ఛత్తీస్‌గఢ్: ముఖ్యమంత్రికి 10 కొరడా దెబ్బలు - ప్రెస్‌రివ్యూ

భూపేశ్ బఘేల్

ఫొటో సోర్స్, facebook/bhupeshbaghel

ప్రచురణ

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆచారం ప్రకారం కొరడా దెబ్బలు కొట్టించుకున్నారని 'ఆంధ్రజ్యోతి' వార్తాకథనం వెల్లడించింది.

''ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లాలంటేనే సామాన్యులకు ఎంతో కష్టం. అలాంటిది ఓ పెద్దాయన కొరడా తీసుకుని ఆ రాష్ట్ర సీఎంను ఎడా పెడా కొట్టేశాడు. అయితే అన్ని దెబ్బలు తింటున్నా.. ముఖ్యమంత్రి మాత్రం నవ్వుతూ ఉన్నారు.

పక్కన వారు ఆపడం మానేసి.. కళ్లప్పగించి చూస్తున్నారు, కెమెరాలు, మోబైల్ ఫోన్లలో ఫోటోలు తీసుకుంటున్నారు కానీ.. ఎవరూ ఆపలేదు.

అదేంటి.. సీఎంను కొరడాతో కొడుతున్నా ఎవరూ ఏమీ అనకపోవడం ఏంటి..? అని ఆలోచిస్తున్నారా..? ఎందుకంటే అది అక్కడి సంప్రదాయం.

రాష్ట్రం సౌభాగ్యంతో తులతూగాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని స్వయానా ముఖ్యమంత్రి ఇలా కొరడా దెబ్బలు కొట్టించుకుంటారు.

ఛత్తీస్‌ఘడ్‌లో ఉందీ సంప్రదాయం. దుర్గ్‌ జిల్లా, జజంగిర్‌ గ్రామంలో ప్రతి ఏటా గోవర్ధన్ పూజ వైభవంగా నిర్వహిస్తారు.

ఈ పూజలో రాష్ట్ర సీఎం స్వయంగా పాల్గొంటారు. ఈ ఏడాది జరిగిన పూజలో సీఎం భూపేశ్‌ బఘేల్‌ పాల్గొన్నారు.

సంప్రదాయం ప్రకారం ఆయన కూడా చేతిపై కొరడాతో దాదాపు పది దెబ్బలు కొట్టించుకున్నారు'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

జగన్

ఫొటో సోర్స్, FACEBOOK/YSJAGANMOHANREDDY

సీఎం చేయూతతో చిన్నారి జీవితంలో వెలుగులు

దీపావళి పండుగ రోజున 12 నెలల చిన్నారి ప్రాణం కాపాడి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబంలో నిజమైన దీపావళి వెలుగులు నింపారంటూ 'సాక్షి' పత్రిక కథనం ప్రచురించింది.

''అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రానికి చెందిన కె.అన్వర్‌బాషా కుమారుడు దానీష్‌ శనివారం ఇంట్లో ఆడుకుంటూ వేరుశనగ విత్తనం మింగాడు. అది కాస్తా ఊపిరితిత్తుల్లోకి చేరడంతో శ్వాస ఆడక తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు విషయాన్ని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్‌ దృష్టికి తీసుకెళ్లారు.

ఆమె ఈ విషయాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీఎం.. చిన్నారికి అవసరమైన వైద్యసేవలు అందించాలని హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు. దీంతో అక్కడి వైద్యులు శస్త్రచికిత్స చేసి చిన్నారి ప్రాణాలను కాపాడార''ని ఆ కథనంలో వివరించారు.

kcr

ఫొటో సోర్స్, facebook/telanganacmo

ఆర్టీసీకి ఆసరా

ఎన్ని కష్టాలకు ఓర్చయినా ప్రభుత్వరంగ సంస్థలను బతికించుకుంటామని, అదే తెలంగాణ ప్రభుత్వం విధానమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారని 'నమస్తే తెలంగాణ' కథనం తెలిపింది.

''నష్టాల్లో ఉన్న ఆర్టీసీ.. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రగతిపథంలోకి వచ్చిందని, కరోనా నేపథ్యంలో వెనుకంజ వేసిన ఆ సంస్థను తిరిగి సాధారణ స్థితికి చేరుస్తామని కేసీఆర్ చెప్పారు. లాక్‌డౌన్‌ సమయంలో ఉద్యోగుల వేతనాల్లో కోత విధించిన 50 శాతాన్ని వెంటనే చెల్లించాలని, బస్సు సర్వీసులను 50 శాతానికి పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం ప్రగతిభవన్‌లో ఆర్టీసీపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలతో లాభాలబాట పడుతున్న సమయంలోనే ఆర్టీసీకి కరోనా కష్టాలను తెచ్చిపెట్టిందని, అయినప్పటికీ వెనుకడుగు వేయకుండా సంస్థను తిరిగి బతికించుకుంటామని తెలిపారు. ప్రజలకు అత్యంత చౌకగా రవాణా అందిస్తున్న సంస్థ ఆర్టీసీ అని, ఆనేక కుటుంబాలు దానిపై ఆధారపడి బతుకుతున్నాయని చెప్పారు. ఈ కారణాల వల్లే లాభనష్టాల గురించి ఆలోచించకుండా ఆర్టీసీని కాపాడుకొనేందుకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నామని వివరించారు. లాక్‌డౌన్‌ సమయంలో రెండునెలల పాటు ఉద్యోగుల వేతనాల్లో కోత విధించిన యాభైశాతం సత్వరమే చెల్లించాలని.. ఇందుకోసం అవసరమైన రూ.120 కోట్లను వెంటనే విడుదల చేయాలని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించార''ని ఆ కథనంలో పేర్కొన్నారు.

వధువు

ఫొటో సోర్స్, Getty Images

తెలుగు రాష్ట్రాల్లో మొదలవుతున్న పెళ్లి సందడి

కార్తీక మాసం ఆరంభంతో తెలుగిళ్లలో సందడి మొదలైంది.. మార్చి నుంచి కరోనా భయం, లాక్ డౌన్ ఆంక్షల వల్ల అంతంతమాత్రంగా జరిగిన శుభకార్యాలు ఇక పుంజుకోనున్నాయని 'ఈనాడు' కథనం తెలిపింది.

''కరోనా భయం కాస్త తగ్గడం, వచ్చే నెల రోజులు శుభ ముహూర్తాలు ఉండడంతో పెళ్లి సందడి మొదలైంది. జనవరి 6 వరకు పెళ్లి ముహూర్తాలు ఉన్నట్లు పురోహితులు చెబుతున్నా తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఈ కార్తీక మాసంలోనే వివాహాలు జరుపుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 11 వరకు పుష్యమాసంలో గురు మూఢం ఉండడం.. ఫిబ్రవరి 12 నుంచి కూడా మూఢం కొనసాగుతుండడం.. ఏప్రిల్ 13 తరువాత ప్లవ నామ సంవత్సరం మొదలైనా పెళ్లి ముహూర్తాలు లేకపోవడంతో ఈ నెల రోజుల్లో పెళ్లి చేయకపోతే ఆ తరువాత సుమారు 6 నెలలు అంటే మే 12 నుంచి వైశాఖం మొదలయ్యేవరకు ముహూర్తాలు లేవు. దీంతో చాలామంది ఇప్పుడే శుభకార్యాలు తలపెడుతున్నార'ని ఆ కథనంలో రాశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)