You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆంధ్రప్రదేశ్: స్థానిక ఎన్నికల ఎఫెక్ట్.. టీడీపీ నుంచి వైసీపీకి వలసలు- ప్రెస్‌రివ్యూ
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలతో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయని 'ఆంధ్రజ్యోతి' ఒక కథనంలో తెలిపింది.
''అధికార వైసీపీ ప్రతిపక్ష పార్టీలోని కీలక నేతలను తమ వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. టీడీపీకి పట్టున్న జిల్లాల్లో ఆ పార్టీని దెబ్బతీయడమే టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తాజా రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ హవా రాష్ట్రమంతా కనిపించినా.. విశాఖలో మాత్రం టీడీపీ నాలుగు అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. ఇలాంటి చోట్ల టీడీపీని సంస్థాగతంగా దెబ్బకొట్టాలని, ఆ పార్టీలోని కీలక నేతలపై వైసీపీ గురిపెట్టింది. ఇందులో భాగంగానే.. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. ఆయన త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇదే విశాఖ జిల్లాలో రెహమాన్, బాలరాజు, తైనాల, చింతలపూడి వెంకట్రామయ్య ఇప్పటికే వైసీపీ కండువా కప్పుకున్నారు.
ప్రకాశం జిల్లాకు చెందిన కనిగిరి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత కదిరి బాబూరావుకు పార్టీ కండువా కప్పి జగన్ ఆహ్వానించారు. ఇదే జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కూడా టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. కడప జిల్లాలో పులివెందుల సతీష్ రెడ్డి, జమ్మలమడుగు రామసుబ్బారెడ్డి టీడీపీని వీడార''ని ఆ కథనంలో పేర్కొన్నారు.
మాస్క్‌లు, శానిటైజర్ల ధరలు పెంచి అమ్మితే చర్యలు తీసుకోండి: హైకోర్టు
కరోనా నేపథ్యంలో మార్కెట్లో మాస్కులు, శానిటైజర్ల ధరలను విపరీతంగా పెంచడంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిందని 'ఈనాడు' కథనం తెలిపింది.
''డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు తనిఖీలు నిర్వహించి వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుత పరిస్థితుల్లో మాస్కులు, శానిటైజర్లను నిత్యవసరాలుగా పరిగణించాలని సూచించింది. కరోనా అనుమానితుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డుల బృందం పనితీరు, ప్రయివేటు ఆసుపత్రుల్లో చికిత్సలు ఎలా అందుతున్నాయి.. ఎన్ని పరీక్షలు నిర్వహించారు.. ఎన్ని ప్రత్యేక వార్డులున్నాయి వంటి వివరాలన్నీ అందించాలని కోరింద''ని ఆ కథనంలో వివరించారు.
ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు
కరోనావైరస్ వైరస్ సెగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు తగిలిందని 'సాక్షి' కథనం తెలిపింది.
''ఇన్నేళ్లుగా ప్రతీ వేసవిని ధనాధన్ మెరుపులతో అలరించిన ఈ లీగ్ ఇప్పుడైతే అటు స్పాన్సర్లని, ఫ్రాంచైజీలనే కాదు... ఇటు పాలకమండలినీ దడదడలాడిస్తోంది. మొత్తం మీద ఆట సాగినా... మునుపటిలా జరగనే జరుగదు. కళ తప్పిన 'షో'గా ఇంకా చెప్పాలంటే గేట్లన్నీ మూసేసి గుట్టుగా... గప్‌చుప్‌గా జరుగుతుంది.
ప్రాణాంతక వైరస్ 'కోవిడ్19' చూస్తుండగానే 'గ్లోబ్'ను చుట్టేసింది. చైనాలో పుట్టి ప్రపంచమంతా పాకింది. వేల మందిని చంపేసింది. లక్ష మందికిపైగా సోకింది. కొన్ని దేశాలైతే ప్రజల్ని బయటికే రాకుండా గృహనిర్భంధంలో ఉంచుతున్నాయి. కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్లు వాయిదా పడ్డాయి. కొన్నయితే ఈ ఏడాదికి రద్దయిపోయాయి కూడా! విదేశీ రాకపోకలతో ఈ మధ్యే భారత్‌కు వచ్చింది. దీని ప్రభావం తెలిసిన భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. అందుకే ఐపీఎల్‌పై నాన్చకుండానే తేల్చేసింది.
ఆటను ఆపం... కానీ ప్రేక్షక సమూహాన్ని మాత్రం అనుమతించబోమని స్పష్టం చేసింది. 'జన సమూహం మధ్య ఎలాంటి క్రీడల ఈవెంట్లకు అనుమతి లేదు. అయితే ఏ క్రీడను, లీగ్‌ను అడ్డుకోం. ప్రేక్షకుల్లేకుండా పోటీలను నిర్వహించుకోవచ్చు' అని కేంద్ర క్రీడాశాఖ వెల్లడించింది. ఈ శాఖ కార్యదర్శి రాధేశ్యామ్ మాట్లాడుతూ 'జాతీయ ఆరోగ్య మిషన్, ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సహా జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్‌ఎస్‌ఎఫ్)లన్నింటికీ స్పష్టంగా తెలియజేశాం. ప్రేక్షకుల మధ్య లీగ్, పోటీల నిర్వహణ కుదరదని చెప్పాం' అని అన్నారు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈ నెల 14న జరిగే ఐపీఎల్ పాలకమండలి సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించినప్పటికీ... బిజీ షెడ్యూలు వల్ల అటు వాయిదా వేయలేదు. ఇటు వేరే దేశంలో నిర్వహించనూ లేరు. ఎన్నికల సందర్భంగా 2009, 2014లలో విదేశాల్లో నిర్వహించింది. కానీ ఇప్పుడున్న 'కరోనా మహమ్మారి' దృష్ట్యా ఏ దేశం నిర్వహణకు సిద్ధంగా లేదు. కాబట్టి ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకోవాల్సిందే. ప్రేక్షకుల్లేకుండానే ఈ సీజన్ ధనాధన్ కాస్తా చప్పగా సాగే అవకాశముంద''ని ఆ కథనంలో తెలిపారు.
నేడు ఆర్టీసీ ఉద్యోగుల ఖాతాల్లోకి సమ్మెకాల వేతనం
ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకాలాన్ని ప్రత్యేక సెలవుగా పరిగణిస్తూ టీఎస్‌ఆర్టీసీ ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. సమ్మెకాలానికి సంబంధించిన 55 రోజుల జీతభత్యాలను ఈ రోజు కార్మికుల ఖాతాల్లో జమ చేయనుందని 'నమస్తే తెలంగాణ' కథనం తెలిపింది. ఇందుకోసం ఆర్థికశాఖ రూ. 235 కోట్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది అక్టోబర్ 5 నుంచి నవంబర్ 28 మధ్యకాలంలో జరిగిన సమ్మెకాలాన్ని ప్రత్యేక సెలవు (స్పెషల్ క్యాజువల్ లీవ్)గా పరిగణిస్తున్నట్లు ఆర్టీసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. సమ్మెకాలంలో మరణించినవారికి, ఉద్యోగవిరమణ చేసినవారికి కూడా తుది వేతన లెక్కింపులో ఈ 55 రోజుల వేతనం కలుస్తుందని ప్రకటనలో తెలిపింది.
ఇవి కూడా చదవండి
- కరోనావైరస్: వేడిలో బతకలేదు.. వెల్లుల్లి తింటే నయమైపోతుంది - ఇవన్నీ తప్పుడు ఆరోగ్య సలహాలు, వీటిని పట్టించుకోకండి
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనావైరస్: నిమ్మరసంతో కరోనా ఆగుతుందా? ఇటలీలో ఫేక్ న్యూస్ వెల్లువ
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల జీవోల్లో ఎందుకంత రహస్యం?
- కరోనావైరస్: మహమ్మారిని నిరోధించటానికి వివిధ దేశాలు చేపడుతున్న చర్యలు ఏమిటి?
- ప్రపంచంలోనే హెచ్ఐవీని జయించిన రెండో వ్యక్తి.. ఎలా నయమయ్యిందంటే?
- కరోనావైరస్: కేంద్ర మంత్రుల విదేశీ పర్యటనలు రద్దు.. దిల్లీలో సినిమా హాళ్లు, స్కూళ్లు, కాలేజీలు బంద్
- ఇటలీ: రోమ్ ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయిన విద్యార్థులకు ఊరట.. వైద్య పరీక్షలు జరిపిస్తామన్న భారత ప్రభుత్వం
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ గురించి ఈ సినిమా 10 ఏళ్ల కిందే చెప్పిందా?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- కరోనావైరస్: జంతువుల నుంచి మనుషులకు సోకింది ఇలాగేనా? శాస్త్రవేత్తల ‘డిటెక్టివ్ కథ’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)