హైదరాబాద్: రియల్ ఎస్టేట్ మళ్లీ ఊపందుకుంటుందా? -ప్రెస్ రివ్యూ

హైదరాబాద్

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ

ఈ ఏడాది కోవిడ్‌తో కార్యాలయాల లీజింగ్‌పై ప్రతికూల ప్రభావం ఏర్పడిందని, ఇది కొత్త సంవత్సరంలో పుంజుకునే అవకాశముందని స్థిరాస్థి సంస్థలు అంటున్నాయంటూ ఈనాడు ఒక కథనాన్ని ప్రచురించింది.

రియల్‌ ఎస్టేట్‌లో కీలకమైన కార్యాలయాల నిర్మాణాల్లో హైదరాబాద్‌ మూడేళ్లుగా కోటికిపైగా చదరపు అడుగుల విస్తీర్ణంతో దూసుకెళ్లింది. అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్‌కు వరస కట్టడం, ముందస్తు ఒప్పందాలతో నిర్మాణాలు పెద్ద ఎత్తున వచ్చాయి. 2019లో 1.19 చ.అ. నిర్మాణం చేపట్టగా రికార్డు స్థాయిలో 1.05 కోట్ల చదరపు అడుగుల్లో కొత్త కార్యాలయాలు వచ్చాయి. ఈ ఏడాది అత్యధికంగా 1.49 కోట్ల చ.అ. నిర్మాణాలు చేపట్టగా ఆరేళ్ల కనిష్ఠానికి లీజింగ్‌ పడిపోయింది. లాక్‌డౌన్‌తో 55 లక్షల చ.అ. మాత్రమే కార్యాలయాలు అద్దెకు తీసుకున్నాయి. ప్రపంచంలోని ఫార్చూన్‌ వెయ్యి కంపెనీలు తమ కార్యాలయాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తుండటంతో తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయంటూ ఈ కథనంలో పేర్కొన్నారు.

కొవిడ్‌తో ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తుండటంతో కార్యాలయాల విస్తరణ 8 నుంచి 10 శాతం ఆగిపోయింది. 65 శాతం మంది ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు వచ్చి పని చేసేందుకు సుముఖంగా ఉన్నారని సర్వేల్లో వెల్లడైంది. దీంతో కొవిడ్‌ ప్రభావం తగ్గగానే మార్కెట్‌ తిరిగి పుంజుకుంటుందని భావిస్తున్నారు. పశ్చిమ హైదరాబాద్‌లోనే ఐటీ కార్యాలయాలు విస్తరిస్తుండటం, అభివృద్ధి మొత్తం ఒకేచోట కేంద్రీకృతం కావడంతో మౌలిక వసతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ట్రాఫిక్‌ సమస్యలతో గ్రిడ్‌ లాక్‌ పరిస్థితులు తలెత్తుతున్నాయి. మరో ఐదేళ్ల పాటు ఐటీ విస్తరణ పశ్చిమ హైదరాబాద్‌లోనే ఉంటుందని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థలు అంటున్నాయి. ఇక్కడ విస్తరణకు పలు సానుకూలతలు ఉన్నాయని చెబుతున్నారు. ఇతర ప్రాంతాల్లో భూముల ధరలు అధికంగా ఉండటం ఒకింత సమస్యగానే ఉందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన గ్రిడ్‌ పాలసీతో కొంపల్లి, పోచారం వైపు కొత్త ఐటీ సంస్థలు వస్తాయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయంటూ ఈ కథనంలో తెలిపారు.

కేసీఆర్

ఫొటో సోర్స్, KalvakuntlaChandrashekarRao/fb

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు: ఇవాళ కేసీఆర్ బహిరంగ సభ

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల ప్రచారం తుది ఘట్టానికి చేరుకోవడంతో నగరం నడిబొడ్డున ఉన్న ఎల్బీ స్టేడియం వేదికగా శనివారం భారీ బహిరంగ సభకు టీఆర్‌ఎస్‌ ఏర్పాట్లు పూర్తి చేసిందంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రచురించింది.

ఈ సభలో పాల్గొననున్న పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ ఎజెండాను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతోపాటు విపక్షాల విమర్శలకు సభా వేదికగా దీటుగా సమాధానం ఇవ్వనున్నట్లు తెలిసింది. ఈ నెల 23న పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా రాజకీయ అంశాలు, విపక్షాల విమర్శల జోలికి పెద్దగా వెళ్లని కేసీఆర్‌.. ఆదివారంతో గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో ఆరేళ్ల తమ పాలనలో హైదరాబాద్‌ అభివృద్ధికి చేసిన కృషిని వివరిస్తారని భావిస్తున్నట్లు ఈ కథనంలో పేర్కొన్నారు.

గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ పక్షాన పరోక్ష ప్రచారం కోసమే కోవిడ్‌ వ్యాక్సిన్‌ తయారీ పురోగతి పేరిట ప్రధాని మోదీ శనివారం హైదరాబాద్‌ పర్యటనకు వస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని ఒకవేళ ఏవైనా రాజకీయ వ్యాఖ్యలు చేస్తే అప్పుడు ఆచితూచి స్పందించాలని ఆ పార్టీ భావిస్తోంది. బీజేపీ నాయకుల వరుస పర్యటనల నేపథ్యంలో వారు చేస్తున్న విమర్శలు, ఓటర్ల స్పందన తదితరాలకు సంబంధించిన వివరాలను టీఆర్‌ఎస్‌ క్రోడీకరిస్తోంది. శనివారం జరిగే సభలో కేసీఆర్‌ వాటన్నంటికీ సమాధానం ఇస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.

కోవిడ్‌ నిబంధనలను దృష్టిలో పెట్టుకొని సభకు హాజరయ్యే వారు మాస్క్‌లతో రావాలని, లేని వారికి స్టేడియం ప్రధాన ద్వారం వద్ద మాస్క్‌లను పంపిణీ చేస్తామని టీఆర్‌ఎస్‌ పార్టీ చెబుతోంది. ఇందులో భాగంగా శనివారం మధ్యాహ్నానికి సభా వేదిక, స్టేడియం పరిసరాలను శానిటైజ్‌ చేయనున్నారు. కాగా, సభ ఏర్పాట్లను పూర్తిచేసినట్లు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ శుక్రవారం మీడియాకు తెలిపారని ఈ వార్తలో రాసారు.

బొత్స సత్యనారాయణ, జగన్

ఫొటో సోర్స్, Botcha Satyanarayana/FB

‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద 30.6 లక్షల మందికి ఇళ్ల పట్టాలు

‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రాష్ట్రంలో క్రిస్మస్‌ పండుగనాడు 30.6 లక్షల లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలివ్వాలన్న నిర్ణయానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసిందంటూ ఆంధ్రజ్యోతి ఒక కథనంలో ప్రచురించింది.

శుక్రవారమిక్కడి సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ముందుగా రాష్ట్రంలో నివర్‌ తుఫాన్‌ వల్ల కలిగిన నష్టాన్ని డిసెంబరు 15కల్లా లెక్కించాలని.. 30వ తేదీకల్లా బాధితులకు పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా సహాయ శిబిరాల్లో ఉన్నవారికి రూ.500 చొప్పున ఇవ్వాలని నిర్దేశించారు. పంట నష్టపోయిన ప్రాంతాల్లో 80 శాతం సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయాలని.. ఆస్తినష్టం, ప్రాణనష్టం ఉంటే.. మార్గదర్శకాల ప్రకారం త్వరగా పరిహారం అందించాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 30.6 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలిచ్చేందుకు మొత్తం 66,518 కోట్ల ఎకరాలను సేకరించారు. 11 వేల పంచాయతీల్లో 17,500 లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నారని ఈ కథనంలో పేర్కొన్నారు.

ప్రసుత్తానికి లబ్ధిదారులకు డీ ఫాం పట్టాలు పంపిణీ చేస్తారు. కోర్టు కేసులు పరిష్కారమయ్యాక కన్వేయెన్స్‌ డీడ్స్‌ ఇస్తారు. అలాగే ‘వైఎస్సార్‌-జగనన్న కాలనీ’ల కింద 28.3 లక్షల మంది ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదించింది. మూడేళ్లలో నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో యూనిట్‌ రూ.1.8 లక్షల చొప్పున తొలి దశలో 8,494 లే అవుట్లలో సుమారు 16 లక్షల ఇళ్లు నిర్మిస్తారు. 18 నెలల్లో తొలి దశలో ఇళ్ల నిర్మాణానికి రూ.28,800 కోట్లు ఖర్చుచేస్తారు. అలాగే పేదల ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. డిసెంబరు 25 నుంచి మొదలుపెట్టి రెండు వారాల పాటు రోజూ లక్ష చొప్పున 175 నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణ పనులు మొదలుపెడతారు. మిగతా 13 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని వచ్చే ఏడాది డిసెంబరులో ప్రారంభించి 2023 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారంటూ ఈ కథనంలో తెలిపారు.

మాస్కులు ధరించిన యువతులు

ఫొటో సోర్స్, Getty Images

మాస్క్ ఉంటేనే ఓటు వెయ్యడానికి పర్మిషన్

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాస్కు ఉంటేనే ఓటర్లకు ప్రవేశమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి వెల్లడించారని నవతెలంగణ ఒక కథనంలో పేర్కొంది.

పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ...

"ఎన్నికల సిబ్బంది కోసం 1.20 లక్షల పీపీఈ కిట్లు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కరోనా దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామంటున్న పార్థసారథి తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద సూక్ష్మ పరిశీలకులతో సహా పూర్తిస్థాయిలో పోలీసు సిబ్బంది ఉంటారు. ఎలాంటి పొరపాట్లకు అవకాశమివ్వం. విద్వేషకర ప్రసంగాలు చేసేవారిపై చర్యలు తీసుకుంటాం అని ఎన్నికల కమిషనర్‌ తెలిపారు.

కరోనా దృష్ట్యా సిబ్బందికి శిక్షణ మొదలుకొని... పోలింగ్‌, కౌంటింగ్‌ వరకు అన్ని రకాల జాగ్రత్త చర్యలు చేపట్టాం. మాస్కు ధరించడం, దూరం పాటించడం, శానిటైజ్‌ చేసుకోవడం కచ్చితంగా అమలు చేస్తున్నాం. ప్రతి పోలింగు కేంద్రాన్ని ఒక రోజు ముందే శానిటైజ్‌ చేస్తాం. నోడల్‌ వైద్యబృందాలు ఉంటాయి. పోలింగ్‌ సిబ్బంది కోసం 1.20 లక్షల పీపీఈ కిట్లతో పాటు 60 వేల శానిటైజర్‌ సీసాలు అందుబాటులో ఉంటాయి. ఓటర్లు నిర్ణీత దూరంలో నిలబడేందుకు వలయాకార గుర్తులు ఏర్పాటు చేశాం. ప్రతి ఓటరు మాస్కు లేనిదే ప్రవేశించకుండా తనిఖీ చేయడం, ప్రవేశద్వారం వద్దనే శానిటైజర్‌ ఏర్పాటు లాంటి చర్యలు చేపట్టాం.

ఎన్నికల్లో 52,500 మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నాం. నిరంతరం పర్యటించేలా 60 ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ ఏర్పాటు చేశాం. మరో 30 స్క్వాడ్‌లు అవసరమైన చోటుకు వెళ్లడానికి అందుబాటులో ఉంటాయి. 30 పోలీసు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. వీటిలో ఎక్సైజ్‌ సిబ్బంది కూడా ఉంటారు. ప్రతిరోజు మద్యం విక్రయాలను పర్యవేక్షిస్తున్నాం. అనుమతి లేని మద్యం దుకాణాలను తొలగించాం. ఇప్పటివరకు మద్యం, నగదు స్వాధీనం సహా 54 కేసులు నమోదు చేశామని అన్నారు" అని ఈ కథనంలో తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)