ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ శాంపిల్స్ లక్షల సంఖ్యలో వృథా... ఆరోగ్య శాఖలో కొత్త సమస్య - ప్రెస్‌రివ్యూ

ప్రచురణ

ఆంధ్రప్రదేశ్‌లో సేకరించిన కోవిడ్‌-19 శాంపిళ్లలో సుమారు 2లక్షలు వృథాగా పోయాయని ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కథనాన్ని ప్రముఖంగా ఇచ్చింది.

ఇటీవల హైదరాబాద్‌లోని సీసీఎంబీ అధికారులు కొన్ని శాంపిళ్లను తిప్పి పంపడంతో ఈ వ్యవహారం బైటికొచ్చ్చినట్లు ఈ కథనంలో పేర్కొంది. అనుభవం లేని వారితో పరీక్షలు చేయించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, ఈ కారణంగా పెద్ద సంఖ్యలో స్వాబ్‌లు పనికి రాకుండా పోయాయని వెల్లడించింది.

ల్యాబ్‌కు వెళ్లేలోగా శాంపిల్స్‌కు మూతలు ఊడిపోయాయని, కొన్నింటికి ఐడీలు సరిగా రాయలేదని, మరికొన్నింటికి ప్యాకింగ్‌ సమయంలో సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చినట్లు తెలిపింది. ప్రతి జిల్లా నుంచి దాదాపు 20వేల శాంపిళ్లు ఇలాంటి స్థితిలో ఉన్నాయని, టెస్టులకు ఇచ్చినవారు రిపోర్టుల కోసం ఎదురు చూస్తుండగా, ఇప్పుడేం చేయాలో అర్ధం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారని ఈ కథనంలో పేర్కొంది.

టెస్టుకు శాంపిల్‌ ఇచ్చి మొబైల్‌కు వచ్చే మెసేజ్‌ కోసం ఎదురు చూసేవారు ఎక్కువకాలం మెసేజ్‌ రాకపోతే ఆ శాంపిల్‌ వృథా అయినట్లేనని ఈ కథనంలో పేర్కొన్నారు.

'జీవన్ రెడ్డి అనుచరులు నాపై దాడి చేశారు' -తీన్మార్ మల్లన్న

తీన్మార్‌ మల్లన్నగా టీవీ షోలు నిర్వహించే చింతపండు నవీన్‌కుమార్‌ తనపై ఆర్మూర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అనుచరులు దాడి చేశారని ఇందల్‌వాయి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ది హిందూ పత్రిక ఒక కథనం ప్రచురించింది.

తాను ఆర్మూర్‌ వెళుతుండగా జీవన్‌ రెడ్డి అనుచరులు దాడి చేసినట్లు నవీన్‌కుమార్‌ ఆరోపించారు. న్యాయవాదితో కలిసి ఆర్మూర్‌ వెళుతుండగా ఇందల్‌వాయి టోల్‌గేట్‌ సమీపంలో జీవన్‌ రెడ్డి అనుచరులు అసభ్య పదజాలంతో దూషిస్తూ తనపై దాడికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. తనపై దాడి జరుగుతుందని పోలీసులకు ముందే తెలుసని, అందుకే వారు అడ్డుకోలేదని నవీన్‌కుమార్‌ ఆరోపించారు.

పోలీసులు నవీన్‌కుమార్‌ను ఇందల్‌వాయి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి ఆర్మూర్‌లో ఓ కేసుకు సంబంధించి ఆయనకు నోటీసులు ఇచ్చారని, ఆయన కూడా తనపై దాడి చేసిన వారి మీద పోలీసులకు ఫిర్యాదు చేసారని ది హిందూ కథనం వెల్లడించింది.

అడ్డంగా దోచుకుంటున్న అంబులెన్సులు

హైదరాబాద్‌ నగరంలో కరోనా వైరస్‌తో మరణించిన వ్యక్తుల మృతదేహాల తరలింపు వారి కుటుంబ సభ్యులకు పెనుభారంగా మారుతోందని, అంబులెన్స్‌ సర్వీసులు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నాయని ఈనాడు పత్రిక ఒక కథనం ఇచ్చింది.

రోజురోజుకు కరోనా మృతుల సంఖ్య పెరుగుతుండటం, వారిని అంబులెన్సులలోనే ఇంటి చేర్చాల్సి ఉండటంతో వాటికి డిమాండ్‌ పెరిగింది. ఈ డిమాండ్‌ను అడ్డం పెట్టుకునే ప్రైవేటు అంబులెన్స్‌ సర్వీసులు బాధితుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్‌ చేస్తున్నాయని ఈ కథనలో రాసింది.

కొందరు ఈ ఖర్చు భరించలేక స్వచ్ఛంద సంస్థల సహాయం కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొంది. సాధారణ మృతదేహాల తరలింపులో కూడా ప్రైవేటు అంబులెన్సులు ఇదే రీతిలో వ్యవహరిస్తున్నాయని వెల్లడించింది. ఉస్మానియా ఆసుపత్రిలో మరణించిన ఓ వ్యక్తి శవాన్ని తరలించడానికి రూ.16,000 డిమాండ్‌ చేయడంతో ఆ డబ్బు సమకూర్చుకోడానికి ఆ కుటుంబం సాయంత్రం వరకు మృతదేహాన్ని ఆసుపత్రి వద్దే ఉంచాల్సి వచ్చినట్లు ఈ కథనంలో తెలిపింది.

ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని తరలించాలంటే దాదాపు రూ.15 నుంచి 25 వేల వరకు ఖర్చవుతోందని బాధితులు వాపోతున్నారు. అయితే వ్యక్తిగత భద్రత కోసం డ్రైవర్లు, సిబ్బందికి పెద్ద మొత్తంలో ఖర్చవుతోందని, అందుకే ధరలు ఎక్కువగా ఉన్నాయని అంబులెన్స్‌ సర్వీస్‌ యజమానులు చెబుతున్నారు.

మధ్యప్రదేశ్‌ బాటలో రాజస్థాన్‌- సీఎంకు ఎదురు తిరిగిన సచిన్‌ పైలట్‌

రాజస్థాన్‌లో అశోక్‌ గెహ్లాత్‌ ప్రభుత్వం మైనారిటీలో పడిందని నమస్తే తెలంగాణతో సహా పలు పత్రికలు ప్రముఖంగా రాశాయి. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న సచిన్‌ పైలట్‌కు 30 మంది ఎమ్మెల్యేలు మద్దతు పలుకుతున్నట్లు ఈ కథనాలు వెల్లడించాయి.

ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందంటూ స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్ పోలీసులు ముఖ్యమంత్రికి, ఉపముఖ్యమంత్రితోపాటు పలువురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడంతో కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలు బైటపడ్డాయి. నోటీసులు ఇవ్వడాన్ని తనకు అవమానంగా భావించిన సచిన్‌ పైలట్‌ ప్రభుత్వం నుంచి తప్పుకోవాలని నిర్ణయించారు. తనకు 30మంది ఎమ్మెల్యేల మద్దతుందని, ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని సచిన్‌ పైలట్‌ ప్రకటించారు.

అయితే పరిస్థితిని చక్కదిద్దేందుకు కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ ప్రయత్నిస్తుండగా, ఇవాళ జరగనున్న లెజిస్లేచర్‌ పార్టీ సమావేశానికి హాజరు కావద్దని సచిన్‌ వర్గం భావిస్తోంది.

గతంలో మధ్యప్రదేశ్‌లో కూడా ఇదే తరహాలో జ్యోతిరాదిత్య సింథియా తిరుగుబాటు చేయడం, తాజాగా సచిన్‌ పైలట్‌ ఆయనతో ఫోన్‌లో మాట్లాడటం, ఆ వెంటనే సింథియా రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో పైలట్‌ను అణచివేస్తున్నారని ట్వీట్‌ చేయడంతో ఇక్కడ కూడా మధ్యప్రదేశ్‌ తరహాలోనే పరిణామాలు మారబోతున్నాయన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.

ఫీ'జులుం' ఆపని కార్పొరేట్‌ స్కూళ్లు

ఒకపక్క ప్రభుత్వం, మరోవైపు హైకోర్టు హెచ్చరించినా, ప్రైవేటు స్కూళ్లు ఫీజుల దందాను ఆపలేదని ఆంధ్రభూమి పత్రిక ఒక కథనాన్ని ఇచ్చింది.

ఆన్‌లైన్‌ క్లాసులు వద్దని ప్రభుత్వం చెప్పినా క్లాసులు నిర్వహిస్తూ, వాటికి ఫీజులకు లంకెపెడుతూ వసూళ్ల కార్యక్రమం నిరాటంకంగా కొనసాగిస్తున్నాయని ఈ కథనం పేర్కొంది. హైదరాబాద్‌ సహా పలు ప్రాంతాలలో ఈ దోపిడీ కొనసాగుతోందని ఈ కథనంలో వెల్లడించింది.

ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కాకుండా స్పెషల్‌ ఫీజు, ట్రాన్స్‌పోర్టు ఫీజ, యాక్టివిటీ ఫీజు అంటూ రకరకాల రూపాలలో స్కూళ్లు డబ్బులు వసూలు చేస్తున్నాయి. మరికొన్ని స్కూళ్లు అప్పులు ఇచ్చే ఫైనాన్స్‌ కంపెనీల పనిని కూడా చేస్తున్నాయని, పోస్ట్‌ డేటెట్‌ చెక్కులు తీసుకుని, విద్యార్ధుల తల్లిదండ్రులను తమ గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని రాసింది. విద్యాశాఖలో పేరుకుపోయిన అవినీతే ప్రైవేటు విద్యాసంస్థల దోపిడికి అవకాశం కల్పిస్తోందని అనుమానం వ్యక్తం చేసింది.

పదిలక్షల మందికి సున్నా వడ్డీ రుణాలు

భారీ వడ్డీలకు అప్పులు తీసుకుని నష్టపోతున్న చిరు వ్యాపారుల కోసం సున్నా వడ్డీ రుణాల కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నట్లు సాక్షి పత్రిక ఒక కథనాన్ని ఇచ్చింది.

ఈ పథకంలో అర్హులైన చిరు వ్యాపారులకు రూ.10వేల రుణం అందిస్తారు. దీనికి వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుంది. బ్యాంకుల ద్వారా పొందే ఈ రుణ సదుపాయం జగనన్న తోడు పథకంలో భాగం. ఈ పథకం వల్ల ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 10 లక్షలమందికి మేలుకలిగే అవకాశం ఉందని, వాలంటీర్ల ద్వారా అర్హులను గుర్తించే ప్రక్రియ ప్రారంభమైందని సాక్షి పత్రిక తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)