You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గోదావరి నది వరదలో 40 మండలాలు, 99 గ్రామాలకు నిలిచిపోయిన కరెంటు సరఫరా - ప్రెస్ రివ్యూ
గోదావరి మహోగ్ర రూపం దాల్చిందని.. వరద ప్రవాహానికి పోలవరం ప్రాజెక్టు ఎగువన ఉన్న గిరిజన గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయని. గిరిజనులు కొండలపైకి ఎక్కి తలదాచుకున్నారని 'ఆంధ్రజ్యోతి' ఒక కథనంలో చెప్పింది.
ఆ కథనం ప్రకారం.. ఉభయ గోదావరి జిల్లాల్లోని గోదావరి పరివాహక లంక గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. లక్షలాది ఎకరాల్లోని వరి, అరటి, కంద పంటలు నీటమునిగాయి. ఏజెన్సీలోని ఏడు విలీన మండలాలతోపాటు దేవీపట్నం మండలంలోని 33 గ్రామాల్లోకి నీరు చేరింది.
భద్రాచలంలో మూడో ప్రమాద హెచ్చరిక, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారని. ధవళేశ్వరంలో మూడో హెచ్చరిక దిశగా ప్రవాహం సాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజి నుంచి 15,85,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.
ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 40 మండలాలపై వరద ప్రభావం ఉంది. ఏజెన్సీలోని ఏడు విలీన మండలాలతో పాటు దేవీపట్నం మండలంలోని 33 గ్రామాలు మునిగిపోయాయి. తూర్పు గోదావరి జిల్లాలో 99 గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయి.
పోలవరం దిగువన సీతానగరం, కడియం లంకలు, ఆలమూరు, కె.గంగవరం, ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, పి.గన్నవరం, అంబాజీపేట, అయినవల్లి, ముమ్మిడివరం, ఐ.పోలవరం, అల్లవరం, మామిడికుదురు, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాలతోపాటు పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం, రూరల్, యలమంచిలి, ఆచంట, పెనుగొండ, పెరవలి, నిడదవోలు రూరల్, కొవ్వూరురూరల్, తాళ్లపూడి, పోలవరం తదితర మండలాల్లోని లంకల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉంది.
వరద ఉధృతితో పోలవరం పనులు పూర్తిగా నిలిపివేశారు. కాఫర్‌డ్యామ్ వద్ద అత్యధికంగా నీటిమట్టం నమోదైంది. దేవీపట్నం మండలంలోని బాధితులకు ఆహారం, మంచినీరు, పాలువంటి సౌకర్యాలను ఏర్పాటు చేయలేదు. ప్రజలు పిల్లా పాపలతో కొండలపైకి చేరి ఇబ్బందులు పడుతున్నారు.
బలహీనంగా గట్లు..: ఉభయ గోదావరి జిల్లాల్లోని గోదావరి ఏటిగట్ల పొడవు 532 కిలోమీటర్లు. బ్యారేజీ నుంచి 36 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చేవరకూ గట్లు తట్టుకుంటాయని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. కానీ, కాఫర్‌డ్యామ్ దిగువన నక్లస్ బండ్ బలహీనంగా ఉంది. కూళ్ల, సుందరపాలెం ఏటిగట్టు బలహీనంగా ఉండగా, కోరంగి, యానాం అవుట్‌ఫాల్ స్లూయిజ్‌ల సమస్య కూడా ఉంది.
పోలవరం సహా పలు గ్రామాలు ఖాళీ: పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం సహా పలు గ్రామాల్లోని ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. పోలవరం గ్రామంలో నెక్లెస్ బండ్ బలహీనపడటంతో అక్కడక్కడ ఇసుక బస్తాలు వేశారు. కొత్తూరు, కోండ్రుకోట, మాధవరం, వాడపల్లి గ్రామాల్లోనూ నీరు చేరడంతో అప్రమత్తం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతమంతా నీట మునిగింది. ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
వేలేరుపాడులోని 23 గ్రామాలూ నీటమునిగాయి. అధికారులు మరబోట్లలో తిరుగుతూ అప్రమత్తం చేస్తున్నారు. కొవ్వూరులోని గోష్పాదక్షేత్రం పూర్తిగా నీటమునిగింది. లంకల్లోని వారంతా పశువులను తీసుకుని ఒడ్డుకు చేరుకున్నారు. పశ్చిమ గోదావరి కలెక్టర్ ముత్యాలరాజు పోలవరంను సందర్శించారు. అత్యవసర సహాయక చర్యల కోసం తూర్పుగోదావరి జిల్లాకు రెండు, పశ్చిమగోదావరి జిల్లాకు రెండు ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను తరలించారు.
ప్రకాశం బ్యారేజీకి వరద: కృష్ణా నదిలోనూ వరద ప్రవాహం పెరుగుతోంది. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు వాగుల నుంచి వరద నీరు జోరుగా వస్తోంది. ప్రకాశం బ్యారేజీ 70 గేట్లను ఎత్తి 1,18,250 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. వైరా, కట్టలేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దొడ్డదేవపాడు కాజ్‌వేపై నుంచి నీరు ప్రవహిస్తోంది. చిలుకూరు-పల్లెంపల్లి, నందిగామ మధ్య రాకపోకలు నిలిపోయాయి.
తుంగభద్ర నుంచి నీరు విడుదల..: తుంగభద్ర జలాశయం నీటి నిల్వలు 98 టీఎంసీలకు చేరుకోవడంతో ఆదివారం రాత్రి 3 గేట్లు ఎత్తి 4,539 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేశారు. ముందుగా బళ్లారి, కర్నూలు జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు.
శ్రీశైలంలో నీటిమట్టం 870 అడుగులు..: శ్రీశైలం జలాశయానికి జూరాల ప్రాజెక్టు నుంచి 1,21,270 క్యూసెక్కుల వరద చేరుతోంది. మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 870 అడుగులకు చేరింది.
విశాఖ మన్యంలో పొంగి ప్రవహిస్తున్న గెడ్డలు: విశాఖ ఏజెన్సీలోని ముంచంగిపుట్టు, చింతపల్లి, జి.మాడుగుల, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లో భారీ వర్షానికి గెడ్డలు పొంగి ప్రవహిస్తుండగా, పంట పొలాలు నీటిలో మునిగాయి. జలాశయాల్లో నీటిమట్టాలు గరిష్ఠస్థాయికి చేరువలో ఉన్నాయి. సీలేరు నదిపై డొంకరాయి జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుండంతో 37 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
రూ. కోట్లలో పంట నష్టం: కర్నూలు జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రూ.కోట్ల విలువన పంటలు దెబ్బతిన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో 15 మండలాల పరిధిలో 65 గ్రామాల్లో 1460 హెక్టార్ల మేర వరిపంట నీట మునిగింది. నెల్లిపాక, కూనవరం మండలాల్లో ప్రత్తిపంట మునిగింది.
2013 తర్వాత ఇదే పెద్ద వరద..: 2013లో ధవళేశ్వరం బ్యారేజీ నీటిమట్టం 19 అడుగులకు చేరగా, 21,18,170 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వదిలారు. అంతకు ముందు 1986లో 35,06,380 క్యూసెక్కులు, 2006లో 28,50,664 క్యూసెక్కులు, 1990లో 27,81,220 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చింది. ఆ తర్వాత ఎప్పూడూ 22 లక్షలకు మించి రాలేదు.
తెలంగాణ: ముసురులో ముద్దవుతున్న రాష్ట్రం.. చిగురుటాకులా వరంగల్
వారం రోజులుగా ముసురుకున్న వానకు తెలంగాణ రాష్ట్రం తడిసి ముద్దవుతున్నదని.. అనేక వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు అలుగు దుంకుతున్నాయని 'నమస్తే తెలంగాణ' ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. అనేక ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో వర్షాల పరిస్థితిపై ఆదివారం ఆరాతీసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. మంత్రులతో మాట్లాడి జిల్లాల్లోనే ఉండి సహాయ చర్యలు చేపట్టాలని సూచించారు. సీఎస్‌తో మాట్లాడి వెంటనే కంట్రోల్ రూం ఏర్పాటుచేయాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన సీఎస్ సోమేశ్‌కుమార్ రాష్ట్రస్థాయి కంట్రోల్ రూంను ఏర్పాటుచేశారు. ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా 040-23450624కు కాల్‌చేయాలని సూచించారు.
వరంగల్ జిల్లాలో వరద తీవ్రత దృష్ట్యా మూడు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరిస్థితిని గమనించిన సీఎం కేసీఆర్.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో ప్రత్యేకంగా మాట్లాడి ఎప్పటికప్పుడు తగిన సూచనలు సలహాలు ఇచ్చారు. ఇతర జిల్లాల మంత్రులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
వరంగల్‌లో పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి 3,500 మంది ముంపు బాధితులకు అక్కడికి తరలించారు. గోదావరి వరద ముంపునకు గురైన ములుగు, భద్రాధ్రి కొత్తగూడెం జిల్లాల ప్రజలకు పునరావాసం కల్పించారు. మంత్రి పువ్వాడ అజయ్ భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతిని పరిశీలించి అధికారులకు తగిన సూచనలుచేశారు. మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్, గార్ల, రాంపూర్ ప్రాంతాల్లో పర్యటించారు.
మున్నేరు వాగు వరద ముంపు ప్రాంతాల ప్రజలను సమీపంలోని పాఠశాలలకు తరలించి, అహార పదార్థాలు అందించారు. మంత్రులు నిత్యం జిల్లాస్థాయి, స్థానిక అధికారులతో ఫోన్‌లో మాట్లాడుతూ తగిన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. చెరువులు, కుంటల కట్టలు తెగకుండా అధికారులను అప్రమత్తంచేస్తున్నారు.
అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూంలు: అన్ని జిల్లాల్లో కలెక్టర్లు ప్రత్యేకంగా కంట్రోల్ రూంలను ఏర్పాటుచేశారు. జిల్లాస్థాయి అధికారులంతా హెడ్ క్వార్టర్‌లోనే ఉండాలని ఆదేశించి, వారికి బాధ్యతలు అప్పగించారు. రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపకశాఖలతోపాటు ఇతర విభాగాల అధికారుల సమన్వయంతో సహాయక చర్యలు చేపడుతున్నారు. సూర్యాపేట జిల్లా కేటీ అన్నారం వద్ద మూసీ నదిలో కొట్టుకుపోతున్న ముగ్గురు యువకులను జిల్లా యంత్రాంగం రక్షించింది. రాష్ట్రంలో 10 ఏండ్ల తర్వాత మళ్లీ ఆ స్థాయి వరదలు వస్తున్నాయి.
చిగురుటాకులా వరంగల్: వరద బీభత్సానికి వరంగల్ చిగురుటాకులా వణికిపోతున్నది. నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద నీరు కాలనీలను ముంచెత్తింది. వర్షం ఓ మోస్తరుగానే ఉన్నా.. వరద ఉధృతి తగ్గడం లేదు. వరంగల్-కరీంనగర్ ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతవాసులకు కంటిమీద కునుకులేకుండాపోయింది. మంత్రులు, ఎమ్మెల్యేలు సహా అధికార యంత్రాంగం మొత్తం వరద సహాయ చర్యల్లో నిమగ్నమైంది. నగరంలో 13 పునరావాస శిబిరాలు ఏర్పాటుచేసి, 3,200 మందిని తరలించారు.
పల్లెల్లో తగ్గుతున్న జనాభా.. పెరుగుతున్న పట్టణ జనం
దేశంలో పట్టణ జనాభా గణనీయంగా పెరుగుతోందని.. రానున్న కాలంలో ఇది రికార్డు స్థాయిలో ఉండనుందని 'నేషనల్ కమిషన్ ఆన్ పాప్యులేషన్' తన తాజా నివేదికలో వెల్లడించినట్లు 'సాక్షి' ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. కేంద్ర ఆరోగ్య - కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఈ సంస్థ దేశ జనాభాపై నిర్వహించిన అధ్యయనంలో.. 2011-21తో పోలిస్తే 2021-36లో దేశ జనాభా పెరుగుదల రేటు బాగా తగ్గనుందని చెప్పింది. అయితే, మొత్తం జనాభాలో మాత్రం భారత దేశం చైనాను అధిగమించి మొదటి స్థానానికి చేరుకోనుంది.
నివేదికలోని మరిన్ని ప్రధాన అంశాలను పరిశీలిస్తే...
పల్లెల్లో తగ్గుతున్న జనాభా
- 2011తో పోలిస్తే 2036 నాటికి దేశంలో పట్టణ జనాభా 57 శాతం పెరగనుంది.
- 2011లో 37.70 కోట్లుగా ఉన్న పట్టణ జనాభా 2036 నాటికి 59.40 కోట్లకు చేరుకోనుంది. అంటే, 31 నుంచి 39 శాతానికి చేరుకుంటుంది.
- ఇక 2011లో 69 శాతంగా ఉన్న గ్రామీణ జనాభా 2036 నాటికి 61 శాతానికి తగ్గుతుంది.
- దిల్లీ జనాభాలో 98 శాతం పట్టణ జనాభా ఉండగా 2036 నాటికి 100 శాతానికి చేరుకుంటుంది. తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్‌లలో 50 శాతానికి పైగా జనాభా పట్టణాల్లోనే ఉంటుంది. ఏపీలో పట్టణ జనాభా 42 శాతానికి చేరుకుంటుంది.
ఉత్తరాదిలోనే పెరుగుదల.. దక్షిణాదిలో నియంత్రణ
ఎప్పటి మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌తో సహా దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో ముందంజలో ఉన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లోనే జనాభా పెరుగుదల అధికంగా ఉండనుంది.
- ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు జనాభా పెరుగుదలలో మొదటి రెండు స్థానాల్లో ఉండనున్నాయి. పెరిగే జనాభాలో 36 శాతం ఆ రాష్ట్రాల్లోనే ఉండనుంది.
- ఇక 2011లో ప్రతి 1,000 మంది పురుషులకు 943 మందిగా ఉన్న స్త్రీలు , 2036 నాటికి 952 మందికి చేరుకోనున్నారు. కాగా ఏపీ, తమిళనాడు, కేరళలో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ మంది ఉంటారు.
2036 నాటికి 152 కోట్ల జనాభా
- దేశ జనాభా 2021 నాటికి 136 కోట్లకు, 2031 నాటికి 147 కోట్లకు, 2036 నాటికి 152 కోట్లకు చేరుతుంది.
- 2011-21లో దేశ జనాభా పెరుగుదల రేటు 12.5 శాతం ఉంటుందని కమిషన్ పేర్కొంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇదే అతి తక్కువ జనాభా పెరుగుదల రేటు. కాగా, 2021-31లో దేశ జనాభా పెరుగుదల రేటు 8.4 శాతానికి తగ్గుతుంది.
అమెరికా హెచ్1బి వీసాలకు అభ్యర్థుల కొరత
అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలుకనే వారి ఆశలు చిగురించాయని.. ఉద్యోగం కోసం మరో దఫా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లభించనుందని 'ఈనాడు' ఒక కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. 2021కి గాను హెచ్1బి ఉద్యోగాలకు చాలినంతమంది ఎంపిక కాకపోవటంతో లాటరీ ద్వారా ఇంకోసారి అభ్యర్థులను ఎంపిక చేయాలని అమెరికా సూత్రప్రాయంగా నిర్ణయించింది.
ఒక ఏడాదిలో ఉద్యోగాలకు రెండుసార్లు లాటరీ ద్వారా ఎంపిక చేయడం ఇదే తొలిసారని నిపుణులు అంటున్నారు. వారంలో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.
ఏటా 85 వేల మందికి వీసాలు: అమెరికాలో హెచ్1బి వీసాపై ఉద్యోగం చేసేందుకు అభ్యర్థులను ఏటా లాటరీ ద్వారా ఎంపిక చేస్తుంది. ప్రతి ఏటా 85 వేల మందికి ఇలా వీసాలను అమెరికా జారీ చేస్తుంది.
2021 కోసం మార్చిలో సుమారు 2.67 లక్షల దరఖాస్తు చేసుకోగా లాటరీ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసింది. ఆయా కంపెనీలు ఉద్యోగార్థుల పక్షాన వీసా కోసం పిటిషన్లను ఏప్రిల్ నుంచి జూన్ మధ్య దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కరోనా తీవ్రతతో అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య లక్షలు దాటడంతో హెచ్1బి వీసాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలు విధించారు. దాంతో కొన్ని కంపెనీలు నియామకాలను పరిమితం చేసుకున్నాయి.
అందువల్ల 85 వేల హెచ్1బి వీసాలు జారీ చేసేందుకు చాలినన్ని పిటిషన్లు అందలేదు. గతంలో విధించిన ఆంక్షలను సడలిస్తూ ట్రంప్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే వీసాలు ఉన్న వారు యథావిథిగా అమెరికా వచ్చేందుకు అనుమతి ఇచ్చారు.
వీసాల కోసం పూర్తి స్థాయిలో దరఖాస్తులు రాకపోవటంతో మరోసారి లాటరీ ద్వారా ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎంతమందిని ఎంపిక చేస్తారన్న అంశంపై స్పష్టత లేదు.
ఇవి కూడా చదవండి:
- బాల గంగాధర్ తిలక్: కుల వివక్షను, స్త్రీల అణిచివేతను బలంగా సమర్థించారా?
- ‘ఆలయ ప్రవేశాన్ని సమర్థించిన గాంధీ హరిజన బాంధవుడేనా?’
- కరెన్సీ నోట్ల మీదకు గాంధీ బొమ్మ ఎప్పుడు వచ్చింది...
- కొత్త పన్ను విధానంతో వేతన జీవులకు లాభమేనా
- లాక్డౌన్లో భారత పురుషులు ఇంట్లో ఒళ్లు వంచి పనిచేశారా?
- గాంధీ బ్రహ్మచర్య ప్రయోగాల గురించి మనూ గాంధీ డైరీల్లో ఏముంది
- చైనా - భారత్ సరిహద్దు సంఘర్షణ: 21వ శతాబ్దపు అతిపెద్ద జగడం ఇదేనా?
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- ‘నీకు జీవితంలో తోడు దొరకదని శకుంతల దేవి చెప్పారు.. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాను’
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- ఆనందం కోసం 'సెక్స్'ను ఆశ్రయించకుండా మహిళలు నిగ్రహం పాటించాలని గాంధీ ఎందుకన్నారు?
- చనిపోయిన భార్య 'సజీవ' ప్రతిరూపంతో గృహప్రవేశం... జీవిత భాగస్వామిపై ప్రేమను చాటుకున్న తెలుగు పారిశ్రామికవేత్త
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)