విశాఖపట్నంలో వరుస కిడ్నాప్‌లు.. ఎవరి పని? : ప్రెస్ రివ్యూ

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ

విశాఖ నగరంలో వరుస కిడ్నాప్‌ కేసులు పోలీసులకు సవాలు విసురుతున్నాయని 'సాక్షి' పత్రిక కథనం రాసింది.

''రెండు కిడ్నాప్‌లు ఒకే పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నగర నడిరోడ్డున జరగడం పోలీసులకు సవాల్‌గా మారింది. ఆ రెండు కేసుల విషయంలో ఇప్పటి వరకు పురోగతి లభించకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నిజంగా కిడ్నాప్‌ ప్రయత్నాలు జరిగాయా..? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

నాలుగు రోజుల క్రితం దొండపర్తి ప్రాంతంలో ఫ్లై ఓవర్‌ కింద రియల్‌ఎస్టేట్‌ వ్యాపారితోపాటు న్యాయవాదిని కొంత మంది దుండగులు కారులో కిడ్నాప్‌ చేసేందుకు ప్రయతి్నంచిన విషయం తెలిసిందే.

అదేవిధంగా ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద లలితా జ్యుయలరీస్‌ ఎదురుగా పెట్రోల్‌ బంక్‌ వద్ద ఒక ఫైనాన్స్‌ వ్యాపారిని బుధవారం కిడ్నాప్‌ చేసి అతని వద్ద ఉన్న నగదు, బంగారం దోచుకొని హత్యాయత్నం చేసి సాగర్‌నగర్‌ వద్ద పడేసిన విషయం తెలిసిందే.

ఈ రెండు కిడ్నాప్‌ వ్యవహారాలు ద్వారకా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోనే జరిగాయి. సమాచారం వచ్చిన వెంటనే పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో బాధితులకు ప్రాణాపాయం తప్పింది. కిడ్నాపర్ల చెర నుంచి సురక్షితంగా బయట పడగలిగారు'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

పరీక్షలు

ఫొటో సోర్స్, Getty Images

ఇంటర్ సెకండియర్‌లో అందరూ పాస్

తెలంగాణలో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను ప్రభుత్వం రద్దుచేసిందని 'నమస్తే తెలంగాణ' వార్తాకథనం తెలిపింది.

''గతనెల విడుదలచేసిన ఫలితాల్లో ఫెయిలైన సెకండియర్‌ విద్యార్థులందరినీ ఉత్తీర్ణులను చేస్తున్నట్టు ప్రకటించింది.

ఈ మేరకు విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ప్రకటన విడుదలచేశారు. కరోనా వ్యాప్తి తగ్గుముఖంపట్టని నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని మంత్రి తెలిపారు.

ద్వితీయ సంవత్సరంలో ఫెయిలైనవారిని కంపార్ట్‌మెంటల్‌ పాస్‌చేస్తామని చెప్పారు. మార్కుల జాబితాలో కంపార్ట్‌మెంటల్‌లో పాసైనట్టు ఉంటుందని వివరించారు.

ఈ నిర్ణయంతో 1.47 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని, ఈ నెల 31 లోగా అన్ని జూనియర్‌ కాలేజీల నుంచి మార్కుల జాబితాను పొందవచ్చని మంత్రి తెలిపారు.

మార్కుల రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ కోసం దరఖాస్తులు చేసుకున్నవారి ఫలితాలను 10 రోజుల తర్వాత అందజేస్తామని చెప్పారు. సె

కండియర్‌లో కంపార్ట్‌మెంటల్‌ పాస్‌అయిన విద్యార్థులు త్వరలో జరిగే జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌, నీట్‌, ఎంసెట్‌, తదితర అన్ని జాతీయస్థాయి పరీక్షలకు హాజరుకావచ్చని విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

ఫస్టియర్‌లో ఫెయిలైన విద్యార్థులు మాత్రం వచ్చేఏడాది మార్చిలో నిర్వహించే వార్షిక పరీక్షల సమయంలో సప్లిమెంటరీ రాయాల్సి ఉంటుందని ఇంటర్‌ బోర్డు అధికారులు తెలిపార''ని ఆ కథనంలో వివరించారు.

రఘరామకృష్ణంరాజు

ఫొటో సోర్స్, raghuramakrishnamraju

ప్రధానికి రఘురామకృష్ణంరాజు మరో లేఖ

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతూ మరో లేఖ రాశారని 'ఈనాడు' కథనం తెలిపింది.

''81 కోట్ల మంది ఆకలి తీర్చినందుకు ధన్యవాదాలు అంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

ఆ లేఖలో ఆయన ప్రధానిపై ప్రశంసలు కురిపించారు.

వ్యవసాయ రంగానికి లక్ష కోట్లు కేటాయించడంపైనా ప్రధానికి కృతజ్ఞతలు చెప్పారు.

పీఎం ఆవాస్ యోజన ద్వారా వలస కూలీలకు అండగా నిలిచారని ఎంపీ కొనియాడారు.

పీఎం గరీబ్ కల్యాణ్ యోజన నవంబరు వరకు పొడిగించడం గురించి లేఖలో ఎంపీ ప్రస్తావించారు'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

జగన్

ఫొటో సోర్స్, facebook

ఆగస్టు 1 నుంచి ఏపీలో రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు?

కరోనా కాలంలోనూ ఆదాయం పెంచుకోవడంపైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టిందని ‘ఆంధ్రజ్యోతి’ కథనం తెలిపింది.

‘‘ప్రజల ఆదాయాలు తగ్గిపోవడం...రాబోయే ఆరేడు నెలలు పరిస్థితి ఇలాగే ఉండబోతున్నదన్న ఆందోళన నేపథ్యంలో కూడా రిజిస్ర్టేషన్ల శాఖ తన పని తాను చేసుకుపోతోంది. అసలే మూలుగుతున్న రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలపై బండరాయి వేసేందుకు కసరత్తు ప్రారంభించింది.

సుమారు గత 15 రోజుల నుంచి క్షేత్రస్థాయిలో సబ్‌ రిజిస్ర్టార్లతో పాటు తహసీల్దార్లు, ఆర్డీవోలు, పట్టణాభివృద్ధి సంస్థల అధికారులను ఈ ప్రక్రియలో భాగస్వాములను చేసింది. రిజిస్ర్టేషన్‌ చార్జీలను ఎక్కడెక్కడ పెంచాలన్నది నిర్దేశించి, ఆయా ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాలంటూ మౌఖిక ఆదేశాలిచ్చింది.

లే అవుట్లు, హైవే పక్కన ఉన్న భూములు, కన్వర్షన్‌ చేసిన భూములు, వివిధ ప్రాజెక్టులు వస్తాయనుకుంటున్న వాటి సమీపంలోని భూము లు, వీటితోపాటు నగరాలు, పట్టణాల్లోని స్థలాలు, అపార్టుమెంట్ల ధరల పెంపుపైనా కసరత్తు చేయాలని ఈ శాఖ కోరింది. గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకోసారి, పట్టణ ప్రాంతాల్లో ఏడాదికోసారి రిజిస్ర్టేషన్‌ ధరలను పెంచడం ఆనవాయితీ. జూన్‌, జూలై నెలల్లో దీనికి సంబంధించిన కసరత్తు ప్రారంభించి...ఆగస్టు ఒకటి నుంచి కొత్త రేట్లను అమలుచేస్తారు. అయితే, ఎప్పటికప్పుడు అప్పటికి ఉన్న మార్కెట్‌ పరిస్థితులను బట్టి వీటిని పెంచుతారు. గత ఏడాది అప్పట్లో ఉన్న ప్రభుత్వం రిజిస్ర్టేషన్‌ చార్జీలను పెంచలేదు. ఆగస్టు ఒకటో తేదీనుంచి రిజిస్ర్టేషన్‌ చార్జీలను పెంచాలన్న ఉద్దేశంతో కొత్త ప్రభుత్వం తాజాగా కసరత్తు ప్రారంభించింద’’ని అందులో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)