క్లినికల్ ట్రయల్స్: నిమ్స్‌లో కరోనా వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్‌కు రక్త నమూనాల సేకరణ - ప్రెస్ రివ్యూ

ప్రచురణ

కరోనా వ్యాక్సిన్‌ కోసం భారత్‌ బయోటెక్‌- ఐసీఎంఆర్‌ సంయుక్తంగా చేపట్టిన క్లినికల్‌ ట్రయల్స్‌కు తొలి అడుగు పడిందని ఈనాడు కథనం ప్రచురించింది.

ఈ ట్రయల్స్ లో భాగంగా నిమ్స్‌లో ఆరుగురి వాలంటీర్ల నుంచి మంగళవారం రక్త నమూనాలు సేకరించారని తెలిపింది.

‘‘భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకాకు సంబంధించి ఇప్పటికే పలు దఫాలుగా ప్రయోగాలు చేశారు. మనుషులపై దీన్ని ప్రయోగించేందుకు ఇటీవల ఆమోదం లభించింది.

క్లినికల్‌ ట్రయల్స్‌కు దేశవ్యాప్తంగా 12 ఆసుపత్రులను ఎంపిక చేయగా.. హైదరాబాద్‌లోని నిమ్స్‌కు అవకాశం లభించింది.

కొద్దిరోజులుగా కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో పాల్గొనేందుకు వాలంటీర్ల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఇందుకు నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మనోహర్‌ సారథ్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటైంది.

క్లినికల్‌ ట్రయల్స్‌ లో పాల్గొనే వారి కోసం ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఐసీయూ వార్డు సిద్ధం చేశారు. మంగళవారం స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ఆరుగురు వాలంటీర్ల నుంచి రక్త నమూనాలు సేకరించారు. వీటిని దిల్లీలోని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌)కి పంపారు.

అక్కడ పరీక్ష కేంద్రంలో ఈ నమూనాలను పరిశీలించి నిమ్స్‌‌కు నివేదిక పంపుతారు. వారిలో పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారిపై తొలుత ఒక డోసు వ్యాక్సిన్‌ ప్రయోగిస్తారు.

రెండు రోజుల పాటు ఆసుపత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో వారి ఆరోగ్య పరిస్థితులను అంచనా వేస్తారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించాక వాలంటీర్లను ఇళ్లకు పంపుతారు.

14 రోజులపాటు వారిని నిమ్స్‌ వైద్యులు ఫోన్‌ ద్వారా పర్యవేక్షిస్తుంటారు. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యంలో వస్తున్న మార్పులను నమోదు చేసుకుంటారు.

దీనికోసం మొదటిదశలో ఆరుగురి నమూనాలను పంపినట్లు వైద్యులు తెలిపారు. రెండు రోజుల్లో క్లినికల్‌ ట్రయల్స్‌కు అవసరమైన వ్యాక్సిన్‌ రానుందని వెల్లడించారు.

ఇక్కడ నిర్వహించే క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం 60 మంది వాలంటీర్లు అవసరమవుతారని వైద్యులు అంచనా వేశారు.

ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా క్లినికల్‌ ట్రయల్స్‌ కొనసాగుతాయని వైద్యుల బృందం స్పష్టం చేసింద’’ని ఈనాడు తెలిపింది..

కరోనా మృతుల అంత్యక్రియలకు 15 వేలు: ఏపీ సీఎం జగన్

ఇటీవల చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో కరోనా మృతుల అత్యక్రియలకు 15 రూపాయల చొప్పిన ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయించినట్లు సాక్షి కథనం ప్రచురించింది.

కరోనా బాధితులకు ఏ ఆస్పత్రికి కూడా వైద్యం నిరాకరించరాదని, అలా నిరాకరిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు.

కోవిడ్‌-19 బాధితులకు వైద్యం అందించని ఆస్పత్రుల అనుమతులు రద్దు చేస్తామన్నామని, ఇటువంటి ఆస్పత్రుల పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులను సీఎం ఆదేశించారని తెలిపింది.

కరోనా మృతుల అంత్యక్రియలకు 15 వేల రూపాయల చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

కోవిడ్‌ కారణంగా మరణించిన వారికి అంత్యక్రియల విషయంలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో సీఎం జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.

దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.

కోవిడ్‌–19 నివారణ చర్యలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారని సాక్షి చెప్పింది.

ఇంజనీరింగ్ ఫీజులపై ఏపీ హైకోర్ట్ ఉత్తర్వులు కొట్టివేత

ఇంజనీరింగ్‌, ఇతర వృత్తి విద్యా కాలేజీల ఫీజుల విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసిందని ఆంధ్రజ్యోతి రాసింది.

అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎ్‌ఫఆర్‌సీ) 2019-20, 2020-21, 2021-22 విద్యాసంవత్సరాలకు సిఫారసు చేసిన ఫీజులనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించినట్లు తెలిపింది. ఏఎ్‌ఫఆర్‌సీ సిఫారసు చేసిన ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టడం కుదరదని స్పష్టం చేసింది.

దీనిపై గత ఏడాది జూలై 23న ప్రభుత్వం జీవో నంబరు 38 విడుదల చేసింది. ఈ జీవోను ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలు హైకోర్టులో సవాల్‌ చేశాయి.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి జస్టిస్‌ ఎం.గంగారావు జీవోను నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఏఎ్‌ఫఆర్‌సీ సిఫారసుల మేరకే ఫీజులు వసూలు చేయాలని ఆదేశించారు.

అయితే... సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం సవాల్‌ చేసింది. అనంతరం సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్లో హైకోర్టు మార్పుచేసింది.

2018-19 విద్యా సంవత్సరపు ఫీజుకు, 2019 జూన్‌లో ఏఎ్‌ఫఆర్‌సీ సిఫారసు చేసిన ఫీజుకు మధ్య ఉన్న తేడాలో 50 శాతాన్ని పాత ఫీజుకు కలిపి అమలు చేయాలని జస్టిస్‌ ప్రవీణ్‌ కుమార్‌ నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ ఆదేశించింది.

హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వును సవాల్‌ చేస్తూ 23 ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలు సుప్రీంకోర్టుకు వెళ్లాయి. 2019-20 నుంచి మూడేళ్లకు ఏఎ్‌ఫఆర్‌సీ సిఫారసు చేసిన ఫీజులనే అమలు చేయాలని కోరాయి.

దీనిపై మంగళవారం సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు చెప్పింది. గతంలో హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసిందని ఆంధ్రజ్యోతి వివరించింది.

కృష్ణ, గోదావరికి జలకళ

కృష్ణాబేసిన్‌, గోదావరి బేసిన్‌లలోని ప్రాజెక్టులకు జలకళ వచ్చిందని నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.

ఎగువన కర్ణాటక, మహారాష్ట్రతోపాటు తెలుగు రాష్ర్టాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరి బేసిన్లు జలకళను సంతరించుకొంటున్నాయని తెలిపింది.

శ్రీశైలం జలాశయానికి గతేడాది కంటే ముందుగానే వరద మొదలైంది. ఎగువన ఆల్మట్టి.. నారాయణపుర ద్వారా దిగువకు వదిలిన జలాలు జూరాల మీదుగా శ్రీశైలం చేరుకున్నాయి.

తెలంగాణ, ఏపీలోనూ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులకు స్థానిక పరివాహక ప్రాం తాల నుంచి కూడా వరద వస్తున్నది.

మంగళవారం కూడా ఆల్మట్టికి 40వేల పైచిలుకు వరద నమోదైంది. దీంతో కర్ణాటక అధికారులు జలాశయంలో 96 టీఎంసీల నీటినిల్వను నిర్వహిస్తూ.. 46వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.

నారాయణపురకు వస్తున్న వరద వచ్చినట్టే దిగువకు విడుదలవుతున్నది. నారాయణపుర నుంచి గత రెండ్రోజులుగా వస్తున్న నీటితో జూరాల జలాశయం కళకళలాడుతున్నది.

జూరాల వద్ద మంగళవారం రాత్రి పది గంటలకు 45 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమో దైంది. మంగళవారం ఉదయం జూరాలలో కరెంట్‌ ఉత్పత్తి ప్రారంభించిన అధికారులు.. రాత్రి పదిగంటల తర్వాత ఐదుగేట్లు ఎత్తి దిగువకు జలాలు విడుదల చేశారు.

ఎగువ జూరాలలో 1, 3, 6 యూనిట్లలో 108 మెగావా ట్లు, దిగువ జూరాలలో 2, 4 యూనిట్లలో 68 యూనిట్ల కరెం టు ఉత్పత్తి అవుతున్నదని డైరెక్టర్‌ వెంకటరాజం తెలిపారు.

ఐదుగేట్లు ఎత్తడం, కరెంటు ఉత్పత్తి, నెట్టెంపాడు,భీమా, కోయిల్‌సాగర్‌తోపాటు, కుడి, ఎడమ సమాంతర కాలువకు నీటివిడుదల ద్వారా జూరాల నుంచి 53,853 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదవుతున్నదని నమస్తే తెలంగాణ చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)