You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అండర్-19 ప్రపంచకప్ క్రికెట్ సెమీస్‌లో భారత్-పాక్ ఢీ :ప్రెస్ రివ్యూ
అండర్-19 ప్రపంచకప్ సెమీస్‌లో భారత్-పాకిస్తాన్ తలపడుతున్నట్లు ఈనాడు కథనం ప్రచురించింది.
శుక్రవారం అఫ్గానిస్తాన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో పాకిస్తాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో ఆ జట్టు గ్రూప్-సిలో రెండోస్థానంలో నిలిచింది.
మరోవైపు క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను మట్టికరిపించిన యువ భారత్ గ్రూప్-ఏలో టాపర్‌గా నిలిచిందని ఈనాడు రాసింది.
దీంతో రెండు జట్లు మంగళవారం సెమీ ఫైనల్లో పోటీపడనున్నాయి.
2018 అండర్ 19 ప్రపంచకప్‌లో కూడా దాయాది యువ జట్లు తలపడ్డాయని ఈ కథనంలో చెప్పారు.
పృథ్వీ షా నాయకత్వం వహించిన ఆ మ్యాచ్‌లో యువ భారత్ 203 పరుగులతో అద్భుత విజయం సాధించింది.
శుభ్‌మన్‌గిల్ శతకంతో కదం తొక్కగా నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 272/9 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం పాకిస్తాన్ 69 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది.
మరోవైపు అండర్ 19 మెగా టోర్నీల్లో భారత్ అత్యధికంగా నాలుగు సార్లు ప్రపంచకప్‌ను ముద్దాడింది. 2000, 2008, 2012, 2018లో యువభారత్ ప్రపంచకప్ కైవసం చేసుకుంది.
అలాగే పాకిస్తాన్ 2004, 2006లో మెగా కప్పులను ఎగరేసుకుపోయిందని ఈనాడు కథనంలో వివరించారు.
మేడారం జాతరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
మేడార జాతరకు వచ్చే భక్తులకు అసౌకర్యం లేకుండా నార్త్ జోన్ పోలీసులు అన్ని చర్యలూ తీసుకున్నట్లు నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క-సారలమ్మల సన్నిధికి శుక్రవారం దాదాపు ఐదు లక్షల మంది భక్తులు తరలివచ్చారని కథనంలో రాశారు.
భక్తుల సంఖ్య అధికంగా ఉండటంతో ట్రాఫిక్ జామ్ తలెత్తకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు.
గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సు నుంచి విడుదల చేసిన నీరు శుక్రవారం సాయంత్రం మేడారంలోని జంట వంతెనల వద్ద గల జంపన్న వాగులోకి చేరింది.
మేడారం జాతరకు రాష్ట్రంతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రానున్న లక్షలాది మంది భక్తులకు అసౌకర్యం కలుగకుండా భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై పక్కా ప్రణాళికతో సిద్ధమైనట్టు నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి తెలిపారు.
మొత్తం 10 వేల మంది పోలీస్ సిబ్బందిని వినియోగించనున్నట్టు, ఫిబ్రవరి 3 నుంచి పూర్తిస్థాయిలో భద్రతా సిబ్బంది అందుబాటులో ఉంటారని ఆయన చెప్పినట్లు నమస్తే తెలంగాణలో రాశారు.
జాతరకు వచ్చే వీఐపీలు, ప్రైవేటు వ్యక్తుల కోసం మొత్తం ఐదు హెలీప్యాడ్లు సిద్ధం చేశామని పోలీసులు చెప్పారు.
మేడారం నుంచి ములుగు వరకు మొత్తం 330 సీసీ కెమెరాలు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో కదలికలను గమనించేందుకు అత్యాధునిక టెక్నాలజీతో కూడిన 20 పీటీజెడ్ (ప్యాన్-టిల్ట్-జూమ్) కెమెరాలను వినియోగిస్తున్నట్లు ఐజీ చెప్పారని పత్రిక వివరించింది.
మేడారం జాతరలో భాగంగా ఫిబ్రవరి 7న గద్దెలపై సమ్మక్క-సారలమ్మ ప్రతిష్ఠ జరుగుతుంది. ఫిబ్రవరి 8న అమ్మవార్లు తిరిగి వన ప్రవేశం చేస్తారు.
రాజధాని భూములపై ఈడీ దర్యాప్తు
రాజధాని అమరావతిలో 'ఇన్‌సైడర్ ట్రేడింగ్' కుంభకోణంపై దర్యాప్తునకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సిద్ధమైందని సాక్షి కథనం ప్రచురించింది.
797 మంది తెల్ల రేషన్ కార్డుదారుల పేర్లతో పలువురు టీడీపీ నేతలు 761.34 ఎకరాల భూములను కొనుగోలు చేయడంపై ఏపీ సీఐడీ అధికారులతో ఈడీ అధికారులు శుక్రవారం చర్చించారని తెలిపింది.
సీఐడీ దర్యాప్తులో వెల్లడైన అంశాలపై నివేదికతోపాటు బినామీల వివరాలను ఈడీ అధికారులు సేకరించారు. వీటిని పరిశీలించిన అనంతరం ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా మనీ ల్యాండరింగ్ జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారని పత్రిక రాసింది.
తొలుత తెల్ల రేషన్‌కార్డుదారులకు నోటీసులు జారీ చేసి విచారించనున్నారు. తర్వాత మిగతావారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నారని సాక్షి చెప్పింది.
దీనిపై విచారణకు హైదరాబాద్, చెన్నై కార్యాలయాల్లో పనిచేసే అధికారులతో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఈడీ నిర్ణయించింది.
భూముల కొనుగోళ్లపై సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వివరాలను సేకరించనుంది.
ఆదాయపు పన్ను చెల్లించకుండా భూములు కొన్నవారిపై మనీల్యాండరింగ్ చట్టం కింద కేసులు నమోదు చేసి విచారించాలని ఈడీ నిర్ణయించినట్లు సాక్షి కథనంలో చెప్పింది.
చైనాలోని వూహాన్ నుంచి భారతీయల ఆగమనం
కరోనా వైరస్ వల్ల వూహాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను ఎయిరిండియా ప్రత్యేక విమానంలో భారత్ తీసుకొస్తున్నట్లు ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.
ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం 'అజంతా'లో నలుగురు పైలట్లు సహా సిబ్బంది, ఇంజనీర్లు అంతా కలిపి 33 మందితో శుక్రవారం మధ్యాహ్నం 1.18 గంటలకు ఢిల్లీ నుంచి బయల్దేరిన విమానం మళ్లీ రాత్రి 10 గంటల తర్వాత 350 మందికి పైగా భారతీయులతో తిరుగుప్రయాణమైందని చెప్పింది.
కేంద్ర ఆరోగ్య శాఖ ఈ విమానంలో ఐదుగురు వైద్యులను, మందులు, మాస్కులు, ఓవర్ కోట్లు, ప్యాకేజ్డ్ ఆహారాన్ని పంపింది.
అక్కడనుంచి వస్తున్నవారు విమాన సిబ్బందితో ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేకుండా ప్రతి సీటు వద్ద భోజనం ఏర్పాట్లు చేశారు. రెండు మరుగుదొడ్లను సిబ్బంది కోసమే కేటాయించారు.
వూహాన్‌లో మిగిలిపోయిన మరికొంతమంది భారతీయులను తీసుకొచ్చేందుకు శనివారం మరో విమానాన్ని పంపనుంది.
వూహాన్ నుంచి తరలిస్తున్న భారతీయులను.. ఢిల్లీ విమానాశ్రయంలో దిగాక నేరుగా వారివారి స్వస్థలాలకు వెళ్లనీయరు.
వైర్‌స్‌కు కేంద్రస్థానం నుంచి వస్తున్న నేపథ్యంలో వారిని దిల్లీ సమీపంలోని మనేసర్‌లో సైన్యం నిర్మించిన ఒక క్వారంటైన్లలో ఉంచనున్నారు. అక్కడ వారిని రెండు వారాలపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతారని ఆంధ్రజ్యోతి రాసింది.
ప్రత్యేక విమానంలో వచ్చినవారందరికీ తొలుత విమానాశ్రయంలోనే పరీక్షలు చేస్తారు. ఎవరికైనా వైరస్ సోకిందన్న అనుమానం కలిగితే వారిని ఢిల్లీ కంటోన్మెంట్ బేస్ హాస్పిటల్‌లోని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స చేస్తారని కథనంలో వివరించారు.
ఇవి కూడా చదవండి:
- మల్లన్నసాగర్ కేసులో ఆర్డీవోకు జైలు శిక్ష వేసిన తెలంగాణ హైకోర్టు
- విక్టోరియా మహారాణి, ఆమె భారత గుమస్తా అబ్దుల్ కరీమ్ మధ్య అంతుపట్టని ఆ బంధాన్ని ఏమనాలి
- అమరావతిలో జర్నలిస్టులపై నిర్భయ కేసు: ఆ రోజు మందడం స్కూల్లో ఏం జరిగింది?
- దారా షికోహ్: సోదరుడి తల నరికి షాజహాన్‌కు బహుమతిగా పంపిన ఔరంగజేబ్
- కరీమ్ లాలా: ఈ ముంబయి మాఫియా డాన్‌ను ఇందిరా గాంధీ ఎందుకు కలిశారు?
- గాంధీ బ్రహ్మచర్య ప్రయోగాల గురించి మనూ గాంధీ డైరీల్లో ఏముంది
- అసదుద్దీన్ ఒవైసీ: 'ఇద్దరు పిల్లల విధానం' అసలు సమస్యలను పక్కదోవ పట్టించడానికే
- ‘దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.. అలాంటి పిటిషన్లతో ఉపయోగం లేదు’- చీఫ్ జస్టిస్ బోబ్డే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)