హైదరాబాద్‌ దిశ ఎన్‌కౌంటర్ కేసు దర్యాప్తు సమయాన్ని ఆరు నెలలు పొడిగించిన సుప్రీంకోర్టు

ప్రచురణ

హైదరాబాద్‌లో దిశ అత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్ కేసు దర్యాప్తు పూర్తి చేయడానికి గడువు మరో ఆరు నెలలు పొడిగిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బాబ్డే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.

ఈ కేసు దర్యాప్తు సమయాన్ని పొడిగించాలని దర్యాప్తు చేస్తున్న జ్యుడిషియల్ కమిషన్‌కు నేతృత్వం వహిస్తున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వీఎస్ సిర్పుర్కర్ పిటిషన్ దాఖలు చేశారు.

దానిపైనే ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణలు జరిగాయి.

కోవిడ్ మహమ్మారి, లాక్‌డౌన్ పరిస్థితుల వల్ల ఈ కేసు దర్యాప్తు ఆలస్యం అవుతోందని కమిషన్ తమ పిటిషన్‌లో పేర్కొంది. దర్యాప్తు సమయాన్ని పొడిగించాలని కోరింది.

ఇంతకు ముందు ఈ కేసు దర్యాప్తు పూర్తి చేసేందుకు విచారణ కమిటీకి ఆరు నెలల సమయం ఇచ్చారు.

ఒక పిటిషనర్‌పై సీజేఐ ఆగ్రహం

విచారణ సమయంలో ప్రదీప్ యాదవ్ అనే ఒక పిటిషనర్ అభ్యర్థనపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహించింది.

“భవిష్యత్తులో ఇలాంటి నేరాలు, ఎన్‌కౌంటర్లు జరగకుండా ఉండేలా ఏదైనా ఆదేశాలు ఇవ్వాలని నేను న్యాయస్థానాన్ని వేడుకుంటున్నా” అని పిటిషనర్లలో ఒకరు, న్యాయవాది ప్రదీప్ యాదవ్ సుప్రీంకోర్టును కోరారు.

దీంతో, సీజేఐ ఎస్ఏ బాబ్డే ఆయనపై విరుచుకుపడ్డారు. “మీరు అసలు లాయరేనా?” అన్నారు.

“మీరు ఏమంటున్నారు, మేం అలా ఎలా చెప్పగలం, ఎలా నిర్దేశించగలం. ప్రపంచంలోని ఏ న్యాయస్థానమైనా, అలాంటి ఆదేశాలు ఇచ్చి, నేరాలు జరగకూడదని ఎలా చెప్పగలదు?” అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి).