నరేంద్ర మోదీ: ‘మన భూభాగంలోకి చైనా చొరబడలేదు, ఒక్క అంగుళం కూడా పోలేదు.. ఏ ఒక్క భారతీయ పోస్టునూ కైవసం చేసుకోలేదు’ - ప్రెస్ రివ్యూ

ప్రచురణ

''భూతలం, గగనతం, జలతలాల నుంచి మన సైనికులు చైనాను అడ్డుకుంటున్నారు. మన భూభాగంపై ఎవరూ కన్నెత్తి చూడలేరు. ఆ పరిస్థితిని త్రివిధ దళాలు కల్పించాయి. మన భూభాగంలో ఎవరూ చొరబడలేదు. ఏ ఒక్క భారతీయ పోస్టునూ కైవసం చేసుకోలేదు. ఒక్క అంగుళం కూడా ఎవరి స్వాధీనం కాలేదు'' అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ఉద్రిక్తతలు, భారత్‌-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు అమరులవ్వడం వంటి అంశాలపై శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు.

అమరులకు నివాళులర్పిస్తూ ఈ సమావేశం ప్రారంభమవ్వగా.. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌.. గల్వాన్‌ లోయలో జరిగిన సంఘటన గురించి విపక్షాలకు వివరించారు.

నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. ''ఇంతకు ముందు మన భూభాగంలోకి ఎవరు వచ్చినా.. అడిగేవారు కాదు. వారిని తరమడం గానీ, నిలువరించడం గానీ చేసేవారు కాదు. ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం. ఇప్పుడు మన సైనికులు చొరబాట్లను అడుగడుగునా అడ్డుకుంటున్నారు. అందుకే సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. మన సైనికుల ధైర్యసాహసాలు భారత్‌ వైపు కన్నెత్తి చూసేవారికి ఓ పాఠంలాంటిది'' అని వ్యాఖ్యానించారు.

లద్దాఖ్‌లో చైనా రెచ్చగొట్టే ధోరణితో 20 మంది సైనికులను పొట్టనబెట్టుకోవడంపై యావద్‌ దేశం రగిలిపోతోందన్నారు. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని, దీని వల్ల మన సైనికుల గస్తీ పెరిగిందని వివరించారు.

ఆధునిక హెలికాప్టర్లు, క్షిపణులు, రక్షణ వ్యవస్థల ద్వారా మన సైనికులకు కావల్సిన సామగ్రిని అందించి, సరిహద్దుల్లో వ్యవస్థను బలోపేతం చేశామని తెలిపారు. సరిహద్దుల్లో తీసుకుంటున్న చర్యల గురించి రానున్న రోజుల్లో సమయానుకూలంగా వెల్లడిస్తామని అన్నారు. గతంలో మనం దృష్టి సారించని ప్రాంతాల్లో కూడా ఇప్పుడు మన సైనికులు మోహరించారని చెప్పారు. అంతకు ముందు రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. మనం దేనికైనా సర్వసన్నద్ధంగా ఉన్నామనడానికి మన సైనికుల తెగువే నిదర్శనమన్నారు.

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఎన్సీపీ నేత శరద్‌ పవార్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌, బీఎస్పీ అధినేత్రి మాయావతితో సహా ప్రతిపక్ష నేతలంతా ప్రభుత్వానికి సంఘీభావం ప్రకటించారు. ఈ సంక్షోభ సమయంలో దేశం తీసుకునే ఎలాంటి వ్యూహాత్మక నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని, ప్రధాని మోదీ నిర్ణయాలకు తాము బలంగా మద్దతునిస్తామని మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. నాయకులంతా భుజం భుజం కలిపి.. మరణించిన సైనికుల కుటుంబాలకు అండగా ఉండాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. ఆర్జేడీ, ఆప్‌, మజ్లిస్‌ నేతలు ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. సీపీఎం నేత సీతారాం ఏచూరీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. విపక్షాలన్నీ కేంద్రానికి మద్దతివ్వడంపై అమిత్‌షా హర్షం వ్యక్తం చేశారు.

కల్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి రూ.5 కోట్లు

గల్వాన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో మరణించిన కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి రూ.5 కోట్ల నగదు, ఇంటి జాగాతోపాటు ఆయన భార్యకు గ్రూప్‌-1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని నమస్తే తెలంగాణ ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. తానే స్వయంగా సంతోష్‌బాబు ఇంటికి వెళ్లి సహాయం అందిస్తానని కేసీఆర్ తెలిపారు. అంతేకాదు.. గల్వాన్‌ ఘర్షణల్లో ప్రాణాలు అర్పించిన 19 మంది సైనిక కుటుంబాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున అందజేస్తామని వెల్లడించారు. ఈ మొత్తాన్ని కేంద్ర రక్షణ మంత్రి ద్వారా అందిస్తామని పేర్కొన్నారు. చైనా దురాగతాలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సైనికులకు, వారి కుటుంబాలకు దేశం అండగా నిలువాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. సైనికుల్లో ఆత్మవిశ్వాసం పెంచేందుకు, వారి కుటుంబాల్లో భరోసా నింపేందుకు యావత్తు దేశం వారి వెన్నంటే ఉండాలని పిలుపునిచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లోనే సింబల్‌ ఆఫ్‌ యూనిటీని ప్రదర్శించాలన్నారు. దేశమంతా సైనికుల వెంటే ఉందన్న సందేశాన్ని పంపాలని వ్యాఖ్యానించారు.

ఏపీలో నాలుగు రాజ్యసభ సీట్లూ వైసీపీకే.. టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్య ఓటమి

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు శుక్రవారం జరిగిన ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. నాలుగు స్థానాలూ వైసీపీనే కైవసం చేసుకుంది. ఆ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులుగా పోటీ చేసిన పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్‌ నత్వాని 38 ఓట్ల చొప్పున ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందారు అని ప్రజాశక్తి దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. తాజా గెలుపుతో వైసీపీ రాజ్యసభ సభ్యుల సంఖ్య ఆరుకు చేరింది. తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన వర్ల రామయ్య 17 ఓట్లు మాత్రమే పొంది ఓటమి పాలయ్యారు.

రాష్ట్రంలో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలకు గానూ 173 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఇఎస్‌ఐ స్కాంలో అరెస్టయిన కారణంగా ఓటు వేయడానికి రాలేదు. మరో టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉన్నందున ఓటు వేయడానికి రాలేనని చంద్రబాబుకు లేఖ రాశారు.

పోలైన 173 ఓట్లలో 151 వైసీపీవి కాగా, 17 టీడీపీ ఓట్లు. మరొకటి జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ ఓటు. నాలుగు ఓట్లు చెల్లలేదు. చెల్లని ఓట్లలో ముందుగా టీడీపీ భావించినట్లుగా పార్టీకి రెబల్‌గా తయారైన ముగ్గురు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీమోహన్‌, కరణం బలరాం, బద్దాలి గిరి ఓట్లు చెల్లలేదు. వారు వ్యూహాత్మకంగానే అటు వైసీపీకి గానీ, ఇటు టీడీపీకి గానీ వేయకుండా చూసుకున్నారు. మరొక టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ అవగాహనా లోపంతో తన ఓటును చెల్లని విధంగా వేశారు.

హీరోయిన్ నీహారికకు ఆగస్టులో పెళ్లి.. వరుడు జొన్నలగడ్డ చైతన్య

హీరోయిన్‌ నిహారికకు కాబోయే భర్త ఎవరో అధికారిక ప్రకటన వెల్లడైంది. గుంటూరు పోలీసుశాఖలో ఐజీగా విధులు నిర్వర్తిస్తున్న జొన్నలగడ్డ ప్రభాకర్‌ కుమారుడు జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక ఏడడుగులు వేయబోతున్నారు అని సాక్షి దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. 'నా మిగతా జీవితం సంతోషంగా గడిచేందుకు తగ్గ వ్యక్తి (చైతన్యను ఉద్దేశిస్తూ) నాకు దొరికారు. ఈ క్షణాలు చాలా థ్రిల్లింగ్‌గా ఉన్నాయి. మా నిశ్చితార్థం త్వరలో జరగబోతోందని చెప్పడానికే గురువారం సోషల్‌ మీడియాలో అలా హింట్‌ ఇచ్చాను. ప్రస్తుతం ఇంతకన్నా నేనేం చెప్పలేను'' అని పేర్కొన్నారు నిహారిక.

''చైతన్య, నిహారికలది అరేంజ్డ్‌ మ్యారేజ్‌. నిజంగా చైతన్య, నిహారికలకు ఒకరికొకరు పరిచయం లేదు.గత వారం వారి ఫ్యామిలీని కలిశాం. చైతన్య, నిహారికలు పర్‌ఫెక్ట్‌ కపుల్‌ అవుతారని భావించాం. మంచి ముహూర్తం కోసం చూస్తున్నాం. మంచి తేదీ కుదిరితే ఈ ఏడాదే వివాహం జరగవచ్చు. వారు (నిహారిక ఫ్యామిలీ) త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తారు'' అని తెలిపారు ప్రభాకర్‌.

చైతన్య - నిహారికల నిశ్చితార్థం ఈ ఏడాది ఆగస్టులో జరగనుందని సమాచారం. ఇక చైతన్య విషయానికి వస్తే... హైదరాబాద్‌లోని ఓ ఎమ్‌ఎన్‌సీ కంపెనీలో బిజినెస్‌ స్ట్రాటజిస్ట్‌గా వర్క్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన చైతన్య బిట్స్‌ పిలానీలో మాస్టర్స్‌ ఇన్‌ మ్యాథమ్యాటిక్స్‌ డిగ్రీ పట్టా పొందారు. ఆ తర్వాత ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో ఎమ్‌బీఏ పూర్తి చేశారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)