'కుక్కను పట్టుకుని వీధిలో కనిపిస్తే దాన్ని షూట్ చేసి చంపేస్తాం' - BBC Newsreel

ప్రచురణ

కుక్కను తీసుకుని వీధులోకి రావడంపై నిషేధం విధిస్తూ చైనాలోని యునాన్‌ ప్రావిన్స్‌ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ఒత్తిడి పెరుగుతోంది.

నవంబర్‌ 20 నుంచి ఎవరైనా సరే మూడుసార్లకు మించి కుక్కను తీసుకుని వీధిలో కనిపిస్తే ఆ కుక్కను పట్టుకుని చంపేస్తామని యునాన్‌ ప్రావిన్స్‌ అధికారులు నవంబర్‌ 13న జారీ చేసిన ఓ నోటిఫికేషన్‌లో హెచ్చరించారు.

వీధుల్లోకి వచ్చిన కుక్కలు మనుషులను కరుస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు.

ఈ నిబంధన ప్రకారం ఎవరైనా కుక్కను తీసుకుని వీధిలో కనిపిస్తే మొదటిసారి హెచ్చరించి వదిలేస్తారు. రెండోసారి 50 యువాన్లు (సుమారు రూ.550) ఫైన్‌ వేస్తారు. మూడోసారి ఆ కుక్కను పట్టుకుని చంపేస్తారు.

అయితే అధికారులు తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. " కుక్కలను పెంచుకోవడం అనే నాగరికమైన పనిపై అనాగరికమైన నిర్ణయం తీసుకున్నారు'' అంటూ కొందరు విమర్శించారు.

ఎక్కువసేపు కుక్కలను ఇంట్లోనే ఉంచడం వల్ల వాటి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని సింగపూర్‌కు చెందిన 'సొసైటీ ఫర్‌ ది ప్రివెన్షన్‌ ఆఫ్‌ క్రుయాల్టీ టు యానిమల్స్‌' సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్ జైపాల్ సింగ్‌ గిల్‌ అన్నారు.

" ఫైన్‌ విధించడం, కుక్కను చంపడంలాంటి నిర్ణయాలకన్నా, తమ కుక్కలను బైటికి తీసుకువచ్చినప్పుడు యజమానులు బాధ్యతాయుతంగా మెలిగేలా అవగాహన కల్పించడం మంచిది'' అని గిల్‌ వ్యాఖ్యానించారు.

కుక్కల పెంపకంపై చైనాలో వివిధి రాష్ట్రాలలో అనేక నిబంధనలు అమలులో ఉన్నాయి.

ఫ్రాన్స్ కార్టూన్ వివాదం: ఫ్రెంచి ఉత్పత్తులను నిషేధించనున్న పాకిస్తాన్

ఫ్రాన్స్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌లో నిరసన ప్రదర్శనలు నిర్వహించిన ఇస్లామిక్‌ గ్రూప్‌ ఒకటి ఫ్రెంచ్‌ ఉత్పత్తులను నిషేధించడానికి ప్రభుత్వం అంగీకరించిందని, అందుకే ఆందోళనను విరమిస్తున్నామని ప్రకటించింది.

మహమ్మద్‌ ప్రవక్త కార్టూన్ల ప్రదర్శన విషయంలో తమ భావప్రకటన స్వేచ్ఛను ఎవరూ అడ్డుకోలేరన్న ఫ్రాన్స్‌ ప్రభుత్వ వాదనకు నిరసనగా ఈ ప్రదర్శన జరిగింది.

ఫ్రాన్స్‌ ఉత్పత్తులపై నిషేధాన్ని డిమాండ్‌ చేసిన అతివాదవర్గం తెహ్రీక్‌-ఈ-లాబెక్‌ పాకిస్తాన్‌ (టీఎల్‌పీ) ప్రభుత్వం తమ డిమాండ్‌కు మద్దతు తెలిపిందని వెల్లడించింది. ఇందుకు ఆధారంగా ఇద్దరు మంత్రులు సంతకాలు చేసిన ఒక ఒప్పంద పత్రాన్ని ప్రదర్శించింది.

యితే, పాకిస్తాన్ ప్రభుత్వం దీని మీద అధికారికంగా ఎలాంటి స్పందనా తెలియజేయలేదు.

దేశంలో ఫ్రెంచ్‌ ఉత్పత్తులను నిషేధించాలన్న మా డిమాండ్‌కు మద్దతు తెలుపుతూ ప్రభుత్వం ఒక అంగీకారపత్రంపై సంతకం చేసింది'' అని టీఎల్‌పీ ప్రతినిధి ఎజాజ్‌ అష్రఫీ రాయిటర్స్‌తో అన్నారు.

దోళకారులు ప్రదర్శించిన ఒప్పంద పత్రాలపై పాకిస్తాన్‌ మత వ్యవహారాల శాఖామంత్రి, ఆంతరంగిక వ్యవహారాల మంత్రి సంతకాలు ఉన్నాయి.

ఫ్రెంచ్‌ రాయబారిని వెనక్కి పంపడంపై ప్రభుత్వం పార్లమెంటులో చర్చించి నిర్ణయం తీసుకుంటుందని కూడా నిరసన చేపట్టిన టీఎల్‌పీ సంస్థ ప్రతినిధులు చెప్పారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్... రేపటి నుంచే నామినేషన్ల స్వీకరణ, డిసెంబరు 1న పోలింగ్

హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జీహెచ్ఎంసీ) ఎన్నికల నగారా మోగింది. నామినేషన్ల స్వీకరణ బుధవారం (నవంబరు 18) నుంచే మొదలు కానుంది.

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి మీడియా సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు.

2016 నాటి రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుత పాలకవర్గం గడువు ఫిబ్రవరి 10తో ముగియనుండడంతో డిసెంబరు 6లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయనున్నారు.

బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.

ఇదీ షెడ్యూల్

ఓటర్ల జాబితాల వెల్లడి: నవంబరు 18

నామినేషన్ల స్వీకరణ: నవంబరు 18

నామినేషన్లకు తుది గడువు: నవంబరు 20

నామినేషన్ల పరిశీలన: నవంబరు 21

ఉపసంహరణ తుది గడువు: నవంబరు 22

పోలింగ్: డిసెంబర్ 1

అవసమైన చోట రీపోలింగ్: డిసెంబరు 3

ఓట్ల లెక్కింపు, ఫలితాలు: డిసెంబరు 4

పాత డివిజన్లే..

పాత డివిజన్ల పరిధిలోనే ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయి. డివిజన్ల పునర్విభజన లేదు.

జనవరి 2020 నాటికి 18 సం నిండి నమోదు చేసుకున్న అందరికీ ఓటు హక్కు ఉంటుంది.

మంగళవారం నుంచే గ్రేటర్ పరిధిలో ఎన్నికల నియమావళి అమలులోకి వస్తుంది.

పోలింగ్ డిసెంబరు 1న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది.

ఇదీ గ్రేటర్ ఎన్నికల స్వరూపం..

గ్రేటర్ లో మొత్తం ఓటర్లు: 74 లక్షల 4 వేల 286

పురుషులు: 38 లక్షల 56 వేల 770

మహిళలు: 35 లక్షల 46 వేల 847

ఇతరులు: 669

పోలింగ్ కేంద్రాలు: 9248

వార్డులు: 150

గ్రేటర్ లో అతి పెద్ద డివిజన్: మైలార్ దేవులపల్లి 79 వేల 290 మంది ఓటర్లు

అతి చిన్న డివిజన్: రామచంద్రాపురం 27 వేల 948 మంది ఓటర్లు.

ఏర్పాట్లు ఇలా..

ఎన్నికల నిర్వహణలో 48 వేల మంది పాలుపంచుకుంటారు.. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతి పోలింగ్ బూత్‌లో 1+3 సిబ్బంది ఉంటారని ఎన్నికల కమిషనర్ చెప్పారు.

మొత్తం 9,238 మొత్తం పోలింగ్ స్టేషన్స్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లో ఉండేవి నవంబరు 21వన తుది రూపు ఇస్తామని చెప్పారు. ఇంకా ఏమన్నారంటే..

* 1439 సెంటిస్టివ్, హైపర్ సెంటిటివ్ 1004, క్రిటికల్ 257,మొత్తం 27వందల పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి.* 913 సమస్యాత్మక పోలింగ్ ప్రాంతాలను ఇప్పటి వరకు గుర్తించాం.* ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయి.* ఫలితాలు విడుదల అయిన తరువాత 45 రోజుల్లో అకౌంట్స్ చూపించాలి. అప్పటిలోగా నిర్లక్ష్యం వహిస్తే 3 సంవత్సరాలు అనర్హత విధిస్తాం.* జనరల్ పర్యవేక్షణ కోసం ఒక్కో జోన్ కు IAS అధికారి సహా మొత్తం ఆరుగురు నియమిస్తాం.* ప్రతి పోలింగ్ స్టేషన్ కి ఇద్దరు పోలీసులు బందోబస్తుఉంటారు. 25 వేల నుంచి 30 వేల మంది పోలీసులతో బందోబస్తు ఉంటుంది.* 356 రూట్ మొబైల్ పార్టీలు, 131 స్ట్రైకింగ్ ఫోర్స్, 44 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ బందోబస్తు.* పోలింగ్ కు 48 గంటల ముందు మద్యం నిషేధిస్తారు.* ప్రతి ఓటర్ కు ఓటర్ స్లిప్ అందిస్తారు.* ఓటర్ స్లిప్ వెబ్సైట్-మొబైల్ స్లిప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.* 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.29 శాతం, 2009 ఎన్నికలలో 42.04 శాతం ఓటింగ్ నమోదైంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)