బాబాయి కాదు, 'బర్త్ డే కేక్' రెండు ప్రాణాలు తీసింది :ప్రెస్ రివ్యూ

ప్రచురణ

నాలుగు నెలల క్రితం సంచలనం సృష్టించిన 'అయినాపూర్ బర్త్ డే కేక్' ఘటనలో ఎలాంటి విష ప్రయోగం జరగలేదని, కాలం చెల్లిన కేక్ వల్లే తండ్రీ, కొడుకులు మృతి చెందారని విచారణలో తేలిందని పోలీసులు చెప్పినట్లు ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.

సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మండలం అయినాపూర్‌లో వరుసకు అన్న అయ్యే వ్యక్తితో ఆస్తి తగాదాలున్న యువకుడు, ఆయన కుమారుడి బర్త్‌ డే కోసం కేక్‌ పంపడంతో, అది తిన్న కుటుంబ సభ్యుల్లో తండ్రి, కొడుకు మృతిచెందగా, తల్లి, కూతురు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు.

ఓ కుటుంబాన్నే చిన్నాభిన్నం చేసిన ఈ ఘటనలో వేళ్లన్నీ 'బాబాయి'వైపే చూపించాయి.

వ్యక్తిగత కక్షలతో అన్న కుటుంబాన్ని అంతం చేయాలన్న కుట్రతోనే కేక్‌లో ఆ సోదరుడు విషం కలిపాడేమోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి! బాధిత కుటుంబమూ ఇదే ఆరోపణలు చేసింది.

ఇన్నాళ్లకు ఈ కేసులో మిస్టరీ వీడింది. కేక్‌లో ఎలాంటి విషప్రయోగం జరగలేదని.. కాలంచెల్లి, పాడైపోయిన (ఎక్స్‌పైర్డ్‌) రసాయనాలతో కేక్‌ను తయారు చేశారని.. అది తినడం వల్లనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని ఫోరెన్సిక్‌ నివేదికలో తేలిందని పోలీసులు చెప్పారు..

అయినాపూర్‌లో 4నెలల క్రితం చోటుచేసుకున్న ఘటన, అనంతరం కేసు దర్యాప్తు వివరాలను చేర్యాల పోలీసులు వెల్లడించారు.

గత ఏడాది సెప్టెంబరు 4న శ్రీనివాస్ అయినాపూర్‌కు వచ్చాడు. రవి కుమారుడు రామ్‌చరణ్‌ 'ఇవాళ నా బర్త్‌డే' అని చెప్పడంతో, సిద్దిపేటకు వెళ్లాక కేక్‌ పంపిస్తానన్నాడని పోలీసులు వివరించారు.

అదే రోజు రాత్రి 10:30కు బస్సులో అతడు అయినాపూర్‌కు కేక్‌ పంపించాడు. దాన్ని తిన్న కాసేపటికి రామ్‌చరణ్‌ కడుపు నొప్పి ఏడ్చాడు. పూజిత, రవి, నాగమణి కూడా తీవ్ర అస్వస్థతకు గురవడంతో నలుగురినీ స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే రవి, రామ్‌చరణ్‌ మృతిచెందారు అని కథనంలో చెప్పారు.

ఈ ఘటనపై శ్రీనివాస్‌ మీదే నాగమణి అనుమానాలు వ్యక్తం చేసింది. తమను చంపాలనే విషం కలిపిన కేక్‌ను పంపాడని శ్రీనివా్‌సపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

విచారణ చేపట్టిన పోలీసులు, కేక్‌ తయారీకి వినియోగించిన నమూనాలను పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు.

ఫోరెన్సిక్‌ నిపుణులు.. పరీక్షలు జరిపి కేక్‌లో విషప్రయోగం జరగలేదని, అపరిశుభ్ర వాతావరణంలో కేక్‌ను తయారు చేయడం.. కాలపరిమితి తీరిన పదార్థాలు, రసాయనాలను వాడటంతో కేక్‌లో ఫంగస్‌ ఏర్పడిందని నిర్ధారించినట్లు కథనంలో చెప్పారు.

ఇద్దరి మృతికి కారణమైన సిద్దిపేటలోని న్యూ ఇండియా బేకరీ యజమాని ఎం.హఫీజ్‌ను పోలీసులు రిమాండ్‌కు తరలించారని ఆంధ్రజ్యోతి రాసింది.

భీమిలి భూముల లైసెన్స్ కోసం టెండర్

భీమిలీలో భూములను చౌకగా సొంతం చేసుకునేందుకు లైసెన్సు పేరుతో దేవాదాయ భూములకు టెండర్ వేశారంటూ ఈనాడు కథనం ప్రచురించింది.

పాలనా రాజధానిగా ప్రచారమవుతున్న విశాఖలోని భీమిలి ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఎకరా రూ.కోట్లలో పలుకుతోంది.

అలాంటి చోట్ల దేవాదాయ శాఖకు చెందిన విలువైన భూములను తక్కువ లైసెన్స్ ఫీజుతో కొట్టేసేందుకు కొందరు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు అని ఈనాడు రాసింది.

ఇటీవల దేవాదాయ శాఖ జారీ చేసిన సర్కులర్‌ను అడ్డుపెట్టుకుని భీమిలిలో ఆ శాఖకు చెందిన రూ.300 కోట్ల విలువైన భూమిని గుట్టుచప్పుడు కాకుండా.. కారు చౌకగా.. లైసెన్సు పేరుతో కొట్టేసేందుకు ఎత్తులు వేస్తున్నారని చెప్పింది.

ఇప్పటిదాకా భూములను లీజుకు కేటాయిస్తుండగా, కొత్త నిబంధనల ప్రకారం లైసెన్సు ఫీజుతో భూములను వినియోగించుకోవచ్చు. దీనిని అడ్డం పెట్టుకుని కొందరు ఈ భూములపై కన్నేశారని ఈనాడు తన కథనంలో రాసింది.

భీమిలి నుంచి తగరపువలస వెళ్లే మార్గంలో భీమిలికి 3 కి.మీ. దూరంలో చిల్లపేట గ్రామ పరిధిలో సర్వే నంబర్ 67/1లో దేవాదాయ శాఖ పరిధిలో ఉండే లంగర్‌ఖానా చౌల్ట్రీకి 67 ఎకరాల భూమి ఉంది.

దీని విలువ రూ.300 కోట్ల వరకూ ఉంటుందని దేవాదాయ శాఖ అంచనా. ఇలాంటి భూమికి 11 ఏళ్లు లైసెన్సు జారీ(ఇంతకు ముందు లీజు విధానం ఉండేది) కోసం అక్కడి దేవాదాయశాఖ అధికారులు సిద్ధమయ్యారని ఈనాడు రాసింది.

విలువైన స్థలాల్లో మూడెకరాలకు మించి ఒక్కరికే లైసెన్స్ జారీ చేయద్దని కొద్ది రోజుల కిందటే అన్ని ఆలయాల అధికారులకూ ఆ శాఖ కమిషనరేట్ నుంచి ఆదేశాలు వెళ్లాయని అందులో రాశారు.

భీమిలిలో మాత్రం ఈ నిబంధనలన్నింటినీ పక్కన పెట్టేశారని ఈ కథనంలో చెప్పారు.

బంగారం డిమాండ్ తగ్గింది

ధరల తీవ్రత వల్ల భారత్‌లో బంగారం డిమాండ్‌ 2019లో 9 శాతం పడిపోయిందని ప్రపంచ పసిడి మండలి (డబ్ల్యూజీసీ) నివేదిక చెప్పినట్లు సాక్షి కథనం ప్రచురించింది.

దేశీయ ఆర్థిక మందగమనం కూడా పసిడి డిమాండ్‌ తగ్గడానికి దారితీసిందని మండలి పేర్కొన్నట్లు చెప్పింది.

మండలి మేనేజింగ్‌ డైరెక్టర్‌ సోమసుందరం తెలిపిన సమాచారం ప్రకారం- నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు...

2018లో దేశంలో బంగారం డిమాండ్‌ 760 టన్నులు. 2019లో 690 టన్నులకు పడింది.

ఒక్క ఆభరణాల విషయానికి వస్తే, డిమాండ్‌ 598 టన్నుల నుంచి 544 టన్నులకు దిగింది.

కడ్డీలు, నాణేల డిమాండ్‌ 10 శాతం తగ్గి 162.4 టన్నుల నుంచి 146 టన్నులు చేరింది.

2019 అక్టోబర్‌ 25న వచ్చిన దంతేరాస్‌లో కొనుగోళ్లు పెద్దగా జరగలేదు. దేశీయంగా పసిడి ధరల తీవ్రత, ఆర్థిక వ్యవస్థ మందగమనం వంటి అంశాలు దీనికి కారణం.

2019 ప్రారంభంలో ముంబై స్పాట్‌ మార్కెట్‌లో పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.32,190 ఉంటే, సంవత్సరం చివరకు వచ్చే సరికి రూ.39,000పైన ముగిసింది. ఒక దశలో రూ.40,000 మార్క్‌ను దాటడం కూడా గమనార్హం.

అయితే పసిడికి స్వల్పకాలంలో కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. పరిశ్రమలో లాభాలు తగ్గడం, పన్నుల అనిశ్చితి వంటివి ఇందులో ఉన్నాయి.

2019లో దేశ పసిడి దిగుమతులు స్మగ్లింగ్‌సహా 14% తగ్గి 756 టన్నుల నుంచి 647 టన్నులకు పడింది. స్మగ్లింగ్‌ 115-120 టన్నులు ఉంటుందని అంచనా. 2020లో డిమాండ్‌ పెద్దగా పెరిగే అవకాశం లేదు.

పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో ముంబయి సహా దేశంలోని పలు ప్రధాన మార్కెట్లలో పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.40,000పైనే కొనసాగుతోందని కథనంలో చెప్పారు.

చరిష్మా తగ్గని చార్మినార్

చార్మినార్‌ను నిర్మించి నాలుగు వందల ఏండ్లుదాటినా దాని చరిష్మా ఏమాత్రం తగ్గలేదని నమస్తే తెలంగాణ ఒక కథనం ప్రచురించింది.

దేశంలోని ఇతర చారిత్రక కట్టడాల కంటే మిన్నగా చార్మినార్ సందర్శకులను ఆకర్షిస్తున్నది.

పెద్దసంఖ్యలో పర్యాటకులు తరలివస్తుండటంతో పగలు, రాత్రి తేడా లేకుండా చార్మినార్‌ ప్రాంతం కళకళలాడుతున్నది.

ఈ క్రమంలో భారత పురావస్తుశాఖ, తెలంగాణ పర్యాటకశాఖ సందర్శకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది అని కథనంలో చెప్పారు.

చార్మినార్‌ చరిత్ర తెలిసేలా సమాచార బోర్డులను ఏర్పాటు చేయడంతోపాటు పాదచారులమార్గాన్ని సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు.

భారత పురావస్తుశాఖ సమాచారం ప్రకారం, హైదరాబాద్‌కు చార్మినార్‌ను సందర్శించేందుకు వస్తున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉన్నది.

ప్రతి నెలా లక్షకుపైగా సందర్శకులు చార్మినార్‌ను తిలకించేందుకు వస్తున్నారు. గత ఏడాది 13 లక్షల వరకు సందర్శకులు చార్మినార్‌ను సందర్శించారని గణాంకాలు చెప్తున్నాయని నమస్తే తెలంగాణ చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)