తిరుమలలో మళ్లీ భక్తుల సందడి... భక్తుడి కిడ్నాప్‌తో రేగిన కలకలం - ప్రెస్ రివ్యూ

ప్రచురణ

తిరుమల వేంకటేశ్వరస్వామిని భక్తులు శనివారం రికార్డు స్థాయిలో దర్శించుకున్నారని, ఆదివారం సాయంత్రం ఓ భక్తుడి కిడ్నాప్ ఘటన కలకలం రేపిందని ఆంధ్రజ్యోతిలో రెండు కథనాలు ప్రచురించారు.

శనివారం నాడు ఉదయం నుంచి రాత్రి వరకు 30,705 మంది భక్తులు ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత మొదలుపెట్టిన శ్రీవారి దర్శనాల్లో ఒక్కరోజులో ఇంతమంది దర్శనం చేసుకోవడం ఇదే మొదటిసారి. కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో టీటీడీ అధికారులు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఒక వార్తలో రాసారు.

అయితే, ఆదివారం సాయంత్రం ఓ భక్తుడి కిడ్నాప్‌ కావడం కలకలం రేపింది. కుటుంబీకుల సమాచారంతో పోలీసులు, టీటీడీ విజిలెన్స్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుమల డీఎస్పీ ప్రభాకర్‌ కథనం మేరకు.. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన హనుమంతరావు ఆదివారం కుటుంబ సభ్యులతో శ్రీవారి దర్శనానికి వచ్చారు. దర్శనం ముగించుకుని ఎస్పీటీ అతిథిగృహానికి చేరుకోగానే.. నలుగురు వ్యక్తులు హనుమంతరావును బలవంతంగా ఓ కారులో ఎక్కించుకుని తిరుపతి వైపు దూసుకుపోయారు. దీన్ని గమనించిన కుటుంబీకులు కారు నంబరును పోలీసులకు తెలియజేశారు.

పోలీసులు, టీటీడీ విజిలెన్స్‌ అధికారులు అప్రమత్తమై.. అలిపిరి చెక్‌పాయింట్‌ వద్ద కారును అడ్డుకున్నారు. అందులోని హనుమంతరావును రక్షించి.. కిడ్నాప్‌కు పాల్పడిన అనంతపురం జిల్లా పెనుగొండకు చెందిన శ్రీనివాస్‌, మారుతి, పుట్టపర్తికి చెందిన కుమార్‌, చిత్తూరుజిల్లా చౌడేపల్లెకు చెందిన సురేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. పెనుగొండ కియా ప్లాంట్‌ ఎదుట క్యాటరింగ్‌ బిజినెస్‌ చేసేందుకు శ్రీనివాస్‌ వద్ద నుంచి రూ. 20 లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వక పోవడంతోనే కిడ్నాప్‌ చేసినట్లు దర్యాప్తులో తేలిందని డీఎస్పీ ప్రభాకర్‌ మీడియాకు తెలిపినట్లు ఈ కథనంలో తెలిపారు.

హైదరాబాద్‌లో వరదలొస్తే ప్రధాని స్పందించలేదన్న కేటీఆర్

ప్రధాని మోదీ తెలంగాణకు సంబంధించి పలు అంశాల్లో వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉంటున్నదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కె. తారక రామారావు విమర్శించారని నవ తెలంగాణ పత్రిక ప్రముఖంగా ప్రచురించింది.

ఈ కథనం ప్రకారం, వరదలకు సంబంధించి కర్నాటక, గుజరాత్ ముఖ్యమంత్రులు లేఖలు రాస్తే వెంటనే స్పందించి ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన ప్రధాని, సీఎం కేసీఆర్ రాసిన లేఖకు మాత్రం ఇప్పటివరకు సమాధానం ఇవ్వలేదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరానికి వరదలొస్తే ఆదుకోవాల్సిన బాధ్యత ప్రధానికి లేదా అని ప్రశ్నించారు.

కేంద్ర హోం మంత్రి హోదాలో ఉన్న కిషన్ రెడ్డి నిజానికి రాష్ట్రానికి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని కేటీఆర్ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులతో కలిసి కేటీఆర్ విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. వరదల వల్ల రాష్ట్రానికి రూ. 8,868 కోట్ల మేర నష్టం వచ్చిందని, ముఖ్యమంత్రి లేఖ రాసినా ప్రధాని ఇప్పటికీ స్పందించలేదని కేటీఆర్ అన్నారని ఈ కథనంలో తెలిపారు.

సోమశిల రిజర్వాయర్‌ రెండో దశ పనులు ప్రారంభం

సోమశిల రిజర్వాయర్‌ జలాలతో నెల్లూరు జిల్లాలోని కరువు ప్రాంతాలకు నీటిని అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోందని, ఈ క్రమంలో సోమశిల హైలెవల్‌ లిఫ్ట్‌ కెనాల్‌ (ఎస్‌హెచ్‌ఎల్‌ఎల్‌సీ) రెండో దశ పనులకు సోమవారం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేయనున్నారని సాక్షి ఒక కథనంలో ప్రచురించింది.

ఈ దశలో దుత్తలూరు, వింజమూరు, ఉదయగిరి మండలాల్లో 46,453 ఎకరాలకు నీళ్లందించనున్నారు. నెల్లూరు జిల్లాలో వర్షాభావ ప్రాంతంలో ఉన్న అనంతసాగరం, మర్రిపాడు, వింజమూరు, దుత్తలూరు, ఉదయగిరి, ఆత్మకూరు మండలాల్లో సాగు, తాగునీటి కోసం ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో సోమశిల జలాశయం నుంచి నీటిని ఎత్తిపోసి.. తాగునీటి కష్టాలను తీర్చడంతో పాటు ఈ మండలాల్లో 90 వేల ఎకరాలకు నీళ్లందించేందుకు ఎస్‌హెచ్‌ఎల్‌ఎల్‌సీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. తొలి దశ కింద 43,547 ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించింది. రూ.840.72 కోట్ల వ్యయం కాగల పనులను కాంట్రాక్టు సంస్థకు అప్పగించింది. ఇప్పటివరకు రూ.572.11 కోట్లను ఖర్చు చేసింది. అటవీ శాఖకు చెందిన 4.28 ఎకరాల భూమిని సేకరించే ప్రక్రియను పూర్తి చేసి.. మిగిలిన పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టిందని ఈ కథనంలో తెలిపారు.

ఈ ప్రాజెక్టును ప్రాధాన్యత ప్రాజెక్టుగా గుర్తించి, ఎస్‌హెచ్‌ఎల్‌ఎల్‌సీ తొలి దశలో మిగిలిన పనులతో పాటూ రెండో దశ పనులను కూడా సత్వరం పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. దీనికోసం బడ్జెట్‌లో నిధులను కేటాయించడమే కాకుండా జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి తక్కువ వడ్డీకే రుణాలు తెచ్చి వేగంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించిందని ఈ కథనంలో పేర్కొన్నారు.

బీసీల విద్యాభివృద్ధికి భారీగా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

బీసీ సంక్షేమ శాఖ విద్యాసంబంధ కార్యక్రమాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 1206.70 కోట్లు విడుదల చేసిందని నమస్తే తెలంగాణ ఒక కథనంలో ప్రచురించింది.

మే నెలనుంచీ అక్టోబర్ వరకూ కేటాయించిన ఈ నిధులను మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ గురుకులాలు, సాధారణ ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు, బీసీ హాస్టళ్లు, స్టడీ సర్కిళ్ల నిర్వహణకు వినియోగించాలని ప్రభుత్వం సూచించినట్లు ఈ వార్తలో తెలిపారు.

అలాగే, బీసీలు విద్యారంగంలో రాణించేలా ఫీజు రీయంబర్స్‌మెంట్, స్కారల్‌షిప్‌లు ఇవ్వడమే కాకుండా గురుకులాల సంఖ్యను విస్తరిస్తోందని, కరోనా కాలంలో కూడా విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా నిధులు విడుదల చేస్తూ వెనుకబడిన కులాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ కథనంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)