You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పవన్ కల్యాణ్: మాకున్న ఒక్క ఎమ్మెల్యే పార్టీతో ఉన్నారో లేదో తెలీదు :ప్రెస్ రివ్యూ
పార్టీలో ఉండాలని ఎవరినీ బలవంతం చేయను అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నట్లు ఈనాడు కథనం ప్రచురించింది.
ఎన్నికలప్పుడు చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చి ఇప్పుడు తన పద్ధతుల బాగాలేవని విమర్శించి వెళ్లిపోయే మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని పవన్ అన్నారని చెప్పింది.
పార్టీని ముడి ఖనిజంగా ఉపయోగించుకునేవారికి తాను అర్థం కానని, అలాంటి వాళ్లు విమర్శించినా పట్టించుకోనని స్పష్టం చేశారు.
ఇష్టంతో ఉండాలిగానీ బలవంతంగా ఎవరినీ పార్టీలో ఉండాలని చెప్పబోనని పవన్ చెప్పారు.
జనసేనకు ఉన్న ఒక్క ఎమ్మెల్యే పార్టీతో ఉన్నారో లేదో తెలీదు. కాపలా కాస్తూ కూర్చునే రాజకీయాలు తాను చేయను అని పవన్ స్పష్టం చేశారని ఈనాడు రాసింది.
మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన "వేరే పార్టీకి ఓటేశారని, రేషన్ కార్డులు, ఇళ్లపట్టాలు ఇవ్వని పరిస్థితులను మనం చూస్తున్నాం, ఇలాంటి దుస్థితి మారాలి" అన్నారని చెప్పింది.
నా పై ఆధారపడిన కుటుంబాలను, నా కుటుంబాన్ని పోషించడానికి సినిమాలు చేస్తున్నానే తప్ప, సినిమాలంటే ఇష్టం కాదు అని పవన్ అన్నారు.
రాజకీయాల్లో అడ్డదారుల్లో వచ్చిన సంపాదనతో నా కుటుంబాన్ని పోషించలేను. నా పిల్లల పాఠశాల ఫీజులు కట్టలేను. అలా చేస్తే నాపై నాకే గౌరవం పోతుంది. వ్యక్తిగత లాభం చూసుకుంటే పార్టీ పెట్టేవాడ్ని కాదు. బీజేపీలో చేరి కోరుకున్న పదవులు అనుభవించేవాడ్ని అన్నారు.
జనసేనకు అండ యువత, ఆడపడుచులే, వారి దీవెనలే బీజేపీతో పొత్తు పెట్టుకునేలా చేశాయి అని పవన్ వివరించినట్లు ఈనాడు కథనంలో చెప్పింది.
జగన్‌ను ఎత్తుకున్నా, మా వాడే-జేసీ
అమరావతిలో దీక్షా శిబిరాలను సందర్శించిన టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి సీఎం జగన్‌ను తీవ్ర స్థాయిలో విమర్శించినట్లు ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.
'మా వాడు మూర్ఖుడు.. ఎవరి మాటా వినడు.. వాడి మూలాన రాష్ట్రమంతా నాశనమవుతోంది' అని సీఎం జగన్‌ను ఉద్దేశించి టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి అన్నారని రాసింది.
శుక్రవారం ఆయన తాడికొండ అడ్డరోడ్డు, తుళ్లూరు, వెలగపూడి దీక్షాశిబిరాలను సందర్శించి ప్రసంగించారు. జగన్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారని చెప్పింది.
పాదయాత్ర సమయంలో మహిళలకు ముద్దులుపెట్టి, తలలపై చేతులు పెట్టి.. అధికారంలోకి రాగానే ముంచేశాడని దుయ్యబట్టారు. జగన్ మూర్ఖుడని, అందుకే బెంగళూరుకు పంపానని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనతోనే చెప్పారని జేసీ అన్నట్లు కథనంలో రాశారు.
"జగన్‌ను చిన్నప్పటి నుంచీ చూశా. తనని ఎత్తుకున్నాను. కనుకనే మావాడని సంబోధిస్తున్నాను' అని జేసీ అన్నారని చెప్పారు.
జగన్ అమ్మ చెప్పినా, చెల్లి చెప్పినా వినడం లేదని.. ఆయన కలలోకి తాత రాజారెడ్డి వచ్చి చెప్పాలని ప్రభువును ప్రార్థిస్తున్నానని అని జేసీ అన్నారు.
ఈ నెల 21వ తేదీ నుంచి మార్చి 20 తేదీ లోపు జగన్ జైలుకు వెళ్తాడని ఓ స్వామిజీ తనతో చెప్పారని జేసీ అన్నారని ఆంధ్రజ్యోతి కథనంలో రాసింది.
దాల్ సరస్సు పరిసరాల్లా గోదావరి అందాలు
గోదావరికి రెండు వైపులా శ్రీనగర్‌లోని దాల్ సరస్సు పరిసరాల్లో ఉన్నట్లు చెట్లు పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారని సాక్షి కథనం ప్రచురించింది.
'శ్రీనగర్‌లోని దాల్ సరస్సును చూడగానే ముందుగా ఆకట్టుకునేవి గట్టున పొడవుగా ఉండే చెట్లు. మంచు కురిసే వాతావరణంలో సుందరంగా ఉండే సరస్సు అందాన్ని ఆ చెట్లు రెట్టింపు చేస్తాయి. ఇప్పుడు అదే తరహా ఎత్తయిన చెట్లను గోదావరి తీరం వెంట పెంచాలి'అని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారని చెప్పింది.
రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధిపై ప్రగతి భవన్‌లో శనివారం సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా 'కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజీల వల్ల వందల కిలోమీటర్ల మేర గోదావరి నదిలో నిత్యం జలకళ ఉట్టి పడుతుంది అని కేసీఆర్ అన్నారు.
ఏడాది పొడవునా నదుల్లో, కాల్వల్లో నీరు నిల్వ ఉంటుంది. నదికి ఇరు వైపులా దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. నదికి ఇరు వైపులా దాల్ సరస్సులా ఉండే తరహాలో ఆకర్షణీయమైన చెట్లు పెంచవచ్చు.
నదిలో బోటింగుకు అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీలు, రిజర్వాయర్లు, పంపుహౌస్‌ల వద్ద కావాల్సినంత స్థలం ప్రభుత్వ అధీనంలోనే ఉంది. అక్కడ బృందావన్ గార్డెన్ లాంటి మ్యూజికల్ ఫౌంటెయిన్‌లు, వాటర్ పార్కులు ఏర్పాటు చేయవచ్చు.
అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటకానికి అనువైన ప్రాంతాలను ఎంపిక చేసి పర్యాటక కేంద్రాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి'అని సీఎం సూచించినట్లు సాక్షి కథనం వివరించింది.
ఆపరేషన్ స్మైల్‌లో 3600 మంది చిన్నారుల గుర్తింపు
తెలంగాణలో జరిగిన ఆరోవిడత ఆపరేషన్ స్మైల్‌లో మొత్తం 3600 చిన్నారులను గుర్తించారని నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.
రాష్ట్రంలో తప్పిపోయిన, బాలకార్మికులు, వెట్టిచాకిరిలోఉన్న పిల్లలను గుర్తించడం, యాచకులు, ట్రాఫికింగ్‌లో చిక్కుకున్న చిన్నారులను రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించేందుకు తెలంగాణా పోలీస్‌శాఖ చేపట్టిన ఆరోవిడుత ఆపరేషన్ స్మైల్ శుక్రవారం ముగిసిందని కథనంలో చెప్పారు.
జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో 3,600 మంది చిన్నారులను గుర్తించినట్టు రాష్ట్ర మహిళా భద్రతావిభాగం ఇంచార్జి, ఐజీ స్వాతిలక్రా చెప్పారని రాశారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు, మతపరమైన స్థలాలు, ట్రాఫిక్ కూడళ్లు, మెకానిక్ షాపులు, ఇటుక బట్టీలు, టీస్టాళ్లు, దుకాణాలపై నిర్వహించిన ఈ డ్రైవ్‌లో 3,600 మందిని రక్షించినట్టు తెలిపారు.
వీరిలో బాలురు 2,923, బాలికలు 677 మంది ఉన్నట్టు పేర్కొన్నారు. 1,571 మంది చిరునామా తెలుసుకుని వారి తల్లిదండ్రులకు అప్పగించగా.. మిగిలినవారిని స్టేట్‌హోంలకు తరలించినట్టు ఈ కథనంలో చెప్పారు.
వీరిలో నేపాల్ వారు 13 మంది, మయన్మార్ చిన్నారులు నలుగురు ఉన్నారని స్వాతిలక్రా చెప్పారని నమస్తే తెలంగాణ వివరించింది.
ఇవి కూడా చదవండి:
- 2022లోగా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న నిర్మల.. ఇది సాధ్యమేనా?
- ఈయూ నుంచి నిష్క్రమించిన బ్రిటన్... స్వతంత్ర దేశంగా ఈయూకు తిరిగి వస్తామన్న స్కాట్లాండ్
- 'ప్రపంచం మౌనంగా ఉంది... నిశ్శబ్దం భయంకరంగా ఉంది'
- బడ్జెట్ 2020: కొత్త పన్ను శ్లాబులు కావాలంటే వీటిని వదులుకోవాల్సిందే
- విక్టోరియా మహారాణి, ఆమె భారత గుమస్తా అబ్దుల్ కరీమ్ మధ్య అంతుపట్టని ఆ బంధాన్ని ఏమనాలి
- అమరావతిలో జర్నలిస్టులపై నిర్భయ కేసు: ఆ రోజు మందడం స్కూల్లో ఏం జరిగింది?
- దారా షికోహ్: సోదరుడి తల నరికి షాజహాన్‌కు బహుమతిగా పంపిన ఔరంగజేబ్
- కరీమ్ లాలా: ఈ ముంబయి మాఫియా డాన్‌ను ఇందిరా గాంధీ ఎందుకు కలిశారు?
- గాంధీ బ్రహ్మచర్య ప్రయోగాల గురించి మనూ గాంధీ డైరీల్లో ఏముంది
- అసదుద్దీన్ ఒవైసీ: 'ఇద్దరు పిల్లల విధానం' అసలు సమస్యలను పక్కదోవ పట్టించడానికే
- ‘దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.. అలాంటి పిటిషన్లతో ఉపయోగం లేదు’- చీఫ్ జస్టిస్ బోబ్డే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)