You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హైదరాబాద్ పేలుళ్ల సూత్రధారి... కరాచీలో వీఐపీ -ప్రెస్ రివ్యూ
గోకుల్‌చాట్, లుంబినీ పార్క్ పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ ప్రస్తుతం కరాచీలో ఉన్నాడని, అక్కడ వీఐపీ హోదా అనుభవిస్తున్నాడని ఐక్యరాజ్యసమితి ఫైనాన్షియన్ యాక్షన్ టాస్క్ పోర్స్(ఎఫ్‌ఏటీఎఫ్) నిర్ధారించినట్లు ఆంధ్రజ్యోతి ఒక కథనం ఇచ్చింది.
కర్ణాటకకు చెందిన భత్కల్ నిషేధిత స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా(సిమి)లో సభ్యుడు. తన సోదరులతో కలిసి ఇండియన్ ముజాహిదీన్ సంస్థను స్థాపించి హైదరాబాద్‌లో పేలుళ్లు జరపడమే కాక, దేశంలోని పలు ప్రాంతాలలో విధ్వంసానికి కుట్రపన్నాడు.
అయితే పాకిస్తాన్‌పై ఎఫ్‌ఏటీఎఫ్ ఆంక్షలకు కారణమైన 20మంది ఉగ్రవాదుల్లో రియాజ్ భత్కల్ కూడా ఒకడు. హింసను ప్రేరేపించే వీరందరికీ ఆశ్రయం ఇస్తున్నందున ఎఫ్‌ఏటీఎఫ్ ఇప్పటికే పాకిస్థాన్‌ను ‘గ్రే’ లిస్టులో పెట్టింది.
ఈ ఉగ్రవాదులకు సహకరించడం మానేయాలని ఎఫ్‌ఏటీఎఫ్ పాక్‌ను ఇప్పటికే హెచ్చరించింది. లేదంటే జూన్‌లో జరిగే ప్లీనరీలో బ్లాక్‌లిస్టులో చేరుస్తామని తేల్చి చెప్పింది.
చంద్రబాబు హయాంలో ఏపీ ఫైబర్‌గ్రిడ్‌లో రూ.2000 కోట్ల స్కామ్
ఆంధ్ర ప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో రూ.2000 కోట్ల అవినీతి జరిగిందని, చంద్రబాబు ఆధ్వర్యంలోని ఆ శాఖ ఫైలుపై నారా లోకేశ్ సంతకం చేయడమే ఇందుకు రుజువని సాక్షి పత్రిక ఒక కథనం రాసింది.
ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన వేమూరి హరికృష్ణ ప్రసాద్ నిన్న ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారని, ఈ స్కామ్‌లోని పలు అంశాలను అంగీకరించిన ఆయన తర్వాత మాట మార్చారని ఈ కథనం పేర్కొంది.
చంద్రబాబు శాఖ ఫైలు మీద లోకేశ్ సంతకం వ్యవహారాన్ని హరికృష్ణప్రసాద్ ముందు అంగీకరించి తర్వాత మళ్లీ కాదన్నారని ఈ కథనం పేర్కొంది. బహిరంగ మార్కెట్‌లో రూ.2200 కే దొరుకుతున్న సెట్‌టాప్‌బాక్సులను టీడీపీ ప్రభుత్వం అప్పటి ఆ పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన కంపెనీ నుంచి రూ.4400 కొన్నదని, ప్రభుత్వ ఖజానాకు దీనివల్ల వేల కోట్ల నష్టం వాటిల్లిందని ఈ కథనం వెల్లడించింది.
ఇంటింటికి ఇంటర్నెట్ కోసం చంద్రబాబు ప్రతిష్టాత్మకం ప్రవేశపెట్టిన ఫైబర్ గ్రిడ్ పథకంలో అనేక అవకతవకలు జరిగాయని సాక్షి పత్రిక తన కథనంలో ఆరోపించింది. అయితే తాను సాంకేతిక సలహాలు మాత్రమే ఇచ్చేవాడినని, ఫైబర్ గ్రిడ్ టెండర్ కమిటీలో తానులేనని హరికృష్ణ ప్రసాద్ చెప్పినట్లు సాక్షి పేర్కొంది.
పేటీఎం డేటా చోరీ అయ్యిందా?
పలు చైనా యాప్‌లు భారతీయుల డేటాను దొంగిలిస్తున్నాయని, ఆ సమాచారమంతా ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ అలీబాబా సర్వర్‌లలో నిక్షిప్తమవుతోందని నమస్తే తెలంగాణ పత్రిక రాసింది.
కలర్ ప్రిడిక్షన్ గేమ్ ముసుగులో లక్షలమంది భారతీయుల డేటాను చైనా సంస్థలు దొంగిలించాయని ఈ కథనం పేర్కొంది. బెట్టింగ్ గేమ్‌లు, డేటింగ్ సైట్‌లు, ఫైనాన్షియల్ సర్వీసులను అందించే యాప్‌ల ద్వారా కూడా ఈ డేటా చౌర్యం కొనసాగిందని పేర్కొంది.
కలర్ ప్రిడిక్షన్ గేమ్‌ల పేరుతో బెట్టింగ్ నిర్వహిస్తూ ఢిల్లీలో పట్టుబడ్డ వారి నుంచి జాతీయ విచారణ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) కూపీ లాగడంతో ఈ మోసం బైటపడింది. హైదరాబాద్‌కు కూడా లింకులున్న ఈ కేసులో ఎన్‌ఐఏ, ఈడీ, ఆదాయపు పన్నుశాఖలు విచారణ జరుపుతున్నాయి.
అయితే పేటిఎం డేటా కూడా చోరీ అయ్యిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు నమస్తే తెలంగాణ కథనం పేర్కొంది. ఈ ఆన్‌లైన్ గేమింగ్ వసూళ్లు, చెల్లింపుల్లో పేటీఎం గేట్‌వేను కూడా ఉపయోగిస్తున్నారు. పేటీఎం కంపెనీలో చైనాకు చెందిన అలీబాబా సంస్థకు కూడా వాటాలున్నాయి. ఈ లెక్కన పేటీఎం సమాచారం కూడా అలీబాబాకు చేరిందా అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు నమస్తే తెలంగాణ పత్రిక రాసింది.
ఇవి కూడా చదవండి:
- విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణానికి 9 ఏళ్లు ఎందుకు? ఈ క్రెడిట్ ఎవరిది?
- ‘నా చిన్నప్పుడు తాలిబన్లు మా అమ్మను కొరడాతో కొట్టారు.. ఇప్పుడు బీబీసీ రిపోర్టర్‌గా ప్రశ్నించా’
- అరుణ్ శౌరి: వాజపేయి కేబినెట్లో మంత్రి.. మోదీ ప్రభుత్వం వచ్చాక సీబీఐ కేసులో నిందితుడు ఎలా అయ్యారు?
- మోదీ ప్రభుత్వానికి లక్ష కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ సాధ్యమేనా?
- ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణతో నిరుద్యోగం మరింత పెరుగుతుందా
- హైదరాబాద్ పేరెత్తకుంటే.. కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు వదిలేస్తామని పటేల్ చెప్పింది నిజమేనా?
- మహాత్మా గాంధీ: అహింసతో స్వాతంత్ర్యం సిద్ధించిందన్నది నిజమేనా!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)