ఆంధ్రప్రదేశ్: కొత్తగా 28 బీసీ కార్పొరేషన్లు.. నెలాఖరులోగా చైర్మన్లు, డైరెక్టర్ల నియామకం - ప్రెస్ రివ్యూ

ప్రచురణ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం త్వరలో 52 బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లు,డైరక్టర్లను నియమించనున్నట్లు సాక్షి పత్రిక ఒక కథనం రాసింది.

ఈ నెలాఖరులో ఈ పని పూర్తి చేయాలని, కులాల అభివృద్ధికి పాటుపడిన వారికి ఈ పదవులలో ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి సూచించినట్లు ఈ కథనంలో పేర్కొంది.

వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక రెండు కోట్లమందికి పైగా బీసీలు 22 వేల కోట్ల మేర లబ్ది పొందారని ఈ కథనంలో పేర్కొంది.

ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయా లేదా అన్నది ఈ కార్పొరేషన్లు చూడాలని ముఖ్యమంత్రి సూచించినట్లు ఈ కథనం పేర్కొంది.

సచివాలయం కూల్చివేతలో జోక్యం చేసుకోలేం: ఎన్జీటీ

సచివాలయం కూల్చివేత అంశంపై తాము జోక్యం చేసుకోలేమని చెన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ ) స్పష్టం చేసినట్లు నమస్తే తెలంగాణ ఒక కథనం ప్రచురించింది.

దీనిపై జోక్యం చేసుకోవాలంటూ కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి వేసిన పిటిషన్‌ఫై విచారణ జరిపిన ఎన్జీటీ ఈ మేరకు ప్రకటన చేసినట్లు ఈ కథనం పేర్కొంది.

అయితే కూల్చివేతల తర్వాత వ్యర్ధాల నిర్వహణ, కాలుష్య నియంత్రణ చర్యలపై అధ్యయనానికి నిపుణల కమిటీని ఎన్జీటీ నియమించింది. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని హరిత ట్రిబ్యునల్ ఈ కమిటీని ఆదేశించింది.

ఏపీలో రేపు ఇద్దరు కొత్త మంత్రుల ప్రమాణం - ఉపముఖ్యమంత్రిగా కృష్ణదాస్‌

రాజ్యసభకు ఎన్నికై రాజీనామాలు చేసిన రాష్ట్రమంత్రులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణ స్థానంలో కొత్తగా ఇద్దరు మంత్రులు ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం జరగనుందని ఈనాడు పేర్కొంది.

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం శాసన సభ్యుడు వేణుగోపాలకృష్ణ, శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజులు కొత్తగా మంత్రి పదవులు చేపట్టబోతున్నారని, ఈ మేరకు వీరిద్దరికీ సమాచారం అందిందని ఈ కథనంలో పేర్కొంది.

అయితే వీరిద్దరికి ఖాళీ అయిన పదవులనే ఇస్తారా లేక వేరే శాఖలు కేటాయిస్తారా అన్నదానిపై చర్చ నడుస్తోందని, ఉపముఖ్యమంత్రి పదవి ధర్మాన కృష్ణదాస్‌కు కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు ఈ కథనం పేర్కొంది.

రాజధాని వికేంద్రీకరణ అధికారం రాష్ట్రానికి ఉందా ?- న్యాయ సలహా కోరిన గవర్నర్‌

ఒక రాజధానిని మూడు రాజధానులుగా మార్చేందుకు ప్రభుత్వానికి అధికారం ఉందో లేదో తెలుసుకునేందుకు గవర్నర్‌ న్యాయ సలహా కోరినట్లు ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది.

ఇటీవలే ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనతో కూడిన పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను గవర్నర్‌ ఆమోదానికి పంపింది. అయితే గవర్నర్‌ ఈ బిల్లులు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయా, అలాంటి చట్టాలను చేసే అధికారం రాష్ట్రానికి ఉందా? అనే అంశాలపై న్యాయ నిపుణుల సలహా కోరినట్లు ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.

ఒకపక్క కోర్టు కేసులు, మరోవైపు విపక్షాలు, ప్రజాసంఘాల లేఖల నేపథ్యంలో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ కథనం తెలిపింది.

వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమం

విరసం నేత వరవరరావు అంపశయ్యపై ఉన్నారని, కుటుంబ సభ్యుల సమక్షంలో మరణించే అవకాశం ఇవ్వాలని ఆయన న్యాయవాది సుదీప్‌ పస్‌బోలా బాంబే హైకోర్టును కోరినట్లు ఆంధ్రజ్యోతి ఒక కథనం రాసింది.

ఈ కథనం ప్రకారం వరవరరావు ఇంకా ఎక్కువ కాలం బతకరని, కరోనా కూడా సోకటంతో కొన్ని రోజుల్లోనే చనిపోతారని, విచారణను ఏ విధంగానూ ప్రభావితం చేయలేని స్థితిలో ఉన్న ఆయనకు బెయిల్‌ ఇవ్వాలని ఈ పిటిషన్‌లో న్యాయవాది పస్‌బోలే పేర్కొన్నారు. అయితే ఐసీఎంఆర్‌ నిబంధనల ప్రకారం కోవిడ్‌-19 సోకిన వారిని కుటుంబ సభ్యులతో కలవనీయడం కుదరదని ఎన్‌ఐఏ తరఫు న్యాయవాదులు బాంబే హైకోర్టుకు తెలిపారు.

మరోవైపు వరవరరావు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తమకు తెలపాలంటూ వరవరరావు భార్య హేమలత, కుమార్తెలు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)