యూపీఐ చార్జీలను ప్రజలకు తిరిగిచ్చేయండి.. బ్యాంకులకు సీబీడీటీ ఆదేశం -ప్రెస్ రివ్యూ

ప్రచురణ

భీమ్‌-యూపీఐ, రూపే, యూపీఐ క్యూఆర్‌ కోడ్‌ డిజిటల్‌ విధానాల్లో జరిపిన ఆర్థిక లావాదేవీలపై కస్టమర్ల నుంచి వసూలు చేసిన చార్జీలను తిరిగి వారికి చెల్లించాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) బ్యాంకులను ఆదేశించినట్లు నమస్తే తెలంగాణ ఓ కథనం ప్రచురించింది.

ఈ ఏడాది జనవరి 1 నుంచి వసూలు చేసిన చార్జీలన్నీ తిరిగి ఇచ్చేయాల్సిందేనని ఆదివారం కేంద్రం సర్యులర్‌ జారీచేసింది.

ఈ డిజిటల్‌ చెల్లింపులపై భవిష్యత్తులో కూడా ఎలాంటి చార్జీలు వసూలు చేయరాదని తేల్చిచెప్పింది.

డిజిటల్‌ ఆర్థిక లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం 2019లో ఫైనాన్స్‌ యాక్ట్‌-2019లో సెక్షన్‌ 269ఎస్‌యూను చేర్చింది.

భీమ్‌-యూపీఐ, రూపే- డెబిట్‌కార్డ్‌, యూపీఐ క్యూఆర్‌ కోడ్‌ లావాదేవీలను ఈ సెక్షన్‌ కింద నోటిఫై చేసింది. దాంతో ఈ మార్గాల్లో చేసే చెల్లింపులకు చార్జీలు వసూలు చేయరాదు. కానీ కొన్ని బ్యాంకులు చార్జీలు వసూలు చేస్తుండటంతో సీబీడీటీ తాజా సర్క్యులర్‌ను జారీచేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో రోజుకు మూడు అత్యాచారాలు

ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు జరిగిన నేరాలను పరిశీలిస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో రోజుకు మూడు అత్యాచారాలు జరుగుతున్నట్లు తేలిందని ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది.

''మూడున్నర నెలలు ప్రజలు కరోనావైరస్ లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంటికే పరిమితమయ్యారు. అయినా కూడా అత్యాచారాలు ఏమాత్రం తగ్గలేదు''.

గుంటూరు జిల్లాలో ప్రతి నెల 10 చొప్పున ఆర్నెల్లలో 59 అత్యాచారాలు జరిగాయి. విశాఖ జిల్లాలో 180 రోజుల్లో 90 అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో రాష్ట్రంలోనే విశాఖ అగ్రస్థానంలో ఉంది.

తూర్పు గోదావరి జిల్లా 85 అత్యాచార కేసులతో రెండో స్థానంలో ఉంది. పశ్చిమ గోదావరి(50), ప్రకాశం(40) కేసులు నమోదయ్యాయి.

కరోనావైరస్: తెలంగాణలోని ప్రభుత్వ ఐసీయూల్లో 60 శాతానికి పెరిగిన కేసులు

ఐసీయూల్లో చేరే కొవిడ్‌-19 బాధితుల సంఖ్య ప్రభుత్వ వైద్యంలో గణనీయంగా పెరిగిందని ఈనాడు ఓ కథనం ప్రచురించింది.

గత నెల రోజుల చికిత్సలను పరిశీలిస్తే.. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఐసీయూల్లో చికిత్స పొందుతున్న కరోనావైరస్ బాధితుల శాతం 21 నుంచి 60 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో (జులై 27 నుంచి ఆగస్టు 27 వరకూ) ప్రైవేటు ఆసుపత్రుల్లోని ఐసీయూల్లో చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య దాదాపు 23 శాతానికి పైగా తగ్గడం గమనార్హం.

జీహెచ్‌ఎంసీ పరిధిలోని కొన్ని ప్రముఖ కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో మాత్రం ఐసీయూ పడకల్లో చేరికలు పెద్దగా తగ్గలేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్‌-19 చికిత్సలకు ఐసీయూ పడకల సంఖ్య పెరిగినా కూడా.. మొత్తంగా చూస్తే చేరికల్లో మాత్రం గుర్తింపు స్థాయిలోనే తగ్గుదల కనిపిస్తోంది.

జీహెచ్‌ఎంసీలో కొవిడ్‌-19 కేసుల నమోదు కొంత తగ్గుముఖం పట్టడం.. జిల్లాల్లో కరోనా వైరస్‌ ఉద్ధృతి క్రమేణా పెరుగుతుండడంతో.. గ్రామీణ ప్రజలు స్థానికంగా చికిత్సలు పొందడానికి ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రులపైనే ఆధారపడుతుండటం ఇందుకు కారణమని వైద్యవర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఈనెల 29 నాటికి తెలంగాణలో మొత్తం 31,284 మంది కొవిడ్‌తో చికిత్స పొందుతుండగా.. వీరిలో ఐసొలేషన్‌ కేంద్రాల్లో, ఇళ్లలో చికిత్స పొందుతున్నవారు 24,176 మంది ఉన్నారు.

మిగిలిన 7,108 మందిలో ప్రాణవాయువు అవసరమై.. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోని ఆక్సిజన్‌ సేవల్లో, ఐసీయూల్లో చికిత్స పొందుతున్న వారు 4948(69.61శాతం) మంది ఉన్నారు.

ప్రభుత్వ, ప్రైవేటులో కలుపుకుంటే మొత్తం 3098 పడకలు ఐసీయూలో అందుబాటులో ఉండగా.. వీటిలో ప్రస్తుతం 1582(51శాతం) పడకలు నిండిపోయాయి.

కేవలం ఆక్సిజన్‌ అందించే పడకలు ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి.. 8743 అందుబాటులో ఉండగా. వీటిలో 3366(38.49శాతం) పడకల్లో రోగులు ప్రాణవాయువు పొందుతున్నారు.

మ‌రుగుదొడ్ల‌ను క్లీన్ చేసిన ఆరోగ్య‌శాఖ మంత్రి

పుదుచ్చేరిలో ఆరోగ్య శాఖ మంత్రి మ‌రుగుదొడ్లు క్లీన్ చేసి అంద‌రికి ఆద‌ర్శంగా నిలిచారని వెలుగు పత్రిక ఓ కథనం ప్రచురించింది.

ఇందిరా గాంధీ మెడికల్ కళాశాల క్యాంప‌స్‌లో క‌రోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ ఆరోగ్య‌శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు పర్యటించారు.

మ‌రుగు దొడ్లను శుభ్రం చేయ‌డం లేదంటూ ఆయనకు రోగులు ఫిర్యాదు చేశారు.

దీంతో మంత్రి మ‌ల్లాడి స్వ‌యంగా ఆస్ప‌త్రిలో మరుగుదొడ్లను క్లీన్ చేశారు. ప్ర‌స్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

మ‌రుగుదొడ్లు క్లీన్ చేసిన‌ అనంత‌రం మ‌ల్లాది మాట్లాడుతూ సిబ్బందితో స‌హా ప్ర‌తీ ఒక్క‌రూ ‌జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని, పారిశుద్ధ్య కార్మికుల సాయంతో పరిసరాలు క్లీన్ చేయించాలని యాజమాన్యాన్ని మందలించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)