You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
దిల్లీ: ‘కుటుంబం కోసం సుపారీ ఇచ్చి తనను హత్య చేయించుకున్న వ్యాపారి' - ప్రెస్‌రివ్యూ
దిల్లీలో నివసించే ఒక వ్యాపారి తన కుటుంబానికి బీమా డబ్బులు లభిస్తాయని.. తనను తానే హత్య చేయించుకున్న ఉదంతం వెలుగుచూసిందని దిల్లీ పోలీసులు తెలిపినట్లు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఒక కథనంలో చెప్పింది.
ఆ కథనం ప్రకారం.. అతడి హత్య కేసుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశామని, ఒక మైనర్‌ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు.
తూర్పు దిల్లీలోని ఐపీ ఎక్స్‌టెన్షన్‌లో నివసించే ఒక హోల్‌సేల్ సరకుల వ్యాపారి జూన్ 9వ తేదీన అదృశ్యమైనట్లు అతడి కుటుంబం ఆనంద్ విహార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ మరుసటి రోజు దిల్లీ శివార్లలోని రనోలాలో చెట్టుకు అతడి మృతదేహం వేలాడుతూ కనిపించింది. అతడి చేతులు వెనక్కు కట్టేసి ఉన్నాయి.
హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం నాడు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా.. మృతుడు తనను హత్య చేయాల్సిందిగా స్వయంగా సుపారీ ఇచ్చినట్లు వారు చెప్పారు.
మృతుడు తనకు సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యాడని విచారణలో మైనర్ చెప్పినట్లు ఔటర్ డీసీపీ డాక్టర్ ఎ.కోవాన్ తెలిపారు. ''మృతుడు తనను హత్య చేస్తే తన కుటుంబానికి తన జీవిత బీమా సొమ్ము లభిస్తుందని చెప్పాడని.. అందుకోసం తనను హత్య చేయాలంటూ డబ్బులు చెల్లించాడని విచారణలో వెల్లడించారు'' అని ఆయన పేర్కొన్నారు.
తన హత్య కోసం అతడు రూ. 80,000 చెల్లిస్తానని చెప్పినట్లు నిందితులు పేర్కొన్నారు. దీంతో ఆ మైనర్ తన స్నేహితులు ముగ్గురిని కలుపుకుని హత్య చేశాడని పోలీసులు చెప్పారు. ఆ ముగ్గురిలో పెద్ద వాడయిన 26 ఏళ్ల నిందితుడు గతంలో ఒక అత్యాచారం కేసులో అరెస్టయినట్లు తెలిపారు.
''కూరగాయలు అమ్మటం, బ్యాగులు కుట్టటం వంటి చిన్నచిన్న పనులు చేసుకునే నిందితులకు గత కొన్ని నెలలుగా పనులు ఉన్నట్లు కనిపించటం లేదు'' అని డీసీపీ చెప్పారు.
ఈ కేసును ఏసీపీ నాంగ్లాయ్ ఆనంద్ సాగర్ సారథ్యంలోని పోలీసు బృందం దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేసింది.
మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ''మృతుడు ఆర్థిక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నాడు. రెండు అప్పులు ఉన్నాయి. అందులో ఆరు లక్షల బాకీ ఒకటి. ఇటీవల తన బంధువుతో గొడవపడ్డ తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. వ్యాపారం కూడా సరిగా సాగటం లేదు'' అని పోలీసులు చెప్పారు.
'కరోనావైరస్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చాలి': తెలంగాణ గవర్నర్‌కు నిపుణుల సూచన
రోజురోజుకు విజృంభిస్తూ ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్న కరోనావైరస్ వ్యాధిని ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చాలని పలు రంగాలకు చెందిన నిపుణులు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు సూచించినట్ల ఆంధ్రజ్యోతి ఒక కథనంలో చెప్పింది.
ఆ కథనం ప్రకారం.. కరోనా ప్రభావంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ రంగాల నిపుణులతో గవర్నర్ మాట్లాడారు. కరోనా చికిత్సకు అయ్యే ఖర్చునంతా బీమా సంస్థలు చెల్లించేలా చర్యలు తీసుకుంటూ ప్యాకేజీ రేట్లను కూడా పెంచాలని పలువురు నిపుణులు కోరారు.
ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని పరీక్షలను వాయిదా వేయడం మంచిదని, కోవిడ్ చికిత్సకు ఆన్‌లైన్ ద్వారా డాక్టర్లతో సంప్రదింపులు జరిపేలా ఏర్పాట్లు చేయడం మంచిదని వారు సూచించారు.
అయితే కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చడం కుదరదని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యమంత్రి ఈటల స్పష్టం చేసినట్లు కూడా ఆంధ్రజ్యోతి తన కథనంలో పేర్కొంది.
ఆ 'నలుగురు' కూడా లేరు... రిక్షాపై స్మశానానికి మృతదేహం
ఖమ్మం జిల్లాలో ఓ వృద్ధురాలు మృతి చెందగా, కరోనా కారణంగా బంధువులు ఎవరూ కడసారి చూడటానికి రాలేకపోవడం, స్మశానానికి తీసుకెళ్లేందుకు కూడా ఎవరూ లేకపోవడంతో చివరకు ఆమెను రిక్షాలో తీసుకెళ్లినట్లు 'ఈనాడు' ఒక కథనం ఇచ్చింది.
ఈ కథనం ప్రకారం జిల్లాలోని కారేపల్లి మండలానికి చెందిన వృద్ధురాలు రాధమ్మ(78) అనారోగ్యంతో మృతి చెందారు. ఆమెకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు కాగా, అల్లుళ్లు ఇద్దరూ వరంగల్ జిల్లాలో ఉండటంతో వారు ఆమెను కడసారి చూసేందుకు రాలేకపోయారు.
కరోనా కారణంగా బంధువులు కూడా ఎవరూ రాలేదు. కొడుకు, కోడలు, కూతుళ్లు తప్ప ఆమెను స్మశానానికి తీసుకెళ్లేందుకు కూడా ఎవరూ లేరు. పాడె మోసే వారు కూడా లేకపోవడంతో చివరకు ఆమెను రిక్షాలో స్మశానానికి మోసుకెళ్లాల్సి వచ్చింది.
వివక్ష నిరసనల్లో గళమెత్తిన భారతీయ మహిళ
వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ఆమెరికాలోని సియాటెల్‌లో జరుగుతున్న ఆందోళనలకు భారతీయ మహిళ క్షమాసావంత్ నాయకత్వం వహిస్తున్నారని 'నమస్తే తెలంగాణ' పత్రిక ఒక కథనం రాసింది.
బ్రూక్స్ అనే నల్లజాతి యువకుడిని పోలీసులు కాల్చి చంపిన నేపథ్యంలో అట్లాంటా స్టేట్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ సమయంలో అదే రాష్ట్రంలోని సియాటెల్‌లో జరుగుతున్న ఆందోళనలో ప్రముఖంగా నిలిచారు క్షమాసావంత్.
పుణెలో జన్మించిన ఆమె అమెరికాలో స్థిరపడ్డారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా కెరీర్ మొదలు పెట్టిన క్షమాసావంత్ తర్వాత కౌన్సిల్ మెంబర్‌గా ఎన్నికయ్యారు. సియాటెల్‌ను నో కాప్ జోన్(పోలీసులు ఉండని ప్రాంతం)గా ప్రకటించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఏపీలో తలసరి ఆదాయం ఎంత పెరిగింది.. సామాజిక, ఆర్థిక సర్వే ఏం చెబుతోంది
- భూగోళం అంచులను, మహా సముద్ర గర్భాన్ని తాకి చరిత్ర సృష్టించిన కేతీ సలివన్
- భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు ఎందుకు పెరుగుతున్నాయి? ‘సరిహద్దు’ తెర వెనుక ఏం జరుగుతోంది?
- గృహ హింస: ‘లాక్డౌన్ నాకు ఆలోచించుకునేంత సమయం ఇచ్చింది.. నా భర్త నుంచి నేను విడిపోవాలనుకుంటున్నా’
- సైకిల్ జ్యోతి: తినడానికీ సమయం దొరకట్లేదు, బిహార్‌లో రాజకీయ నాయకులు, అధికారులు, జర్నలిస్టులతో ‘పీప్లీ లైవ్’ను తలపిస్తున్న ఇల్లు
- ఎవరెస్ట్ ఎత్తు ఎంత? చైనా ఎందుకు మళ్లీ లెక్కిస్తోంది? 4 మీటర్ల తేడా ఎందుకు వచ్చింది?
- ఇదో బానిసల మార్కెట్... వేలాది మహిళలను ఆన్లైన్లో అమ్మేస్తున్నారు: బీబీసీ రహస్య పరిశోధన
- చరిత్ర: భారత్ నుంచి బ్రిటన్ ఎంత సంపద దోచుకెళ్లింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)