You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ముకేశ్ అంబానీ సంపాదన గంటకు ఏడు కోట్లు : ప్రెస్ రివ్యూ
భారత్‌లో కుబేరుల సంఖ్య జోరుగా పెరుగుతోందంటూ ఆంధ్రజ్యోతి ఓ వార్తను ప్రచురించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ భారత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారని ఈ కథనంలో తెలిపారు.
గత ఏడాది మన దేశంలో సగటున ప్రతి నెలలో ముగ్గురు డాలర్ బిలియనీర్లు ఆవిర్భవించారు. 34 మంది కొత్త బిలియనీర్లు జతకావడంతో దేశంలోని వారి సంఖ్య ఏడాదికాలంలో 138కి ఎగబాకింది. ఓ వైపు దేశంలో ఆర్థిక మందగమనం సాగుతున్నప్పటికీ వారి సంఖ్య గణనీయంగా పెరగడం విశేషం.
ప్రపంచవ్యాప్తంగా చూస్తే బిలియనీర్లలో భారత్ మూడోస్థానంలో నిలిచిందని హురున్ గ్లోబల్ రిచ్ 2020 జాబితా వెల్లడించింది. వీరిలో రిలయన్స్ ఇండస్ర్టీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు.
ఆయన ఆస్తుల నికర విలువ 6,700 కోట్ల డాలర్లు(సుమార రూ.4.8లక్షల కోట్లు). అంటే ఆయన గంటకు రూ. 7 కోట్లు సంపాదిస్తున్నట్టు లెక్క తేల్చారు . ప్రపంచ కుబేరుల్లో ముకేశ్ అంబానీ తొమ్మిదో స్థానంలో ఉన్నారు.
ప్రపంచ బిలియనీర్లలో 14,000 కోట్ల డాలర్లతో అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ అగ్రస్థానంలో నిలిచారు. దేశంలోని సంపన్నుల్లో ఎస్‌పీ హిందుజా కుటుంబం (2,700 కోట్ల డాలర్లు) రెండో స్థానంలో, గౌతమ్ అదానీ (1,700 కోట్ల డాలర్లకు పైగా) మూడో స్థానంలో, శివ్ నాడార్ ఆయన కుటుంబం ( దాదాపు 1,700 కోట్ల డాలర్లు) నాలుగో స్థానంలో, లక్ష్మీ మిట్టల్ (1,500 కోట్ల డాలర్లు) ఐదో స్థానంలో నిలిచారు.
ఓయో వ్యవస్థాపకుడు 24 ఏళ్ల వయసున్న రితేష్ అగర్వాల్ సంపద 110 కోట్ల డాలర్లుగా ఉంది. దేశంలో అతి పిన్న వయసు సంపన్నుడు ఈయనే కావడం విశేషం.
భార్యకు చిత్రహింసలు- కొడుకుతో వీడియో చిత్రీకరణ
తెలంగాణలోని వనపర్తి జిల్లా నుంచి ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చిన ఓ కుటుంబంలో భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను చిత్రహింసలు పెడుతూ కుమారుడితోనే వీడియో తీయించేవాడంటూ ఈనాడు ఓ కథనాన్ని ప్రచురిచింది ఆవివరాలు ఇవి.
రెండు రోజుల క్రితం భార్యను తీవ్రంగా హింసించిన ఆమె భర్త తల పగులగొట్టాడు. ఆపై వివస్త్రను చేశాడు. తన 14 ఏళ్ల కుమారుడితో అదంతా వీడియో తీయించాడు.
ఆపై ఆమె తలపై బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమయ్యింది. చివరకు ఎలాగోలా తప్పించుకొని వచ్చి వనపర్తి పోలీసుల్ని ఆశ్రయిచింది.
మెరుగైన వైద్యం కోసం ఆమెను మహబూబ్‌నగర్ ఆస్పత్రికి పంపారు పోలీసులు. సెల్ ఫోన్లో చిత్రీకరించిన దృశ్యాలు చూస్తే ఎవ్వరైనా చలించకతప్పదని భర్తను ఆమెను అత్యంత దారుణంగా హింసించారని ఎస్సై వెంకటేశ్వర్ గౌడ్ తెలిపినట్టు ఈ కథనంలో ఈనాడు తెలిపింది.
వికేంద్రీకరణపై కౌంటర్ దాఖ చెయ్యండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనుల కొనసాగింపు, హైకోర్టు తరలింపు వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చెయ్యాలని హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన ఆదేశాలపై సాక్షి ఓ కథనాన్ని ప్రచురించింది. తదుపరి విచారణను కోర్టు మార్చి 17కి వాయిదా వేసిందని ఈ వార్తలో తెలిపింది.
అలాగే పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులను, జీఎన్ రావు, బోస్టన్ కమిటీ , హైపవర్ కమీటలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై కూడా కౌంటర్ దాఖలు చెయ్యాలని కోర్టు ఆదేశించినట్టు సాక్షి ఈ కథనంలో చెప్పింది.
రాజధాని విషయంలో రక రకాల వ్యాజ్యాలు దాఖలై గందరగోళ పరిస్థితి నెలకొన్న దృష్ట్యా అంశాల వారీగా పిటిషన్లను వేరు చెయ్యాలని రిజిస్ట్రీకి ధర్మాసనం సూచించిందని పేర్కొంది.
మరోవైపు రాజధాని ప్రాంతంలోని 1250 ఎకరాలను పేదల ఇళ్ల పథకం కోసం కేటాయిస్తూ ఈ నెల 25న ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ కూడా కొన్ని పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి.
వాటిపై బుధవారం మధ్యాహ్నం నుంచి ధర్మాసనం విచారణలు ప్రారంభించింది. ఇవాళ కూడా వాదనలు కొనసాగనున్నాయని సాక్షి ఈ కథనంలో వివరించింది.
జనగణనతోనే NCR
తెలంగాణ రాష్ట్రంలో జనాభా లెక్కలకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని జనగణనతో పాటే జాతీయ పౌరసత్వ జాబితా (ఎన్‌సీఆర్) వివరాలు కూడా నవీకరించనున్నారంటూ నమస్తే తెలంగాణ ఓ కథనాన్ని ప్రచురించింది.
దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30లోగా జనాభా లెక్కల సేకరణ పూర్తి చేయాలని నిర్ణయించారు.
ఈ వ్యవధిలోనే రాష్ట్రాలు 45 రోజుల్ని ఎంచుకొని ఈ పని పూర్తి చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో పదేళ్ల క్రితం ఏప్రిల్ 26 నుంచి జూన్ 10 వరకు తెలంగాణలో జనగణన చేపట్టారు. సాధారణంగా ఈ పనికి ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని వినియోగిస్తుంటారు కనుక ఈ సారి కూడా వేసవి సెలవుల్లోనే జనగణనను చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎన్సీఆర్‌కి సంబంధించి కుటుంబ యజమానికి తెలిసిన వివరాలు చెబితే చాలని అధికారులు ఎటువంటి ధ్రువపత్రాలు అడగరని కేంద్రం చెబుతున్నట్టు ఈ కథనంలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి.
- బంగారం ధర ఏడేళ్ళలో ఎన్నడూ లేనంత పెరిగింది... ఎందుకిలా?
- కరోనావైరస్ వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోతున్న చైనా కంపెనీలు
- కరోనా వైరస్: వూహాన్లో ఏం జరుగుతోందో ప్రపంచానికి చూపించిన రిపోర్టర్స్ మిస్సింగ్
- 'గ్రహాంతర వాసుల అన్వేషణను మరింత సీరియస్గా తీసుకోవాలి.. ప్రభుత్వాలు భారీగా నిధులివ్వాలి'
- వుహాన్ డైరీ: మరణించడానికి మూడు గంటల ముందు ఆయనకు హాస్పిటల్ బెడ్ దొరికింది
- డోనల్డ్ ట్రంప్: ముగిసిన రెండు రోజుల భారత పర్యటన
- BBC Indian Sportswoman of the Year 2019: విజేత ఎవరో మార్చి 8న ప్రకటిస్తాం
- కరోనావైరస్: వన్య ప్రాణులను తినడాన్ని నిషేధించిన చైనా ప్రభుత్వం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)