అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు: జార్జియాలో గెలుపుతో జో బైడెన్ విజయం సంపూర్ణం

ఫొటో సోర్స్, Reuters
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 1992 తర్వాత డెమొక్రాట్లకు దక్కని జార్జియాలో గెలవడం ద్వారా అమెరికా కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ చరిత్ర సృష్టించారు. ఈ విజయంతో ఎలక్టరల్ కాలేజీలో ఆయన బలం మరింత పెరిగింది.
అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకోవడానికి అవసరమైన 272 ఎలక్టొరల్ ఓట్ల మార్కును దాటి కొత్త అధ్యక్షుడిగా అవతరించిన జో బైడెన్ బలం.. తుది ఫలితాల తర్వాత 306 ఎలక్టొరల్ ఓట్లకు చేరుకుంది.
డోనాల్డ్ ట్రంప్ మొత్తంగా 232 ఎలక్టొరల్ ఓట్లు సంపాదించగలిగారు. తాజాగా వెలువడిన మూడు రాష్ట్రాల ఫలితాలకన్నా ముందే 279 సీట్లు సాధించి అధ్యక్ష పీఠం అధిరోహించడానికి జో బైడెన్ అర్హత సాధించారు.
జనవరిలో కొత్త ప్రభుత్వానికి అధికార బదిలీ జరగాల్సి ఉండగా, తన పరాజయాన్ని అంగీకరించడానికి డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికీ సిద్ధంగా లేరు.
ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్ టాస్క్‌ఫోర్స్‌తో జరిగిన మీటింగ్‌లో కూడా ఆయన తన ఓటమిని అంగీకరించినట్లు కనబడలేదు.
అమెరికాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయని, అయితే తాను మళ్లీ లాక్‌డౌన్ విధించబోనని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా “భవిష్యత్తులో ఎవరు అధికారంలో ఉంటారో ఎవరికి తెలుసు? కాలమే అన్నీ నిర్ణయిస్తుంది’’ అన్నారు ట్రంప్.
ట్రంప్ ఈ సందర్భంగా బైడెన్ పేరును ప్రస్తావించ లేదు. అలాగే మీడియాతో మాట్లాడలేదు. బైడెన్ ప్రభుత్వం ఏర్పాటుకు, అధికార మార్పిడికి అవసరమైన లాంఛనాలు ప్రకటించడానికి ట్రంప్ ఇష్టపడక పోతుండగా, దీనికోసం రిపబ్లికన్ల మీద ఒత్తిడి పెరుగుతోంది.
జార్జియా, నార్త్ కరోలినా ఫలితాలు కూడా వెలువడటంతో వైట్‌హౌస్ కోసం జరిగిన ఎన్నికల యుద్ధం ముగిసినట్లయింది. విశేషం ఏంటంటే, ప్రస్తుతం జో బైడెన్‌కు వచ్చిన ఎలక్టొరల్ ఓట్ల సంఖ్యా, 2016లో హిల్లరీ క్లింటన్‌పై విజయం సాధించినప్పుడు ట్రంప్ సాధించిన ఓట్ల సంఖ్య సమానం. అప్పట్లో ట్రంప్ తన గెలుపును అద్భుత విజయంగా పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆధారాల్లేని ఆరోపణలు
జోబైడెన్ విజయాన్ని ఏమాత్రం అంగీకరించే ఉద్దేశం లేని ట్రంప్ కీలక రాష్ట్రాలలో ఓటింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ ఎలాంటి ఆధారాలు చూపకుండానే వాదిస్తున్నారు. న్యాయపోరాటానికి దిగారు. అయితే ఈ పోరాటంలో శుక్రవారం నాడు ఆయన వర్గానికి ఎదురుదెబ్బలు తగిలాయి.
- మిషిగన్‌లోని వేనీ కౌంటీలో పోలింగ్ సందర్భంగా అక్రమాలు జరిగాయంటూ రిపబ్లికన్ పార్టీ పోలింగ్ బూత్ ఏజెంట్లు వేసిన పిటిషన్‌ను మిషిగన్ కోర్టు కొట్టివేసింది.
- ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియాలలో తప్పుడు పోస్టల్ బ్యాలట్లు వచ్చాయని, వాటిని రద్దు చేయాలని ట్రంప్ టీమ్ చేసిన ఫిర్యాదులను అధికారులు తిరస్కరించారు.
- అరిజోనా రాష్ట్రంలో కొన్ని ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించారంటూ ట్రంప్ టీమ్ కోర్టులో పిటిషన్ వేసింది. ఆ తర్వాత దాన్ని ఉపసంహరించుకుంది.
జార్జియాలో ఇరుపక్షాల ఓట్లలో తేడా స్వల్పంగా ఉండటంతో మాన్యువల్‌గా కౌంటింగ్ జరిపించాలని నిర్ణయించారు. అయితే ఇందులో ఎలాంటి ఫలితం వచ్చినా పెద్దగా మార్పు ఉండదని డెమొక్రాటిక్ పార్టీ నేతలు అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మారిన ఓటు సరళి-విశ్లేషణ
ఆంథోనీ జర్చర్, బీబీసీ ఉత్తర అమెరికా కరస్పాండెంట్
అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడానికి జో బైడెన్‌కు జార్జియా, అరిజోనా రాష్ట్రాల ఫలితాలు పెద్దగా అవసరం లేదు. ఆయన ఇప్పటికే విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియా రాష్ట్రాలను కైవసం చేసుకున్నారు. కాబట్టి విజయానికి అంతకన్నా ఎక్కువ అవసరం లేదు.
సన్-బెల్ట్ స్టేట్స్‌గా చెప్పుకునే దక్షిణాది రాష్ట్రాలలో దశాబ్దాల తర్వాత డెమొక్రాట్లు విజయం సాధించారు. ఈ రాష్ట్రాలే జో బైడెన్ విజయంలో కీలకంగా మారాయి. దీని ఆధారంగా డెమొక్రాట్లు భవిష్యత్తు విజయాలకు వీటిని మార్గంగా మలుచుకునే అవకాశం ఉంది.
అదే జరిగితే ఉత్తర అమెరికా ప్రాంతంలో విద్యావంతులైన ఓటర్లపై డెమొక్రాట్లు ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. వీరంతా ఇప్పుడు ట్రంప్ పక్షంవైపు మొగ్గు చూపారు. జార్జియా, అరిజోనాలోని విద్యావంతులైన పట్టణ ఓటర్లు, మైనారిటీ వర్గాల వారు బైడెన్‌కు మద్దతు పలికారు.
స్వింగ్‌స్టేట్స్‌లో ఒకటైన నార్త్ కరోలినాలో ట్రంప్ గెలవకపోవడం ఒక్కటే డెమొక్రాట్లకు ఊరట. 2008లో ఈ రాష్ట్రం బరాక్ ఒబామాకు మద్దతు పలికింది.
మొత్తం మీద దేశవ్యాప్తంగా ఓటర్ల సరళి మారుతూ వస్తోంది. దీనికి అనుగుణంగా పార్టీలు వ్యూహాలను ఖరారు చేసుకోవాల్సి ఉంది. ఇక సెనెట్‌కు జనవరి నెలలో రెండు స్థానాలకు జరగనున్న రన్-ఆఫ్ ఎలక్షన్ కీలకంగా మారాయి. ఈ రెండుస్థానాలు సెనెట్‌లో పార్టీ పట్టును నిర్ణయిస్తాయి.
ఈ రాష్ట్రంలో స్వల్ప మెజారిటీతో బైడెన్ గెలవడంతో ఇక్కడ పోరు హోరాహోరీగా ఉండబోతోంది.
ప్రస్తుతం సెనెట్‌లో డెమెక్రాట్లకు 48మంది సభ్యులు ఉండగా, రిపబ్లికన్లకు 50మంది సభ్యులున్నారు. మరోవైపు ప్రతినిధుల సభలో సాధారణ మెజారిటీకి 218 సీట్లు అవసరం కాగా, డెమొక్రాట్లకు 218మంది, రిపబ్లికన్లకు 203మంది సభ్యులున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అధికార పగ్గాల కోసం ఎదురు చూపులు
అధికార మార్పిడి వ్యవహారాన్ని చూడాల్సిన జనరల్ సర్వీస్ అడ్మినిస్ట్రేషన్ (జీఎస్‌ఏ) ఇంకా బైడెన్, కమలా హారిస్‌ల విజయాలను అధికారికంగా గుర్తించలేదు.
రక్షణ విభాగానికి సంబంధించిన అంశాలలో బ్రీఫింగ్ కోసం బైడెన్ వర్గానికి అనుమతులు రాలేదు. ఇలా యాక్సెస్ ఇవ్వకపోవడం వల్ల పరిపాలనలో ఇబ్బందులు ఎదురవుతాయని బైడెన్ ప్రతినిధి జెన్ సాకీ అన్నారు.
“ కరోనా మహమ్మారి నేపథ్యంలో మా అధికారులకు, నిపుణులకు యాక్సెస్ ఇవ్వడమనేది అత్యవసరం’’ అని ఆమె అన్నారు.
ఈ వాదనకు ట్రంప్ మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జాన్ కెల్లీ కూడా మద్దతిచ్చారు. అధికార బదిలీ ఆలస్యం కావడం వల్ల దేశభద్రత ప్రమాదంలో పడుతుందని ఆయన అన్నారు.
ఒకపక్క అధికార బదిలీ కోసం ఎదురు చూస్తూనే జో బైడెన్ తనకు అవసరమైన అధికారులను ఎంపిక చేసుకుంటున్నారు. తాజాగా తన మద్దతుదారైన రోన్ క్లెయిన్‌ను చీఫ్ ఆఫ్ ది స్టాఫ్‌గా ప్రకటించారాయన.
అంతకు ముందు 150మంది మాజీ జాతీయ భద్రతాధికారులు కూడా అధికార బదిలీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని జీఎస్‌ఏకు విజ్జప్తి చేశారు.
సంఖ్యాపరంగా తక్కువమందే అయినా, రిపబ్లికన్‌లలోని కొందరు కూడా అధికార బదిలీ ప్రక్రియ ప్రారంభించడం మంచిదని వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Reuters
ఫలితాలపై ట్రంప్‌లో ఇంకా అనుమానాలు
మరోపక్క ఎన్నికల ఫలితాలపై ట్రంప్ తన అభ్యంతరాలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఎలాంటి ఆధారాలివ్వకుండానే శుక్రవారంనాడు ఆయన వరసగా ట్వీట్లు చేశారు. వాషింగ్టన్‌లో శనివారంనాడు పెద్ద ర్యాలీ నిర్వహిస్తానని కూడా ట్రంప్ ప్రకటించారు.
ఈసారి అమెరికా చరిత్రలోనే అత్యంత పకడ్బందీగా ఎన్నికలు జరిగాయంటూ ఎలక్షన్ అధికారులు ప్రకటన చేసిన కొద్దిసేపటి నుంచే ట్రంప్ ట్వీట్ చేయడం ప్రారంభించారు. అయితే అధ్యక్షుడి ఆరోపణలను వివిధ రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ అధికారులు తోసిపుచ్చారు.
ఓటింగ్ సాఫ్ట్‌వేర్ కారణంగా 28రాష్ట్రాలలో మిలియన్ల ఓట్లు రద్దయ్యాయని ట్రంప్ చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలులేవని ఎలక్షన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ కో-ఆర్డినేటింగ్ కౌన్సిల్ తేల్చి చెప్పింది.
మరోవైపు “అధ్యక్షుడు ట్రంప్ పదవిలో కొనసాగుతారు. ఆయన రెండో దఫా అధికారాన్ని నిర్వహిస్తారు’’ అని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి కేలే మెకెనీ ఫాక్స్ న్యూస్‌కు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లు తెరిచిన వారంలోనే పిల్లల్లో పెరుగుతున్న కరోనా కేసులు.. తల్లిదండ్రుల్లో ఆందోళన
- ఎన్నికల్లో ఓట్లు చీల్చటానికి.. కీలక గుర్తులను పోలిన గుర్తులతో డమ్మీ అభ్యర్థులను పోటీకి పెడుతున్నారా?
- దూదేకుల’ వివాదం ఏపీ హైకోర్టుకు ఎందుకు చేరింది
- నంద్యాల ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం అంతా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది?
- విశాఖ తీరానికి కొట్టుకువచ్చిన ఈ ఓడ తిరిగి సముద్రంలోకి వెళ్తుందా? ఇక్కడే రెస్టారెంట్‌గా మారుతుందా?
- ‘జ్వరమొస్తే అందరూ కరోనా అని భయపడుతున్నారు... మేం కిడ్నీ జబ్బేమో అని భయపడతాం’
- అమెరికా అధ్యక్ష ఎన్నికలు: ఈ ఫలితాలను ట్రంప్ అంగీకరించకపోతే ఏమవుతుంది?
- జో బైడెన్: అమెరికా 'అత్యుత్తమ ఉపాధ్యక్షుడు' అధ్యక్ష పదవి వరకూ ఎలా చేరుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























