You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్‌పై పాటలు రాసి, పాడిన తెలంగాణ జానపద గాయకుడు నిస్సార్ కోవిడ్-19తో మృతి
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
తెలంగాణ జానపద గాయకులు నిస్సార్ కరోనాతో మృతి చెందారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, చివరి నిమిషంలో ఆసుపత్రుల్లో చోటు దొరక్క మరణించారు. దాదాపు ఆరు ఆసుపత్రులు తిరిగినా ఆయనకు బెడ్ దొరకలేదని సన్నిహితులు చెబుతున్నారు.
యాభై ఆరేళ్ల మహమ్మద్ నిస్సార్ ఆర్టీసీలో ఏడీసీగా ఉన్నారు. అంతేకాకుండా ఆర్టీసీ ఈయూ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా, తెలంగాణ ప్రజా నాట్య మండలిలో కార్యదర్శిగా ఉన్నారు. ఆయన సొంతూరు యాదాద్రి జిల్లా గుండాల దగ్గర సుద్దాల.
''పండూ వెన్నెల్లలోన.. పాడేటి ఆటలేమాయె.. మన పల్లెటూరిలోనా ఆడేటి ఆటలేమాయె'' వంటి పాటలు ఆయనకు పేరు తెచ్చాయి. ''సుట్టూ పక్కల ఎక్కడ సూశిన పొట్టాలల్లో ఆకలి మంటలు.. సుట్టుకపోయిన పేగులన్నీ తట్టీలేపుతున్నయి.. బుసగొట్టలేవమన్నయ్'' అనే పాట కరవుపై రాశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాటలతో చురుగ్గా పాల్గొన్నారు.
నిస్సార్ కరోనాపై అవగాహన పెంచేలా ఒక పాట, లాక్ డౌన్ కష్టాలపై పాట రాశారు. లాక్ డౌన్ పై రాసిన పాట వాట్సప్ లో చక్కర్లు కొడుతోంది. కరోనాపై ఆయన రాసిన పాటను వందేమాతరం శ్రీనివాస్ పాడారు. మార్చి చివర్లో దీన్ని యూట్యూబ్లో పెట్టారు. ఆయన పాట, ''కరోనా నీ నోట్లో దుమ్ముకొడతాం, నిను భారత భూభాగం నుండి తరిమికొడతాం'' అంటూ సాగుతుంది.
''నాకు 27 ఏళ్ల పరిచయం. ఇద్దరం ఆర్టీసీలోనే పనిచేస్తాం. ఏ అంశంపై పాట రాసినా నాతో చర్చించేవాడు. కనీసం ఫోన్లో అయినా నాకు పాట వినిపించేవాడు. పది రోజుల క్రితమే కరోనాపై తను రాసిన పాటకు హిందీ అనువాదం చేసి, సవరణల కోసం నాకు పంపాడు. బెడ్ విషయంలో మాకు ఫోన్ చేసినా ఏదో ప్రయత్నం చేసే వాళ్లం. గాంధీకి ఒక రెండు మూడు గంటల ముందు వెళ్లి ఉండినా బావుండేదన్నారు దగ్గరనున్న వాళ్లు'' అంటూ ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు వహీద్.
ఆయన బెడ్ కోసం ఏడు గంటల వ్యవధిలో ఆరు ఆసుపత్రులు తిరిగారని సమాచారం. ఊపిరి తీసుకోవడం కష్టం కావడంతో ఆసుపత్రులకు బయల్దేరారు. చందానగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి, లింగంపల్లిలోని ఓ ఆస్పత్రి, గచ్చిబౌలి, ఎర్రగడ్డలోని రెండు ఆసుపత్రులు, బల్కంపేట చివరగా గాంధీలోకి వెళ్లారు. గాంధీలో చేరిన 3 గంటల్లోనే మరణించారు.
''నాలుగైదు రోజుల నుంచి జ్వరం ఉంది. ఆరోజు రెండు మూడు గంటల్లోనే ఊపిరి సమస్య మొదైలంది. భయపడ్డాడు అనుకుంటున్నాను. ఆక్సిజన్ సిలిండర్ ఇంట్లో పెట్టుకోవడానికి ఎరేంజ్ చేయమని నన్ను అడిగాడు'' అంటూ గుర్తుచేసుకున్నారు వహీద్.
నిస్సార్ తన రాజకీయ భావజాలాలకు అతీతంగా పాటలు పాడేవారు. రాసేవారు. లోక్ సత్తా సురాజ్య ఉద్యమానికి కూడా పాటలు రాశారు.
''మిత్రమా నిసార్ మనం ఓడిపోయాం.. "సర్కార్ దవఖాన పేరుకైతే గొప్పది.. ఎంతో ముద్దుగుంటది.. దవాఖానకు పోతే ఉన్న రోగమెక్కువైతది" అని నువ్వ్వు రాసిన పాట నీ జీవితంలోనే నిజం అవుతుందని, నీ ప్రాణాలని బలికొంటుంది అని అస్సలు ఊహించలేకపోయాను'' అంటూ సోషల్ మీడియాలో నిస్సార్ కి నివాళి అర్పించారు లోక్ సత్తాలో పనిచేసిన నరేశ్.
‘‘విద్యని, ఆరోగ్యాన్ని పట్టించుకోని, ఈ దోపిడీ పాలన అంతం కావాలని, అవినీతిని, వారసత్వ రాజకీయాలను యువతరం ఎదిరించాలని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, మార్పు సాధించాలని ఆయన పాటలు రాశారు. కామ్రేడ్ అని పిలిస్తే ఆయనకు ఇష్టం అని తెలిసినా, నేను కమ్యూనిస్టు ను కాదు కాబట్టి ఒక్కసారి కూడా నిన్ను కామ్రేడ్ అని పిలవలేదు’’ అన్న నరేశ్, చివరిసారిగా ఆయన కోసం కామ్రేడ్ అంటూ నివాళి అర్పించారు.
''ప్రస్తుతం నిస్సార్ మియాపూర్ 2 డిపోలో పనిచేస్తున్నారు. చాలా మంది ఆర్టీసీ కార్మికులు ఇలానే ఎక్కడ తిరిగిన బెడ్లు దొరక్క చనిపోతున్నారు. రైల్వే, సింగరేణి తరహాలో ఆర్టీసీ కార్మికుల కోసం కూడా తార్నాక ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు తెరవాలని'' ఆర్టీసీ ఈయూ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి అన్నారు.
''ఏటా జనవరి 26 హైదరాబాద్లో జరిగే కులనిర్మూలన సమావేశంలో పాటలు పాడేవాడు. ప్రతీ వర్గం కోసం పాటలు రాశాడు. ఎక్కడ ఎవరు పిలిచినా వెళ్లేవాడు. వినాయక చివితి ప్రోగ్రాములు కూడా చేశాడు. తెలంగాణ ఉద్యమం అయితే చెప్పక్కర్లేదు. కానీ ఆయనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి తగిన గుర్తింపు లేదు. ఇకనైనా కనీసం ఆయన పేరిట ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్ నిర్మించి, నిస్సార్ పేరిట కళాకారులను ప్రోత్సహించే అవార్డు ఇవ్వాలని కోరుతున్నాం'' అన్నారు వహీద్.
కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- టిప్స్: కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- వ్యాక్సిన్: కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?
- లాక్డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)