You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆంధ్రప్రదేశ్ గ్రీన్ జోన్లలో లాక్‌డౌన్ సడలింపు... వ్యాపారాలకు అనుమతి -ప్రెస్ రివ్యూ
ఆంధ్రప్రదేశ్‌లోని గ్రీన్ జోన్లలో ఆర్థిక కార్యకలాపాలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రెడ్, ఆరెంజ్ జోన్లలో మాత్రం లాక్ డౌన్ ఆంక్షలు యథాతథంగా కొనసాగుతాయి.
ఒక్కటంటే ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని గ్రీన్‌జోన్లలో ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిందంటూ ఆంధ్రజ్యోతి పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
వ్యవసాయం, వ్యాపారం, పారిశ్రామిక రంగాలకు ఆంక్షలతో కూడిన వెసులుబాటు కల్పించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రెడ్, ఆరెంజ్ జోన్లతోపాటు కట్టడి ప్రాంతాల్లో మాత్రం ప్రస్తుత లాక్‌డౌన్ యథాతథంగా కొనసాగుతుంది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం దీనిపై ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 14 నుంచి 26 మధ్య కేంద్ర హోం, వైద్య, ఆరోగ్యశాఖలు లాక్‌డౌన్ అమలు, వెసులుబాట్లపై పలు మార్గదర్శకాలను ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు వాటిని క్రోడీకరిస్తూ, రాష్ట్రంలోని గ్రీన్‌జోన్‌లలో మరిన్ని మినహాయింపులు ఇచ్చారు. వాస్తవానికి ఇప్పటికే కరోనాలేని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు వెసులుబాట్లు కల్పించారు.
అయితే, తాజాగా ఏజెన్సీ ప్రాంతాలు సహా గ్రీన్‌జోన్‌లలో కార్యకలాపాల నిర్వహణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పనులకు వెళ్లేవారు, సమూహాల్లో తిరిగే రైతులు, ఇతరులు మాస్కులు ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం తమ ఆదేశాల్లో స్పష్టం చేసినట్టు ఆంధ్రజ్యోతి ఈ కథనంలో పేర్కొంది.
మోదీ ట్విటర్‌తో అమెరికా కటీఫ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యాలయం వైట్ హౌస్ ట్విటర్‌లో భారత ప్రధాని మోదీతో స్నేహానికి ముగింపు పలికిదంటూ సాక్షి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.
ట్రంప్ ట్విటర్ ఖాతాను నిర్వహిస్తున్న అధ్యక్షుడి నివాసమైన వైట్‌హౌస్ ట్విటర్‌లో మోదీని అన్‌ఫాలో చేసింది. రాష్ట్రపతి కోవింద్‌ను, ప్రధాని కార్యాలయం (పీఎంవో), అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని అనుసరించడం మానేసింది.
కొన్ని రోజుల క్రితం వరకు మోదీసహా 19 మంది భారతీయులను ట్విటర్‌లో ఫాలో అయ్యేది. తాజాగా ఆ సంఖ్య 13కు పడిపోయింది. ఈ 13 మంది అమెరికా పరిపాలనతో సంబంధం ఉన్న భారతీయులు.
వైట్‌హౌస్ ట్విట్టర్ ఖాతాకు 2.1కోట్ల ఫాలోవర్లు ఉన్నారు. ఏప్రిల్ 10వ తేదీ నుంచి వైట్‌హౌస్ మోదీ ట్విటర్ ఖాతాను అనుసరించడం ప్రారంభించింది. అయితే తాజాగా మోదీ ట్విటర్ ఖాతాను వైట్‌హౌస్ అన్‌ఫాలో చేయడం చర్చనీయాంశంగా మారిందంటూ సాక్షి ఈ కథనంలో వివరించింది.
హెచ్-1బి వీసాదారులపై వేలాడుతున్న కత్తి
కరోనా దెబ్బకు అమెరికాలో అనేక కంపెనీలు తాత్కాలికంగా మూతపడటంతో ఇబ్బంది పడుతున్న విదేశీ నిపుణులకు మరో ముప్పు పొంచి ఉందంటూ ఈనాడు దినపత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
ఈ కథనం ప్రకారం, అమెరికాలో ఈ ఏడాది జూన్ చివరిలోగా 2 లక్షల మందికి పైగా ఉద్యోగులు చట్టబద్దమైన హోదాను కోల్పోయే ప్రమాదం ఉంది.
ఇమ్మిగ్రేషన్ వ్యవహారాల నిపుణుల విశ్లేషణ ప్రకారం, అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందేందుకు ప్రయత్నిస్తున్న విదేశీ నిపుణుల సంఖ్య ప్రస్తుతం 2.5లక్షలుగా ఉంది. వారిలో హెచ్-1బి వీసాదారులే 2 లక్షల మంది వరకు ఊంటారు.
కరోనా సంక్షోభంతో అమెరికాలో చాలా కంపెనీలు మూతపడ్డాయి. లక్షల మంది అమెరికన్లు ఉపాధి కోల్పోయారు. అధిక సంఖ్యలో హెచ్-1బి వీసాదారులకు ఇదే పరిస్థితి ఎదురయ్యింది.
నిబంధనల ప్రకారం.. హెచ్-1బి వీసాదారులు వేతనాలు పొందకుండా అమెరికాలో ఎక్కువ రోజులు ఉండకూడదు. ఉన్న ఉద్యోగాన్ని కోల్పోతే..60 రోజుల్లోగా కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవాలి. లేదా, వేరే వీసా విభాగంలోకి మారాలి.
ఇవేవీ చేయలేకపోతే స్వదేశాలకు తిరుగు ప్రయాణం కావాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో 2 లక్షల మంది హెచ్-1బి వీసాదారులు, వారి కుటుంబాలపై చట్టబద్ధ హోదా కత్తి వేలాడుతోందని అంచనా.
మరోవైపు, బ్రిటన్లో సేవలందిస్తున్న భారతీయ ఆరోగ్య నిపుణులకు ఆ దేశం ఊరట కల్పించింది. కరోనాపై పోరులో తమ దేశానికి సేవలందిస్తున్న ఆరోగ్య సిబ్బంది వీసాల గడువును ఏడాది పాటు ఉచితంగా పొడిగిస్తున్నట్టు బ్రిటన్ హోం మంత్రి ప్రీతీ పటేల్ ప్రకటించారు.
ఐటీలో కొత్త ఉద్యోగాలు లేనట్టే
ఇక ఈ ఏడాదికి ఐటీ రంగంలో కొత్త ఉద్యోగాల కల్పన ఉండకపోవచ్చని ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ టీవీ మోహన్ దాస్ పాయ్ పేర్కొన్నట్టు నవతెలంగాణ పత్రిక తెలిపింది.
కరోనా ప్రతికూల ప్రభావం ఐటీ రంగంపై తీవ్రంగా పడనుందని, ఇప్పటికే హామీ ఇచ్చిన వారికి మాత్రం ఆయా సంస్థలు నియామకాలు కల్పించనున్నాయని మోహన్ దాస్ చెప్పినట్లు ఈ కథనంలో వివరించారు.
ఐటీ కంపెనీల క్లయింట్లు కూడా చాలా వరకు తమ కార్యాలయాలను తెరవలేదని ఆయన గుర్తు చేశారు. దీంతో వచ్చే 2-3 త్రైమాసికాల వరకు ఎలాంటి నియామకాలు జరగబోవని ఆయన తెలిపారు.
ఒక వేళ ఏవరైనా ఉద్యోగం మానేసినప్పటికీ ఆ స్థానాన్ని భర్తి చేయకపోవచ్చని మోహన్ దాస్ అన్నారు. అలాగే సీనియర్ ఉద్యోగుల జీతాల్లో 20 నుంచి 25 శాతం వరకు కోతలు ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.
పదోన్నతులు ఉన్నప్పటికీ జీతాల్లో పెంపు ఉండదని, లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా తమ ఉద్యోగుల్ని ఇంటి నుంచే పని చేయాలని కొన్ని కంపెనీలు కోరనున్నాయని ఆయన తెలిపారు.
వచ్చే ఏడాది వరకు ఇప్పటి కార్యాలయాల్లోనే కార్యకలాపాలు కొనసాగనున్నాయని దీంతో, ఈ రంగంలో కార్యాలయాల విస్తరణ నిలిచిపోనుందని మోహన్ దాస్ పాయ్ తెలిపినట్టు నవ తెలంగాణ ఈ కథనంలో వివరించింది.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంటే ఏమిటి? అది ఏం చేస్తుంది?
- కరోనావైరస్: ఈ మహమ్మారి ప్రపంచ దేశాల మధ్య యుద్ధానికి కారణం అవుతుందా?
- కరోనావైరస్: కొన్ని దేశాల ప్రజలు మాస్క్‌లు వాడతారు, మరికొన్ని దేశాల ప్రజలు వాడరు, ఎందుకు
- కరోనావైరస్: రోజూ పేపర్ తెప్పించుకోవచ్చా? కూరలు పళ్లు కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
- కరోనావైరస్: ఇళ్లలో తయారుచేసే మాస్కులు ఎంత భద్రం?
- కరోనా ఎఫెక్ట్: నారింజ రసం ధరలు పైపైకి
- కరోనావైరస్ నివారణకు గోమూత్రం పని చేస్తుందా
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)