You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఎంపీ రఘురామ కృష్ణ రాజు కంపెనీల్లో సీబీఐ సోదాలు - ప్రెస్ రివ్యూ
ఎంపీ రఘురామ కృష్ణ రాజు కంపెనీల్లో సీబీఐ సోదాలు నిర్వహించినట్లు సాక్షి కథనం ప్రచురించింది.
జాతీయ బ్యాంకుల నుంచి వందల కోట్ల రుణాలు తీసుకుని.. కనీసం వడ్డీ కూడా చెల్లించకుండా ఆ నిధుల్ని అక్రమంగా తన వారి ఖాతాల్లోకి మళ్లించి బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణరాజుకు చెందిన ఇళ్లు, కంపెనీలు, కార్యాలయాల్లో సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందాలు గురువారం సోదాలు చేశాయి.
ఏపీ, హైదరాబాద్, ముంబై సహా ఇతర ప్రాంతాల్లో ఆయన, ఆయన కంపెనీల డైరెక్టర్లకు చెందిన ఆస్తులపై ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ బృందాలు ఏకకాలంలో దాడులు చేశాయని సాక్షి చెప్పింది.
ఉదయం 6 గంటలకే మొదలైన ఈ సోదాల్లో ఏకంగా 11 బృందాలు పాల్గొన్నాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంకు, దాని అనుబంధ బ్యాంకుల నుంచి ఇండ్–భారత్ థర్మల్ పవర్ పేరిట తీసుకున్న రూ. 826.17 కోట్ల రుణాన్ని పక్కకు మళ్లించడంతో పాటు వడ్డీ కూడా చెల్లించకుండా బ్యాంకును మోసం చేయటం... తనఖాగా పెట్టిన భూముల్ని మోసపూరితంగా అమ్మేసుకోవటం, 95 శాతం బొగ్గు తరిగిపోయిందని చెప్పి దాన్ని తగలబెట్టేయటం వంటి అంశాలతో పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫిర్యాదు చేయటంతో సీబీఐ కేసు నమోదు చేసి సోదాలకు దిగిందని కథనంలో చెప్పారు.
సంస్థకు చైర్మన్‌గా ఉన్న రఘురాజుతో పాటు ఆయన భార్య, కుమార్తె ఇతర డైరెక్టర్లపై కేసులు నమోదు చేసింది. దాడుల సందర్భంగా పలు ఫైళ్లు, హార్డ్ డిస్కులను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసిందని సాక్షి వివరించింది.
న్యాయ వ్యవస్థపై యుద్ధమా?: కోర్టు ధిక్కరణ వ్యాఖ్యల కేసులో ఏపీ హైకోర్టు ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ స్పీకర్, డిప్యూటీ సీఎం, ఎంపీ వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థపై యుద్ధం చేసినట్లు ఉన్నాయని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఈనాడు కథనం ప్రచురించింది.
శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులు హైకోర్టు, న్యాయమూర్తులపై చేసిన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థపై యుద్ధం ప్రకటించినట్లుందని హైకోర్టు మండిపడింది.
ఆ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేవిగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరహా పరిస్థితులు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ చూడలేదని ఘాటుగా వ్యాఖ్యానించింది.
ఆంధ్రప్రదేశ్‌లో న్యాయవ్యవస్థను మూసేయాలనే ఉద్దేశంతో ఆ తరహా వ్యాఖ్యలు చేసినట్లుందని గట్టిగా చెప్పినట్లు ఈనాడు రాసింది.
హైకోర్టు పాత్ర లేకుండా చేసే ప్రతీదీ తామే నిర్ణయించొచ్చు అన్నట్లు వారి తీరుందని ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది. ఆ తరహా వ్యాఖ్యలు రాజ్యాంగబద్ధ పదవి నిర్వహిస్తున్న వ్యక్తి (స్పీకర్) శాసనసభలో కాకుండా వేరేచోట చేస్తే కచ్చితంగా కోర్టుధిక్కరణ అవుతుందని స్పష్టం చేసింది.
న్యాయవిచారణలో భాగంగా తాము వ్యాఖ్యలు చేయొచ్చని, దాన్ని ఎవరూ ప్రశ్నించలేరని స్పష్టం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం, నేతలపై ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టింగులు పెడితే వెంటనే స్పందిస్తున్న సీఐడీ.. న్యాయమూర్తులపై పోస్టింగుల వ్యవహారంలో హైకోర్టు అప్పటి రిజిస్ట్రార్ జనరల్ రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఎందుకు వెంటనే చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది.
ఈ కేసులో అందరి వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసిందని ఈనాడు వివరించింది.
ఆరోగ్య శ్రీలో అవయవ మార్పిడి
తెలంగాణలో ఆరోగ్య శ్రీ పరిధిలోకి అవయవ మార్పిడిని కూడా తీసుకొస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లు ఆంధ్రజ్యోతి తన కథనంలో చెప్పింది.
ఆరోగ్యశ్రీ పరిధిలోకి మూత్రపిండాలు, గుండె, కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సలను తీసుకురావాలని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.
ప్రస్తుతం నిమ్స్, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లోనే ఆరోగ్యశ్రీ కింద అవయవ మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నారు. దానిని మెడికల్ కాలేజీలున్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.
ప్రస్తుతం పదుల సంఖ్యలోనే అవయవ మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నాయని, వాటిని మరితంగా విస్తరించేందుకు అవసరమైతే చట్టంలో మార్పులు చేయాలని నిర్ణయించింది.
తెలంగాణలో వైద్యరంగం బలోపేతం చేయడంపై మంత్రి ఈటల రాజేందర్ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం హైదరాబాద్‌లోని ఎంసీఆర్-హెచ్‌ఆర్డీలో గురువారం సమావేశమైంది.
అనంతరం మంత్రివర్గ ఉపసంఘం ఆమోదించిన అంశాలను ఈటల విలేకరులకు వివరించారు.
మూత్రపిండాలు, గుండె, కాలేయ మార్పిడి ఆపరేషన్లకు రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఖర్చు అవుతోందని, పేదలపై భారం తగ్గించేందుకు ఈ మూడింటిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తున్నామని మంత్రి చెప్పారని ఆంధ్రజ్యోతి వివరించింది.
నేడు ఇందూరు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
ఇందూరు ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఈసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు నమస్తే తెలంగాణ రాసింది.
ఉమ్మడి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం ఉదయం 9నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.
ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం పటిష్ఠ ఏర్పాట్లుచేసింది. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ముందుజాగ్రత్తలు తీసుకున్నది. కరోనా బాధితులు సాయంత్రం 4 నుంచి 5గంటల సమయంలో ఓటు వేసేలా ఏర్పాట్లు చేసింది. కరోనా సోకిన ఓటరు స్వతహాగా పీపీఈ కిట్లు వేసుకోవాలి.
కరోనా సోకిన ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరేలా 108 అంబులెన్సులను అందుబాటులో ఉంచనున్నది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించనున్న సిబ్బందికి ఫేస్‌షీల్డులు, పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజులు అందజేసింది.
నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి గురువారం కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని పోలింగ్ సెంటర్లకు సిబ్బంది చేరుకున్నారు.
ఉపఎన్నికలకు 50 పోలింగ్ కేంద్రాల్లో 14 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. 48 చోట్ల వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతంలో వెబ్‌కాస్టింగ్‌కు తోడు వీడియో తీయిస్తున్నారు.
మరోవైపు బలగాలను ఎక్కువ సంఖ్యలో మోహరించేలా నిర్ణయం తీసుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుచేస్తున్నారు.
ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచారు. టీఆర్‌ఎస్ నుంచి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ నుంచి వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి, బీజేపీ నుంచి పోతన్‌కార్ లక్ష్మీనారాయణ ఉన్నారని నమస్తే తెలంగాణ వివరించింది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: ప్రపంచ చరిత్రను మార్చేసిన అయిదు మహమ్మారులు
- కరోనావైరస్: హంతక మహమ్మారిపై శాస్త్రవేత్తల వేటలో వెలుగు చూసిన నిజాలేమిటి?
- రష్యా ఎన్నికలు: మేయర్‌ను ఓడించిన క్లీనర్.. పుతిన్ పార్టీకి ఝలక్
- నితీశ్ కుమార్‌కు వ్యతిరేకంగా బీజేపీ, చిరాగ్ పాశ్వాన్ తెర వెనక కథ నడిపిస్తున్నారా?
- సరిహద్దుల్లో విధులకు వెళుతూ చైనా సైనికులు ఏడ్చేశారా?
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఏంటి? వీటికి పరిష్కారాలు ఏంటి?
- కరోనావైరస్ వల్ల కంటి సమస్యలు వస్తున్నాయా?
- బొప్పాయి పండుతో అబార్షన్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- భారతదేశంలో కోవిడ్ మరణాలు 1,00,000 దాటాయి... ఈ మరణాలకు కారణాలేమిటి?
- ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- చైనాలో మహిళలకు మాత్రమే పరిమితమైన రహస్య భాష... నుషు
- కరోనావైరస్: వ్యాక్సీనా, హెర్డ్ ఇమ్యూనిటీనా... ఏది వస్తే మేలు?
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)