వరవరరావుకు బెయిల్ ఇవ్వలేం: బాంబే హైకోర్టు - Newsreel

ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

విరసం నేత, కవి వరవరరావుకు బెయిల్‌ ఇవ్వడం కుదరదని బాంబే హైకోర్టు తేల్చి చెప్పింది.

వరవరరావు ఆరోగ్యం బాగా లేదని ఆయనకు బెయిలివ్వాలని ఆయన కుటుంబం చేసిన విజ్జప్తిని బాంబే హైకోర్టు తోసిపుచ్చింది.

ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు వీడియో కాల్‌ ద్వారా పరిశీలిస్తారని, అవసరమైతే ఆయన వద్దకు వెళ్లి వైద్య సహాయం అందిస్తారని కోర్టు తెలిపింది.

వరవరరావు మూత్ర సంబంధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆయనకు డైపర్స్‌ వాడాల్సి వస్తోందని కుటుంబం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ఆయనకు న్యాయం అందడంలేదని అన్నారు. అయితే వరవరరావు ఆరోగ్య పరిస్థితిని గురువారం కానీ శుక్రవారం కానీ నానావతి ఆసుపత్రి డాక్టర్లు వీడియో కాల్‌ ద్వారా సమీక్షిస్తారని స్పష్టం చేసిన కోర్టు ఈ కేసులో ఈ నెల 17న తదుపరి విచారణ జరుపుతామని తెలిపింది.

బీమా-కోరేగావ్‌ అల్లర్ల కేసులో వరవరరావు 2018 జనవరిలో అరెస్టయ్యారు.

ఆయనపై తీవ్రవాద నిరోధక చట్టం (యుఏపీఏ) ఆరోపణలు మోపారు. అయితే ఆరోగ్య కారణాలరీత్యా వరవరరావును విడుదల చేయాలని ఆయన కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

మరో ఉద్దీపన ప్యాకేజ్ ప్రకటించిన కేంద్రం

ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ఉద్దీపన చర్యను ప్రకటించింది.

'ఆత్మనిర్భర్‌ భారత్‌ 3.0'లో భాగంగా 12 కీలక ప్రకటనలు చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.

దేశంలో ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఆత్మనిర్భర్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన తీసుకొచ్చినట్లు ఆమె ప్రకటించారు. మొత్తం రూ. 2.65లక్షల కోట్ల ప్యాకేజీని వెల్లడించారు.

ప్యాకేజ్‌లో అంశాలు

* ఆత్మ నిర్భర్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన కింద కొత్త ఉద్యోగులను తీసుకునే సంస్థలకు పీఎఫ్‌ కంట్రిబ్యూషన్‌లో రెండేళ్ల పాటు రాయితీ కల్పిస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అక్టోబరు 1 నుంచి ఈ రాయితీ వర్తిస్తుందని చెప్పారు. 1000లోపు ఉద్యోగులుండే సంస్థలకు ఉద్యోగుల వాటా, సంస్థల వాటా పీఎఫ్‌ మొత్తం 24 శాతం కేంద్రమే భరిస్తుందని చెప్పారు. 1000 కంటే ఎక్కువ ఉండే సంస్థలకు మాత్రం ఉద్యోగుల పీఎఫ్‌ వాటాను కేంద్రం ఇస్తుందని తెలిపారు.

* రూ. 3లక్షల కోట్లతో తీసుకొచ్చిన ఎమర్జెన్సీ క్రెడిట్‌ లైన్‌ గ్యారంటీ పథకాన్నివచ్చే ఏడాది మార్చి 31 వరకు అమలు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. గతంలో కేవలం సూక్ష్మ,చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఈ పథకాన్ని అమలు చేయగా.. తాజాగా బిజినెస్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ముద్రా రుణాలు, వ్యాపార రుణాలకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపారు. కొవిడ్‌ కారణంగా కుదేలైన రంగాలకు రుణ గ్యారెంటీ కల్పిస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. కామత్‌ కమిటీ సూచించిన 26 ఒత్తిడికి గురైన రంగాలకు రుణ భరోసా ఇస్తున్నట్లు చెప్పారు.

* దేశీయ ఉత్పత్తికి ఊతమిచ్చేలా రూ.1.46 లక్షల కోట్లతో ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. మొబైల్ తయారీ, వైద్య పరికరాల తయారీ రంగాలకు రూ.51,355కోట్లు ఇస్తున్నట్లు వెల్లడించారు.

* పీఎం ఆవాస్‌ యోజనకు అదనంగా రూ. 18వేల కోట్లు కేటాయింపు.

* కొత్తగా 12 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభం, మరో 18లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి. ఇళ్ల నిర్మాణంతో అదనంగా 78 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం.

* డెవలపర్లు, గృహ కొనుగోలుదారులకు ఆదాయపు పన్నులో ఊరట

* ఎరువుల రాయితీకి అదనంగా రూ. 65,000 కోట్లు. దీంతో కోటి 40లక్షల మంది రైతులకు లబ్ధి

* పీఎం గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ యోజనకు అదనంగా రూ. 10వేల కోట్ల కేటాయింపు

* ఎగ్జిమ్‌ బ్యాంక్‌కు రూ.3000 కోట్ల కేటాయింపు

* దేశీయ రక్షణ పరికరాలు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు, గ్రీన్‌ ఎనర్జీ కోసం రూ. 10,200 కోట్లు

* కొవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రయోగాల కోసం ఆర్‌ అండ్‌ డీ విభాగానికి రూ. 900 కోట్ల నిధులు మంజూరు

'అధ్యక్షా.. మాపై నిషేధం ఇంకా ఉందా?': ట్రంప్‌ను అడిగిన టిక్‌టాక్

అమెరికాలో నవంబరు 12 నుంచి తమపై నిషేధం విధించాలంటూ డోనల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టిక్‌టాక్ కోర్టులో సవాల్ చేసింది.

చైనాకు చెందిన టిక్‌టాక్ మాతృసంస్థను ఒక అమెరికా సంస్థ కొనుగోలు చేయకపోతే.. కొత్త వీడియోల డౌన్‌లోడ్‌లు నిలిపేయాలని ట్రంప్ ఇదివరకు ఆదేశాలు జారీచేశారు.

భద్రతా ఆందోళనల నడుమ ట్రంప్ జారీచేసిన ఆదేశాలపై ఆగస్టు నుంచీ తాము పనిచేస్తున్నట్లు టిక్‌టాక్ తెలిపింది.

అయితే, గత రెండు నెలల నుంచి అమెరికా ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఫీడ్‌బ్యాక్ రాలేదని వెల్లడించింది.

''జాతీయ భద్రత ఆందోళనల విషయంలో అమెరికాలోని విదేశీ పెట్టుబడుల కమిటీతో టిక్‌టాక్ కలిసి పనిచేస్తోంది. ఆందోళనలను తొలగించేందుకు మేం తీసుకున్న చర్యలపై రెండు నెలల క్రితం ట్రంప్ ప్రాథమికంగా ఆమోదం తెలిపారు. ఆ చర్యలకు తుదిరూపును ఇస్తూ మేం సమగ్ర ఒప్పందాన్ని సమర్పించాం. కానీ దానిపై మాకు ఎలాంటి ఫీడ్‌బ్యాక్ రాలేదు. ఇంతకీ మాపై విధించబోయే నిషేధం కొనసాగుతుందా?''అని టిక్‌టాక్ ఒక ప్రకటన విడుదల చేసింది.

మరోవైపు అమెరికాలోని 15,00 మందికిపైగా ఉద్యోగులతోపాటు తమ సంస్థ హక్కులను కాపాడుకునేందుకు అమెరికా అప్పీళ్ల కోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలుచేసినట్లు తెలిపింది.

ట్రంప్ ఆదేశాలను సమీక్షించాలని, గడువును కూడా మరో 30 రోజులు పొడిగించాలని కోర్టును కోరినట్లు టిక్‌టాక్ వెల్లడించింది.

పింక్ డైమండ్: రూ. 197 కోట్లకు అమ్ముడుపోయిన అరుదైన గులాబీ వజ్రం

అత్యంత అరుదైన లేత గులాబీ రంగు రష్యా వజ్రం ((పర్పుల్ పింక్ డైమండ్).. స్విట్జర్లాండ్‌లో 197.95 కోట్ల రూపాయలు (26.6 మిలియన్ డాలర్లు)కు అమ్ముడుపోయింది. ఇప్పటివరకు వేలం వేసిన ఇలాంటి వజ్రాల్లో ఇదే అతిపెద్దది.

దాదాపు 99 శాంతి గులాబీ రంగు వజ్రాలు పది క్యారెట్లలోపే ఉంటాయి. కానీ తాజా వజ్రం మాత్రం 14.8 క్యారెట్లు ఉంది. దీన్ని ''ద స్పిరిట్ ఆఫ్ ద రోజ్''గా పిలుస్తున్నారు.

పరిమాణం, రంగుతోపాటు ప్రస్ఫుటంగా కనిపించే వజ్రం అంతర్నిర్మాణమే జెనీవాలో సౌథెబే నిర్వహించిన వేలంలో భారీ ధర పలికేందుకు కారణమైంది.

దీన్ని దక్కించుకున్న వ్యక్తి పెరును బయటపెట్టలేదు.

రష్యా మైనింగ్ సంస్థ అల్రోసా సేకరించిన మూడు ప్రముఖమైన వజ్రాల్లో ఇదీ ఒకటి. 2017లో ఇది బయటపడింది.

దీని ముడి వజ్రం పేరు నిజిన్‌స్కీ. రష్యా-పోలండ్ బ్యాలే డ్యాన్సర్ పేరును దీనికి పెట్టారు.

గులాబీ వజ్రాల్లో అత్యధిర పలికిన రికార్డు ''సీటీఎఫ్ పింక్ స్టార్'' పేరిట ఉంది. 59 క్యారెట్ల ఈ వజ్రాన్ని హాంకాంగ్‌లో 2017 ఏప్రిల్‌లో వేలం వేశారు. ఇది రూ.528 కోట్ల(71 మిలియన్ డాలర్లు)కు అమ్ముడుపోయింది.

హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య అనుకూల శాసన సభ్యులందరూ మూకుమ్మడి రాజీనామా

హాంకాంగ్‌లోని ప్రజాస్వామ్య అనుకూల శాసన సభ్యులందరూ రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. నలుగురు ప్రజాస్వామ్య అనుకూల సభ్యులపై చైనా వేటు వేయడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.

జాతీయ భద్రతకు ముప్పు పొంచివుండే రాజకీయ నాయకులపై హాంకాంగ్ వేటువేసేందుకు అనుమతించే తీర్మానాన్ని బుధవారం చైనా ఆమోదించింది.

దీంతో హాంకాంగ్ స్వాతంత్ర్యం, చైనా సార్వభౌమత్వాన్ని వ్యతిరేకించడం, హాంకాంగ్ అంతర్గత అంశాల్లో జోక్యం చేసుకోవాలని విదేశాలను కోరడం, జాతీయ భద్రతకు ముప్పు తీసుకురావడం తదితర కారణాలతో శాసన సభ్యులను నేరుగా తొలగించడానికి చైనాకు వీలుపడింది.

తీర్మానం ఆమోదించిన కొద్దిసేపటికే.. సివిక్ పార్టీకి చెందిన ఆల్విన్ యూంగ్, క్వోక్ కాకీ, డేనిస్ క్వోక్, ప్రొఫెసనల్ గిల్డ్‌కు చెందిన కెనెత్ ల్యూంగ్‌లపై చైనా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ వేటువేసింది.

ఈ నలుగురికీ సంఘీభావం ప్రకటిస్తూ..15 మంది ప్రజాస్వామ్య అనుకూల శాసన సభ్యులు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో 1997లో హాంకాంగ్‌ను చైనాకు అప్పగించిన తర్వాత, తొలిసారి అసమ్మతి గళం లేకుండా పోయినట్లు అయింది.

నలుగురు శాసన సభ్యుల్ని చైనా తొలగించడాన్ని.. హాంకాంగ్ స్వేచ్ఛకు సంకెళ్లు వేయడంగా విమర్శకులు విశ్లేషిస్తున్నారు. అయితే, ఆ ఆరోపణల్ని చైనా ఖండిస్తోంది.

70 స్థానాలున్న శాసన సభలో ప్రజాస్వామ్య అనుకూల సభ్యులు 19 మంది ఉన్నారు. తాజా పరిణామాలతో మొత్తం వీరంతా రాజీనామా చేసినట్లు అయ్యింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)