You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘కులాల జాబితాలు సవరించాలి, ఎస్సీ ఎస్టీల్లో సంపన్నులు రిజర్వేషన్ ఫలాలు లాక్కుపోతున్నారు’ - సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు :ప్రెస్ రివ్యూ
బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసిందని.. మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితులకు, ప్రస్తుతం రిజర్వేషన్లు అనుభవిస్తున్న వారి ఆర్థిక స్థితికి అనుగుణంగా రిజర్వేషన్ కులాల జాబితాలు మార్చాల్సిన అవసరం ఉందని చెప్పిందని ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం, ఎస్సీ ఎస్టీల్లో సంపన్నులే రిజర్వేషన్ ఫలాలు లాక్కుపోతున్నారని, అసలైన పేదలకు, అవి దక్కాల్సినవారికి దక్కకుండా అడ్డుపడుతున్నారని న్యాయస్థానం అభిప్రాయపడింది.
‘‘కులాల జాబితాలు సవరించడం తప్పనిసరి. అది జరిగినపుడే రిజర్వేషన్ ఫలాలను - ఇప్పటికే వాటిని అనుభవిస్తున్న వారు తన్నుకుపోకుండా చూడగలం’’ అని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షెడ్యూల్డ్ ఏరియాల్లో టీచింగ్ పోస్టులను నూరు శాతం ఎస్టీలకే కేటాయిస్తూ అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవోలను కొట్టేస్తూ వెలువరించిన 152-పేజీల తీర్పులో ఈ వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగంలోని 341వ అధికరణం కింద రాష్ట్రపతి ఎస్సీ ఎస్టీ జాబితాలను నోటిఫై చేస్తారు. వీటిని ఎప్పటికప్పుడు మార్చాలన్నది సుప్రీం బెంచ్ తాజా తీర్పు.
ఇందిరా సహానీ (మండల్ కమిషన్) కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ - ‘రిజర్వేషన్ కులాల జాబితాలు పరమ పవిత్రమేమీ కాదు...అవి మార్చకూడదన్న రూలు కూడా ఏమీ లేదు’ అని జడ్జీల్లో ఒకరైన జస్టిస్ అరుణ్ మిశ్రా స్పష్టం చేశారు. రాకేశ్ కుమార్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో ఇచ్చిన తీర్పును కూడా ఉటంకిస్తూ- ‘మారుతున్న సామాజిక, ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా- ఎప్పటికప్పుడు కులాల జాబితాలను సమీక్షించాలి’ అని కూడా పేర్కొన్నారు.
‘రిజర్వేషన్ ఫలాలు అందడం లేదని ఎస్సీ, ఎస్టీ, బీసీల్లోని అనేక వర్గాలు ఆవేదన చెందుతున్నాయి. ఇన్నేళ్ల రిజర్వేషన్ విధానం వల్ల అనేకులు సంపన్నులయారు. ఇవి అందని వర్గాలనేకం సామాజికంగా ఉన్నతస్థాయికి చేరుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. కానీ సంపన్నవర్గాలు వారికి ఆ అవకాశం లేకుండా చేస్తున్నాయి. ఇది అంతర్గతంగా రిజర్వేషన్‌కు అర్హులైన వర్గాల్లోనే ఓ రకమైన ఘర్షణకు దారితీస్తోంది. ఎవరు అర్హులన్న ప్రశ్నకు తావిస్తోంది’ అని జస్టిస్ మిశ్రా, జస్టిస్ ఎం ఆర్ షా, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. కులాల జాబితాలు సవరించాలంటూ సీనియర్ న్యాయవాది రాజీవ్ ధవన్ చేసిన వాదనతో బెంచ్ ఏకీభవించింది.
‘‘ప్రభుత్వాలు నియమించిన కమిషన్లు... కొన్ని వర్గాలకు రిజర్వేషన్లు ఎత్తేయాలని, మరికొన్ని వర్గాలను కులాల జాబితాలో చేర్చాలని సూచిస్తూ వచ్చాయి. జాబితాలు సవరించాలని కూడా సిఫారసు చేశాయి. అలాంటి నివేదికలు రాష్ట్ర ప్రభుత్వాలకు అందుబాటులో ఉన్నపుడు వాటిపై సత్వరం నిర్ణయం తీసుకోవాలి. ఆ నివేదికలకు అనుగుణంగా జాబితాల్లో మార్పులు చేర్పులు చేస్తే వాటిని కేంద్ర సర్కార్‌కు నివేదించాలి’’ అని బెంచ్ పేర్కొంది.
(ఉమ్మడి) ఆంధ్రప్రదేశ్ కేసులో షెడ్యూల్డ్ ఏరియాలోని టీచింగ్ పోస్టులను నూరు శాతం ఎస్టీలకు కేటాయించడం ద్వారా ఎస్సీలకు, బీసీలకు తగిన అవకాశం దక్కకుండా చేశారని బెంచ్ అభిప్రాయపడింది. ‘రిజర్వేషన్ల మౌలిక లక్ష్యం దామాషా ప్రాతిపదిక కాదు. సరిపడ్డ రీతిలోఈ రిజర్వేషన్ కలగజేయడం. రూల్ ప్రకారం ఎస్టీలకు ఇవ్వాల్సినది 6 శాతం రిజర్వేషన్ మాత్రమే. ఏకంగా నూరు శాతం ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం. ఇలా కలగజేయడం షెడ్యూల్డ్ ఏరియాలో నివాసితులు కాని గిరిజనుల హక్కులు కూడా కాలరాయడమే. రాష్ట్రపతి ఉత్తర్వు- 371డీ ప్రకారం వారు మిగిలిన ఏరియాల్లో రిజర్వేషన్లు పొందడానికి వీల్లేకుండా పోతుంది’ అని బెంచ్ వివరించింది.
కులాల జాబితాలు సవరించనంతకాలం, కోటా నిబంధనలను సమీక్షించనంతకాలం రిజర్వేషన్ల విధానం విసిరే సవాళ్లను ఎదుర్కొనే రాజకీయ సంకల్పం ఎన్నికైన ప్రజా ప్రభుత్వాలకు ఉండడం కష్టమేనని సుప్రీం బెంచ్ వ్యాఖ్యానించింది. రాజ్యాధికారంలో భాగం పొందేందుకు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు చేసిన యత్నాలు ఫలించడం లేదనీ, వారు వివక్షకు గురవుతున్నారని, అందుకే రిజర్వేషన్ల వ్యవస్థ వచ్చిందనీ వివరించింది.
సామాజిక అసమానతలు, ఆర్థిక వెనుకబాటుతనం పదేళ్లలోగా అంతం కావాలని తొలుత రాజ్యాంగ నిర్ణేతలు లక్ష్యించారని, కానీ ప్రభుత్వాలు క్రమేణా సవరణలు తెచ్చి వాటికి గండి కొట్టాయనీ, జాబితాలు మార్చక, రిజర్వేషన్ నిబంధనలు మార్చక అలానే వదిలేశాయనీ, ఫలితంగా... ఇవి అసలైన లబ్ధిదారులకు అందకుండా పోయాయని బెంచ్ విమర్శించింది. పైపెచ్చు.. రిజర్వేషన్ శాతం పెంచాలన్న వాదనలు, రిజర్వేషన్లలో సబ్ కోటా కోసం డిమాండ్లు క్రమేణా పెరిగిపోయాయంది.
‘అసలు షెడ్యూల్డ్ ఏరియాలు ఎందుకు ప్రకటించారు? అక్కడ ఉన్న గిరిజనుల జీవన విధానం వేరు. సంస్కృతి వేరు. వారి న్యాయ విధానం, సాంస్కృతిక వైరుధ్యం మనలా ఉండవు. అందరికీ అందే విద్య వారికి చేరదు. ఫలితంగా వారు వెనకబడే ఉంటారు. అలాంటి వారికి చేయూతనివ్వాలి. వారిని ఆదిమ సంస్కృతి నుంచి బయటకు తీసుకొచ్చి దేశాభివృద్ధిలో భాగస్వాములను చేయాలి. వారిని జంతుప్రదర్శనశాలలో ఉంచిన మనుషులుగా భావించరాదు. వారి ప్రాచీన నాగరికతను, సంప్రదాయ నృత్యాలను వినోద దృష్టితో చూడరాదు’ అని బెంచ్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసిందని ఈ కథనంలో తెలిపారు.
రివ్యూ పిటిషన్ వేయాలి: తమ్మినేని వీరభద్రం
ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి 2000 సంవత్సరంలో వచ్చిన జీవో నం.3ను కొట్టేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విజ్ఞప్తి చేశారు. ఈ తీర్పు అమలు జరగకుండా స్టేఆర్డర్ పొందేలా తక్షణం జోక్యం చేసుకోవాలని గురువారం ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
వేల మంది నష్టపోయారు: సుప్రీం తీర్పుపై పిటిషనర్ లీలాప్రసాద్
ఏజెన్సీలో నూటికి నూరు శాతం ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులకే ఉండాలని ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన జీవో వల్ల ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం దాకా వేలాది మంది గిరిజనేతర నిరుద్యోగులు నష్టపోయారని, వారి జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయని పిటిషనర్ చేబ్రోలు లీలాప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. 20 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధంగా సమీక్షించి తీర్పు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. అప్పట్లో ఖమ్మం జిల్లాలో 2 వేల పోస్టులు గిరిజనులకు కేటాయించారని, తద్వారా అన్ని అర్హతలున్నా ఉపాధ్యాయ పోస్టుకు తమని అనర్హులను చేశారని వాపోయారు. ఇప్పుడు వచ్చిన తీర్పు ద్వారా న్యాయం గెలించిందన్న సంతృప్తి ఉన్నా, ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుపొందలేదన్న బాధ ఉందన్నారు.
‘మే 1లోగా గ్రామాలు ఖాళీ చేయండి’ - కొండపోచమ్మ ముంపువాసుల పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఆదేశాలు
కాళేశ్వరం పరిధిలోని కొండపోచమ్మ రిజర్వాయర్ ముంపు గ్రామాలైన ములుగు మండలంలోని బహిలాంపూర్, మామిడ్యాల గ్రామాలను మే 1వ తేదీలోగా ఖాళీ చేయాలని తెలంగాణ హైకోర్టు గురువారం స్పష్టం చేసినట్లు ‘ఈనాడు’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. ఆయా కుటుంబాల వారిని పునరావాస పునర్నిర్మాణ పథకం కింద నిర్మించిన ఇళ్లలోకి లేదంటే తాత్కాలిక నివాసంలోకి తరలించాలని కలెక్టర్‌కు ధర్మాసనం నిర్దేశించింది. పరిహారం వివాదం నేపథ్యంలో ప్రాజెక్టులను దీర్ఘకాలం ఆపలేమని, వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని పిటిషనర్లకు సూచించింది.
పునరావాస, పునర్నిర్మాణ పథకం కింద ఇళ్లకు రావాల్సిన పరిహారం చెక్కులను, కొత్త ఇళ్లకు చెందిన పట్టాలను పిటిషనర్ల తరఫు న్యాయవాదికి అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషనర్లు వారి న్యాయవాది నుంచి చెక్కులు, పట్టాలు తీసుకెళ్లవచ్చని, అభ్యంతరాలుంటే చెప్పవచ్చని పేర్కొంది.
పునరావాసం, పరిహారాలకు సంబంధించి తాము చర్చకు సిద్ధమని చెప్పినా పట్టించుకోకుండా అవార్డు నోటీసులు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ మామిడ్యాల, బహిలాంపూర్ గ్రామాలకు చెందిన 26 మంది హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది.
అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్, ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్ వాదనలు వినిపించారు. ఈ నెల 16న గ్రామస్థులతో సిద్దిపేట కలెక్టర్ చర్చలు జరిపారన్నారు. పిటిషనర్ల అభ్యర్థన మేరకు ఇళ్ల స్థలాలపై రీసర్వే నిర్వహించినట్లు చెప్పారు. అందరితో సమానంగా పరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, చట్టప్రకారమే చెల్లిస్తామని పేర్కొన్నారు. పంట విలువను కూడా లెక్కించామని తెలిపారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ పునరావాసం, పునర్నిర్మాణానికి సంబంధించి సరైన వసతులు కల్పించలేదన్నారు. ధర్మాసనం ఆదేశాలిస్తూ.. 55 మందికి చెందిన ఇళ్ల పరిహారం, పట్టాలను పిటిషనర్ల తరఫు న్యాయవాదికి అందజేయాలని తెలిపింది. పిటిషనర్లు మే 1లోగా ఆ గ్రామాలను ఖాళీ చేయాలంది. భూములకు సంబంధించిన వివాదంపై ఈనెల 27న విచారణ చేపడతామని పేర్కొంటూ.. విచారణను వాయిదా వేసింది.
24 గంటల్లో వలస కార్మికులను ఆదుకోండి’’: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
లాక్‌డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులను 24 గంటల్లో గుర్తించి, వారిని ఆదు కునేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించినట్లు ‘ప్రజాశక్తి’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్ డి.రమేష్‌లతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
లాక్‌డౌన్ విధించడం వల్ల విజయవాడ, గుంటూరు నగరాల్లో భారీ సంఖ్యలో వలస కార్మికులు చిక్కుకుపోయారంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకష్ణ దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు విచారించింది.
రెండు నగరాల్లోని వలస కార్మికులను 24 గంటల్లో గుర్తించాలని, వసతి, భోజన, వైద్యం వంటి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించింది.
ప్రభుత్వ చర్యలపై పూర్తి వివరాలను తమకు నివేధించాలని ఆదేశిప్తూ హోంశాఖ, కార్మిక శాఖల ముఖ్య కార్యదర్శులకు నోటీసులిచ్చింది. విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: లాక్‌డౌన్ పొడిగిస్తే ఎదురయ్యే పరిస్థితులకు మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉందా?
- కరోనావైరస్: తొలి కేసు నమోదవడంతో యెమెన్‌లో 'భయం భయం'
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి? నిర్థరణకు ఎలాంటి పరీక్షలు చేస్తారు?
- కరోనావైరస్: ఇటలీని దాటేసిన అమెరికా, ప్రపంచంలో అత్యధిక మరణాలు ఇక్కడే
- కరోనా లాక్‌డౌన్: విపరీతంగా బయటపడుతున్న ఎలుకలు.. వీటిని నివారించడం ఎలా
- వుహాన్‌లో లాక్ డౌన్ ఎత్తేసిన చైనా ప్రభుత్వం.. రైళ్లు, విమానాల్లో మొదలైన ప్రయాణాలు
- కరోనావైరస్: నియంత్రణ రేఖ 'సామాజిక దూరం' ఎలా పాటించాలంటున్న స్థానికులు
- మామకు కరోనా పాజిటివ్... రహస్యంగా చూసివచ్చిన అల్లుడిపై కేసు
- కొడుకు శవంతో రోడ్డుపై పరుగులు తీసిన తల్లి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)