నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ రిటైరయ్యేదాకా ఏపీలో ఎన్నికలుండవు: జేసీ - Press Review

ప్రచురణ

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ రిటైరయ్యేంతవరకూ పంచాయతీలే కాదు... స్థానిక సంస్థలకూ ఎన్నికలు జరగబోవని టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించినట్లు 'ఆంధ్రజ్యోతి' ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. జేసీ గురువారం అనంతపురం ఎస్పీ సత్యఏసుబాబును కలిసిన అనంతరం మీడియాతో ముచ్చటించారు.

''ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలుంటాయని కమిషనర్‌ ప్రకటించినా, ప్రొసీజర్‌ ఇతరత్రా పనులు ఉంటాయి. ఈలోపు ఎవరో ఒకరు కోర్టుకు పోతారు'' అని ఆయన పేర్కొన్నారు.

ఇదివరకు ఏకగ్రీవం అయినవాళ్లైనా ఈ పని చేయొచ్చునని, ఏకగ్రీవం కానివాళ్లు మళ్లీ ఎన్నికలను తాజాగా నిర్వహించాలని కోర్టును కోరవచ్చని అభిప్రాయపడ్డారు.

''ముఖ్యమంత్రి, మంత్రులు ఇందుకు సమ్మతించరు. అప్పట్లో ఎన్నికల కమిషనే ఎన్నికల ప్రక్రియ నిర్వహించినందున ఏకగ్రీవమయ్యారు కాబట్టి కొనసాగించాలని చెబుతారు. ఇలా ఇద్దరూ కోర్టుకు పోతారు'' అని విశ్లేషించారు జేసీ.

''కోర్టుకు పోయినోడు కాటికిపోయినట్లే కదా! కోర్టులో 15 రోజులు పట్టొచ్చు, నెల రోజులు పట్టొచ్చు'' అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

అబివృద్ధి కావాలో అరాచకం కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి: కేటీఆర్

హైదరాబాద్ మహానగర పాలక సంస్థపై మరోసారి గులాబీ జెండా ఎగరేస్తామని తెరాస కార్యనిర్వాహ కమిటీ అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ తెలిపారని ‘ఈనాడు’ కథనంలో ప్రచురించారు.

సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగిన ‘మీట్ ది ప్రెస్’ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారని తెలుపుతూ, ఆయన ప్రసంగంలోని వివరాలను ఈ కథనంలో అందించారు.

150 స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, మజ్లిస్‌తో ఎలాంటి అవగాహన లేదని, పాతనగరంలో గత ఎన్నికల్లో 5 చోట్ల గెలిచామని, ఈసారి 10 స్థానాల్లోనూ విజయం సాధిస్తామని కేటీఆర్ తెలిపారు. దుబ్బాక ఎన్నికల ఫలితం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపదన్నారు. కేసీఆర్ తెలంగాణలో మౌలిక వసతులు, ప్రాథమిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని పని చేసారన్నారు. రూ.67,000 కోట్లను అభివృద్ధికి వెచ్చించినా ఎలాటి పన్నులు పెంచలేదన్నారు. భూసమస్యలు పరిష్కరిస్తామని, రెండో దశ మెట్రోను తామే పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్రం పెట్టుబడులకు ఆకర్షణ కేంద్రంగా మారిందని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయడానికి ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరిస్తామని, అభివృద్ధి కావాలో, అరాచకం కావాలో ప్రజలే తేల్చుకోవాలని కేటీఆర్ అన్నారని ఈ కథనంలో తెలిపారు.

నీటి సమస్యలను పరిష్కరించడం కోసం కేసీఆర్ కేశవాపూర్ రిజర్వాయర్ నిర్మిస్తున్నారని, పారిశుద్ధ్య నిర్వహణలో ఆధునిక పద్ధతులు అవలంబిస్తున్నామని, రహదారుల మరమ్మత్తు, విస్తరణ చేపడుతున్నామని, నాలాల ఆక్రమణను తొలగిస్తామని, హైదరాబాద్ వరద సమయంలో బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టామని కేటీఆర్ తెలిపినట్లు ఈ కథనంలో పేర్కొన్నారు.

ఆంధ్ర ప్రదేశ్‌లో నవంబర్‌ 26న పాడి పండుగ

వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా పథకాల లబ్ధిదారులైన మహిళలకు నవంబర్‌ 26వ తేదీన పాడి పశువులను పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారని ‘సాక్షి’ ఒక కథనంలో తెలిపింది.

ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పంపిణీకి ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. వర్చువల్‌ విధానంలో వచ్చే గురువారం రోజు తొలిదశలో ప్రకాశం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లోని 400 గ్రామాల్లో దాదాపు 7 వేల యూనిట్ల పాడి పశువుల పంపిణీని సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం దశలవారీగా పంపిణీ చేసేలా ప్రణాళికలను సిద్ధం చేశారని ఈ వార్తలో రాశారు.

వైఎస్సార్‌ చేయూత, ఆసరా పథకాల లబ్ధిదారులైన మహిళలకు పాడి పశువులు, గొర్రెలు, మేకల పంపిణీ కార్యక్రమంపై ముఖ్యమంత్రి జగన్‌ గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లాలవారీగా వివరాలను పరిశీలించారు. చేయూత ద్వారా కొత్తగా లబ్ధి పొందిన 2.78 లక్షల మంది నుంచి కూడా ఆప్షన్లు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

పశువులపై పెట్టుబడి పోషకులకు కచ్చితంగా గిట్టుబాటు కావాలని, ఈ మేరకు పాడి పశువులను ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. పాల దిగుబడి బాగుండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా సాధికారత, సుస్థిర ఆర్ధికాభివృద్ధి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు చెప్పారు.

పశువుల దాణా, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వైఎస్సార్‌ చేయూత, ఆసరా పథకాల ద్వారా ఇప్పటివరకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 78 వేల దుకాణాలు ప్రారంభం అయినట్లు అధికారులు సీఎంకు వివరించినట్లు ఈ కథనంలో తెలిపారు.

కవిత, మాణిక్కం ఠాగూర్‌ల మధ్య ట్విట్టర్‌లో వార్

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ మధ్య గురువారం ట్విటర్‌ వేదికగా వాగ్యుద్ధం జరిగిందని ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనంలో ప్రచురించింది.

కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడతామన్న కేసీఆర్‌ వ్యాఖ్యలపై ఠాగూర్‌ స్పందించారు. ‘‘అమిత్‌షాకు అవసరమైనప్పుడు అంతా మద్దతిస్తారు’’ అని ట్వీట్‌ చేశారు. ‘రాజ్యసభలో మద్దతిచ్చారు. ఇప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా కాంక్లేవ్‌ నిర్వహిస్తారు. కేంద్రానికి కేసీఆర్‌ ఏటీఎం లాంటి వాడు’’ అని వ్యాఖ్యానించారని ఈ వార్తలో రాసారు.

దీనిపై ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా స్పందించారు. ‘‘వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ ఎంపీలు పోరాడారు. మా ఎంపీలతో మీవాళ్లు కూడా వచ్చి నిలబడ్డారు’’ అని సమాధానమిచ్చారు.

మరో ట్వీట్‌లో.. ‘‘ కేసీఆర్‌ గురించి మాట్లాడుతున్నప్పుడు మీ పదాలను జాగ్రత్తగా ఎంచుకోండి’’ అని వ్యాఖ్యానించారు. ఇంకో ట్వీట్‌లో.. రూ.10వేల వరద సాయాన్ని ఆపడానికి ఎన్నికల సంఘానికి కాంగ్రెస్‌ ఎందుకు లేఖ ఇచ్చిందని ప్రశ్నించారని ఈ కథనంలో తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)