కేసీఆర్: 'ఆంధ్రప్రదేశ్ సర్కార్‌ది ఏకపక్ష నిర్ణయం... శ్రీశైలం జలాల ఎత్తిపోతల ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నాం' :ప్రెస్ రివ్యూ

ప్రచురణ

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించడం తీవ్ర అభ్యంతరకరమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారని 'ఈనాడు' కథనం తెలిపింది.

ఇది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధం అని కేసీఆర్ అన్నారు. తెలంగాణను సంప్రదించకుండానే ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం నీటి విషయంలో నిర్ణయం తీసుకోవడం, అపెక్స్‌ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టడం ఏపీ చేసిన తప్పిదాలుగా సీఎం పేర్కొన్నారు.

తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర భంగకరమైన ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి న్యాయపోరాటం చేస్తామని ఆయన ప్రకటించారు. దీనిపై వెంటనే కృష్ణా నీటి యాజమాన్య నిర్వహణ బోర్డు(కేఆర్‌ఎంబీ)లో తెలంగాణ ప్రభుత్వం తరఫున ఫిర్యాదు చేయాలని అధికారులను ఆదేశించారు.

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు టీఎంసీల నీటిని లిఫ్టు చేసే విధంగా కొత్త ఎత్తిపోతల పథకం చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. ఈ అంశంపై కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

"గతంలో ఉన్న వివాదాలు, విభేదాలను పక్కన పెట్టి రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా నదీ జలాలను వినియోగించుకుందామని తెలంగాణ ప్రభుత్వం ఏపీకి స్నేహహస్తం అందించింది. బేసిన్లు, భేషజాలు లేకుండా నీటిని వాడుకుందామని నేనే చొరవ చూపించా. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం కనీసం తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్షంగా వ్యవహరించడం అత్యంత బాధాకరం. పరస్పర సహకారంతో నీటిని వాడుకుందామనే స్ఫూర్తికి ఇది విఘాతం. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగితే రాజీ పడే ప్రసక్తే లేదు. కృష్ణానీటిని ఆంధ్రప్రదేశ్‌ తరలించుకుపోతే ఉమ్మడి పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగునీటి సమస్య ఏర్పడుతుంది. అందుకే ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగకుండా ఆదేశాలు జారీ చేయాలని వెంటనే కేఆర్‌ఎంబీలో ఫిర్యాదు చేస్తాం. వాటాలపై సుప్రీంకోర్టును ఆశ్రయిద్దాం. కృష్ణానదిలో రాష్ట్రాల వాటాను తేల్చే విషయంలో బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌లో చాలా జాప్యం జరుగుతోంది. సత్వర న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిద్దాం'' అని కేసీఆర్ అన్నారని ఆ కథనంలో పేర్కొన్నారు.

స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌కు స్లాట్‌ బుకింగ్‌

లాక్‌డౌన్‌ మినహాయింపుతో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించిన తెలంగాణ రిజిస్ట్రేషన్‌ శాఖ, స్థిరాస్తుల నమోదు ప్రక్రియ కోసం దరఖాస్తుదారులకు మరింత వెసులుబాటు కల్పించే విధంగా చర్యలు చేపట్టిందని 'సాక్షి' కథనం తెలిపింది.

''ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుకింగ్‌తో పాటు సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులకు వెళ్లడానికి అనుమతి పత్రం (పాస్‌) సౌకర్యం కూడా కల్పిస్తోంది. స్థిరాస్తి దస్తావేజుల నమోదు కోసం నిర్ణయించుకున్న సమయం ప్రకారం ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకున్న సమయంలో సంబంధిత సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌కు వెళ్లడానికి పాస్‌ కూడా ఆన్‌లైన్‌లో లభిస్తుంది.

స్థిరాస్తి రిజిస్ట్రేషన్‌ చేసుకునే దరఖాస్తుదారులు ముందుగా రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారిక వెబ్‌సైట్‌ registration. telangana.gov.in లో పబ్లిక్‌ డాటా ఎంట్రీ ద్వారా డాక్యుమెంట్స్‌ వివరాలను నమోదు చేసుకోవాలి.

రిజిస్ట్రేషన్‌ చేయించుకునే ఆస్తి విలువ ప్రకారం స్టాంప్‌ డ్యూటీని ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజులు మినహా ఇతర రుసుం చెల్లించాల్సిన అవసరం ఉండదు. స్టాంపు డ్యూటీ తదితర సుంకాలను పూర్తిగా ఆన్‌లైన్‌ లో చెల్లించాల్సి ఉంటుంది.

క్రయవిక్రయదారులు అనుకూలమైన సమయాన్ని నిర్ణయించుకొని ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. అలాగే స్థిరాస్తికి సంబంధించిన ఈసీ, దస్తావేజు నఖలు పత్రాలను కూడా ఆన్‌లైన్‌ ద్వారా పొందే అవకాశాన్ని రిజిస్ట్రేషన్‌ శాఖ కల్పించింది. రిజిస్ట్రేషన్‌ శాఖ registration. telangana.gov.in వెబ్‌సైట్‌ నుంచి ఆన్‌లైన్‌లో రుసుము చెల్లించి పొందవచ్చ''ని ఆ కథనంలో వివరించారు.

కశ్మీర్‌లోయలో ఇంటర్నెట్‌ సేవలు ప్రారంభం

జమ్ముకశ్మీర్‌లో 2జీ మొబైల్‌ డాటా సేవలు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయని 'నమస్తే తెలంగాణ' కథనం తెలిపింది.

''పుల్వామా, షోపియాన్‌ జిల్లాల్లో తప్ప కశ్మీర్‌లోని మిగిలిన అన్ని జిల్లాలో లో స్పీడ్‌ ఇంటర్నెట్‌ సేవలు ప్రారంభమవుతాయని అధికారులు ప్రకటించారు. హిజ్‌బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ రియాజ్‌ నైకూతోపాటు మరో ఉగ్రవాదిని మే 6న పుల్వామాలో భద్రతా దళాలు మట్టుపెట్టాయి.

దీంతో అక్కడ అల్లర్లు జరిగే అవకాశం ఉందని, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కశ్మీర్‌ లోయలో ఇంటర్నెట్‌ సర్వీసులను పూర్తిగా నిలిపివేశారు. కాగా, గతేడాది 370వ ఆర్టికల్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి జమ్ముకశ్మీర్‌లో 4జీ సర్వీసులను పూర్తిగా నిలిపివేశారు. అవి ఇప్పటికీ ప్రారంభమవలేద''ని అందులో వెల్లడించారు.

మ‌ట్కా కింగ్‌ ర‌త‌న్ ఖ‌త్రి కన్నుమూత

భార‌తీయ బెట్టింగ్ దిగ్గ‌జం, మట్కా కింగ్‌గా పేరుగాంచిన ర‌త‌న్ ఖ‌త్రి చ‌నిపోయిన‌ట్లు కుటుంబ‌స‌భ్యులు తెలిపారని 'నమస్తే తెలంగాణ' వార్తాకథనం తెలిపింది.

''రతన్ ఖత్రి వ‌య‌సు 88 ఏళ్లు. ముంబై సెంట్ర‌ల్‌లోని న‌వ‌జీవ‌న్ సొసైటీ ఇంట్లో ఆయ‌న తుదిశ్వాస విడిచిన‌ట్లు తెలిపారు.

సింద్ కుటుంబానికి చెందిన ర‌త‌న్ ఖ‌త్రి.. పాక్‌లోని క‌రాచీ నుంచి ముంబయికి వ‌చ్చారు. 1947 దేశ విభ‌జ‌న స‌మ‌యంలో అత‌ను ఇండియాలోకి వచ్చారు. జూదం లాంటి మ‌ట్కా ఆట‌ను దేశవ్యాప్త చేయ‌డంలో ర‌త‌న్ ఖ‌త్రి కీల‌క పాత్ర పోషించారు.

1962 స‌మ‌యంలో ముంబైలో మ‌ట్కా జూదానికి ఎక్కువ క్రేజీ ఉండేది. బెట్టింగ్ రాకెట్‌గా ఆ ఆట‌ను మార్చి దేశవ్యాప్త నెట్‌వర్క్ ఏర్పాటుచేసుకున్నార''ని ఆ కథనంలో తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)