వైఎస్ జగన్: ప్రతి శుక్రవారం ఏదో ఒక కారణం చెబుతారేం.. ఈసారి రాకపోతే తగిన ఉత్తర్వులు ఇస్తాం - సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం : ప్రెస్ రివ్యూ

ప్రచురణ

అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడైన వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఈ నెల 31న కోర్టుకు హాజరుకావాలని శుక్రవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఈనాడు కథనం ప్రచురించింది.

ఆయన హాజరు కాకపోతే తగిన ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.

శుక్రవారం హాజరు నుంచి సీఆర్‌పీసీ సెక్షన్ 317 కింద మినహాయింపు కోరుతూ జగన్ తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.

ముఖ్యమంత్రిగా ముఖ్యమైన సమావేశంలో పాల్గొనాల్సి ఉన్నందున జగన్ వ్యక్తిగత మినహాయింపునకు అనుమతించాలని కోరారు. ఈ పిటిషన్‌ను సీబీఐ కోర్టు న్యాయమూర్తి బి.ఆర్.మధుసూదన్‌రావు పరిశీలించారని ఈనాడు చెప్పింది.

హాజరు మినహాయింపునకు ప్రతివారం ఏదో ఒక కారణం చెబుతుంటారని, ఈనెల 31న హాజరుకావాలని లేదంటే తగిన ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారని తెలిపింది.

అక్రమాస్తుల కేసులో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన కేసుల్లోనూ నిందితుడైన జగన్ వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని ఈడీ ప్రత్యేక హోదా ఉన్న సీబీఐ కోర్టు స్పష్టం చేసింది.

ఈడీ కేసుల్లో తన తరఫున సహ నిందితులైన బ్రహ్మానందరెడ్డి, రాంగంగిరెడ్డి హాజరయ్యేందుకు అనుమతించాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టేవేస్తూ ఉత్తర్వులిచ్చిందని కథనంలో చెప్పారు.

తీవ్రమైన ఆర్థిక నేరాల కేసుల్లో నిందితుడు హాజరుకావాలని, ఇతర నిందితులను అనుమతించరాదన్న ఈడీ వాదనతో కోర్టు ఏకీభవించినట్లు ఈనాడు రాసింది.

నాగారంలో వృద్ధాశ్రమంలో మానసిక వికలాంగులు

వృద్ధాశ్రమం పేరుతో ఇరుకిరుకు గదుల్లో ఉంచిన 82 మంది రోగులకు పోలీసులు విముక్తి కల్పించినట్లు ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.

మేడ్చల్‌ -మల్కాజిగిరి జిల్లా కీసర మండలం నాగారం మునిసిపాలిటీ పరిధిలోని శిల్పా నగర్‌లో ఒక చిన్న డబుల్‌ బెడ్‌ రూం ఇంట్లో 61మంది పురుషులను కుక్కినట్లు చెప్పారు.

అంతమందికి కలిపి అక్కడ ఒకే మరుగుదొడ్డి ఉంది. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న 21మంది మహిళల పరిస్థితి కూడా అలాగే ఉంది.

అందర్నీ ఇరుకు గదుల్లో పెట్టి ఉంచుతున్నారు. వారికి సదుపాయాలు, చికిత్స మాట అటుంచితే సరైన గాలి.. వెలుతురు లేక రోగులు ఒకరకంగా బందీల్లా అక్కడ బతుకీడుస్తున్నారు అని వివరించారు.

మమత వృద్ధాశ్రమం పేరుకు వృద్ధాశ్రమమే అయినా దీనిని మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంగానూ నడుపుతున్నారు.

దీన్ని నాలుగేళ్ల క్రితం ప్రభుదాస్‌ అనే వ్యక్తి ప్రారంభించాడు. వృద్ధులతో పాటు మానసిక వికలాంగులను కూడా చేర్చుకొని చికిత్స అందిస్తున్నారు అని ఆంధ్రజ్యోతి చెప్పింది.

ఆదరణకు నోచుకొని వృద్ధులతో పాటు మాదకద్రవ్యాలకు బానిసైన వారు, చిన్నప్పటి నుంచి మానసికంగా ఎదగని వారు ఇక్కడ ఉంటున్నారు.

ఈనెల 22న నాగారంలో మనిసిపల్‌ ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు పోల్‌ చిట్టీలను పంపిణీ చేశారు.

ఈ క్రమంలో శిల్పానగర్‌కు వెళ్లిన నాయకులకు అక్కడి మమతా వృద్ధాశ్రమం నుంచి రోగుల అరుపులు వినిపించడంతో, 100కు ఫోన్‌ చేసి విషయం చెప్పారు.

ఆశ్రమాన్ని పరిశీలించిన మల్కాజ్‌గిరి పోలీసులు అక్కడ రోగుల అవస్థలు, వారి పట్ల, నిర్వాహకులు వ్యవహరిస్తున్న తీరును చూసి చలించిపోయారని పత్రికలో రాశారు.

నిర్వాహకులపై కేసులు నమోదు చేసిన పోలీసులు, తమవారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకుగాను వృద్ధులు, రోగుల కుటుంబసభ్యులపైనా కేసులు నమోదు చేశారు.

రోగులకు వైద్యులు పరీక్షలు నిర్వహించిన అనంతరం బాధితులను వివిధ స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న పునరావాస కేంద్రాలకు తరలించారు.

ఆశ్రమంలో ఒక్కొక్కరి నుంచి నెలకు రూ.5వేల నుంచి రూ.10వేల దాకా వసూలు చేస్తున్నారని, రోగులను అప్పుడప్పుడు ఆస్పత్రులకు తీసుకెళుతున్నారని ఆంధ్రజ్యోతి కథనంలో చెప్పారు.

అర్హులైన పేదలందరికీ నివాస స్థలాలు

ఇల్లులేని పేదలకు పంపిణీ చేసే నివాస స్థలాల కోసం అన్ని విధాలా అనుకూలమైన ఇళ్ల స్థలాలను ఎంపిక చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించినట్లు సాక్షి కథనం ప్రచురించింది.

ఇల్లు లేని అర్హులైన పేదలందరికీ నివాస స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించాలన్నది బృహత్తర కార్యక్రమమని, దీనిని తంతుగా మార్చవద్దని సీఎం నొక్కి చెప్పారని పత్రిక చెప్పింది.

ఉగాది సందర్భంగా నివాస స్థల పట్టాల పంపిణీకి తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై శుక్రవారం జగన్ తన క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్, ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఇళ్ల పట్టాలకు అర్హులను ఎంపిక చేసేందుకు ప్రజాసాధికార సర్వే (పీఎస్‌ఎస్‌) ప్రామాణికం కాదని, గ్రామ సచివాలయ, క్షేత్ర స్థాయి సిబ్బంది సర్వేనే కొలబద్ద అని స్పష్టం చేశారు.

అర్హులు ఎంత మంది ఉన్నా అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిందేనని ఆదేశించినట్లు కథనంలో చెప్పారు.

పేదలకు నివాస స్థలాలు ఇచ్చి, ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని ప్రభుత్వం యజ్ఞంగా భావిస్తోందని, అందువల్ల ఏ ఒక్కరూ ఈ మహా క్రతువును తంతుగా భావించవద్దని సీఎం చెప్పారు.

అందువల్ల అన్ని విధాలా అనుకూలంగా, ఆవాస యోగ్యంగా ఉండే ప్రాంతాలను ఇళ్ల స్థలాల పంపిణీకి ఎంపిక చేయాలని సీఎం సూచించినట్లు సాక్షి వివరించింది.

కరోనా వైరస్: విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ కేంద్రాలు

పొరుగున ఉన్న చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో భారత్ అప్రమత్తమైందని నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.

తెలంగాణలోని శంషాబాద్ విమానాశ్రయంతోపాటు దేశంలోని ఏడు ప్రధాన విమానాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు చెప్పింది

ఇప్పటివరకు 60 విమానాల్లో వచ్చిన 12,828 మంది ప్రయాణికులకు స్క్రీనింగ్ నిర్వహించామని, అయితే ఎలాంటి పాజిటివ్ కేసు నమోదుకాలేదని కేంద్ర వైద్య శాఖ కార్యదర్శి ప్రీతిసూడాన్ తెలిపారు. వైరస్ వ్యాప్తి, సన్నద్ధతపై ఆమె గురువారం సమీక్ష నిర్వహించారు.

ప్రయాణికులకు ఇప్పటికే ట్రావెల్ అడ్వైజరీని జారీచేసిన కేంద్రం.. విమానాశ్రయాల్లో సన్నద్ధతపై సమీక్ష నిర్వహించి పటిష్ఠ చర్యలు చేపట్టాలని తెలంగాణతోపాటు మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, కర్ణాటక ప్రభుత్వాలకు లేఖ రాసిందని కథనంలో వివరించారు.

కాగా, సౌదీ అరేబియాలోని అల్ హయత్ దవాఖానలో పనిచేస్తున్న కేరళ నర్సుకు కరోనా వైరస్ సోకింది.

సుమారు 100 మంది భారతీయ నర్సులకు (కేరళకు చెందినవారే అత్యధికులు) స్క్రీనింగ్ నిర్వహించగా, ఒక నర్సుకు వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది.

బాధిత నర్సుకు అసీర్ జాతీయ దవాఖానలో చికిత్స అందిస్తున్నట్లు విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ తెలిపారు.

అయితే ఆ వైరస్ చైనాలో వ్యాపించిన కరోనా వైరస్ కాదని, వేరే జాతికి చెందిన కరోనా వైరస్  అని జెడ్డాలోని భారత కాన్సులేట్ స్పష్టం చేసింది.

చైనాలో వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మూడు ప్రధాన నగరాల్లో ప్రజారవాణాను స్తంభింపజేయడంతో అక్కడ చిక్కుకుపోయిన భారతీయుల కోసం చైనాలోని మనదేశ రాయబార కార్యాలయం హాట్‌లైన్లు ఏర్పాటుచేసినట్లు నమస్తే తెలంగాణలో రాశారు.

వుహాన్, దాని పరిసర ప్రాంతాల్లోని యూనివర్సిటీల్లో సుమారు 700 మంది భారతీయ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.

చైనాలో నూతన సంవత్సర సెలవుల నేపథ్యంలో వారిలో చాలా మంది భారత్‌కు తిరిగి రాగా, కొంతమంది అక్కడే ఉండిపోయారు. అయితే ఎంతమంది అక్కడ ఉన్నారన్నదానిపై స్పష్టతలేదని కథనంలో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)