You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'నా ప్రాణాలకు ముప్పు...' ఏపీ ఎన్నికల కమిషనర్ పేరుతో లేఖ, ధ్రువీకరించని రమేశ్ కుమార్: ప్రెస్‌రివ్యూ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల పరిస్థితులను వివరిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్ రాసినట్లుగా ఉన్న ఒక లేఖ బుధవారం కేంద్ర హోంశాఖకు చేరిందని, ఆ లేఖలో ప్రస్తావించిన అంశాలు రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయని ఈనాడు ఒక కథనం ప్రచురించింది.
కానీ, 'ఈ లేఖ మీరు రాసిందేనా' అని ఈనాడు ప్రతినిధి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్‌ను ప్రశ్నించగా, ఆయన దానిని ధ్రువీకరించలేదు అని అందులో రాశారు.
'ఆంధ్రప్రదేశ్‌లో నాకు, నా కుటుంబానికి ఎలాంటి భద్రతా లేదు. కేంద్రప్రభుత్వ బలగాలతో రక్షణ కల్పించాలి. ఇక్కడి పాలకుల్లోని ఉన్నతస్థాయి నాయకుల అసహనం, వారి ఫ్యాక్షన్ చరిత్ర, కక్షసాధింపు వైఖరితో ఈ నిర్ణయానికి వచ్చాను' అని ఆ లేఖలో రమేశ్‌కుమార్ పేర్కొన్నట్లుగా ఉందని ఈనాడు చెప్పింది.
ఆ లేఖలో ఉన్న విషయాలు స్థూలంగా ఇలా ఉన్నాయి..''రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో నాకు, నా కుటుంబానికి భద్రత విషయంలో చాలా ఆందోళన చెందుతున్నాను.
ఈ సమయంలో నేను హైదరాబాద్‌లో ఉండటమే కొంత సురక్షితం. అలాగని పూర్తిగా కాదు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతుండటంతో ఎన్నికల సంఘం కార్యాలయంలోనే పోలీసుల రక్షణలో ఉంటున్నాను. పూర్తి రక్షణ లేకుండా బయటకు వెళ్లే సాహసం చేయలేకపోతున్నాను.
ఎన్నికల ప్రక్రియ పూర్తయిపోతే నాకు, నా కుటుంబానికి ప్రమాదం పొంచి ఉంటుంది. నా శ్రేయోభిలాషులు, నాతో కలిసి పనిచేసేవారు, భద్రతా వ్యవహారాల్లో అనుభవం ఉన్నవారూ నన్ను జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్నారు. నాకు వస్తున్న బెదిరింపులపై రాష్ట్ర యంత్రాంగానికి పూర్తి అవగాహన ఉన్నట్లు లేదు.
నాపైనా, నా కుటుంబసభ్యులపైనా భౌతికదాడులు చేస్తామని భయపెడుతున్నారు. ప్రస్తుత పాలకుల్లోని ఉన్నతస్థాయి నాయకుల అసహన వైఖరి, ప్రతీకారేచ్ఛలను పరిగణనలోకి తీసుకుని నాకు, నా కుటుంబసభ్యులకు ఆపద ఏర్పడిందని ఆందోళన చెందుతున్నాను.
ఈ పరిస్థితుల్లో కేంద్ర హోంశాఖను శరణు కోరడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదు. కేంద్ర రక్షణ బలగాలను అందించి మాకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నాను. ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతవరకు ఈ రక్షణ ఏర్పాట్లు కొనసాగాలి.
ఈ ప్రభుత్వం నాకు వ్యతిరేకంగా ఉన్నందువల్ల వారి అనుయాయులు, నేరగాళ్లు నాపై దాడికి సిద్ధంగా ఉన్నారు. వారి నేరచరిత్రను దృష్టిలో ఉంచుకుని ఈ బాధాకరమైన అభిప్రాయానికి వచ్చాను'' అని లేఖలో ఉందని ఈనాడు చెప్పింది.
దీనిని తానే రాసినట్లు ఆయన ధ్రువీకరించలేదని రాసింది.
కరీంనగర్‌లో కరోనా కలకలం
ఇండోనేషియా నుంచి కరీంనగర్ వచ్చినవారిలో ఏడుగురికి కోవిడ్-19 పాజిటివ్ రావడంతో నగరంలో హై అలర్ట్ ప్రకటించినట్లు నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.
కరీంనగర్‌లో కరోనా కలకలం సృష్టించింది. ఇండోనేషియా నుంచి జిల్లాకేంద్రానికి వచ్చినవారిలో ఏకంగా ఏడుగురికి కొవిడ్-19 పాజిటివ్ రావడంతో ఆందోళన వ్యక్తమైంది.
ఈ పరిణామంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తంచేసింది. ఇండోనేషియా దేశస్థులు కరీంనగర్‌లో ఎక్కడెక్కడ సంచరించారో గుర్తించి ఆయా ప్రాంతాల్లో కట్టడికి చర్యలు చేపట్టింది అని కథనంలో రాశారు.
కరీంనగర్‌లో పూర్తిగా శానిటైజేషన్ చర్యలను చేపట్టింది. ప్రభుత్వం చర్యలకు, అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని మంత్రి గంగుల కమలాకర్ విజ్ఞప్తిచేశారు.
ఈ నెల 14న ఇండోనేషియాకు చెందిన పదిమంది మత ప్రచారకులు కరీంనగర్‌కు వచ్చారు. రైలులో ఢిల్లీ నుంచి రామగుండం వచ్చిన వీరు ఆటోలో కరీంనగర్ చేరుకొన్నారు.
అనంతరం స్థానికంగా మత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నెల 16న వీరిని గుర్తించిన అధికారులు కరీంనగర్ జిల్లా కేంద్ర దవాఖానకు, అక్కడి నుంచి హైదరాబాద్ గాంధీ దవాఖానకు పంపించారు.
గాంధీ దవాఖానలో పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. వారి నమూనాలను పుణె వైరాలజీ కేంద్రానికి పంపించారు. బుధవారం పుణె నుంచి వచ్చిన నివేదికలో ఏడుగురికి కొవిడ్-19 పాజిటివ్‌గా తేలింది అని నమస్తే తెలంగాణ వివరించింది.
ఇండోనేషియా వ్యక్తులు కరీంనగర్‌లో 48 గంటలపాటు ఉన్నట్టు గుర్తించామని.. ఆ సమయంలో వారు కలెక్టరేట్ పరిధిలోని ఓ ప్రార్థనామందిరంలో ఉన్నట్లు గుర్తించామని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు.
కలెక్టరేట్ కేంద్రంగా మూడు కిలోమీటర్ల పరిధిలోని ప్రతి ఇంట్లో వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు.
గురువారం నుంచి వంద వైద్య బృందాలను రంగంలోకి దింపుతున్నామని, అత్యవసరమైతే తప్ప ప్రజలు నాలుగురోజుల పాటు ఇండ్లనుంచి బయటకు రావద్దని మంత్రి కోరినట్లు నమస్తే తెలంగాణ రాసింది.
కరోనా వస్తుందని నిరూపిస్తే రూ.కోటి
చికెన్ తింటే కరోనా వస్తుందని నిరూపిస్తే రూ.కోటి బహుమతి ఇస్తానని తమిళనాడులో నామక్కల్‌కు చెందిన వ్యాపారి, మార్కెటింగ్ సొసైటీ సభ్యుడు వాంగిలి సుబ్రమణ్యం సవాలు విసిరారని ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.
వదంతుల కారణంగా తమ వ్యాపారం దారుణంగా దెబ్బతిందని, కరోనా భయంతో రాష్ట్రంలో గుడ్డు, చికెన్ ధరలు దారుణంగా పడిపోయాయని ఆయన చెప్పారని రాసింది.
తమిళనాడులో రూ.4.50కు విక్రయించే గుడ్డు ధర 1.50కు పడిపోయిందని, కిలో రూ.80 నుంచి రూ.90కి విక్రయించే చికెన్ రూ.5 నుంచి రూ.10కి అమ్మే పరిస్థితులు నెలకొన్నాయని ఆయన వాపోయారు.
సోషల్ మీడియాలో వదంతులను వ్యాపింపజేయడమే ఇందుకు కారణం అని, ఈ వదంతుల వల్ల రూ.వందల కోట్లు నష్టపోయామని సుబ్రమణ్యం స్పష్టం చేశారని కథనంలో రాశారు.
చికెన్, గుడ్లు తినడం వల్ల కరోనా వస్తుందని రుజువు చేస్తే రూ.కోటి బహుమతిగా ఇస్తామని ఆయన తెలిపారు. కరోనా వెలుగు చూసిన దేశంలోనే ప్రజలు చికెన్ తింటున్నారని, ఇలాంటి వదంతులను ప్రజలు నమ్మరాదని ఆయన విజ్ఞప్తి చేశారని ఆంధ్రజ్యోతి వివరించింది.
ఉగాది రోజు 26 లక్షల మందికి ఇళ్లపట్టాలు
ఉగాది పర్వదినం సందర్భంగా ఈ నెల 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు వేగవంతం చేసిందని సాక్షి రాసింది.
స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేసిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఎత్తివేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆంక్షలు తొలగిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో ఇళ్ల పట్టాల పంపిణీతోపాటు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు అవరోధం తొలగిపోయింది. ఈ నేపథ్యంలో 'నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు' కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాల్లో 26 లక్షల మందికి నివాస స్థల పట్టాలను కన్వేయన్స్ డీడ్స్ (విక్రయ దస్తావేజుల) రూపంలో ఇచ్చేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేసిందని పత్రిక రాసింది.
ఇళ్ల స్థలాల కోసం భూమి ఇచ్చిన వారికి పరిహారం చెల్లింపు, ప్లాట్ల అభివృద్ధి కోసం రెవెన్యూ శాఖ తాజాగా బుధవారం రూ.1,400 కోట్లు విడుదల చేసిందని చెప్పింది.
త్వరితగతిన ఫ్లాటింగ్, పట్టాలను సిద్ధం చేయాలని రెవెన్యూ అధికారులు జిల్లాల అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారని సాక్షి వివరించింది..
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: కొనసాగుతున్న స్టాక్ మార్కెట్ల పతనం
- కరోనావైరస్తో మన రోగనిరోధక వ్యవస్థ ఎలా పోరాడుతుందంటే..
- కరోనావైరస్: రోగుల ప్రాణాలను కాపాడుతున్న త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ
- డెబిట్-క్రెడిట్ కార్డులతో ఆన్లైన్ లావాదేవీలకు కొత్త నిబంధనలు... ఇవాళ్టి నుంచే అమలు
- పెళ్లికి ముందు అమ్మాయిని మళ్లీ కన్యగా మార్చే సర్జరీలు ఎందుకు?
- కరోనావైరస్: తెలంగాణలో పకడ్బందీ చర్యలు.. మార్చి 31 వరకే వివాహాలకు అనుమతి..
- కరోనావైరస్ సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: తిరుమలకి భక్తుల రాకపోకలపై ప్రభావం ఎలా ఉంది?
- కరోనావైరస్: ట్రంప్ చెప్పిన ఆరు గొప్పలు.. అందులో నిజానిజాలు
- ‘నేను చనిపోయినా ఫరవాలేదు.. ఈ వ్యాధిని ఆఫ్రికాకు మోసుకెళ్లకూడదని చైనాలోనే ఉండిపోయాను’
- కరోనావైరస్ గురించి ఈ సినిమా 10 ఏళ్ల కిందే చెప్పిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)