హైదరాబాద్ నగరంలో రెండంతస్తుల భారీ స్కైవేలు - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, ArvindkumarIAS/Twitter
హైదరాబాద్ నగరానికి రెండు భారీ స్కైవేలు రానున్నాయని ఆంధ్రజ్యోతి కథనం ఇచ్చింది. 2024 సంవత్సరం నాటికి నగరం అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ స్కైవేలు నిర్మించాలని హెచ్‌ఎండీఎ ప్రణాళికలు వేస్తున్నట్లు ఈ కథనం పేర్కొంది.
జీ ప్లస్ 2 పద్దతిలో రోడ్డు, ఫ్లైఓవర్ కమ్ మెట్రో కారిడార్ నిర్మాణానికి ప్లాన్లు సిద్ధం చేసింది హెచ్‌ఎండీఎ. జూబ్లీ బస్టాండ్ నుంచి శామీర్‌పేట, ప్యారడైజ్ నుంచి కొంపల్లి ఆర్వోబీ వరకు ఈ స్కైవేల నిర్మాణానికి కసరత్తులు జరుగుతున్నాయి.
ఈ రెండు కారిడార్లకు ఖర్చు రూ.5వేల కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. భూసేకరణకే రూ.1000 కోట్లు అవుతుందని అంచనా వేశారు అధికారులు. నగరానికి అన్నివైపులా అభివృద్ధికి రూపొందించిన లుక్ ఈస్ట్ పాలసీకి అనుగుణంగా ఈ స్కైవే ప్రాజెక్టు ఉంటుందని చెబుతున్నారు.
పీవీ నరసింహారావు క్స్ ప్రెస్‌వే తరహాలో ఈ డబుల్ డెక్కర్ హైవేకు మధ్య మధ్యలో ఎక్కేందుకు, దిగేందుకు ర్యాంపులు నిర్మిస్తారు. కింది ఫ్లోర్‌లో రోడ్డు, రెండో ఫ్లోర్‌లో మెట్రో రైలు ఉండేలా ప్లాన్ సిద్ధం చేశారు. జేబీఎస్-శామీర్‌పేట స్కైవేకు ఇప్పటికే డీపీఆర్ సిద్ధం కాగా, ప్యారడైజ్-కొంపల్లి స్కైవేకు ఓ కంపెనీ ప్రాజెక్టు రిపోర్ట్ సిద్ధం చేస్తోందని ఆంధ్రజ్యోతి తన కథనంలో పేర్కొంది.

10 నెలల్లో తెలంగాణ కొత్త సెక్రటేరియట్
పాత సచివాలయంలోని 11 బ్లాకులు కూల్చివేత పూర్తి కావడంతో కొత్త నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు ఆంధ్రప్రభ రాసింది. ఆగస్టు మొదటి వారంలోనే పనులు మొదలు పెట్టేందుకు ప్రభుత్వం సిద్దమవుతోందని పేర్కొంది.
ఈ నెల 5న క్యాబినెట్ భేటీ ఉంటుందని, భూమి పూజపై క్యాబినెట్ నిర్ణయం తీసుకోనుందని ఈ కథనం పేర్కొంది. టెండర్ల ప్రక్రియ పూర్తి కాగానే నిర్మాణ పనులు మొదలవుతాయని, గరిష్టంగా వారం నుంచి పది రోజుల్లో పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. 10 నెలల్లోనే నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు ఈ కథనం వెల్లడించింది.
ఇప్పటికే పది పెద్ద నిర్మాణ కంపెనీలు భవనం నమూనాలను సిద్ధం చేశాయని, శ్రావణ మాసంలోనే ముహూర్తాన్నిఖరారు చేయాలని వేద పండితులను కోరినట్లు తెలిపింది. ఈనెల 5న జరగబోయే క్యాబినెట్ సమావేశంలో కొత్త సెక్రటేరియట్ నిర్మాణమే ప్రధాన అజెండా కానుందని వెల్లడించింది.

ఫొటో సోర్స్, Naveen
ఆంధ్రప్రదేశ్‌కు వాహనాల అనుమతి
అన్‌లాక్ 3.0 ప్రారంభం కావడంతో రాష్ట్రంలోకి వచ్చే వాహనాలపై ఉన్న ఆంక్షలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసిందని టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక రాసింది. ఇకపై రాష్ట్రంలోకి వచ్చేందుకు ఏ వాహనానికి ముందస్తులు అనుమతులు అవసరం లేదు.
అయితే, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు స్పందన యాప్‌లో తమ వివరాలను నమోదు చేయాలని మాత్రం నిబంధన విధించింది. వెబ్‌సైట్‌లో పేరు వివరాలు ఇస్తే ఆటోమేటిక్‌గా పాస్ ఇచ్చే సౌకర్యం ఇందులో లభిస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఎక్కడెక్కడికి వెళ్లారో తెలుసుకోడానికి ఈ వివరాలు తప్పదని ఏపీ కోవిడ్-19 నోడల్ ఆఫీసర్ కృష్ణబాబు వెల్లడించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది.

ఫొటో సోర్స్, Getty Images
వాల్‌మార్ట్‌కు చింతపల్లి పసుపు
లాక్‌డౌన్ కాలంలో తాము పండించిన పసుపు, జీడిపప్పు, మిరియాల పంటలను మార్కెట్ చేసుకోలేకపోయిన చింతపల్లి రైతులకు అండగా నిలించేందుకు ప్రపంచ దిగ్గజం వాల్‌మార్ట్ ముందుకొచ్చిందని సాక్షి పత్రిక వెల్లడించింది.
పసుపుతోపాటు జీడిపప్పు, మిరియాలను మార్కెట్‌కు పంపలేక ఇబ్బంది పడుతున్న రైతులకు ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో కొనుగోలు చేసేందుకు వాల్‌మార్ట్ ముందుకు వచ్చింది. చింతపల్లి ఏరియాలో పండే పసుపు పంటలలో ఔషధ గుణాలు ఎక్కువని, మందుల తయారీకి ఉపయోగించే కర్కుమిన్ అనే పదార్ధం ఈ ప్రాంతపు పసుపులో 5-7శాతం ఉంటుందని, దీనికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉందని సాక్షి పత్రిక పేర్కొంది.
పంటను అమ్ముకోలేక పోతున్న రైతులకు సహకరించేందుకు ముందుకు వచ్చిన వాల్‌మార్ట్ 2,500మంది చిన్న సన్నకారు రైతుల నుంచి ఇప్పటికే పసుపును కొన్నట్లు సంస్థ డైరక్టర్ షెర్రీ లీ సింగ్ వెల్లడించారని ఈ కథనం పేర్కొంది.
ఈ ఏర్పాటు వల్ల రైతుల దగ్గర పసుపు, ఇతర దినుసులు వెంటనే మార్కెట్ కావడంతోపాటు, వచ్చే సీజన్ పంటకు అవసరమైన పెట్టుబడి సొమ్ము చేరిందని ఈ కథనం వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ నిర్మిస్తున్న ఆనకట్టపై భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
- అక్కడ అమ్మాయి పేరు ఎవరికీ చెప్పకూడదు.. పెళ్లి పత్రాల్లో రాయరు, మరణ ధ్రువీకరణల్లో ఉండదు
- ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ హాట్ స్పాట్‌గా మారిన తూర్పు గోదావరి
- భారత జనాభా ఈ శతాబ్దం చివరికి ఎందుకు తగ్గుతుంది... తగ్గితే ఏమవుతుంది?
- తూర్పుగోదావరి జిల్లాలో ఒక వ్యక్తి నుంచి 100 మందికి కరోనావైరస్.. ఎలా వ్యాపించింది?
- సెక్స్ వర్కర్లు ఆ దేశంలో రెయిన్ కోట్ ఎందుకు వేసుకుంటున్నారు?
- రిలయన్స్ జియో 5జీ వస్తోంది.. కానీ భారతీయులు ఎన్నాళ్లు ఎదురు చూడాలి?
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























