You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కోవిడ్-19 నుంచి కోలుకున్నాక.. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే... - ప్రెస్ రివ్యూ
కరోనావైరస్ సోకిన సమయం కంటే.. కోలుకున్న తర్వాతి రోజులే అత్యంత కీలకమైనవని వైద్య నిపుణులు చెబుతున్నారని.. అసలు యుద్ధమంతా ఆ తర్వాతే మొదలవుతుందని స్పష్టం చేస్తున్నారని 'ఆంధ్రజ్యోతి' ఒక కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. కోవిడ్-19 నుంచి కోలుకొని 'నెగెటివ్' నిర్ధారణ కాగానే.. ఇక ఆరోగ్యానికి ఢోకా లేదనే అతివిశ్వాసంతో వ్యవహరించడం సరికాదని చెబుతున్నారు. అలా అని భయపడాల్సిన పనిలేదని, కొద్దిపాటి జాగ్రత్త చర్యలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చని సూచిస్తున్నారు.
నెగెటివ్ వచ్చిన తర్వాత కూడా దాదాపు మూడు నెలల పాటు వైద్యుల పర్యవేక్షణలో క్రమం తప్పకుండా మందులు వాడటం మంచిదని అభిప్రాయపడుతున్నారు. ఈక్రమంలో అంతకుముందు నుంచీ ఉన్న ఇతరత్రా వ్యాధులు ముదిరిపోకుండా చూసుకోవడం అత్యవసరమన్నారు. కరోనా నుంచి కోలుకున్నవారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే గుండె, మెదడు, కిడ్నీ వంటి కీలక వ్యవస్థల్లో సమస్యలు తలెత్తే ముప్పు పొంచి ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కరోనా వైరస్ వెలుగుచూసిన తొలినాళ్లలో అది కేవలం న్యూమోనియా తరహా ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని అంతా భావించారు. దాని లక్ష్యం ఊపిరితిత్తులు మాత్రమే అయి ఉండొచ్చని అనుకున్నారు. ఆ తర్వాతే అసలు విషయాలు ఒక్కటొక్కటిగా వెలుగుచూడటం ప్రారంభించాయి.
మెదడు, కళ్లు, చర్మం, కాలేయం, రక్తనాళాలు, గుండె, కిడ్నీలు, పొట్ట, క్లోమం, పేగులనూ అది ప్రతికూలంగా ప్రభావితం చేయగలదని శాస్త్రవేత్తల అధ్యయనాల్లో తేటతెల్లమైంది. తాజాగా దిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) నిపుణులు కూడా ఇదే విషయాన్ని గుర్తుచేశారు. కరోనా వైరస్ ప్రభావితం చేసే శారీరక వ్యవస్థల సంఖ్యపెరిగిన దృష్ట్యా.. ఇన్ఫెక్షన్ లక్షణాల గుర్తింపునకు సంబంధించిన ప్రొటోకాల్‌లో సవరణలు చేయాల్సిన అవసరం ఉందని ఎయిమ్స్ వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు.
యాంటీబాడీలు దీర్ఘకాలిక రక్షణ కల్ల..: కరోనా నుంచి కోలుకున్నంత మాత్రాన.. దాని నుంచి దీర్ఘకాలిక రక్షణ పొందేంత రోగ నిరోధక శక్తిని పొందినట్లు కాదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కరోనా యాంటీబాడీలు కొందరిలో మూడు నెలలు, మరికొందరిలో ఆరు నెలలు క్రియాశీలంగా ఉంటాయని అధ్యయనాల్లో వెలుగుచూసిందని గుర్తుచేశారు.
కొంతమందిలో యాంటీబాడీలు తగినంత వృద్ధి చెందకపోతే మరోసారి ఇన్ఫెక్షన్ వచ్చే ముప్పు ఉంటుందన్నారు. రీఇన్ఫెక్షన్ కేసులు ఇప్పుడిప్పుడే వెలుగుచూస్తున్నాయని చెప్పారు. కరోనా నుంచి కోలుకున్నవారు ఇతరులతో ఐదారు నిమిషాల కంటే ఎక్కువసేపు మాట్లాడొద్దని చెస్ట్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్‌ఖాన్ సూచించారు. ఇన్ఫెక్షన్ రాకముందు ఎలా అప్రమత్తంగా ఉన్నారో.. కోలుకున్న తర్వాతా అలాగే ఉండాలని ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ పేర్కొన్నారు.
వైద్య నిపుణుల సూచనలివీ..: సాధారణంగా కరోనా వైరస్ ఇంక్యుబేషన్ సమయం 14 రోజులేనని వైద్యులు చెప్తున్నారు. ఆ సమయంలో తప్పకుండా వైద్యులు సూచించినన్ని రోజులు పూర్తి కోర్సు మందులు వాడాలి. కోలుకున్న తర్వాత కూడా వైద్యులు సూచించే మందులను క్రమం తప్పకుండా వాడాలి. ఒకవేళ మధ్యలో మందులు ఆపేస్తే వైరస్ మళ్లీ తిరగబెట్టే ప్రమాదం ఉంటుంది.
ఇప్పటికే ఇతర జబ్బులు ఉన్నవారికి.. కరోనా వైరస్ వస్తే ఎప్పటికీ జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా మరోసారి వైరస్ దాడిచేసే ప్రమాదముంది. ఇతర జబ్బులున్న వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటంతో రీఇన్ఫెక్షన్ గండం పొంచి ఉంటుంది. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత 100 మందిలో ఇద్దరికి గుండెపోటు, 100 మందిలో ఒకరికి బ్రెయిన్ స్ట్రోక్ వస్తున్నాయి. కానీ వైరస్ సోకిన 100 మందిలో సుమారు 15 మందికి షుగర్ లెవల్స్ భారీగా పెరుగుతున్నాయి. కరోనా తగ్గిపోయిన తర్వాత షుగర్ కంట్రోల్ కావడం లేదు.
ఒకవేళ మెదడుపై వైరస్ ప్రభావం పడితే 10 రోజుల వరకూ ఎలాంటి మందులు వాడినా జ్వరం తగ్గదు. ఈ పరిస్థితిలో వెంటనే సీఎస్ఎఫ్ అనాలసిస్ చేయించుకుంటే విషయం బయటపడుతుంది. ఈ తరహా లక్షణాలున్న వారు వెంటనే ఆస్పత్రిలో చేరడం మంచిది. రక్తాన్ని చిక్కబడేలా చేసే గుణం కరోనా వైర్‌సకు ఉండడంతో రక్తం సరఫరాలో ఆటంకాలు ఏర్పడి ఆకస్మాత్తుగా గుండె ఆగిపోవడం, బ్రెయిన్ స్ట్రోక్ వంటివి చోటు చేసుకోవచ్చు.
మందులు ఆపగానే.. బరువెక్కిన గుండె: కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన 29 ఏళ్ల వైద్యుడికి జూలైలో పాజిటివ్ తేలింది. ఓ ఆస్పత్రిలో 19 రోజుల చికిత్స తర్వాత ఆయన డిశ్చార్జి అయ్యారు. డాక్టర్లు సూచించిన మందులను ఆయన వారం పాటు వాడారు. ఆ తర్వాత మానేశారు. దీంతో రెండు వారాలు గడిచాక.. ఆయనకు గుండె బరువెక్కినట్లు అనిపించింది. వెంటనే వైద్యులను సంప్రదించారు. అన్ని పరీక్షలు చేసిన వైద్యులు, శరీరంలో రక్తం చిక్కపడినట్లు గుర్తించారు. రక్తం చిక్కపడటంతో గుండె పంపింగ్‌పై భారం పడి గుండెపోటుకు దారి తీసిందని వైద్యులు నిర్ధారించారు. ఆ వెంటనే రక్తం పలచపడే మందులిచ్చి పంపించారు.
వైరస్ సోకిందనగానే.. మతిభ్రమణం: పశ్చిమగోదావరి జిల్లాలోని ఒక కుటుంబంలో తండ్రి, కొడుకులు ఇద్దరికీ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయం తెలిసిన వెంటనే తండ్రి మతిస్థిమితం కోల్పోవడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. కరోనావైరస్ మెదడుపై దాడి చేసిన సందర్భాల్లో బ్రెయిన్ స్ట్రోక్ రావడం, మతిస్థిమితం కోల్పోవడం వంటివి తలెత్తవచ్చని అధ్యయనాల్లో వెలుగుచూసింది. ఈక్రమంలోనే సదరు వ్యక్తి మానసిక స్థితి గతి తప్పి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. విజయవాడలోని ఒక ప్రముఖ కోవిడ్ ఆస్పత్రిలో ఇలాంటివి రెండు కేసులు నమోదయ్యాయి.
రెండు వారాలకోసారి డాక్టర్‌ను సంప్రదించాలి: ''కరోనాను కేవలం 14 రోజుల జబ్బుగా మాత్రమే అందరూ పరిగణిస్తున్నారు. కానీ ఈ వైరస్ శరీరంలో నుంచి పూర్తిగా బయటకుపోవడానికి మూడు నెలల సమయం పడుతుంది. ఈలోగా ఎలాంటి సమస్యలైనా తలెత్తొచ్చు. కాబట్టి కరోనా తగ్గి డిశ్చార్జి అయిన తర్వాత కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. రెండు వారాలకు ఒకసారి వైద్యులను సంప్రదిస్తే మంచిది'' అని పల్మనాలజిస్ట్ డాక్టర్ రఘురాం సూచించారు.
అప్రమత్తతే శ్రీరామ రక్ష: ''ఇతరత్రా జబ్బులు ఉన్నవారికి ఒక్కసారి కరోనా వస్తే ఎప్పటికీ జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా మరోసారి వైరస్ దాడి చేసే ప్రమాదం ఉంటుంది. గుండె, కిడ్నీ, మధుమేహం, కాలేయం, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వాళ్లు అదనపు అప్రమత్తతతో వ్యవహరించాలి. ప్రస్తుత తరుణంలో అప్రమత్తతే శ్రీరామరక్ష'' అని కేర్ ఆస్పత్రి జనరల్ ఫిజీషియన్ డాక్టర్ నవోదయ చెప్పారు.
కేపీ (కృష్ణాపురం) ఉల్లికి అంతర్జాతీయ ఖ్యాతి...
ఎన్నో ఏళ్లుగా విదేశాలకు ఎగుమతి అవుతూ, ప్రత్యేకతను సంతరించుకున్నా అభివృద్ధిలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్న కృష్ణాపురం (కేపీ) ఉల్లి పంటకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే భౌగోళిక గుర్తింపు లభించిందని.. దీంతో పంట అభివృద్ధికి బంగారుబాట ఏర్పడిందని 'సాక్షి' ఓ కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. కృష్ణాపురం ఉల్లి పంటకు అరబ్ దేశాల్లో గిరాకీ ఉంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ పంటకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ కల్పించింది. దీంతో రైతులు, రైతు సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలుసార్లు కేపీ ఉల్లికి గుర్తింపు ఇవ్వాలని విన్నవించడంతోనే ఇది సాధ్యమైందని రైతులు అంటున్నారు.
బ్రిటీష్ వైశ్రాయ్‌ల పరిపాలనా కాలంలో కేపీ ఉల్లి విదేశాలకు ఎగుమతి అవుతూ వస్తోంది. మద్దతు ధర కల్పించాలని, పంట కనుమరుగై పోకుండా కాపాడాలని రైతు సంఘాలు పోరాటాలు చేశాయి. అయినా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేపీ ఉల్లి పంటకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్) వచ్చేలా సహాయ సహకారాలు అందించారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక విదేశీ ఎగుమతులకు ఢోకా ఉండదని, పంట పండినట్లేనని రైతులు అంటున్నారు.
మైదుకూరు ప్రాంతం నుంచి కడపకు వచ్చే కేసీ కెనాల్ ద్వారా ఉల్లిగడ్డలు కడప సమీపంలోని కృష్ణాపురం రైల్వేస్టేషన్ వరకు పడవల ద్వారా రవాణా అయ్యేవని పెద్దలు సాహితీ వేత్త విద్వాన్ కట్టా నరసింహులు చెప్పారు. అక్కడి నుంచి నాటి మద్రాసు నేటి చెన్నై ఓడరేవు వరకు రైలులో వెళ్లేదన్నారు. అక్కడి నుంచి బ్రిటీషు వాళ్లు వారి దేశానికి ఎగుమతి చేసుకునే వారన్నారు. కేపీ ఉల్లిగడ్డలను మందులలో ముడి పదార్థంగా వాడతారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
బ్రిటీష్ కాలం నాటి నుంచి పంట సాగు..: బ్రిటీష్ వారి పరిపాలనా కాలం నుంచి కర్ణాటకలో మొదలై అనంతపురం, కర్నూలు, వైఎస్సార్, ప్రకాశం జిల్లా మార్కాపురం వరకు ఈ పంట సాగవుతూ చిట్టిబళ్లారి, చిన్న బళ్లారి, రెడ్‌లేడీ, అగ్రిబ్రౌన్ రోజ్‌గా రూపాంతరం చెందింది. కేపీ ఉల్లిగా పేరు తెచ్చుకుని విస్తరించింది. రాయలసీమ జిల్లాల్లోని అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో లక్షల హెక్టార్లలో ఏటా సాగవుతూ ఉండేది. అయితే మన ప్రభుత్వాలు పంట దిగుబడిని ఎగుమతులు ఇవ్వకుండా మొండికేస్తూ వచ్చాయి. ధరలు పతనమవుతూ రావడంతో రైతులు పంట సాగు చేయడం తగ్గిస్తూ వచ్చారు.
అయితే వైఎస్సార్ జిల్లాలోని మైదుకూరు కేంద్రంగా మైదుకూరు, ఖాజీపేట, దువ్వూరు, బ్రహ్మంగారి మఠం, సింహాద్రిపురం, వీరపునాయునిపల్లె, కలసపాడు, పోరుమావిళ్ల, కాశినాయన మండలాలు, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని మండలాలు, ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలోని మండలాల్లో మాత్రమే సాగవుతోంది.
రాజాసింగ్ వర్సెస్ సిటీ పోలీసు కమిషనర్.. 'సెక్యూరిటీ వార్'!
భారతీయజనతా పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోధా, హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్‌ల మధ్య సెక్యూరిటీ అంశాలకు సంబంధించి కోల్డ్ వార్ మొదలైందని 'సాక్షి' ఒక కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలంటూ ఎమ్మెల్యేకు కొత్వాల్ లేఖ రాయగా, అసలు ఆ ముప్పు ఎవరి నుంచో చెప్పాలంటూ రాజాసింగ్ నిలదీయడంతో పోలీసు శాఖకు చిక్కొచ్చి పడింది. అలాగే పోలీసు కమిషనర్ రాసిన రహస్య (కాన్ఫిడెన్షియల్) లేఖ సైతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టింది. కొన్ని గంటల తర్వాత ఆ లేఖ అనుకోకుండా బయటకు వచ్చిందని ప్రచారమైంది.
తెలంగాణలో బీజేపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్‌కు గతం నుంచే ముప్పు పొంచి ఉందని పోలీసు అధికారులు చెపుతున్నారు. అయితే అది ఇటీవలి కాలంలో మరింత తీవ్రమైందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే మిగతా ఎమ్మెల్యేలకు లేని విధంగా ఆయనకు బుల్లెట్ ఫ్రూఫ్ (బీపీ) కారు సమకూర్చాలని నిఘా విభాగం అధికారులు సిఫారసు చేశారు.
ఇటీవల ముప్పు తీవ్రమైన నేపథ్యంలోనే రాజాసింగ్ భద్రతాధికారుల్ని అప్రమత్తం చేయడంతో పాటు ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షిస్తున్నామని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బందికి ఎప్పటికప్పుడు అదనపు సూచనలు, శిక్షణ కూడా ఇస్తూ పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు.
అయితే ఆయన పలు మార్లు కారును వదిలి ద్విచక్ర వాహనంపై ప్రజల్లోకి వెళ్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని చెప్తున్నారు. దీనివల్ల మరింత ముప్పు ఉందని, తాము అందించిన బీపీ కారునే వాడాలని, భద్రతకు సంబంధించి అంశాల్లో తమకు సహకరించాలని సూచిస్తూ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఈ నెల 24న ఎమ్మెల్యేకు ఓ కాన్ఫిడెన్షియల్ లేఖ రాశారని తెలుస్తోంది. అయితే ఇందులోని తేదీని ఈ నెల 28వ తేదీగా మార్ఫ్ చేసిన కొందరు వ్యక్తులు దానిని సోషల్ మీడియాలో పెట్టారు. ఇది శనివారం హల్‌చల్ చేసింది.
బుల్లెట్‌పైనే తిరుగుతా..: ఇదిలా ఉండగా ఈ అంశంపై రాజాసింగ్ తనదైన శైలిలో స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు ఎవరి వల్ల ముప్పు పొంచి ఉందో, ఆ విషయాన్ని పోలీసులు తక్షణం బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కొన్నేళ్లుగా తనకు ఉగ్రవాదులతో పాటు పాకిస్తాన్‌కు చెందిన వారి నుంచి బెదిరింపులు వస్తున్నాయని అన్నారు. తాను ప్రజల మనిషినని, ప్రజలను కలుసుకోవడానికి బుల్లెట్ వాహనంపై తిరుగుతానని స్పష్టంచేశారు. తనకు ఎవరి నుంచి ముప్పు ఉందో తెలపాలని కోరుతూ డీజీపీ, హోంమంత్రి, ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రికి కూడా లేఖలు రాస్తున్నట్లు చెప్పారు.
జమిలి ఎన్నికలపై మోదీ సర్కారు కసరత్తు!
దేశమంతటా కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న వేళ.. తన ఎజెండాలోని ఒక్కో అంశాన్నీ పూర్తి చేసుకుంటూ వస్తున్న మోదీ సర్కార్.. తాజాగా జమిలి ఎన్నికలపై కసరత్తును ప్రారంభించిందని.. దీంట్లో భాగంగా.. లోక్‌సభ, అసెంబ్లీ, లోకల్‌బాడీలకు ఒకే ఓటర్ల జాబితాను సిద్ధం చేసే అంశంపై ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఇటీవల ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిందని 'నమస్తే తెలంగాణ' ఒక కథనంలో చెప్పింది.
ఆ కథనం ప్రకారం.. ఈ నెల 13న జరిగిన ఈ సమావేశంలో ఏకీకృత జాబితా తయారీపై రెండు అవకాశాల గురించి చర్చించినట్టు జాతీయ మీడియా శనివారం వెళ్లడించింది. ఏకీకృత ఓటర్ లిస్టు తయారీ కోసం రాజ్యాంగంలోని 243కే, 243జెడ్‌ఏ ఆర్టికల్స్‌కు సవరణలు చేయటం మొదటి అంశం కాగా, భారత ఎన్నికల సంఘం (ఈసీ) రూపొందించే ఓటర్ల జాబితానే మున్సిపల్, పంచాయతీ ఎన్నికలకు కూడా తీసుకోవాలని రాష్ట్రాలను కోరటం రెండో అంశం.
బీజేపీ ఎన్నికల హామీ..: ప్రస్తుతం లోక్‌సభ, అసెంబ్లీలకు ఓటర్ లిస్టును ఈసీ రూపొందిస్తుండగా, స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్రాల ఎన్నిక సంఘాలు ఓటర్ జాబితాను సిద్ధం చేస్తున్నాయి. వీటి మధ్య చాలా తేడాలు ఉంటుండటంతో వివాదాలు ఏర్పడుతున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో కామన్ ఓటర్ లిస్టు తయారుచేస్తామని బీజేపీ తన ఎన్నికల హామీల్లో పేర్కొంది.
జమిలి సులువు కాదు: కామన్ ఓటర్ లిస్టు తయారు చేసినంత తేలికగా పార్లమెంటు, అసెంబ్లీ, లోకల్‌బాడీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించటం సాధ్యంకాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలతోపాటే ఐదేండ్లకోసారి అసెంబ్లీలకు కూడా ఎన్నికలు నిర్వహించటానికి అన్ని రాష్ర్టాలను ఒప్పించటమే కాక విశాల దృష్టితో ఏకాభిప్రాయం సాధించాల్సి ఉంటుందని మాజీ ఎన్నికల కమిషనర్లు పేర్కొంటున్నారు. పలు రాష్ర్టాల్లో ప్రాంతీయపార్టీలు అధికారంలో ఉన్నందున.. ఏకాభిప్రాయ సాధన కష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు.. బలవంతంగా గుండు గీయించారు’
- కృష్ణా జలాలు కడలి పాలు.. రాయలసీమలో కరవు కష్టాలు.. ఎందుకిలా? పరిష్కారం లేదా?
- పార్టీ సమావేశంలో ప్రత్యక్షమైన కిమ్ జోంగ్ ఉన్... ఇంతకీ ఆయనకేమైంది?
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- చైనాను ఎదుర్కోవడంలో భారత్ ముందున్న ‘సైనిక ప్రత్యామ్నాయాలు’ ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)