అమరావతిలోనే రాజధాని ఉండాలి... వైకాపాకు ప్రజలే బుద్ధి చెబుతారు: పురందేశ్వరి - ప్రెస్ రివ్యూ

పురందేశ్వరి

ఫొటో సోర్స్, Y.S. Chowdary/Facebook

ప్రచురణ

''ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో భాజపా రెండు నాల్కల ధోరణితో వ్యవహరించడం లేదు. ద్వంద్వ వైఖరి ప్రసక్తే లేదు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అమరావతిలో రాజధాని ఉండాలని పార్టీ రాష్ట్రశాఖ తీర్మానం చేసింది'' అని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన దగ్గుబాటి పురందేశ్వరి 'ఈనాడు' ఇంటర్వ్యూలో చెప్పినట్లు ఆ పత్రిక ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విషయంలో కేంద్రం తన పరిమిత పాత్ర గురించి హైకోర్టుకు అఫిడవిట్ల రూపంలో చెప్పిందని ఆమె తెలిపారు. ''ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. పార్టీ పరంగా రాజధాని అమరావతిలో ఉండాలనే చెబుతున్నాం. రైతులకు న్యాయం జరగాలి. వారు స్థలాలు ఇచ్చిన చోట అభివృద్ధి జరగాల్సిందే. ఇందులో ఎటువంటి భిన్నాభిప్రాయాలూ లేవు. ప్రస్తుతం కోర్టులో ఉన్నందున ఎక్కువ చర్చ అక్కర్లేదు'' అని పురందేశ్వరి పేర్కొన్నారు.

దక్షిణాదిన పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు దీటుగా ఎదగటానికి ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని పురందేశ్వరి పేర్కొన్నారు. ''గత ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు ప్రత్యేక హోదా విషయంలో భాజపాను దోషిగా నిలబెట్టడంలో సఫలీకృతమయ్యాయి. హోదా ఇవ్వడం సాధ్యం కాకున్నా 'స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌' ఏర్పాటు చేస్తే ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం వెల్లడించింది. గత ప్రభుత్వం దాని గురించి అసలు పట్టించుకోలేదు'' అన్నారామె.

మిత్రపక్షంగా ఉన్న జనసేనతో కలిసి ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తామన్నారు. ''ఎన్డీయే నుంచి మిత్రపక్షాలు వాటంతట అవే వైదొలుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ, శివసేన, రాష్ట్రీయ లోక్‌ సమతాపార్టీ అలాగే వ్యవహరించాయి. మిత్రపక్షాలతో భాజపా సన్నిహితంగానే వ్యవహరిస్తోంది. వాటికి ప్రాధాన్యం ఇస్తోంది. అయినా కొన్ని పార్టీలు ఎన్డీయేను వీడుతున్నాయి'' అని పురందేశ్వరి చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైకాపా పాలనపై ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని.. హైకోర్టు నుంచి ఆ సర్కారుకు 65-70 వ్యాజ్యాల్లో ఎదురు దెబ్బలు తగిలాయని, అడుగడుగునా చీవాట్లు పడుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ''దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. దేవాలయాల ఆస్తులు, భూములకు రక్షణ లేకుండాపోతోంది. పార్టీపరంగా ప్రజాక్షేత్రంలో వీటిని ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వ చర్యలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. తగిన సమయంలో వారు బుద్ధి చెబుతారనడంలో ఎటువంటి సందేహం లేదు'' అన్నారు.

టీపీసీసీ

ఫొటో సోర్స్, @manickamtagore

2023లో అధికారమే లక్ష్యం: టీపీసీసీ నేతలకు కొత్త ఇన్‌చార్జి మాణిక్యం దిశానిర్దేశం

తెలంగాణలో 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రతి కాంగ్రెస్‌ నాయకుడు పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ పిలుపునిచ్చినట్లు 'సాక్షి' ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. నాయకులంతా కలిసికట్టుగా పనిచేసి లక్ష్యాన్ని సాధించాలన్నారు. రాష్ట్రంలో త్వరలో రానున్న దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నిక, రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ, జీహెచ్‌ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలన్నింటిలో పార్టీ గెలుపే ధ్యేయంగా పనిచేయాలని మాణిక్యం ఠాగూర్‌ టీపీసీసీ నేతలను కోరారు.

ఆయన తన తొలి పర్యటనలో భాగంగా రెండో రోజు ఆదివారం రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులతో వరుసగా భేటీ అయ్యారు. ఉదయం దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, పట్టభద్రుల ఎన్నికలు, తర్వాత జీహెచ్‌ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికలకు సంబంధించిన సమీక్షలు జరిపారు.

ఆ తర్వాత డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో సమావేశమై ఎన్నికల వ్యూహాలు, రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశాల్లో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌తో పాటు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ రేవంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అన్ని ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తానే అభ్యర్థిని అనుకొని పని చేయాలని, టీమ్‌ వర్క్‌తో అందరూ పనిచేస్తేనే ఫలితం దక్కుతుందని మాణిక్యం ఠాకూర్ సూచించారు. బౌలర్, బ్యాట్స్‌మెన్‌లే కాకుండా ప్రతి ఆటగాడు బాగా ఆడితేనే క్రికెట్‌ మ్యాచ్‌లో విజయం సాధిస్తామని, ఇదే స్ఫూర్తిని రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అలవర్చుకోవాలని కోరారు. అన్ని ముఖ్యమైన అంశాలపై సబ్‌ కమిటీలు వేసి లోతుగా చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని, ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజల్లో ఉండి పోరాడాలన్నారు.

హేమంత్, అవంతి

''హేమంత్‌ను చంపేదాకా అన్నం ముట్టనని.. నా తల్లి ఒట్టేసుకుంది'': అవంతి

హేమంత్‌తో ప్రేమ, పెళ్లిని అవంతి తల్లి అర్చన జీర్ణించుకోలేకపోయిందా? హేమంత్‌ను చంపేంత వరకు అన్నం ముట్టనని ఆమె ఒట్టేసిందా? హేమంత్‌ భార్య అవంతి ఇదే చెబుతున్నారని 'ఆంధ్రజ్యోతి' ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. హేమంత్‌తో తన ప్రేమ విషయం తెలిసినప్పుడే అన్నంలో విషం పెట్టి చంపేస్తానని తనను తల్లి అర్చన హెచ్చరించిందని అవంతి చెప్పారు. తాను ఇంట్లోంచి బయటకు వెళ్లి హేమంత్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత అతడిని చంపాలని నిర్ణయించుకుందని ఆరోపించారు.

హేమంత్‌ను చంపేంత వరకు అన్నం తినను అని ఒట్టు వేసుకుందని, ఆమెకు తండ్రి లక్ష్మారెడ్డి మద్దతు ఇస్తే.. యుగేంధర్‌రెడ్డి రెచ్చగొట్టాడని అవంతి పేర్కొన్నారు. హేమంత్‌ను హత్యచేసిన చోటే తన తల్లిదండ్రులను మేనమామ యుగేంధర్‌రెడ్డిలను ఎన్‌కౌంటర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. పెళ్లయిన మూడు నెలలకే తనను వింతంతువును చేశారని, వారెవ్వరికీ బతికే అర్హత లేదని.. తనకు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, ఏపీ సీఎం జగన్‌ న్యాయం చేయాలని కోరారు.

హేమంత్‌ను చంపిన ఘటనలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ శిక్షపడాలని కోరారు. హత్య ఘటనలో భాగంకాకుండా తన అన్నయ్య ఆశిష్‌ రెడ్డి ఉద్దేశపూర్వకంగా బయట ఉన్నాడని, అతడితో తనకు తన అత్తగారి కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

నిందితులను బెయిల్‌ మీద బయటకు తెచ్చేందుకు ఆశిష్‌రెడ్డి ప్రయత్నిస్తున్నాడని, ముందు అతడిని వెంటనే అరెస్టు చేసి జైల్లో పెట్టాలని డిమాండ్‌ చేశారు. తన తల్లిదండ్రులకు, మామయ్య యుగంధర్‌రెడ్డి మధ్య 15 ఏళ్లుగా మాటల్లేవని.. ఓదార్చాలనే నెపంతోనే తల్లిదండ్రులకు అతడు మళ్లీ దగ్గరయ్యాడని చెప్పారు. హేమంత్‌ హత్య కోసం లక్ష్మారెడ్డితో యుగేంధర్‌రెడ్డి 10 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడని ఆరోపించారు.

''హేమంత్‌కు జోతిష్యం తెలుసు. మన ఇంటికి మీ బంధువులు వస్తారని ఒక రోజు ముందే హేమంత్‌ చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే వాళ్లంతా వచ్చారు'' అని అవంతి చెప్పారు. మాట్లాడేందుకు రావాలని బలవంతం చేస్తే ఇద్దరం బయలుదేరామని చెప్పారు. విడిగా కారులో వస్తామని చెప్పినా ఒప్పుకోలేదని, బలవంతంగా కారులోకి ఎక్కించారని పేర్కొన్నారు.

అనుమానం వచ్చి గోపన్‌పల్లి చౌరస్తా వద్ద కారులోంచి దూకేశామని, ఆ తర్వాత ఇద్దరు రౌడీలతో యుగేంధర్‌రెడ్డి మరో కారులో వచ్చి హేమంత్‌ను కిడ్నాప్‌ చేశారని రోదించారు. ఇక నుంచి హేమంత్‌ తల్లిదండ్రులే తన తల్లిదండ్రులని చెప్పారు.

హేమంత్‌ను హత్యచేసిన నిందితులను కఠినంగా శిక్షించి అవంతికి న్యాయం చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్‌ చేశారు. ఆదివారం హేమంత్‌ కుటుంబసభ్యులకు ఆమె ధైర్యం చెప్పారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా నిందితులకు శిక్షపడేలా చేయాలన్నారు.

ఫేస్ రికగ్నిషన్

ఫొటో సోర్స్, Getty Images

బల్దియా ఎన్నికల్లో ఫేస్‌ రికగ్నిషన్‌ సిస్టం

ఈసారి హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఫేస్‌ రికగ్నిషన్‌ విధానాన్ని అమలు చేయనున్నారని.. దీని ద్వారా దొంగ ఓట్లను ఇట్టేపసిగట్టవచ్చునని ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. జీహెచ్‌ఎంసీ పాలకవర్గం గడువు ఫిబ్రవరి 10న ముగియనుండటంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమవుతున్నది. ఇప్పటికే పోలింగ్‌ అధికారులకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇస్తున్న ఎస్‌ఈసీ.. ఎన్నికల్లో ఫేస్‌ రికగ్నిషన్‌ సిస్టం, 'ఈ ఓటింగ్‌' తదితర సాంకేతికతను వినియోగించాలని ప్రాథమిక నిర్ణయానికి వచ్చింది.

ఈ మేరకు డివిజన్‌కు ఒక కేంద్రంలో ఫేస్‌ రికగ్నిషన్‌ (ముఖ గుర్తింపు) సిస్టంను ఏర్పాటు చేయనున్నది. ఈ ప్రక్రియ విజయవంతమైతే తరువాత జరిగే మున్సిపాలిటీల ఎన్నికల్లో ఈ పరిజ్ఞానాన్ని విస్తృతం చేయాలనే ఆలోచనలో ఉన్నామని ఎన్నికల కమిషన్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

ఇక సీనియర్‌ సిటీజన్స్‌ (పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వేయలేని స్థితిలో ఉన్నవారు), పోలింగ్‌ శాతం తక్కువగా ఉన్న డివిజన్లలోని ఓటర్లు, పోలింగ్‌ అధికారుల కోసం ఈ- ఓటింగ్‌ను తీసుకురానున్నారు. దీని ద్వారా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఉన్న చోటు నుంచే ఓటు వేసే వెసలు బాటు కల్పించనున్నారు.

ఎన్నికల్లో బ్యాలెట్‌లు వాడాలా లేక ఈవీఎంలు వినియోగించాలా అనే విషయంపై రాజకీయ పార్టీలు అభిప్రాయాన్ని తెలిపిన వెంటనే ఈ విషయంలో స్పష్టమైన ప్రకటన చేయనున్నారు.

ఫేస్‌ రికగ్నిషన్‌లో భాగంగా ఓటరు పోలింగ్‌ కేంద్రానికి రాగానే ఫొటో తీసి అప్‌లోడ్‌ చేస్తారు. వచ్చిన వ్యక్తి రోల్‌లో ఉన్న వ్యక్తి ఒక్కరేనా.. కాదా.. అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఒకరి పేరుతో మరొకరు ఓటు వేయడానికి ఆస్కారం ఉండదు. ఓటరు గుర్తింపు కోసం మాత్రమే ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. గత ఏడాది కొంపల్లిలో ఈ ప్రక్రియను ప్రయోగాత్మకంగా చేపట్టారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)