You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కరోనావైరస్ పరీక్షలు
- రచయిత, శంకర్. వి
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తితో లాక్‌డౌన్ విధించిన కారణంగా అన్ని కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోయాయి. చివరకు పార్లమెంట్ సమావేశాలను కూడా అర్థాంతరంగా ముగించాల్సి వచ్చింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను వాయిదా వేశారు.
రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ఆమోదించే అవకాశం లేకపోవడంతో ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయిన కొత్త ఆర్థిక సంవత్సరం కోసం 3 నెలల కాలపరిమితితో ఓటాన్ అకౌంట్‌ను ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చారు. గత మూడు నెలలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాని ప్రకారం నిధులు వినియోగిస్తోంది.
ఓటాన్ అకౌంట్ గడువు ముగుస్తున్న దశలో జూలై నుంచి రాబోయే 9 నెలల కాలం కోసం పూర్తిస్థాయి బడ్జెట్ ఆమోదించాల్సి ఉంది. దాని నిమిత్తం అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 16 నుంచి నిర్వహించాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయించింది.
మంగళవారం నుంచి ఈ సమావేశాలు నిర్వహించబోతున్నారు. మూడు రోజుల పాటు సమావేశాలు జరపాలని తొలుత భావించారు. అయితే బీఏసీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జి.శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.
19వ తేదీన రాజ్యసభ ఎన్నికలు కూడా జరగబోతుండడంతో దానికి అనుగుణంగా అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారు చేశారు.
ఓవైపు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన కీలక నేతల అరెస్టులు, మరోవైపు వివిధ రాజకీయ అంశాలు కూడా చర్చనీయాంశాలవుతున్న వేళ ఈసారి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి.
కరోనావైరస్ మూలంగా అమలు చేసిన లాక్‌డౌన్ సడలింపుల తర్వాత దేశంలోనే తొలిసారి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు ఇవే కావడం విశేషం.
లాక్‌డౌన్‌కి కొద్ది రోజుల ముందు మార్చి మూడో వారంలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఆ తర్వాత ప్రస్తుతం ఏపీలోనే శాసనసభ, శాసనమండలి సమావేశాలు జరగబోతుండటంతో ఇవి ఎలా సాగుతాయనే ఆసక్తి అందరిలో కనిపిస్తోంది.
శాసనసభ నిర్వహణలో పలు మార్పులు
శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్వహించడం, అందులో గవర్నర్ ప్రసంగించడం సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఆనవాయితీ.
కానీ ఈసారి ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్వహించడం లేదు. విడివిడిగా సమావేశాలు జరగబోతున్నాయి. అదే సమయంలో గవర్నర్ ప్రసంగం కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సభలో వినిపించబోతున్నారు.
సభ లోపల, వెలుపల కూడా భౌతికదూరం పాటించేందుకు అనుగుణంగా మార్పులు చేశారు.
అసెంబ్లీ ప్రాంగణంలోకి సభ్యులు, కీలక శాఖల అధికారులు మినహా మిగిలిన వారికి అనుమతి లేదు. మంత్రులు, సభ్యుల వ్యక్తిగత భద్రత, సహాయక సిబ్బంది కూడా బయట ఉండాలి. వారికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నామని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు.
అసెంబ్లీలోకి వాహనాలు అనుమతించాలంటే అధికారికంగా విడుదల చేసిన స్టిక్కర్లను ఆయా వాహానాలకు అతికించి ఉండాల్సిందేనని ఆదేశించారు.
ఈ సమావేశాలకు సందర్శకులను అనుమతించేది లేదని ప్రకటించారు.
సభ లోపల సీట్లను పూర్తిగా శానిటైజ్ చేస్తున్నట్టు అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణాచార్యులు వెల్లడించారు.
సభ్యులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించబోతున్నారు. వయసు పైబడిన వారు, అనారోగ్య సమస్యలు ఉన్న వారు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
మీడియా పాయింట్‌లో కార్యకలాపాలు రద్దు చేశారు. లాబీల్లోకి కూడా మీడియా ప్రతినిధులకు అనుమతి లేదని ప్రకటించారు.
సభా నిర్వహణపై ప్రత్యేక సమావేశం
అసెంబ్లీ నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పీకర్ అధ్యక్షతన వెలగపూడిలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితిని, పాటించాల్సిన నిబంధనలను చర్చించారు.
అసెంబ్లీ నిర్వహణ, భద్రతపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని స్పీకర్ తమ్మినేని సీతారామ్ బీబీసీకి తెలిపారు.
‘‘కోవిడ్ 19 విస్తృతమవుతున్న తరుణంలో అసెంబ్లీ నిర్వహించాల్సి వస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా మార్చి మొదటి వారంలో ఆమోదించాల్సిన బడ్జెట్ చివరి వారానికి వాయిదా పడింది. అప్పట్లో దేశమంతా లాక్‌డౌన్ ప్రకటించడంతో సభ నిర్వహణ సాధ్యం కాలేదు. ఇప్పుడు సమావేశాల నిర్వహణకు తగ్గట్టుగా సమీక్షా సమావేశంలో పలు సూచనలు వచ్చాయి’’ అని ఆయన చెప్పారు.
మండలి చైర్మన్, శాసనసభా వ్యవహారాల మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, పోలీస్ అధికారులు, చీఫ్ విప్, విప్‌లతో ఈ అంశంపై చర్చించామన్నారు.
‘‘అసెంబ్లీ వద్ద భద్రతను కట్టు దిట్టం చేసి సభ్యులు మినహా ఎవ్వరిని అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నాం. సభ్యులందరూ సహకరించాలి’’ అని కోరారు.
మంగళవారం ఉదయం గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం ఉంటుందని, తుది ఎజెండా అక్కడ ఖరారవుతుందని స్పీకర్ తెలిపారు. సభా ప్రాంగణంలో ఎటువంటి ఆందోళనలు, నిరసనలకు అనుమతి లేదన్నారు. ఆంక్షలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ కరోనా పరీక్షలు
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే పలువురు మంత్రుల సంబంధీకులు కరోనా బారిన పడ్డారు. అనంతపురం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే సన్నిహితుడు కరోనా వైరస్‌తో మరణించారు.
ఈ నేపథ్యంలో సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ కరోనా పరీక్షలు నిర్వహించబోతున్నట్టు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
‘‘ఈసారి అసెంబ్లీ ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతోంది. తొలిసారిగా సభ నిర్వహణ భిన్నమైన పద్ధతిలో సాగబోతోంది. సభ ఎన్ని రోజులు జరగాలన్నది బీఏసీలో నిర్ణయిస్తాం. హాజరవుతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ కరోనా పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశాం. వ్యక్తిగతంగా సమస్యలు ఉన్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలి’’ అని ఆయన బీబీసీతో మాట్లాడుతూ వివరించారు.
అసెంబ్లీలో 62 మంది పెద్ద వయసు వారే
ఏపీ అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో 70 మంది తొలిసారిగా సభలో అడుగుపెట్టారు. వారిలో 67 మంది వైసీపీ టికెట్‌పై గెలవగా, ముగ్గురు టీడీపీ తరఫున విజయం సాధించారు.
ఇక వయసు రీత్యా చూస్తే ప్రస్తుత సభలో 2019 ఏప్రిల్ నాటికి 40 ఏళ్ల లోపు వయసు వారు 19 మంది ఉన్నారు. అదే సమయంలో 56 ఏళ్ల వయసు పైబడిన వారు ఏకంగా 62 మంది ఉన్నారు.
వారిలో నలుగురు ఎమ్మెల్యేలు డబ్బై ఏళ్ల పైబడి కూడా ఉన్నారు.
కరోనా నేపథ్యంలో పెద్ద వయసు వారు మరిన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని ఇప్పటికే వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆయా ఎమ్మెల్యేలు కూడా తగిన విధంగా సన్నద్ధం కావాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- వరుసగా తొమ్మిదో రోజు పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
- ఏపీలో తలసరి ఆదాయం ఎంత పెరిగింది.. సామాజిక, ఆర్థిక సర్వే ఏం చెబుతోంది
- భూగోళం అంచులను, మహా సముద్ర గర్భాన్ని తాకి చరిత్ర సృష్టించిన కేతీ సలివన్
- భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు ఎందుకు పెరుగుతున్నాయి? ‘సరిహద్దు’ తెర వెనుక ఏం జరుగుతోంది?
- గృహ హింస: ‘లాక్‌డౌన్ నాకు ఆలోచించుకునేంత సమయం ఇచ్చింది.. నా భర్త నుంచి నేను విడిపోవాలనుకుంటున్నా’
- సైకిల్ జ్యోతి: తినడానికీ సమయం దొరకట్లేదు, బిహార్‌లో రాజకీయ నాయకులు, అధికారులు, జర్నలిస్టులతో ‘పీప్లీ లైవ్’ను తలపిస్తున్న ఇల్లు
- ఎవరెస్ట్ ఎత్తు ఎంత? చైనా ఎందుకు మళ్లీ లెక్కిస్తోంది? 4 మీటర్ల తేడా ఎందుకు వచ్చింది?
- ఇదో బానిసల మార్కెట్... వేలాది మహిళలను ఆన్లైన్లో అమ్మేస్తున్నారు: బీబీసీ రహస్య పరిశోధన
- ఆరాంకో: ప్రపంచంలో అత్యధిక లాభాలు సంపాదించే కంపెనీ షేర్ మార్కెట్లోకి ఎందుకొస్తోంది?కరోనావైరస్: సౌదీ అరేబియా ఎప్పుడూ లేనంత కష్టాల్లో కూరుకుపోయిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)