కరోనావైరస్-లాక్‌డౌన్ నేపథ్యంలో కేంద్ర కార్మిక శాఖ ఆదేశాలు: ‘ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు విధులకు రాకపోయినా వచ్చినట్లే’ - ప్రెస్ రివ్యూ

ప్రచురణ

కరోనా నేపథ్యంలో ప్రభుత్వ, ప్రయివేటు రంగ సంస్థలేవీ ఉద్యోగులను తొలగించరాదని కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి హీరాలాల్ సమారియా చెప్పారని ‘ఈనాడు’ కథనం తెలిపింది.

ఈ మేరకు ఆయన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల కార్యదర్శికి, అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు లేఖ రాశారు.

‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ, ప్రయివేటు రంగ సంస్థలేవీ ఉద్యోగులను తొలగించకుండా సహకరించాలి. ముఖ్యంగా సాధారణ, కాంట్రాక్ట్ కార్మికులెవరినీ తొలగించడం కానీ, వారి వేతనాలు తగ్గించడం కానీ చేయరాదు. కార్మికులు సెలవు తీసుకుంటే దాన్ని అతను విధుల్లో ఉన్నట్లుగానే భావించాలి. అనువైన పరిస్థితులు లేకపోతే ఆ యూనిట్ ఉద్యోగులు సెలవులో ఉన్నా విధుల్లో ఉన్నట్లే భావించాల’’ని సమారియా తన లేఖలో పేర్కొన్నారు.

లాక్‌డౌన్‌లో జనం ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారో తెలుసా

కరోనా వైరస్ భయంతో దేశ ప్రజలందరూ చాలా వరకు ఇళ్లలోనే గడుపుతున్న వేళ పుస్తకాలు చదవడం, కామిక్స్ చూడడం, గేమింగ్ యాప్స్ వినియోగం ఎక్కువైందని ‘ఆంధ్రజ్యోతి’ కథనం తెలిపింది.

‘‘గత రెండు నెలలుగా మొబైల్ బ్రౌజింగ్ యాప్ యాక్టివిటీ దాదాపు 40 శాతం పెరిగినట్టు ఓ నివేదిక వెల్లడించింది. కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో దేశం దాదాపు లాక్‌డౌన్ స్థితిలో ఉంది. ఇళ్లకే పరిమితమైన ప్రజలు మొబైల్స్‌కే పరిమితమై న్యూస్, సమాచారం, ఎంటర్‌టైన్మెంట్ వంటి వాటిని అందులోనే వెతుక్కుంటున్నారు. ఈ విషయాన్ని బెంగళూరుకు చెందిన 'ఇన్‌మోబి గ్రూప్' నివేదిక వెల్లడించింది.

'కోవిడ్-19 కన్జుమర్ ఇన్‌సైట్స్' పేరుతో పలు విషయాలు వెల్లడించింది. జనవరి తొలి వారం నుంచి ఈ నెల 11 వరకు డేటా సిగ్నల్స్‌ను విశ్లేషించడం ద్వారా ఈ నివేదిక విడుదల చేసింది. దేశవ్యాప్తంగా లొకేషన్ ట్రెండ్స్, వినియోగదారుల ఇన్‌-యాప్ బిహేవియర్‌ను వెల్లడించింది. అది వెల్లడించిన వివరాల ప్రకారం.. బుక్స్, కామిక్ యాప్స్ వినియోగం 200 శాతం పెరగ్గా, గేమింగ్ యాప్స్ వినియోగం 110 శాతం పెరిగింది. ఇమేజ్, వీడియో ఎడిటింగ్ యాప్ వినియోగం 60 శాతం పెరిగింది. మొబైల్ బ్రౌజింగ్ యాప్ యాక్టివిటీ 37 శాతం పెరిగింది. మార్చి 5 నుంచి అయితే ఇమేజ్, వీడియో ఎడిటింగ్ యాప్ వినియోగం రాకెట్ స్పీడ్ అందుకుందని వివరించింది. ఫిబ్రవరి 12 నుంచి గేమింగ్ యాప్‌ల వినియోగం క్రమంగా పెరినట్టు పేర్కొంది.

పాఠశాలల మూసివేతతో బుక్స్, కామిక్స్ యాప్‌కు పాపులారిటీ పెరిగిందని, ఈ నెల తొలి వారం తర్వాత ఇటువంటి యాప్‌ల వినియోగం ఒక్కసారిగా పెరిగినట్టు తెలిపింది. మహారాష్ట్ర, కర్ణాటకలో స్కూళ్లు మూతపడిన తర్వాత లెర్నింగ్, రీడింగ్ యాప్స్‌కు డిమాండ్ పెరిగినట్టు నివేదిక వెల్లడించింది. జనవరి మాసాంతంలో బ్రౌజింగ్ యాప్‌ల వినియోగం పడిపోగా, దేశంలో తొలి కోవిడ్ నమోదైన తర్వాత బ్రౌజింగ్ యాప్‌ల వినియోగం అమాంతం పెరిగినట్టు వివరించింద’’ని ఆ కథనంలో తెలిపారు.

కరోనా రాకుండా ఊరంతా ఏకమై..

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా పలు గ్రామాల ప్రజలు సమష్ఠిగా కృషిచేస్తున్నారని ‘నమస్తే తెలంగాణ’ కథనం తెలిపింది.

‘‘తామే కాదు తమ ఊరు కూడా బాగుండాలని, ఊర్లో ఎవరూ ఈ వైరస్‌ బారిన పడకూడదని గ్రామాల పొలిమే రల్లో చెక్‌పోస్టులు పెట్టారు. ఒకరు రాళ్లు అడ్డం పెడితే, మరొకరు కంచె పాతారు. 'వేరే గ్రామస్థులు మా ఊరికి రావొద్దు.. మేము వేరే ఊరికి వెళ్లం' అంటూ స్పష్టంచేస్తున్నారు.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం గండికామారం గ్రామంలోకి నిత్యం భూపాలపల్లి నుంచి పదుల సంఖ్యలో పలువురు బైక్‌లపై వస్తుండటంతో.. సోమవారం స్థానికులు రోడ్డుకు అడ్డంగా ఇనుప కంచెను ఏర్పాటుచేశారు. అలాగే, గండికామారం వాసులు పక్క గ్రామాలకు వెళ్లకుండా కట్టడి చేశారు. గండికామారం గ్రామస్థులు చేసిన పనిని పలు గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు, సోషల్‌ మీడియా ద్వారా అభినందిస్తున్నారు.

లాక్‌డౌన్‌కు ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని పలు గ్రామాల ప్రజలు తమ గ్రామానికి ఎవరూ రావద్దంటూ ఇతర ప్రాంతాల నుంచి గ్రామానికి వచ్చే రోడ్లను మూసివేశారు. తాము కూడా ఎక్కడికీ వెళ్లమని, ఇతరులు కూడా తమ గ్రామానికి రావద్దంటూ ముక్తకంఠంతో తేల్చి చెప్పారు. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్‌ మండలం మార్లవాయి గ్రామ శివారులో స్థానికులు చెక్‌పోస్ట్‌ ఏర్పాటు చేసుకున్నార’’ని ఆ కథనంలో తెలిపారు.

‘లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ .. అడ్డగోలు దోపిడీ’

దేశం, రాష్ట్రమంతా కోవిడ్‌ మహమ్మారితో హడలెత్తిపోతుంటే.. ఈ ఆపత్కాలాన్ని కూడా వ్యాపారులు అవకాశంగా మలుచుకుంటున్నారని ‘సాక్షి’ కథనం తెలిపింది.

‘‘ ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ ప్రకటిం చిన నేపథ్యంలో కూరగాయల ధరలు పెం చేసి వ్యాపారులు సొమ్ము చేసుకున్నారు. లాక్‌డౌన్‌ విధిం చినప్పటికీ.. నిత్యావసర సరుకుల కొనుగోలుకు ప్రభుత్వం వెసులుబాటు ఇవ్వడంతో ప్రజ లంతా ఒక్కసారిగా మార్కెట్లకు ఎగబడ్డారు. దీంతో హైదరాబాద్‌ సహా అన్ని జిల్లాలు, మండల కేంద్రాల్లోని రైతు బజార్లు, సూపర్‌ మార్కెట్లు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయాయి. ఉదయం 7 గంటల నుంచే జనం కూరగాయల కొనుగోళ్లకు మొగ్గుచూపారు.

ఆదివారం జనతా కర్ఫ్యూ కొనసాగడంతో ఇళ్లకే పరిమితమైన జనం సోమవారం ఉదయం రోడ్లపైకి వచ్చారు. ఆదివారం మార్కెట్లోకి కూరగాయలు రాకపోవడంతో నిల్వలు తక్కువగా ఉండటం, డిమాండ్‌ అధికంగా ఉండటంతో వ్యాపారులు ధరలు పెంచేశారు. మెహదీపట్నం రైతుబజార్‌లో నిన్నమొన్నటి వరకు కిలో టమాట రూ.10 వరకు ఉండగా, సోమవారం ఏకంగా రూ.80 నుంచి రూ.100కు అమ్మారు. అధిక ధరలకు అమ్మొద్దని మార్కెట్‌ అధికారులు ప్రకటించి, ధరల నిర్ణయ సూచీ ఏర్పాటు చేసినా వ్యాపారులు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇదే బజార్‌లో పచ్చిమిర్చీ కిలో ఏకంగా రూ.100 వరకు అమ్మారు. ఇతర మార్కెట్లలో కూడా టామాట కిలో రూ.50 నుంచి రూ.80 వరకు అమ్మకం చేయగా, పచ్చిమిర్చి కిలో రూ.150 వరకు అమ్మినట్లు కొనుగోలుదారులు తెలిపారు. అన్ని రకాల కూరగాయలు కూడా నాలుగింతలు పెరిగాయి. వారం రోజులకు సరిపడా కొనుగోలు చేయడంతో మధ్యాహ్నం 12 గంటలకే స్టాక్‌లు ఖాళీ అయ్యాయి.

జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. కొన్ని చోట్ల పాలు, పెరుగుకు డిమాండ్‌ పెరిగింది. దీన్ని కూడా వ్యాపారులు సొమ్ము చేసుకున్నారు. పాల ప్యాకెట్‌పై రూ.5 వరకు పెంచినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బియ్యం, పప్పులు, నూనెల కొనుగోళ్లకూ గిరాకీ పెరిగింది. అయితే వీటి ధరల్లో మాత్రం పెరగలేదు.

ఆపత్కాలంలో అవసరాన్ని ఆసరాగా చేసుకుని సొమ్ము చేసుకునే వ్యాపారులపై కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే అనేక అపోహలు, అనుమానాల మధ్య బతుకుతున్న తమను నిలువు దోపిడీ నుంచి బయటపడేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అంటున్నారు. అడ్డగోలుగా కూరగాయల ధరలు పెంచి అమ్మడంతో ఏమీ కొనలేకపోతున్నామని, లాక్‌డౌన్‌ ప్రారంభమైన రోజే ఇలాంటి పరిస్థితి ఉంటే మరికొన్ని రోజులు పోతే ఎలా ఉంటుందన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కూరగాయల అమ్మకాలను పోలీసు పహారా లేదంటే మరే రూపంలోనైనా జరపాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రైతుబజార్లు, మార్కెట్లు, మాల్స్‌లో విపరీతంగా పెరిగిపోయిన ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఆంక్షలు విధించి కూరగాయలు అమ్మించాలని, నిత్య జీవితంలో కీలకమైన వీటిని కొనుగోలు చేసే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని అంటున్నారు. ఎక్కువ రేట్లకు అమ్ముతున్న వారిపై ఫిర్యాదు చేసే పరిస్థితి లేదని, ఎక్కడ ఫిర్యాదు చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో అవసరమైతే ప్రభుత్వం ఇందుకోసం కమిటీలు ఏర్పాటు చేయాలని, ఈ కమిటీ సభ్యులు రైతు బజార్లు, మార్కెట్లలో స్వయంగా ఉండి కూరగాయల విక్రయాలను నిర్వహించాలనే డిమాండ్‌ వినిపిస్తోంద’’ని ఆ కథనంలో తెలిపారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)