తెలంగాణలో ఆస్తి పన్ను రాయితీని ప్రకటించిన కేటీఆర్ - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, KTR/FACEBOOK
హైదరాబాద్‌కు సంబంధించిన కీలక అంశాలపై తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ దృష్టి సారించారని, ఈ మేరకు నిన్నఉన్నతాధికారులతో సమావేశమై చర్చలు జరిపారని, అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రజలకు దీపావళి కానుక అందించనున్నట్లు ప్రకటించారని ఈనాడు కథనంలో ప్రచురించారు.
2020-21 సంవత్సరానికి జీహెచ్ఎంసీ పరిధిలో రూ.15 వేల మేరకు ఆస్తి పన్ను చెల్లించే గృహ యజమానులకు 50 శాతం రాయితీ, రాష్ట్రంలోని మిగిలిన పట్టణాలలో రూ.10 వేల మేరకు ఆస్తి పన్ను చెల్లించే వారికి 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఆస్తి పన్ను చెల్లించినవారికి వచ్చే ఏడాది మినహాయింపు ఇవ్వబోతున్నట్లు తెలిపారు.
దీని ద్వారా రాష్ట్రంలో 31.40 లక్షల కుటుంబాలకు, రూ.326.48 కోట్ల మేర లబ్ధి చేకూరుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ వరదసాయం కింద 4,75,871 కుటుంబాలకు, రూ.475 కోట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు.
జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు వేతనం రూ.14,500 నుంచీ రూ.17,500కు పెంచుతున్నట్లు మంత్రి ప్రకటించారని, దసరా, దీపావళి వేళ ప్రజలు సంతోషంగా ఉండాలని సీఎం ఆకాంక్షించారని ఈ వార్తలో రాసారు.

విజయవాడ విమానాశ్రయంలో సిద్ధమైన కొత్త రన్‌వే
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త రన్‌వే ట్రయల్ రన్‌కు సిద్ధమవుతోందని, రూ.125 కోట్ల వ్యయంతో 1,074 మీటర్ల మేర రన్‌వే నిర్మాణం పూర్తి చేశారని సాక్షి కథనంలో తెలిపారు.
ఇప్పటికే 2,286 మీటర్ల పొడవున్న పాత రన్‌వేపై విమానాల టేకాఫ్, ల్యాండింగ్ తీసుకుంటున్నాయి. విమానాశ్రయానికి పెరుగుతున్న విమానాల తాకిడిని దృష్టిలో ఉంచుకుని కొత్త రన్‌వే నిర్మించారు. ఇది అందుబాటులోకి రావడంతో విమానాశ్రయంలో మొత్తం రన్‌వే పొడవు 3,360 మీటర్లకు చేరింది.
దీనిపై ట్రయల్ రన్‌కు అనుమతిలిస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఉత్తర్వులిచ్చినట్లు సమాచారం. ఈ నెలాఖరు నాటికి కొత్త రన్‌వేపై విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌ల ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ట్రయల్ రన్ విజయవంతమయ్యాక ఈ రన్‌వే దేశీయ, అంతర్జాతీయ విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌కు అనువైనదిగా గుర్తింపు వస్తుందని ఈ కథనంలో తెలిపారు.

ఫొటో సోర్స్, Twitter/Telangana CMO
ఉన్నతాధికారులతో నేడు కేసీఆర్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో కీలక సమావేశం కానున్నారని, ఈ సమావేశంలో భాగంగా వ‌్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లపై సమీక్షించి ఇవాళ నిర్ణయం తీసుకోనున్నారని నమస్తే తెలంగాణ కథనంలో తెలిపారు.
ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ సమావేశానికి సీఎస్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'ధరణి' పోర్టల్ ద్వారా వ్యవయసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని కేసీఆర్ సర్కార్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
రెండు నెలలుగా నిలిచిపోయిన వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ఆగిపోయాయి. ఇవాళ జరగనున్న ఈ సమావేశంలో వీలైనంత త్వరగా రిజిస్ట్రేషన్లు ప్రారంభించడానికి ఏం చేయాలనే అంశంపై అధికారులతో కేసీఆర్ చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
ఇదిలా ఉంటే.. రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ను ఇదివరకే రిజిస్ట్రేషన్, స్టాంపుల విభాగం అధికారుల సంఘాలు కలిశాయి. 'ధరణి' ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు అంతా సిద్ధంగా ఉందని.. మెరుగైన సేవలకు పూర్తి స్థాయిలో సహకరిస్తామన్న అధికారులు, సిబ్బంది వెల్లడించారని ఈ కథనంలో పేర్కొన్నారు.

నంద్యాలలో అబ్దుల్ సలాం దీక్షా శిబిరం వద్ద హైడ్రామా
అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం చేస్తామని డీఎస్పీ చిదానందరెడ్డి హామీ ఇచ్చారని, శాంతి భద్రతల దృష్ట్యా దీక్ష ఆపాలని పోలీసులు కోరారని ఆంధ్రజ్యోతి రాసింది. దీంతో అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ సభ్యులు దీక్ష విరమించారు. నిందితుల బెయిల్ రద్దు కాకపోతే కార్యాచరణ ప్రకటిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. అబ్దుల్ సలాం కేసును ప్రభుత్వం బలహీనపరిచేందుకు చూస్తోందని అబ్దుల్ సలాం న్యాయ పోరాట సమితి ఆరోపిస్తోంది. దోషులకు శిక్ష పడేంత వరకు తాము పోరాటం చేస్తామని కమిటీ సభ్యులు హెచ్చరిస్తున్నారు.
అబ్దుల్ సలాం (45).. భార్య నూర్జహాన్ (38), కుమార్తె సల్మా (14), కుమారుడు దాదా ఖలందర్ (10)తో కలిసి పాణ్యం మండలం కౌలూరు వద్ద గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. బంగారు షాపులో చోరీ, ఆటోలో దొంగతనం వంటి కేసుల్లో పోలీసులు అబ్దుల్ సలాంను వేధించినట్లు అప్పట్లోనే ఆయన బంధువులు ఆరోపించారు. ఈ క్రమంలోనే.. ఆత్మహత్యకు ముందు అబ్దుల్ సలాం కన్నీటి పర్యంతమవుతూ రికార్డు చేసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది.
ఇవి కూడా చదవండి:
- ఇల్లు, ఫర్నీచర్ అమ్మేసి ఓ వ్యాన్ కొనుక్కున్నారు... ఇప్పుడు ఆ వ్యానే వారి ఇల్లు
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- వీరప్పన్ కేసుల్లో 31 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నవారి కథేమిటి.. గంధపు చెక్కల స్మగ్లర్ నేరాల్లో వారి పాత్రేమిటి
- చైనా టిబెట్ ఆక్రమణకు 70 ఏళ్లు: అసలు హిమాలయాల్లో ఘర్షణ ఎందుకు మొదలైంది?
- ప్రపంచంలో అత్యంత అరుదైన కోతుల్ని కాపాడిన ఒక చిన్న ఐడియా
- ఇంగువ.. అనాదిగా భారతీయ వంటల్లో భాగం.. కానీ నేటివరకూ భారతదేశంలో పండలేదు...
- ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- బెంగళూరులో పది లక్షల బావులు ఎందుకు తవ్వుతున్నారు?
- కరోనావైరస్: ప్రధాని మోదీ భారత్‌లో కోవిడ్ పరిస్థితిపై చెప్పిందంతా నిజమేనా? - BBC FactCheck
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























