కరోనావైరస్‌పై కేసీఆర్ ప్రెస్‌మీట్: 'ప్రజలంతా ఆదివారం బంద్ పాటించాలి, వైరస్‌ను ఒంట్లోకి, ఇంట్లోకి రానివ్వొద్దు'

కేసీఆర్

ఫొటో సోర్స్, I&PR Telangana

ప్రచురణ

ఆదివారం రాష్ట్రం మొత్తం కర్ఫ్యూ పాటించాలని, ఎవరూ బయటకు రావద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారు. కూలీలు, కార్మికులు సైతం ఒక్క రోజు ఇళ్లకే పరిమితం కావాలని విజ్ఞప్తి చేశారు.

ఈ ప్రయత్నంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.

పదేళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వారు అత్యవసరం అయితే తప్పితే ఇళ్ల నుంచి బయటకు వెళ్లకూడదని కేసీఆర్‌ కోరారు.

కరోనావైరస్ పరీక్షల కోసం హైదరాబాద్‌లోని సీసీఎంబీని వాడుకోవాలని ప్రధానమంత్రి మోదీని తాను కోరగా, అందుకు ఆయన అంగీకరించారని ముఖ్యమంత్రి చెప్పారు.

తెలంగాణకు ఇతర రాష్ట్రాల బస్సులు రావద్దని, రేపు (ఆదివారం) హైదరాబాద్ మెట్రో బంద్ చేస్తామని తెలిపారు.

కరోనావైరస్ జాగ్రత్తలు

సీఎం ఇంకా ఏమన్నారంటే...

రాష్ట్రంలో ఇప్పటి వరకు 21 మందికి కరోనా వైరస్ సో కినట్లు పాజిటివ్ వచ్చింది.

సుమారు 700 మంది అనుమాతులను పరీక్షిస్తున్నాం. వాళ్లందరూ విదేశాల నుంచి వచ్చినవారే. వారిని 14 రోజులు పర్యవేక్షణలో ఉంచిన తర్వాత నెగెటివ్ వస్తే ఇళ్లకు పంపిస్తాం.

రాష్ట్ర సరిహద్దుల్లో 52 చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. 78 సంయుక్త బృందాలను మోహరించాం. రాష్ట్రవ్యాప్తంగా 5,274 పర్యవేక్షణ బృందాలు పనిచేస్తున్నాయి.

ఆరోగ్య శాఖ మంత్రి ఆద్వర్యంలో సీనియర్ నిపుణుల కమిటీ వేశాం. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను, రాష్ట్రంలో పరిస్థితులను ఆ బృందం నిరంతరం పర్యవేక్షిస్తుంది.

విదేశాల నుంచి ఇప్పటి వరకు 20 వేల మందికి పైగా వచ్చారు.

విదేశాల నుంచి వచ్చినవారికి దండం పెట్టి చెబుతున్నా, మీరు కూడా మా రాష్ట్ర బిడ్డలే కానీ, ప్రభుత్వానికి మీరు సహకరించాలి. ప్రయాణాలు చేయొద్దు. నియంత్రణ పాటించండి.

మీ అంతట మీరే స్వచ్ఛందంగా వైద్యులను సంప్రదించండి. మీరు అలా చేస్తే అందరూ క్షేమంగా ఉంటారు. వారి కుటుంబ సభ్యులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.

ఇది మీ సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత లక్షణాలు ఉంటే తక్షణమే వైద్యులను సంప్రదించండి.

మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. అన్ని వైద్య సదుపాయాలు కల్పిస్తుంది. మందులు ఇస్తుంది. మీరేమీ భయపడొద్దు.

రాష్ట్ర ప్రజలను కాపాడుకునేందుకు ఎన్ని వేల కోట్ల రూపాయలు అయినా ఖర్చు చేస్తాం.

కేసీఆర్

ఫొటో సోర్స్, Telanganacmo

తెలంగాణ ఎపిడమిక్ డిసీజెస్ కోవిడ్-19 రెగ్యులేషన్స్-2020 విడుదల

తెలంగాణలో 22 మందికి ఈ వ్యాధి నిర్థరణ అయింది. అయితే, శనివారం మొదటిసారిగా ఒక స్థానికుడికి కరోనావైరస్ సోకినట్లు గుర్తించారు. పేషెంట్ నంబర్ 14తో కలిసిన ఒక వ్యక్తికి కరోనా సోకిందని నిర్థరించారు. కోవిడ్ వ్యాధికి గురైన వారిలో ఒకరు డిశ్చార్జి అయ్యారు.

వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. 1897 నాటి ఎపిడమిక్ చట్టానికి లోబడి, 'తెలంగాణ ఎపిడమిక్ డిసీజెస్ కోవిడ్-19 రెగ్యులేషన్స్-2020'ను విడుదల చేసింది.

కరోనా వ్యాప్తి నిరోధంలో భాగంగా ప్రభుత్వ సంస్థలు, పౌరులు కచ్చితంగా పాటించాల్సిన నిబంధనలను ఇందులో పొందుపరిచారు. దీని ప్రకారం అనుమానితులపై స్వయంగా తమకు తామే ప్రభుత్వానికి రిపోర్టు చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసేవారిపై చర్యలు తీసుకునే అధికారం కూడా ప్రభుత్వానికి వచ్చింది.

ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన ఈ జీవో-13 ప్రకారం వైద్య సంస్థలు, స్థానిక సంస్థలు, పోలీసులకు అదనపు అధికారాలు దక్కాయి. ప్రైవేటు ఆసుపత్రులపై కూడా పరీక్షలు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అంతేకాకుండా, సహకరించని వారిపై ఐపిసి-188 సెక్షన్ (ప్రభుత్వం ఆదేశాలకు పౌరులు బద్ధులై ఉండాలి) కింద కేసులు కూడా నమోదు చేయవచ్చు.

కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

ఆదివారం సకలం బంద్

ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు రాష్ట్రమంతా జనతా కర్ఫ్యూ పాటిద్దాం. ఇది మనకోసం మనమే చేస్తున్నాం.

మరెవరికోసమే చేయడంలేదు. ఈ విషయంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలవాలి.

ఆర్టీసీ బస్సులన్నీ పూర్తిగా రద్దు చేస్తున్నాం. సరిహద్దు బస్సులను రాష్ట్ర సరిహద్దుల దగ్గరే ఆపేస్తాం. ఎట్టిపరిస్థితుల్లోనూ రానివ్వం.

దుకాణాలు, షాపింగ్ మాళ్లు అన్నీ స్వచ్ఛందంగా పూర్తిగా మూసివేయాలని కోరుతున్నాను.

పాలు, వైద్య సేవల, నీటి సరఫరా సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది లాంటి అత్యవసర సేవలకు సంబంధించిన వారు మాత్రమే ఆదివారం పనిచేయాలి. మిగతావారంతా ఇళ్లలోనే ఉండాలి. అది మనందరికీ సాధ్యమే. పెద్ద కష్టమేమీ కాదు.

కరోనావైరస్ ప్రభావం మహారాష్ట్రలో ఎక్కువగా ఉంది. కాబట్టి, రెండు రోజులు పరిస్థితిని చూసి, అవసరమైతే ఆ రాష్ట్రంతో సరిహద్దులను పూర్తిగా మూసివేసే దిశగా ఆలోచిస్తాం.

మీడియా ప్రతినిధులు బయటకు వెళ్లినా కనీసం ఇతరుల నుంచి మీటరు దూరంలో ఉండండి.

పదేళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడినవారు రెండు వారాల పాటు ఇళ్ల నుంచి బయటకు రాకుంటే మంచిది.

వైద్యులకు ఇన్‌ఫెక్షన్ సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వారికి అవసరమైన అన్ని రకాల సామగ్రి అందుబాటులో ఉంచాం. ఎలాంటి అసౌకర్యం లేకుండా చూస్తున్నాం.

కేసీఆర్

ఫొటో సోర్స్, Telanganacmo

ప్రధాని మాటలను అవహేళన చేస్తారా?

ప్రధానమంత్రి పిలుపును కూడా అవహేళన చేసే విధంగా కొందరు పనికిమాలినోళ్లు మాట్లాడుతున్నారు. అది మంచిది కాదు. వారిని అవసరమైతే అరెస్టు చేయాలి. వారికి బుద్ధి రావాలి.

జాతి ఐక్యత కోసం ప్రధానమంత్రి పిలుపు ఇస్తే, దానిని అవహేళన చేయడం మంచిపని కాదు.

ప్రధాని పిలుపు మేరకు ఆదివారం సాయంత్రం 5 గంటలకు అందరూ బయటకొచ్చి చప్పట్లు కొట్టి ఐక్యతను చాటిచెప్పాలని కోరుతున్నాను.

కరోనావైరస్ లక్షణాలు

పరిస్థితి విషమిస్తే అన్నీ మూసేస్తాం

కరోనావైరస్ వ్యాప్తి మరింత ఎక్కువైతే రాష్ట్రం మొత్తాన్ని మూసేసి, ప్రభుత్వమే నిత్యావసరాలు ఇళ్లకు పంపించే ఏర్పాటు చేస్తాం. కరీంనగర్‌లో ఇండోనేషియా నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోనా సోకినట్లు తేలింది.

ఆ జిల్లాలో 50 వేల మందికి పరీక్షలు చేయగా, ఎవరిలోనూ కరోనావైరస్ లక్షనాలు బయటపడలేదు. ఇండోనేషియా వారు ప్రయాణించిన ఆటో డ్రైవర్‌కు కూడా లక్షణాలు లేవు.

ఎవరైనా ధరలు పెంచి వ్యాపారం చేస్తే కఠినంగా వ్యవహరిస్తాం.

వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)