You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌పై రాష్ట్రపతికి ఫిర్యాదు - ప్రెస్ రివ్యూ
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక, అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక విధానాలు, కోర్టు ధిక్కార నేరాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందంటూ తెలుగుదేశం ఎంపీలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఫిర్యాదు చేశారని 'ఆంధ్రజ్యోతి' కథనం తెలిపింది.
''టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్ నాయకత్వంలో ఆ పార్టీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్, కేశినేని నాని గురువారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతిని కలిశారు.
జగన్ ప్రభుత్వ చర్యలపై సాక్ష్యాధారాలు జత చేసి 53 పేజీలతో కూడిన ఫిర్యాదును అందించారు.
'రాష్ట్రంలో శాంతి భద్రతలు భ్రష్టు పట్టాయి. ప్రభుత్వం తీసుకుంటున్న చట్ట వ్యతిరేక, రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాలను హైకోర్టు, సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో తప్పుపట్టింది. కోర్టు తీర్పులను కూడా జగన్ ప్రభుత్వం బేఖాతరు చేస్తోంది' అని ఎంపీలు రాష్ట్రపతికి వివరించారు. దీనిపై రాష్ట్రపతి స్పందిస్తూ... 'ఏపీలో జరుగుతున్న విషయాలన్నీ నాకు తెలుస్తున్నాయి. నా వద్ద సమాచారం ఉంది. మీరు చేసిన ఆరోపణలపై విచారించి, తగు చర్యలు తీసుకుంటాం. ఇవే అంశాలను పార్లమెంటు సమావేశాలలో ప్రస్తావించండి. అలాగే, సంబంధిత మంత్రిత్వ శాఖలకు కూడా ఫిర్యాదు చేయండి' అని సూచించారని ఎంపీలు మీడియాకు తెలిపారు. కరోనా నేపథ్యంలో ఇప్పటివరకు ఎవ్వరికీ అపాయింట్‌మెంట్లు ఇవ్వని రాష్ట్రపతి... తొలిసారి తమతోనే భేటీకి అనుమతించారని చెప్పారు.
వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 13 నెలల్లో అభివృద్ధి పూర్తిగా స్తంభించిపోయిందని... అవినీతి, అక్రమాలే రాజ్యమేలుతున్నాయని రాష్ట్రపతికి టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న చట్టవ్యతిరేక, రాజ్యాంగ విరుద్ధ 65 నిర్ణయాలను హైకోర్టు తప్పుపట్టింది. సుప్రీం కూడా అనేక నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పులిచ్చింది. అయితే జడ్జిలకే దురుద్దేశాలను ఆపాదిస్తూ విమర్శల దాడి చేస్తున్నారు. టీడీపీ నేతలపై కక్ష్య సాధింపు చర్యలకు దిగుతున్నారని ఫిర్యాదు చేశార''ని ఆ కథనంలో తెలిపారు.
హైదరాబాద్ ఏమైనా ఎడారా.. అన్ని ఒంటెలు ఎలా వచ్చాయి?
ఎడారి ప్రాంతం కాని తెలంగాణలోకి 71 ఒంటెలు ఎలా వచ్చాయని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించిందని.. ఒంటెల తరలింపును అడ్డుకోవడంతోపాటు ప్రస్తుతం ఉన్న ఒంటెల సంరక్షణకు ఎలాంటి విధానాన్ని అనుసరిస్తున్నారో తెలపాలని సర్కారును ఆదేశించిందని 'సాక్షి' కథనం తెలిపింది.
''ఒంటె మాంసం విక్రేతలపై చర్యలు చేపట్టాలని, ఒంటెలను వధించకుండా ఆదేశాలివ్వాలంటూ హైదరాబాద్‌కి చెందిన డాక్టర్ కె.శశికళ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిల ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది.
రాజస్తాన్ నుంచి ఒంటెలను తరలించకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్ కుమార్ హైకోర్టుకు నివేదించారు.
అక్రమంగా ఇక్కడికి తరలించిన ఒంటెలను సైతం తిరిగి రాజస్తాన్‌కు తరలించామని తెలిపారు. ఒంటెల తరలింపును అడ్డుకునేందుకు ఎలాంటి విధానాన్ని అనుసరిస్తున్నారో తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
హైదరాబాద్‌లో ఒంటె మాంసం విక్రయించే వారిపై జీహెచ్‌ఎంసీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ డీఎస్.లోకేశ్ కుమార్ హైకోర్టుకు నివేదించారు.
గతంలో ధర్మాసనం ఆదేశించిన మేరకు ఒంటె మాంసం విక్రేతలపై, వాటి మాంసాన్ని అమ్మకుండా తీసుకున్న చర్యలను వివరిస్తూ ఆయన హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశార'ని ఆ కథనంలో పేర్కొన్నారు.
ఇక విద్యావ్యవస్థ ప్రక్షాళన: కేసీఆర్
తెలంగాణలో విద్యావ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రకటించారని 'నమస్తే తెలంగాణ' కథనం తెలిపింది.
''ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడానికి అవసరమైన దీర్ఘకాలిక వ్యూహం రూపొందించి అమలుచేస్తామని కేసీఆర్ వెల్లడించారు.
ఇందుకోసం విద్యావేత్తలు, విషయ నిపుణులతో వెంటనే సమావేశం నిర్వహించి అభిప్రాయాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు.
కరోనా నేపథ్యంలో వివిధ రకాల విద్యాసంస్థల నిర్వహణ, పరీక్షలు, సిలబస్ తదితర విషయాలపై యూజీసీ, ఏఐసీటీఈ తదితర సంస్థల మార్గదర్శకాలను పాటించాలని నిర్ణయించారు.
కొవిడ్-19 నేపథ్యంలో విద్యావ్యవస్థకు సంబంధించిన అంశాలు, రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతంచేసే విషయాలపై సీఎం కేసీఆర్ గురువారం ప్రగతిభవన్‌లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వ విద్యాసంస్థల పనితీరును గణనీయంగా మెరుగుపరిచి, అత్యుత్తమ విద్యాబోధన జరిగేలా చేయడం ద్వారానే విద్య పేరు మీద జరుగుతున్న దోపిడీని అరికట్టడం సాధ్యమవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్కొక్క రంగంపై దృష్టి పెట్టామని, క్రమంగా దీర్ఘకాలిక సమస్యల నుంచి ప్రజలకు శాశ్వత విముక్తి కలిగిస్తూ వస్తున్నామని సీఎం చెప్పారు. 'విద్యుత్ సమస్య పరిష్కారమైంది. మంచినీటి గోస తీరింది. సాగునీటి సమస్య పరిష్కారమవుతున్నది. వ్యవసాయరంగం కుదుటపడుతున్నది. భూకబ్జాలు లేవు. పేకాట క్లబ్బులు పోయాయి. గుడుంబా బట్టీలు ఆగిపోయాయి. ఇలా అనేక సమస్యలను పరిష్కరించుకోగలుగుతున్నాం. ఇక రెవెన్యూశాఖ ప్రక్షాళన, విద్యావ్యవస్థ బలోపేతంపై దృష్టి పెడతాం' అని ముఖ్యమంత్రి స్పష్టంచేశార''ని ఆ కథనంలో వివరించారు.
యథావిధిగా శ్రీవారి దర్శనాలు
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనాలు కొనసాగుతాయని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారని 'ఈనాడు' కథనం తెలిపింది.
''అన్నమయ్య భవన్‌లో ఈవో అనిల్ కుమార్, ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, ఇతర అధికారులతో చైర్మన్ సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం అనుసరిస్తున్న దర్శనాల విధానంలో ఎలాంటి మార్పులేదని.. యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు.
ఆలయంలో నిత్య కైంకర్యాలు, ఇతర సేవలను ఆగమ శాస్త్రబద్ధంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
టీటీడీలో ఇప్పటివరకు 140 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. అందులో ఏపీఎస్పీఎఫ్‌లో పనిచేసే 60 మంది భద్రతా సిబ్బంది, 16 మంది పోటు కార్మికులు, 14 మంది అర్చకులు, ఉద్యోగులు ఉన్నట్లు చెప్పారు.
వారిలో కొందరు హోం క్వారంటైన్‌లో ఉన్నారని, కొందరు విధులకు వస్తున్నారని.. మరో 70 మంది కోలుకుంటున్నారని, ఒక్కరు మాత్రమే తిరుపతి స్విమ్స్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారని చెప్పారు.
తిరుమలలో ఇప్పటివరకు భక్తులెవరకీ పాజిటివ్ రాలేదని చెప్పార''ని ఆ కథనంలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- Reality Check: హైస్పీడ్ రైలును నిజంగా చైనానే కనిపెట్టిందా?
- డెక్సామెథాసోన్: కరోనా 'లైఫ్ సేవింగ్' మెడిసిన్‌కు, భారత్‌కు ఉన్న బంధం ఏంటి?
- పెంగ్విన్ సినిమా రివ్యూ: కీర్తి సురేశ్ అద్భుత నటనతో సాగిన క్రైమ్ థ్రిల్లర్
- అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం: జీన్స్, మొబైల్.. ఇంకా వేటి ధరలు పెరగొచ్చు?
- చైనాలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ 'బెగ్గింగ్'
- కరోనావైరస్ వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోతున్న చైనా కంపెనీలు
- కరోనావైరస్ కోరల్లో చైనా ఆర్థిక వ్యవస్థ.. దశాబ్దాల కాలంలో తొలిసారి కుదేలు
- 996 విధానం అంటే ఏంటి? ‘ఆలీబాబా’ జాక్ మా దీన్ని ఎందుకు సమర్థిస్తున్నారు?
- అమెరికా ఆధిపత్యం పోతుందా? చైనా సూపర్ పవర్ అవుతుందా? కరోనావైరస్తో తెర వెనుక జరుగుతున్న యుద్ధాలేమిటి?
- భారీగా పతనమవుతున్న చైనా కరెన్సీ యువాన్.. కారణాలివే
- అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం: ఆర్థిక వ్యవస్థలోకి మరింత నగదును చొప్పిస్తున్న చైనా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)