికిత్స అందిస్తున్నారు.
విదేశాల్లో ఉన్నవారికి కూడా ఓటు వేసే అవకాశం...
దేశం అవతల ఉంటున్న వారికి కూడా దేశంలో ఓటేసే అవకాశం కల్పించే అంశంపై ఎన్నికల కమిషన్ కేంద్రానికి ఒక ప్రతిపాదన చేసినట్లు ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కథనం ఇచ్చింది.
విదేశాలలో ఉంటున్న వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసే అవకాశాన్ని పరిశీలించాలంటూ ఈసీ కేంద్రాన్ని కోరింది. దీనికి కేంద్రం సానుకూలంగా ఉంటే రాబోయే ఎన్నికల నాటికి విదేశాలలో ఉంటున్న భారతీయులు స్వదేశంలో తమకు నచ్చిన అభ్యర్థికి ఓటేసే అవకాశం ఉంటుందని ఈ కథనం పేర్కొంది.
విదేశాల్లో 1.30 మంది భారతీయులు ఉంటున్నారని వీరిలో దాదాపు 60శాతంమందికి ఓటు హక్కు ఉందని ఆంధ్రజ్యోతి కథనం వెల్లడించింది. వీరికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు కల్పిస్తే ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టం ద్వారా తమకు నచ్చిన వ్యక్తికి ఓటేసే అవకాశం దక్కుతుంది.
కేంద్రం ఆమోదిస్తే ఎన్నికల నియమావళిలో స్వల్ప మార్పుల ద్వారా దీన్ని అమలు చేయవచ్చని ఎన్నికల సంఘం అభిప్రాయపడినట్లు ఆంధ్రజ్యోతి కథనం వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
- జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌లో మద్యం అమ్మకాలు పెరిగాయా?
- తుపాన్లకు పేర్లను ఎవరు పెడతారు?
- ఎడారిలో అంతుచిక్కని లోహస్తంభం... అకస్మాత్తుగా ప్రత్యక్షం.. అదే తీరులో అదృశ్యం.. ఏలియన్స్ పనా?
- ఆ రోజు ఈ ఫొటో తీసింది ఎవరు? కసబ్ గురించి ఆ ఫొటో జర్నలిస్టు ఏమంటున్నారు?
- బిచ్చగాడు అనుకుని దానం చేయబోయారు.. ఆయనెవరో తెలిసి సెల్యూట్ చేశారు
- కరోనావైరస్: కేరళలో దాచి పెట్టిన కోవిడ్ మరణాల గుట్టు రట్టు చేసిన వలంటీర్లు
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- 2,000 ఏళ్ల కిందటి రోమ్ సామ్రాజ్యపు యజమాని, బానిస... బయటపడ్డ బూడిద శిలలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)