ఆంధ్రప్రదేశ్: ‘పోలవరం ఎత్తు అంగుళం కూడా తగ్గించమని చెప్పినా... దుష్ప్రచారం చేస్తున్నారు’ - ప్రెస్ రివ్యూ

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించోమని స్పష్టం చేసినా, ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించినట్లు ‘సాక్షి’ దినపత్రిక ఓ వార్త రాసింది.
టీడీపీ, సీపీఐ ‘కవల పిల్లలు’గా తయారయ్యాయని అనిల్ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎజెండా కోసమే సీపీఐ నేత రామకృష్ణ పోరాటం చేస్తున్నారని ఆరోపించారు.
‘‘పోలవరం ప్రాజెక్టు వద్ద మూడు వేల మంది పనిచేస్తూంటే 200 మందితో అక్కడికి వెళ్లి రచ్చ చేయడం సీపీఐకి అవసరమా? బలప్రదర్శనకు వెళుతున్నారా? లేక అనుమానాల నివృత్తి కోసం వెళ్తున్నారా? అక్కడికి వెళ్లి రాజకీయం చేయడం, బురద జల్లడం తప్ప చేసేదేమిటి?’’ అని అనిల్ ప్రశ్నించారు.
‘‘అనుమానాలుంటే సీపీఐకి చెందిన ఒకరో, ఇద్దరో వెళ్లండి. అధికారులు ప్రాజెక్టు పనుల గురించి వివరిస్తారు. ప్రాజెక్టుపై రాజకీయం చేయాలి.. రచ్చ చేయాలి.. ప్రజల్లో అపోహలు కల్పించాలి అని అనుకుంటే మాత్రం కచ్చితంగా ప్రభుత్వం అడ్డుకుంటుంది. పోలవరం ఎత్తు అంగుళం కూడా తగ్గించబోమని గతంలోనే చెప్పినా పదే పదే దానిపై దుష్ప్రచారం చేస్తున్నారు. రామకృష్ణకు అనుమానాలు ఉంటే.. ప్రాజెక్టు పూర్తయ్యాక చంద్రబాబుతో వెళ్లి కొలుచుకోవచ్చు’’ అని అన్నారు.

ఫొటో సోర్స్, TWITTER/KTRTRS
‘ఎంఐఎంను ఓడించే దమ్ము బీజేపీకి లేకపోవచ్చు... మాకు ఉంది’
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రధాన పోటీ తమకు, ఎంఐఎంకు మధ్యేనని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారంటూ ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఓ వార్త ప్రచురించింది.
గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 99 డివిజన్లు గెలిస్తే, మజ్లిస్ 44 స్థానాల్లో గెలిచిందని... ఇప్పుడు కూడా పోటీ ఈ రెండు పార్టీల మధ్యేనని కేటీఆర్ అన్నారు.
‘‘క్రితం సారి ఎంఐఎం గెలిచిన డివిజన్లలో 12 చోట్ల 500 ఓట్ల తేడాతో టీఆర్‌ఎస్ రెండో స్థానంలో నిలిచింది. అప్పుడు ఎంఐఎంను ఓడించింది టీఆర్‌ఎస్సే. బీజేపీ కాదని గుర్తిస్తే మంచిది. వాళ్లు పాతబస్తీలో ఒక్క సీటు గెలిస్తే, మేం ఐదు సీట్లు గెలిచాం. ఈసారి కూడా మేం పాతబస్తీలో 10 డివిజన్లు గెలుస్తాం. బీజేపీ ఎన్ని గెలుస్తుందో చూస్తాం!’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘ఎంఐఎంను ఓడగొట్టే దమ్ము బీజేపీకి లేదు కావచ్చు. కానీ, టీఆర్‌ఎస్‌కు ఆ దమ్ము ఉంది. బీజేపీ దూకుడు సోషల్ మీడియాలో ఎక్కువ... సొసైటీలో తక్కువ. గ్రేటర్ ఫలితాల తర్వాత ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలే చూస్తారు’’ అని కేటీఆర్ అన్నారు.
‘‘ముస్లిములపై బీజేపీకి అంత గుడ్డి వ్యతిరేకత, ద్వేషం ఎందుకు? అంత విషం చిమ్మడం ఎందుకు? ఒక కార్పొరేషన్ కోసం.. నాలుగు ఓట్ల కోసం ఈ రకమైన రాజకీయాలతో దిగజారడమా?’’ అని విమర్శించారు.

ఫొటో సోర్స్, TWITTER/ANDHRAPRADESHCM
క్యాబ్‌లు, ఆటోల్లో మహిళల భద్రత కోసం ‘అభయం’
ప్రైవేట్ క్యాబ్‌ల్లో, ఆటోల్లో ప్రయాణించే మహిళలు, చిన్నారుల భద్రత కోసం అభయం ప్రాజెక్టును తీసుకువచ్చినట్లు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తెలిపారని ‘ప్రజాశక్తి’ దినపత్రిక ఓ వార్త రాసింది.
సీఎం క్యాంపు కార్యాలయంలో వర్చువల్ విధానంలో సోమవారం ఈ ప్రాజెక్టును జగన్ ప్రారంభించారు.
మొదటగా విశాఖలో పైలెట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. దీని తర్వాత విజయవాడ, తదితర ప్రాంతాల్లో అమలు చేస్తామని అన్నారు.
దాదాపు లక్ష ఆటోలను అభయం ప్రాజెక్టు కిందకు ప్రభుత్వం తీసుకురానున్నట్లు జగన్ తెలిపారు.
ఆటోల్లో అభయ అనే మొబైల్ ఆప్షన్ ఉంటుందని, ఆ బటన్ నొక్కిన పది నిమిషాల్లో పోలీసులు చేరుకుంటారని పేర్కొన్నారు. ప్రయాణాల్లో ట్రాకింగ్ కోసం ఆటోల్లో ప్రత్యేక పరికరాలు అమర్చనున్నట్లు పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘ధరణిలో ఆస్తుల నమోదుకు ఆధార్ అడిగితే తప్పేంటి?’
ధరణి పోర్టల్‌లో స్థిరాస్తుల నమోదుకు ఆధార్ అడిగితే తప్పేంటని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించినట్లు ‘ఈనాడు’ దినపత్రిక వార్త ప్రచురించింది.
ధరణిలో ఆస్తుల వివరాల నమోదుకు ఆధార్, కులం వివరాలు అడగడాన్ని సవాలు చేస్తూ కాశీభట్ల సాకేత్, న్యాయవాది గోపాల్‌శర్మ తదితరులు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
‘‘వ్యవసాయ భూములకు సంబంధించి రాయితీతో ఎరువులు, విత్తనాలు, నీటి సరఫరా తదితరాలను పొందేందుకు ఆధార్ ఆధారంగా ఇవ్వవచ్చుగా. పథకాలను అందజేయడానికేనని ప్రభుత్వం చెబుతోంది. దీనిపై అభ్యంతరాలేమిటి?’’ అని కోర్టు పిటిషనర్లను ప్రశ్నించింది.
ఆధార్ పథకాలకే పరిమితం కాదని, రిజిస్ట్రేషన్‌కూ తప్పనిసరని ప్రభుత్వం చెబుతోందని పిటిషనర్లు వాదించారు. రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం ఫొటో ఉన్న ఏదేని గుర్తింపు కార్డు ఉంటే చాలని, ప్రస్తుతం ఆధార్‌ను తప్పనిసరి చేసిందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఆధార్‌లో ఫొటో మాత్రమే ఉండదని, బయోమెట్రిక్ వివరాలు కూడా ఉంటాయని గుర్తుచేశారు. పాన్‌కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయాలనేది ఆదాయపు పన్ను చట్టం నిబంధన ప్రకారమే జరిగిందని, ఇక్కడ మాత్రం చట్ట సవరణ జరగలేదన్నారు
ఆధార్ చట్టం, సుప్రీంకోర్టు పుట్టుస్వామి కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం ఆధార్ వివరాలు తీసుకున్నపుడు, వాటికి రక్షణ కల్పించాల్సి ఉందన్నారు. అయితే ఇక్కడ చట్టమూ, రక్షణా రెండూ లేవన్నారు.
వాదననలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేస్తూ ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు ఒత్తిడి తీసుకురావద్దన్న మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది.
ఇవి కూడా చదవండి:
- బిచ్చగాడు అనుకుని దానం చేయబోయారు.. ఆయనెవరో తెలిసి సెల్యూట్ చేశారు
- ఆలయంలో ముద్దు సీన్, నెట్‌ఫ్లిక్స్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం
- జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్‌గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- 2,000 ఏళ్ల కిందటి రోమ్ సామ్రాజ్యపు యజమాని, బానిస... బయటపడ్డ బూడిద శిలలు
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
- చాందసవాద ఇస్లాంను మార్చేందుకు ఫ్రాన్స్ ఏం చేస్తోంది?
- గంగా నదిలోకి ఘరియల్ మొసళ్లను వదులుతున్నారు.. ఎందుకంటే...
- "నేనొక అబ్బాయిని... పదహారేళ్ల వయసులో నాకు రుతుస్రావం మొదలయింది"
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- వై.ఎస్.జగన్‌కు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్.. బెంగాల్లో మమతను గట్టెక్కించగలరా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























